మోస్ట్‌ ఫ్యాషనబుల్‌ గై

మోస్ట్‌ ఫ్యాషనబుల్‌ గై


‘‘మనిషి తానే ‘మోస్ట్‌ ఫ్యాషనబుల్‌ గై’ అని విర్రవీగుతుండటాడు గానీ... వాడు అనుక్షణం  ఇన్‌ఫినిటీ ఆఫ్‌ ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో బాధపడుతుండడేమోనని నా అనుమానం రా. జంతువులు చేసే ఫ్యాషన్లతో పోలిస్తే వాడికి తీవ్రమైన ఆత్మన్యూనతా భావం ’’ అన్నాడు మా రాంబాబు. ‘‘ఒరేయ్‌... ఏదో ఎప్పుడూ నీ మాటే గెలిపించుకోవాలనే కాంక్షతో వితండ వాదం చేస్తుంటావు గానీ, నువ్వు చెప్పేవన్నీ తప్పురా. మిగతా జీవరాసులు అన్నిట్లో కెల్లా మానవుడే కదా బుద్ధి జీవి. వాడు మాత్రమే పౌడర్‌ డబ్బా, స్నో క్రీములు కనుక్కున్నది? అలాంటప్పుడు వాడు  నాగరికుడవుతాడు గానీ ఏమీ ధరించని యానిమల్స్‌ ఫ్యాషనబుల్స్‌ ఎలా అవుతాయిరా...?’’ ‘‘నీకు అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్‌ చెబుతా విను. సపోజ్‌...



మన నాగుపాము ఉందనుకో... మంచి గోధుమవన్నెతో వేసుకునే డ్రస్‌ను అలా మాసీమాయకముందే కుబుసం అంటూ విడిచేసి పోతుంది. విడిచేసిన డ్రస్సును  మళ్లీ కన్నెల్తైనా చూడదు. నేచురల్‌గా కొత్త డ్రస్సు పుట్టించుకుంటుంది. అంతేగానీ...కుట్టించుకోదు. నీలా నాలా ఒకసారి కొన్ని డ్రస్సును  ఐదారేళ్ల పాటు లాగదు. నువ్వంటే కుదరలేదంటూ ఒక్కోసారి డ్రైక్లీనింగూ చేయించవు. కానీ పాము చూడు... కుబుసం విడిచనప్పుడల్లా కొత్త డ్రస్సే ఫ్రెష్షు గార్మెంటే’’ అన్నాడు వాడు.



‘‘సరే పాము కాబట్టి కుబుసం విడుస్తుంది కాబట్టి దాన్ని కొత్త డ్రస్సు అని అనగలిగావు. మరి మిగతా జంతువులదంతా మామూలు చర్మమే కదా’’ అడిగా. ‘‘ఒరేయ్‌ అమాయకుడా... ఎప్పుడైనా గొర్రెను చూశావా? మాంఛి న్యాచురల్‌ కోటును  వేసుకున్నట్టుగా ఉంటుంది దాని తీరు. కుదిరితే ఎప్పుడైనా గొర్రెల మందను చూడు.  మందపాటి బొచ్చుకోట్లను వేసుకొని పెద్ద కాన్ఫరెన్సుకు హాజరైన డిగ్నిఫైడ్‌ వీవీఐపీల  మహా గ్యాదరింగులా ఉంటుందా మంద. నీకు తేలిగ్గా అందుబాటులో ఉంటుందని దాని పేరు చెప్పాగానీ... ఎలుగుబంటి కూడా మందపాటి కోటేసుకున్నట్టే ఉంటుంది. కాకపోతే గొర్రె కోటు కాళ్ల వరకు ఉండదు. కానీ ఎలుగుబంటి తీరే వేరు.  అది మరీ డిగ్నిఫైడు. కాబట్టి  కాళ్ల వరకు లాంగుకోటు వేసుకున్నట్లుగా ఉంటాయి ఎలుగుబంట్లు’’



‘‘సరేరా... నువ్వన్నదే నిజమనుకుందాం. ఎంతసేపూ ఆ డ్రస్సులూ, లాంగ్‌కోట్ల  విషయమేనా. మరి కాటుకా పౌడరూ వేసుకునే యానిమల్సు కూడా ఉంటాయని కొయ్‌ రా కొయ్‌’’ ‘‘వార్నీ పౌడర్లు వేసుకునే జంతువు కోసం కాస్త అడవిలోకి వెళ్లాలి గానీ... కాటుక పూసుకునే గంగిగోవు మన పెరట్లోనే ఉంటుంది చూడు. పరిశీలనగా దాని కళ్లను చూస్తే అచ్చం వేలుతో మందంగా కాటుక పూసినట్టే ఉంటాయి దాని కళ్లు. కాకపోతే మన కుక్క కళ్లు మాత్రం ఐ లైనర్‌తో పలుచగా కాటుక పూసినట్లుగా ఉంటాయి, చిరుతకైతే ఏడ్చినప్పుడు జారినట్టుగా కాటుక చెంపల మీదికి పాకుతుంది’’ జవాబిచ్చాడు వాడు. ‘‘ఏమిటీ... అడవిలోని జంతువేదో పౌడరు పూసుకుంటుందా? ఏమిట్రా అది?’’ ఆశ్చర్యంగా అడిగాను నేను. ‘‘ఏనుగు రా... ఏనుగు. హాయిగా తొండాల కొద్దీ నీళ్లను మీద పోసుకుంటూ గజస్నానం చేస్తుందా... అలా చేసి ఇలా బయటకు రాగానే ఒంటినిండా దుమ్మెత్తిపోసుకుంటుంది.



