ప్రేమానురాగాల కలబోత

ప్రేమానురాగాల కలబోత


పువ్వు సున్నితంగా ఉంటుంది.

 పరిమళాలు వెదజల్లుతుంది. సహజంగా ఉంటుంది, చూడడానికి చాలా అందంగానూ ఉంటుంది. రేకులు విచ్చుకున్నాక, వాటి చక్రవ్యూహంలో దారి తప్పుతుంది. పుప్పొడుల ఘన పదార్థాన్ని దాటి మరింత లోనికి వెళ్లగలిగితే తేనియలూరుతుంది. ఆ మధువుని వధువుగా అందుకోవాలంటే, చేయాల్సిన ప్రయాణంలో ఎన్ని మలుపులో... ఎన్ని అడ్డుగోడలో!

 

 పువ్వులాంటి సున్నితమైన, కోమలమైన స్త్రీ... తన ప్రవర్తనతో, నడవడికతో తన ఇంట్లో అనురాగ పరిమళాలు వెదజల్లుతుంది. సహజంగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఆమె మనసుని అర్థం చేసుకోవాలంటే పూరేకుల చుట్టూ దారితప్పి తిరిగినట్టు గింగిరాలు తిరగాల్సిందే. పరిస్థితుల ప్రభావంతో ఘనీభవించిన గోడల్ని చెమటోడ్చి పగలగొట్టాల్సిందే. ఆపైన ఆమె అనుమతిస్తే... మధువు లాంటి తీయనైన, అమృతమయమైన సహచర్య సుఖాన్ని అనుభవించవలసిందే. తరించవలసిందే. మోక్షం కలగాలంటే ఏ మునైనా తపస్సు చేయాల్సిందే. ఆడదాని మనసర్థం చేసుకుని, మోక్షంతో సమానమైన, సుఖమయమైన జీవితం పొందాలంటే తలకిందులుగా తపస్సు చేయాల్సిందే.

 

 1914 అయినా, 2014 అయినా, వందేళ్లు దాటినా, మనసుకి నచ్చిన స్త్రీ సహచర్యంలో ఉండే సుఖమైతే అదే. అది పొందడంలో ఉండే దుఃఖమూ అదే. ఆహార, వేష, దేశ, భాషలెన్ని మారినా, స్త్రీ ఆత్మ సౌందర్యము గౌరవమూ, అమాయకత్వమూ, అందమూ, గూఢత్వమూ, గాఢత్వమూ, మృదుత్వమూ, సంక్లిష్టమూ - ఇవేవీ మారలేదు. మారకపోవడం సృష్టిలో ఒక అద్భుతమే. ఇదంతా నేను రీసెర్చ్ చేసి కనుక్కున్నది కాదు. 1800 చివర్లో పుట్టి 2000 దాటాక కూడా మనల్ని అలరించే పాత్రల్ని సృష్టించిన బెంగాలీ మేధావి, రచయిత శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ స్త్రీల మానసిక పరిణతిపై చేసిన అధ్యయనం, అది సృష్టించిన చరిత్ర - మొదట దేవదాసులో పార్వతి, చంద్రముఖి.

 

  తర్వాత పరిణీతలో లలిత. ఏం క్యారెక్టరైజేషన్?!

 ప్రముఖ దర్శక నిర్మాత విధువినోద్ చోప్రా 2000వ సంవత్సరంలో ‘మిషన్ కాశ్మీర్’ అనే చిత్రాన్ని తీస్తున్న రోజుల్లో ప్రదీప్ సర్కార్ అనే ఒక తెలివైన సాంకేతిక నిపుణుడిని పిలిపించి, ‘మిషన్ కాశ్మీర్’ చిత్రానికి పాటలు షూట్ చేయమని అడిగాడట. అందుకు ఒక కారణం ఉంది. అప్పటికే ప్రదీప్ సర్కార్ 1000 ఎడ్వర్టయిజ్‌మెంట్లు, 15 మ్యూజిక్ వీడియోలు తీసిన అనుభవంతో ఉన్నాడు.

 

  దర్శకుడిగా సినిమాల్లోకి ప్రవేశించేదెలా అని మథనపడిపోతున్న ప్రదీప్ సర్కార్... విధు వినోద్ చోప్రా నుంచి పిలుపు రాగానే మహదానందభరితుడై వెళ్లిపోయి, వినోద్ చోప్రాతో కలసి వర్క్ చేయడం ప్రారంభించాడు. కానీ హృతిక్‌తో తీసిన ‘మిషన్ కాశ్మీర్’ ఘోర పరాజయం పొందింది. షారుఖ్ ఖాన్‌తో సంజయ్‌లీలా భన్సాలీ తీసిన ‘దేవదాసు’ బాగా ఆడింది. ఈ రెండూ విధు వినోద్ చోప్రాని బాగా ఆలోచనలో పడేసినట్టున్నాయి. భారతదేశంలో సౌత్ ఇండియన్ సినిమాకి పుట్టినిల్లు అయిన బెంగాలీ కథని తీసుకుని, ప్రముఖ బెంగాలీ నటుడు సవ్యసాచి చక్రవర్తిని సైఫ్ అలీఖాన్ తండ్రి పాత్రలో మెయిన్ విలన్‌గా తీసుకుని, బెంగాలీ నటి రైమాసేన్‌ని హీరోయిన్ చెల్లెలి పాత్ర కోయెల్‌కి ఎంచుకుని, విద్యాబాలన్‌ని హీరోయిన్‌గా తీసుకుని, ప్రదీప్ సర్కార్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, సహ రచయితగా, కళాదర్శకుడిగా నియమించి, చిత్రాన్ని నిర్మించాడు విధు వినోద్ చోప్రా.

