మిర్రర్ అండ్ ఎర్రర్!

మిర్రర్ అండ్ ఎర్రర్!


హ్యూమర్

మిర్రర్స్ అండ్ ఎర్రర్స్ అండ్ కో అనే అద్దాల కంపెనీలోని ఉద్యోగులంతా కొత్త బిజినెస్ ఐడియా కోసం మేధోమథనం చేస్తున్నారు. అద్దాలన్నీ రొటీన్‌గా ఉంటు న్నాయి. కొత్తరకం అద్దం ఏదైనా తయారు చేద్దామన్నది ఆ మీటింగ్ ఉద్దేశం. అంతలో ఓనర్‌కు తటాలున ఒక ఐడియా తట్టింది. దాన్ని ప్రకటించగానే మిగతా భాగస్వాములంతా సంతోషంగా ఆమోదించారు. ‘‘నువ్వు వెంటనే ఆ ఫార్ములా ఏమిటో తెలుసుకొని ఆ తరహా అద్దాలు తయారు చెయ్. ఇక పిచ్చి సేల్స్.



బ్లాకులో అమ్మినా అమ్ముతారు’’ అని ఆదేశించాడు కంపెనీ ఓనర్. వెంటనే రీసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ వాళ్లను పిలిపించారు. అందులో ఒక చీఫ్ సైంటిస్టుకూ ఆ ఐడియా విపరీతంగా నచ్చింది. ‘‘భలే వచ్చింది సార్ మీకు ఐడియా. ఈ ఐడియాకు ఇన్‌స్పిరేషన్ ఏదైనా ఉందా?’’ అడిగాడు సైంటిస్ట్. ‘‘ఏమీ లేదయ్యా. రాత్రి మాయా బజార్ సినిమా చూశా. అందులోని పాత్ర ధారులంతా ఒక అద్దంలోకి చూస్తుంటారు కదా.



మన టీవీలాంటిదే కదా ఆ అద్దం అనిపించింది మొదట్లో. కానీ తర్వాత గబుక్కున ఒక ఐడియా వచ్చింది. ఆ సినిమాలో ఉన్న తరహా మిర్రర్స్ చేసి అమ్మాం అనుకో.. సావిత్రికి ఏఎన్నార్ కనిపించినట్టు... దానిలోకి చూసిన వాళ్లందరికీ వాళ్ల లవర్‌‌స కనిపిస్తారని చెప్పామనుకో... ఇక అందరూ దాని కోసం ఎగబడతారు. ఓల్డేజి వాళ్లూ తమ లవర్స్ ఎవరో చూసుకోడానికి ఉవ్వి ళ్లూరుతారు.



‘వాలెంటైన్స్ డే’ నాడు ఈ ‘లవర్స్ మిర్రర్స్’ను మార్కెట్‌లోకి  రిలీజ్ చేస్తే సందర్భానికి తగినట్లుగా కూడా ఉంటుంది’’ అన్నాడు మిర్రర్స్ అండ్ ఎర్రర్స్ యజమాని సంతోషంగా. ‘‘చాలా బాగుంటుంది సార్. అసలు ఐడియా వినడానికే ఎక్సైటింగ్‌గా ఉంది. అంతెందుకు, నా లవర్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది సార్’’ అన్నాడు అప్పుడే చేరిన యంగ్ అప్రెంటిస్ ఒకడు.

 ‘‘ఈ బిజినెస్ ఐడియా సూపర్‌గా ఉంది సార్. మారేజ్ బ్యూరోలూ, మ్యాట్రి మోనియల్ కంపెనీలకూ అమ్మవచ్చు. నిజానికి మనం అమ్మాల్సిన అవసరం లేదు సార్.



