అందరి మందువయా!

అందరి మందువయా! - Sakshi


 ఆదర్శం

 ఎనిమిది సంవత్సరాల క్రితం... ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో, నిర్మాణంలో ఉన్న మెట్రో బ్రిడ్జి ఉన్నట్టుండి కుప్పకూలింది. అనేక మంది గాయాల పాలయ్యారు. బాధితుల్లో ఎక్కువమంది పేదవాళ్లే. సకాలంలో వైద్యం అందినప్పటికీ, ఆ తరువాత అవ సరమైన మందులు లభించక, లభించినా కొనుక్కునే స్తోమత లేక వారు పడిన ఇబ్బందులు ఇన్నీ అన్నీ కావు. వారి పరిస్థితిని చూసి అందరూ అయ్యో అన్నారు. కానీ ఓంకార్‌నాథ్ మాత్రం నాటి నుంచి నిద్రకు కరువయ్యారు.

 

 కన్ను మూసినా తెరిచినా ఆ పేదల పాట్లే గుర్తు రాసాగాయి ఓంకార్‌కి. అలాంటివాళ్ల కోసం తాను ఏమీ చేయ లేనా అని మథన పడేవారు. అలా అని ఆయనేం సంపన్నుడు కాదు. బ్లడ్ బ్యాంకులో పని చేసి రిటైరైన సామాన్య ఉద్యోగి. అందుకే మొదట ‘‘నేనేం చేయగలను? బాధ పడడం తప్ప!’’ అనుకున్నాడు. కానీ ఆలోచించాక ‘‘బాధకే పరిమితం కాకూడదు. కచ్చితంగా ఏదో ఒకటి చేయాలి’’ అనుకున్నాడు. అప్పుడే అతనికొక మంచి ఆలోచన వచ్చింది. అదే  ‘మెడిసిన్ బ్యాంక్’!

 

 రోగం తగ్గాలంటే మందు వేయాలి. కానీ ఆ మందు కొనాలంటే సొమ్ము కావాలి. ఉన్నవాడు కొనుక్కుంటాడు. కానీ లేనివాడి పరిస్థితి ఏంటి? ఆ లేనివాళ్లే ఓంకార్ టార్గెట్. వారికి అవసరమైన మందులు సమకూర్చాలి అనుకున్నాడు. ఆ క్షణం నుంచీ సంపన్నులు, మధ్యతరగతి ఇళ్లకు తిరగడం మొదలుపెట్టాడు. ఆరోగ్యం కుదుటపడ్డాక మిగిలిన మందులు ఉంటే ఇవ్వమని అడిగేవాడు. వాటన్నిటితో ఓ ‘మెడిసిన్ బ్యాంక్’ను ఏర్పాటు చేశాడు. అక్కడికి ఏ పేదవాడైనా రావొచ్చు. తన అనారోగ్యానికి మందు అడిగి తీసుకుపోవచ్చు.  అలా అని అవసరంలో ఉన్నవారు తన బ్యాంకును వెతుక్కుంటూ రావాలను కోలేదు ఓంకార్. వారిని వెతుక్కుంటూ తనే వెళ్లడం మంచిదనుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా మురికి వాడలకు, పేద వాళ్లు ఉండే బస్తీలకు వెళ్లడం ప్రారంభిం చాడు. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మందులు చేతిలో పెట్టి వస్తుంటాడు.

 

 ఇంత చేస్తున్న ఓంకార్ వయసు ఎంతో తెలుసా? డెబ్భై తొమ్మిది సంవత్సరాలు. కడుపుకింత తిని, కంటికింత నిద్రపోయి, ప్రశాంతంగా గడపాల్సిన వయసు తనది. కానీ అసలు విశ్రాంతి అన్న ఆలోచనే రాదు ఓంకార్‌కి. ‘‘కష్టం అనుకుంటే అన్నీ కష్టాలే మిగులు తాయి. దాని గురించి ఎక్కువగా ఆలో చించకుండా లక్ష్యంపై మాత్రమే దృష్టి పెడితే అస్సలు కష్టమనిపించదు’’ అంటాడు స్పష్టంగా, స్ట్రాంగ్‌గా. పైగా ‘‘విశ్రాంతి అంటే గుర్రుపెట్టి నిద్రపోవడం కాదు... మనసుకు నచ్చిన పని చేయడం’’ అని కూడా అంటాడు.

 

 నిజానికి ఓంకార్‌ని మొదట్లో కొందరు అనుమానించారు. ఏ అనుభవం లేకుండా, మందులపై ఎటువంటి అవ గాహనా లేకుండా చేతికొచ్చిన మందును ఇచ్చేస్తే ఎంత ప్రమాదం అంటూ కామెంట్ చేశారు. కానీ ఆమాత్రం ఆలో చన లేనివాడు కాదు ఓంకార్. ఆయన ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుం టాడు. సేకరించిన మాత్రల ఎక్స్‌పయిరీ డేట్లు చెక్ చేస్తాడు. వాటన్నిటి వివరాలతో ఓ రికార్‌‌డ మెయింటెయిన్ చేస్తాడు. ఏ మందు దేనికి వేసుకోవాలి, దేనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఏ మందు వేసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలన్నీ నిపుణుల్ని అడిగి తెలుసుకున్నాడు.

 

 దాంతో ఓంకార్ మేలు చేసేవాడే తప్ప కీడు చేసేవాడు కాదని తెలిసొచ్చింది. మెడిసిన్ బాబా అంటూ ఓంకార్‌ని ప్రేమగా పిలవడం మొదలుపెట్టారు. ఇంకొందరు స్వామీజీ అంటారు. స్వయంగా మిగిలిన మందులు తీసుకుని, ఢిల్లీలోని మంగళ్‌పురిలో ఉన్న ‘మెడిసిన్ బ్యాంక్’కి వస్తున్నారు. ఎంతో గౌరవంగా ఓంకార్ చేతిలో పెట్టి వెళ్తున్నారు. కొందరు ఫోన్ చేసి తమ దగ్గర మందులున్నాయి తీసుకెళ్లమని చెప్తున్నారు. మరికొందరు మెడిసిన్ బ్యాంకు నిర్వహణ కోసం ధన సహాయం కూడా చేస్తున్నారు.

 

 తన దగ్గర మందులు తీసుకెళ్లినవాళ్లు కోలుకుని ఆరోగ్యంగా తిరుగుతుంటే చూసి ఎంతో సంతోషపడతాడు ఓంకార్. అక్కడితో ఆగిపోకుండా తాను సేకరించిన విరాళాలతో... మందులతో జబ్బు తగ్గని పేదలకు చికిత్స కూడా చేయిస్తాడు. క్యాన్సర్, కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి కూడా ఏదైనా సహాయ పడాలనేది ఓంకార్‌నాథ్ ప్రస్తుత లక్ష్యం. లక్ష్యాలను పెట్టుకోవడమే కాదు... వాటిని సాధించడం కూడా ఓంకార్‌నాథ్‌కు బాగా తెలుసు. త్వరలోనే ఈ లక్ష్యాన్నీ ఛేదించి తీరతాడు.                                

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top