 

  అప్పటికే ఆయన అనిల్‌కపూర్, మనీషా కొయిరాలా జంటగా, భారీగా తీసిన ‘1942 ఎ లవ్‌స్టోరీ’ పీరియడ్ ఫిల్మ్ మంచి పేరును మిగిల్చినా, పరాజయాన్ని మూటకట్టుకొంది. అయినా, వెరవకుండా పరిణీత చిత్రానికి శ్రీకారం చుట్టాడు విధు వినోద్ చోప్రా. ఏడాది పాటు కూర్చుని నవలని తెరకి అనువదించారు చోప్రా, ప్రదీప్ సర్కార్. మరో ఏడాది పాటు కూర్చుని శంతను మొయిత్రాని పీల్చి పిప్పిచేసి, కొన్ని వందల ట్యూన్లు స్వరం చేయించి, ఆరు పాటలు ఫైనలైజ్ చేశారు. అప్పుడే ఒక ఇంటర్వ్యూలో చోప్రా, బాలీవుడ్‌కి మరో ఆర్.డి.బర్మన్ కాగల సత్తా శంతను మొయిత్రాకి ఉందని కితాబిచ్చాడు.

 

  ఆయన అన్నట్టే పరిణీత రిలీజ్ అయ్యాక ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ మ్యూజిక్ డెరైక్టర్ అవార్డు, ఆర్.డి.బర్మన్ స్మారక అవార్డుల్ని శంతను మొయిత్రా గెలుచుకున్నారు. నిజానికి శేఖర్ పాత్రలో ముందు అభిషేక్ బచ్చన్‌ని ఎంపిక చేసుకున్నారు. గిరీష్ పాత్రలో సైఫ్ అలీఖాన్‌ని ఫిక్స్ అయ్యారు. ఈ శేఖర్ ఎవరు, గిరీష్ ఎవరు అంటారా? అయితే ముందు కథనోసారి పరికించి వద్దాం. అందమైన కలకత్తా నగరంలో ప్రజల జీవన విధానం చూపిస్తూ, గంభీరమైన అమితాబ్ బచ్చన్ గళం 1960ల నాటి కలకత్తా పరిస్థితుల్ని, కథని మనకి పరిచయ వాక్యాలుగా వినిపిస్తూ సినిమా మొదలౌతుంది. శరీరం సీట్లకి, కళ్లు తెరకీ అతుక్కుపోతాయి ఆ ఇంట్రడక్షన్‌తో.

 

  ధనవంతుడైన నవీన్‌రాయ్ కొడుకు శేఖర్. పక్కింట్లో ఉండే దిగువ మధ్యతరగతి అమ్మాయి లలిత. శేఖర్ వివాహం గాయత్రితో జరగబోతోంది మరికాసేపట్లో. వివాహానికి తయారౌతున్న శేఖర్ మనసు మనసులో లేదు. ఏవో జ్ఞాపకాలు. పందిట్లో పాట మొదలైంది. పక్కింటివైపు వెళ్లాడు శేఖర్. రెండిళ్లకీ మధ్య పెద్ద గోడ అడ్డుగా ఉంది. తనని చిన్నప్పట్నుంచీ అభిమానించిన వసుంధరా ఆంటీని కలిశాడు శేఖర్. భర్త మరణించిన బాధలో ఉందామె. అయినా, ఆ కుటుంబాన్ని ఆదుకున్న గిరీష్‌ని ప్రశంసించింది. భర్త ఆఖరి కోరిక మేరకు లలితకి, గిరీష్‌కి వివాహం చేశారని శేఖర్‌కి అర్థమైంది. కోపంగా వెనక్కి వెళ్లిపోతున్న శేఖర్‌ని పిలిచింది లలిత, అతని చిన్నప్పటి స్నేహితురాలు. ఇప్పుడు గిరీష్ భార్య. మొహం కూడా చూడదను కున్నాడు. అసలు ఆమె మీద కోపంతోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అభిమానంగా దగ్గరకొచ్చిన లలితని దూషించి, అవమానించి వెళ్లిపోయాడు శేఖర్.