తమ దగ్గర ఇలాంటి సదు పాయం ఉందనీ, సంబంధాలు వెతకడం అంతా షార్ట్‌కట్‌లో అయిపోతుందని వాళ్లంతా మనకు బోలెడు ఆర్డర్స్ ఇస్తారు’’ అన్నాడు బిజినెస్ డెవెలప్‌మెంట్ వింగ్ అధికారి. ‘‘అవున్సార్. మన టీవీ యాడ్స్‌లో ఈ క్లిప్పింగ్‌నూ చూపిద్దాం. ‘శశిరేఖకు అభిమన్యుడు, మరి మీకు ఎవరు...?’ అనేది మన టీవీ యాడ్ క్యాంపెయినింగ్ క్యాప్షన్. యూత్‌ను ఆక ర్షించే పవర్‌ఫుల్ స్లోగన్స్ కూడా  తయారు చేద్దాం’’ అన్నాడు క్రియేటివ్ డెరైక్టర్.



‘‘నిజమే సార్. బ్రాండ్ అబాసిడర్స్‌గా స్టార్‌‌సని తీసుకోవాలి. మీరు చెప్పిన మాయాబజార్‌లోని శ్రీకృష్ణుడినే తీసుకుంటే దిగులే లేదు. పైగా ఆయన తనను లవ్ చేసిన రుక్మిణిని చేసుకున్నాడు. సొంత చెల్లెలు సుభద్ర అర్జునుడిని లవ్ చేస్తే వాళ్లకి పెళ్లి చేశాడు. అన్న కూతురు శశిరేఖ, చెల్లెలి కొడుకు అభిమన్యుడిని లవ్ చేస్తే అదీ సక్సెస్ అయ్యేలా చేశాడు. ఆ సినిమా చూసే కద్సార్ మీకు ఈ ఐడియా వచ్చింది’’ అన్నాడు మరో సబార్డినేట్. ‘‘వాట్ యాన్ ఐడియా సర్జీ’’ అన్నాడు మరో ఉద్యోగి.

 

‘‘ఇదంత వర్కవుట్ కాదనుకుంటా సర్’’ ఆ సంతోషపు మూడ్స్ చెడగొడుతూ మూల నుంచి ఒక గొంతు వినిపించింది.

 ‘‘ఏం మాట్లాడుతున్నారండీ...’’ అంటూ ఒక్కసారే అరిచారంతా. బాస్ ఐడియాను మెచ్చుకోని వాళ్లంతా మూకుమ్మడిగా ఆ గొంతు తాలూకు ఓనర్ ఎవరా అని ఆ వైపునకు తిరిగారు. అందరూ అవుననే దాన్ని ఎవడైతే కాదంటాడో వాడే రాంబాబు.

 

‘‘అయినా ఎంత ధైర్యం... ఇంత సేలబుల్ ఐడియాను బాస్ చెబితే కాదం టారా? పైగా అంత క్రియేటివ్ ఫ్యాంటసీ అద్దాన్ని రియల్‌గా తయారు చేయ బోతుంటే... తయారు కాకముందే ఆ అద్దాన్ని బద్దలు కొడు తున్నారా? హౌ శాడ్’’ అంటూ నిట్టూర్చారు ఒకరిద్దరు.

 ‘‘అవున్సార్. ఇది ఫ్యాంటసీ రియాలిటీ అయినా... అది అందు బాటులోకి రాకముందే ప్రొడక్ట్ చచ్చి పోతుంది సార్. ఇందులో పెద్ద ఆలో చించాల్సిందేమీ లేదు, చిన్న లాజిక్.’’

 ‘‘మీకు మాత్రమే తెలిసిన ఆ లాజిక్ ఏమిటో?’’ వ్యంగ్యంగా అడిగాడు ఓనర్.

 ‘‘ఏమీ లేదు సార్. మీరు మీ లవర్ ఎవరో అందులో చూస్తారు. మీ ఆవిడ అదే మిర్రర్‌లోకి చూసినప్పుడు... ఇంకెవడో గానీ కనపడితే ఏముంద్సార్. కాపురం కొలాప్స్. అదే ఈ మిర్రర్‌లోని ఎర్రర్’’ అన్నాడు రాంబాబు.

 - యాసీన్

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top