టవల్‌ మామ వీరగాథ

టవల్‌ మామ వీరగాథ - Sakshi


‘‘అది... బుల్లి బుడతలకు నిద్దుర పుచ్చే దుప్పటి, స్నానాల వేళ సిగ్గులొలికే చిన్నారులకు రక్షక కవచం. పెళ్లి పెద్దల భుజంపై వాలే పెద్దరికం, కూలీ నాలీ చేసేవారి నెత్తిపై మెత్తటి సాయం, శ్రమజీవుల చెమటలను తుడిచే ఆత్మీయం, నీట తడిసిన ఒంటిని శుభ్రంచేసే పనిమనిషి.’’ అనేది ఒక పొడుపు కథ అయితే, సమాధానం ఏం చెబుతారు..? పక్కనే కనిపించే చిత్రాలను చూసి టవల్‌ అని ఠక్కున చెప్పేస్తారులే కానీ, మీ లైఫ్‌లో మీరు ఇప్పటి దాకా ఎన్ని టవల్స్‌ వాడి ఉంటారు..? నిజానికైతే ఆరోగ్యరీత్యా ప్రతి మనిషి సంవత్సరానికి ఒకసారి టవల్‌ మార్చాలట. మరి మారుస్తున్నారా..? ఎన్నో అవసరాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్న ఈ ‘టవల్‌ మామ వీరగాథ’ ఏంటో ఓసారి చూసేద్దామా..?



ప్రతి దానికీ ఓ డేని ఇచ్చేసే ఫారినర్స్‌ ఈ టవల్స్‌కి కూడా ఓ రోజు ఇచ్చారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న డగ్లస్‌ ఆడమ్స్‌ అనే రచయిత మరణానికి నివాళిగా మే 25న టవల్‌ డేగా ప్రకటించారు. ఇంగ్లాండ్‌కు చెందిన డగ్లస్‌.. ‘ది హెచర్స్‌ గైడ్‌ టు ది గెలాక్సీ’ నవలలో టవల్‌ ప్రాధాన్యతను మెండుగా చెబుతారు. దాంతో ఆయన అభిమానులు... ఆయన నిర్వహించే మీటింగ్స్‌కు టవల్స్‌తో అటెండ్‌ అయ్యేవారు. హాస్యంతో, వ్యంగ్యంతో అందరినీ నవ్వించే డగ్లస్‌ 2001లో మృతి చెందారు. అతని గుర్తుగా అప్పటి నుంచీ టవల్స్‌ డే జరుపుకుంటున్నారు. ఆయన రాసిన ‘ది హెచర్స్‌ గైడ్‌ టు ది గెలాక్సీ’ని 2005లో  సినిమాగా తీశారు. అందులో హీరో, అతడి స్నేహితుడు ఇంచుమించు అన్ని సీన్స్‌లోనూ టవల్స్‌ పట్టుకుని తిరుగుతుంటారు.



చలన చిత్రాల్లో టవల్‌

రొమాన్స్‌ పండించేందుకు సినిమాలో టవల్‌ సీన్స్‌ చాలానే పెడుతుంటారు దర్శక నిర్మాతలు. అయితే ఈ టవల్‌పైన కడుపుబ్బే కామెడీ సీన్స్‌ అంటే.. ‘ఆట’ సినిమాలోని ‘సునీల్‌ టవల్‌ లేకుండా పడ్డ కష్టాలు గుర్తొస్తాయి. జనాలందరినీ పరుగులు పెట్టించి, బెంబేలెత్తించిన ఆ సీన్‌ తలుచుకుంటే భలే నవ్వు వస్తుంది కదూ! మరి మన నిత్య జీవితంలో టవల్‌ వాడకం గురించి కాస్త తెలుసు కుందామా..?



వారానికి రెండు సార్లు..

మనిషి జీవితంలో విరివిగా వాడే టవల్స్‌ను  2, 3 రోజులకొకసారి ఉతకాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. అంతకు మించితే మాత్రం ఒంటిని శుభ్రం చేసే టవల్స్‌ కూడా... ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు. ఒకసారి ఉతికిన టవల్‌ను మూడుసార్లకు మించి వాడకూడదని న్యూయార్క్‌ యూనివర్సిటీకి చెందిన ఆరోగ్య విజ్ఞాన నిపుణులు సూచిస్తున్నారు.



మీ ఆరోగ్యం మీ టవల్‌లో..

మనం వాడే టవల్‌ను ఏడాదికి ఒక్కసారైనా మార్చాలి. చిరగలేదు, బాగానే ఉందనే కారణాలతో రోగాలను తెచ్చుకోవద్దంటున్నారు నిపుణులు. ఇక టవల్‌ను వాష్‌ చెయ్యడంలో ఎక్కువగా డిటర్జెంట్‌ వాడితే... క్లాత్‌ బిరుసుగా తయారైపోతుంది. టవల్‌ని ఉతికేటప్పుడు వేడినీళ్లు ఉపయోగించడం చాలా మంచిది. ఏదేమైనా టవల్‌ యూజ్‌ చెయ్యడంలో తగిన జాగ్రత్తలు అవసరం అనేది మొత్తం సారాంశం. మరి టవల్స్‌ డే సందర్భంగా కొత్త టవల్‌ తీస్కోరాదు.!?



బ్యాక్టీరియా దాడి ఖాయం

టవల్స్‌ ఉతక్కుండా ఎక్కవ సార్లు యూజ్‌ చేస్తే... బ్యాక్టీరియా, ఫంగస్‌లకు నిలయాలుగా మారే ప్రమాదం ఉంది. ఒకరి టవల్‌  మరొకరు వాడటం వల్ల కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. 90 శాతం మంది టవల్‌ను శుభ్రంగా ఉంచుకోరని ఓ అంచనా. టవల్‌ శుభ్రంగా ఉంచుకునే వారితో పోల్చుకుంటే.. శుభ్రతను పాటించని వారికి అనారోగ్యాలు వేగంగా దాడి చేస్తాయని వైద్యులు నిర్ధారించారు.





అమ్మో... టవల్‌!

ఒక టవల్‌ కొనాలంటే... మహా అయితే... ఎంత కాస్ట్‌ పెట్టొచ్చు. మూడొందలు..? ఐదొందలు..? ఎనిమిదొందలు...? అమ్మో అంతా... అంటారా.? మరి ఈ ఆరు టవల్స్‌ సెట్‌ కాస్ట్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు. ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉన్న ఈ సెట్‌ ధర కేవలం అంటే కేవలం 8 వందల కోట్ల డాలర్లు. వీటిని ఖరీదైన,  స్వచ్ఛమైన సుపీమా కాటన్‌తో తయారు చేశారు. ఈ సెట్‌ ధరను మన రూపాయల్లో చెప్పాలంటే సుమారు 5,15,360 కోట్లు అన్నమాట. అంటే ఇంచుమించు ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌కు దాదాపు నాలుగు రెట్లు.



– సంహిత నిమ్మన

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top