 

 ఇంటికెళ్లి పియానో వాయించాడు. ఆ పియానో మెట్లమీద అందంగా, ఉల్లాసంగా ఊయల ఊగుతూ శేఖర్‌తో మాట్లాడుతూ, ఆడుతూ, పాడుతున్న సెలయేరంటి యువతి లలిత. గతంలోకి వెళ్తే శేఖర్, లలితల మధ్య ఒక పాటలో లిరిక్‌కి, మ్యూజిక్‌కి ఉన్నంత స్నేహం. ఆ స్నేహం పరిఢవిల్లి ప్రేమగా మారాక, అంతరాలు మొదలై, అపార్థాలకి దారితీసి శేఖర్ జీవితంలోకి గాయత్రి, లలిత జీవితంలోకి గిరీష్ వస్తారు. చివరికి లలిత పట్ల శేఖర్‌కున్న అపార్థాన్ని గిరీషే తొలగిస్తాడు. ఆ రెండు ఇళ్ల మధ్యనున్న అడ్డుగోడని శేఖర్ పడగొడతాడు. లలితని చేపడతాడు. అనివార్య కారణాల వల్ల అభిషేక్ బచ్చన్ ఈ శేఖర్ పాత్ర నుంచి తప్పుకున్నాడు. అప్పుడు చోప్రాకి పెద్దగా ఇష్టం లేకపోయినా ప్రదీప్ సర్కార్ బలవంతం మీద సైఫ్ అలీఖాన్‌ని గిరీష్ పాత్ర నుంచి తప్పించి, శేఖర్ పాత్రకి అయిష్టంగానే ఫిక్స్ అయ్యారు. తర్వాత గిరీష్ పాత్రకి సంజయ్‌దత్‌ని ఒప్పించారు.

 

 ప్రదీప్ సర్కార్ చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించిన విద్యాబాలన్‌ని ప్రధాన హీరోయిన్‌గా తీసుకోవడం సైఫ్‌కి పెద్దగా ఇష్టం లేదు. ఏ ఐశ్వర్యారాయ్‌నో, రాణీముఖర్జీనో పెడితే బావుంటుందని అనేవాట్ట. కానీ, ఆరు నెలలపాటు కొన్ని వందలసార్లు ఆడిషన్ చేసి ప్రదీప్ సర్కార్ విద్యాబాలన్ ఆ పాత్రకి న్యాయం చేయగలదని హీరోని, నిర్మాతని ఒప్పించాడు. ఇదంతా కన్‌ఫార్మ్ అయ్యాక, స్క్రిప్ట్ రెడీ అయ్యాక, చోప్రా ఇంక ఈ ప్రాజెక్ట్‌ని నిశ్చింతగా ప్రదీప్ సర్కార్‌కి అప్పచెప్పేశాడు. చివరికి డబ్బు కూడా ప్రదీప్ అకౌంట్‌లో వేసి, అతని ద్వారానే ఖర్చు పెట్టించాట్ట. అంత నమ్మకంగా అప్పగించాడు నిర్మాత.విద్యాబాలన్ అద్భుతమైన పరిణతి ప్రదర్శించింది పరిణీత పాత్రలో. చిత్రం చూశాక, ఆ పాత్రలో వేరెవరినీ ఊహించలేం. దియామీర్జా చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది ఉన్న కాస్సేపూ.కెమెరా, ఎడిటింగ్, సంభాషణలు, సంగీతం, కళాదర్శకత్వం అన్నీ అదనపు హైలైట్స్ ఈ చిత్రానికి. మొదటి చిత్ర ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు ప్రదీప్ సర్కార్.

 

 ‘కైసీ పహేలి జిందగానీ’ అనే 1960ల నాటి నైట్‌క్లబ్‌లో పాటకోసం అలనాటి అందాల నటి రేఖని ఒప్పించారు. లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ మ్యూజికల్ ఆల్బమ్‌లో ‘ఎ కిస్ టు బిల్డ్ ఏ డ్రీమ్ ఆన్’ పాట స్ఫూర్తితో ఈ పాటని స్వరపరిచారు శంతను మొయిత్రా. శ్రేయాఘోషల్, సోనూనిగమ్ పాడిన ‘పియా బోలే’ పాట చాలా బావుంటుంది వినడానికి, చూడ్డానికి కూడా.రేఖ ప్రత్యేకంగా నటించిన ఈ ‘కైసీ పహేలి జిందగానీ’ పాట చిత్రీకరణ, ట్యూన్ అన్నీ స్ఫూర్తిగా తీసుకుని మన తెలుగు దర్శకులు శ్రీ నీలకంఠగారు, ఆయన భూమికతో తీసిన మిస్సమ్మ సినిమాలో ‘నే పాడితే లోకమే పాడదా’ అనే పాట దృశ్యీకరించారు.ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన చిత్రం ‘పరిణీత’. గంభీరమైన చిత్రాలు, గతంలోకి తొంగిచూసే చిత్రాలు, పాత్రల నడుమ సున్నితమైన భావోద్వేగాలు ఇష్టపడే ప్రేక్షకులు తప్పక చూడాల్సిన సినిమా ‘పరిణీత’!వచ్చేవారం మరో మంచి సినిమాతో మళ్లీ మీ ముందుంటాను.                

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top