అదేమిటీ అంటే అదే దాని తాలూకు సన్‌స్క్రీన్‌ అట. దాని ఒళ్లు కాస్త నున్నగా ఉంటుంది కదా. అందుకే అలా పౌడర్‌లా అలా దుమ్మెత్తిపోసుకుంటే అది సూర్యుడి కిరణాల వేడినుంచి ఆ పౌడర్‌కాస్తా సన్‌స్క్రీన్‌లోషన్‌లా కాపాడుతుంటుందట. ఈ లోషన్‌ ఎఫెక్ట్స్‌ కోసం ఒక్కోసారి అది కాస్తంత బురదమయం అయిన నీళ్లను నీటుగా ఒంటినిండా యూనిఫామ్‌గా అమరేలా నీళ్లు జల్లుకుంటుంది’’ ‘‘సరే... ఏదో కొత్త బట్టలూ, కోట్లూ, కాటుక, సన్‌స్క్రీనూ, బురదనే క్రీము అనుకునే పందుల గురించి నువ్వు ఎంతైనా చెప్పగలవు. కానీ యాక్సెసరీస్‌ మాట మరచిపోయావా? యాక్ససరీస్‌ తొడుక్కునే జంతువులేముంటాయ్‌రా నీ పిచ్చిగానీ... అందుకే ఇక ఆగిపో... పట్టి పట్టి ఎలాగైనా నిరూపించాలని తపనపడకు’’ సలహా ఇచ్చాను. ‘‘యాక్సెసరీస్‌ కోసం ఎంతో దూరం పోనక్కర్లేదురా... మళ్లీ మొదట మనం మాట్లాడామే.... ఆ పామే చాలు. ఇప్పుడు కళ్లకు జోడు పెట్టుకోవడం ఫ్యాషన్‌. కానీ అదే కళ్ల జోడును నెత్తిమీదికి ఎక్కించుకుంటే అది సై్టల్‌ రా. సూపర్‌ సై్టల్‌. మన నాగుపాము ఆ పని చేస్తుంది’’



‘‘ఏమిటీ? నాగుపాము నెత్తిన కళ్లజోడు పెడుతుందా?’’

‘‘యా... మరేమనుకున్నావ్‌. అది నేరుగా నెత్తిమీద కాకుండా శివాజీ సినిమాలో రజనీకాంత్‌లా కళ్లజోడు గుండు వెనక్కు... అదే పడగ వెనక్కు పెడుతుంది. సైన్సు విద్యార్థులు ఆ మార్కును చూసే ఫలానాది ‘స్పెక్టకిల్‌ కోబ్రా’ అని... కళ్లజోడులో ఒకటి పగిలిపోయి ఉంటే ‘మోనోకల్‌ కోబ్రా’ అని పిలుచుకుంటూ ఉంటారు’’ ‘‘ఇక నేను వింటున్నాను కాబట్టి పాము గురించి చెప్పింది చాల్లేరా బాబూ... ఇంతకు మించి ఇంకా ఎగస్ట్రా ఏముంటాయిరా పాము దగ్గర’’ రాంబాబుగాడిని నిలువరింపజేద్దామని ఒక ప్రయత్నం చేశా. ‘‘పిచ్చివాడా... ఇప్పటివరకూ నేను చెప్పింది బ్రహ్మాండంలో అణువంత. నీలాంటి, నాలాంటి వాళ్లమంతా కామన్‌గా ఏ గుడ్డ క్యాపో, ప్లాస్టిక్‌ క్యాపో తొడుక్కుంటాం. సైన్సు ఒప్పుకోదు గానీ... ఒకవేళ మా తాత చెప్పిందే గానీ నిజమైతే... నాగుపాము ఏకంగా అమూల్యమైన రత్నాన్నో, వజ్రాన్నో క్యాపుగా తొడుగుతుందిరా. అంతటి అమూల్యరత్నాన్ని క్యాప్‌లా తొడిగిన దర్జా నరమానవుల్లో ఎవరికైనా ఉందంటావా? ఉంటే పట్రా. నా మాటలన్నీ ఉత్తదే అని ఒప్పుకుంటా’’ అన్నాడు వాడు... మనుషుల ఫ్యాషన్లను మీరే జంతువుల సై్టల్స్‌ ఉంటాయంటూ సోదాహరణంగా నిరూపిస్తూ!

– యాసీన్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top