మృత్యువు ముంగిట్లోంచి కాలేజీ గేట్లోకి...

మృత్యువు ముంగిట్లోంచి కాలేజీ గేట్లోకి... - Sakshi


మెడికల్ మెమరీస్

ఆరోజు తన పనులన్నీ వేగంగా ముగించుకొని సాయంత్రం ఆరింటికల్లా ఆసుపత్రి నుంచి బయటపడ్డారు డాక్టర్ ప్రసాద్‌బాబు. మరో గంటలో ఆయన విమానాశ్రయంలో ఉండాలి. మర్నాడు బెంగళూరులో జరుగుతున్న వైద్యుల కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలి.



ఆరోజే శ్యామ్(పేరు మార్చాం) ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన మొదటిరోజు. కాలేజీ నుంచి ఇంటికి చేరాల్సిన కుర్రాడు క్యాజువాలిటీలో చేరాడు! అతడి బైకును ఏదో వాహనం ఢీకొట్టింది. రక్తపు మడుగులో పడి ఉన్న శ్యామ్‌ను కొందరు దగ్గరి ఆసుపత్రికి తీసుకెళ్లారు.  



ప్రథమ చికిత్స అనంతరం పెద్దాసుపత్రికి తరలించాలని సూచించడంతో శ్యామ్‌ను ‘యశోద’కు తెచ్చారు. ఎడతెరిపి లేకుండా రక్తస్రావం జరుగుతోంది. బతుకుతాడనే ఆశ లేదు. విమానాశ్రయంలో ఉన్న ప్రసాద్‌బాబుకు కబురు వెళ్లింది. ఇంకొన్ని క్షణాల్లో విమానంలో ఉండాల్సిన ఆయన, కొద్దిసేపటికి శ్యామ్ పక్కన ఉన్నారు. స్కానింగ్ రిపోర్టులను పరిశీలించారు. కాలేయంలో ఒక రక్తనాళం చిట్లి రక్తం కారుతోంది. కటివలయంలోని ఎముకల్లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్.



ఎడమకాలి తొడలో రక్తనాళం దెబ్బతింది. ముందు రక్తం ఎక్కించడం ప్రారంభించారు డాక్టర్లు. న్యూరోసర్జన్ వచ్చి తలకు గాయాలేమైనా ఉన్నాయా అని పరిశీలించారు. బలమైన గాయాలేమీ తగల్లేదు. కాకపోతే  డాక్టర్ల ప్రయత్నాలకు రోగి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో తక్షణం ఏమీ చెప్పలేని పరిస్థితి. శ్యామ్ మంచి అథ్లెట్. ఫుట్‌బాల్ ప్లేయర్. అప్పటికే అక్కడవున్న తల్లిదండ్రులు కొడుకును అలా అచేతనంగా చూడలేకపోతున్నారు.



వివిధ వైద్యప్రక్రియల్లో నైపుణ్యం ఉన్న 20 మంది సూపర్ స్పెషలిస్టుల బృందం రంగంలోకి దిగింది. రక్తస్రావాన్ని నిలువరించేందుకు అత్యంత అరుదుగా ఉపయోగించే ఇంజెక్షన్లను అప్పటికే రెండింటిని వాడారు. కాసేపటికి రక్తస్రావం ఆగడంతో బీపీ ఆనవాళ్లు కనిపించడం మొదలయ్యాయి. దాంతో మరింతగా పురోగమించారు డాక్టర్లు. రోగి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపెన్ సర్జరీ చేసి కాలేయంలో, తొడలో దెబ్బతిన్న రక్తనాళాలను సరిచేయడం అసాధ్యం. ఇక ప్రత్యామ్నాయం కేవలం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో సర్జరీ.

 

ప్రసాద్‌బాబు వెంటనే శ్యామ్‌ను  వెంటిలేటర్‌పైనే ఉంచి ఐసీయూ నుంచి క్యాథ్‌ల్యాబ్‌కు తరలించారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు సహాయంతో కాలేయంలోని రక్తనాళాన్ని పూడ్చగలిగారు. ఇప్పుడు మరో సవాలు. తొడలో చిట్లిన రక్తనాళాన్ని పూడ్చేందుకు ప్రత్యేకమైన కవర్డ్ స్టెంట్ అమర్చడమే ఏకైక మార్గం. అవి అందుబాటులో లేవు. అన్ని చోట్లా  వాకబు చేస్తే, కేవలం ఒకరి దగ్గర, అదీ  ఒక్కటంటే ఒక్కటే ఉందని తెలిసింది. అప్పటికే అర్ధరాత్రి దాటింది. ఆ వేళలో ఆ డీలర్‌ను నిద్రలేపి, షాప్‌ను తెరిపించి, స్టెంట్ తెచ్చేందుకు అంబులెన్స్ ఆగమేఘాల మీద వెళ్లింది. వచ్చిన పదిహేను నిమిషాల్లో స్టెంట్ అమరిక విజయవంతంగా పూర్తయ్యింది. తెల్లవారుజామున శ్యామ్ పరిస్థితిలో ఆశాజనకమైన పురోగతి కనిపించింది. ఈలోపు డాక్టర్ల బృందం ఓపెన్ సర్జరీకి రంగం సిద్ధం చేసింది. దీని ద్వారా కాలేయంలో దెబ్బతిన్న రక్తనాళాన్ని సంపూర్ణంగా మరమ్మతు చేశారు. పనిలోపనిగా పగిలిన మూత్రాశయాన్నీ సర్జరీ ద్వారా రిపేరు చేశారు.

 

రెండు రోజుల తర్వాత శ్యామ్ మెల్లగా  కళ్లు తెరిచాడు. ప్రసాద్‌బాబు బృందం హాయిగా నిట్టూర్చింది. ఏడు రోజుల తర్వాత వెంటిలేటర్ తొలగించారు. ఐసీయూ నుంచి వార్డుకు తరలించారు. ప్రాణమైతే దక్కింది. కానీ శ్యామ్ మంచి ప్లేయర్. అతడు మునుపటిలా ఆడగలడా? కనీసం నడవగలడా?

 ఈ దశలో ఆర్థోపెడిక్ సర్జన్లు రంగంలోకి దిగారు. కటివలయానికి మల్టిపుల్ ఫ్రాక్చర్లు అయిన చోట వాటిని కలుపుతూ శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత రీహ్యాబిలిటేషన్ చికిత్సలూ, ఫిజియో ప్రక్రియలూ మొదలయ్యాయి. తన విల్‌పవర్‌తో తిరిగి కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టాడు శ్యామ్.

 

మళ్లీ ఇవాళ్టికి వస్తే...

‘ఇది టీమ్ విజయం. ఆరోజున 20 మంది డాక్టర్లూ, 100 మందికి పైగా పారామెడికల్ సిబ్బందీ అవిశ్రాంతంగా కష్టపడ్డాం. అతడికి కొత్త జీవితం అందించగలిగాం’. తన జీవితంలోని అత్యంత సంక్లిష్టమైన కేసును గుర్తుతెచ్చుకుంటూ  డాక్టర్ ప్రసాద్‌బాబు చెప్పే మాట ఇది.

 - యాసీన్

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top