నయన మనోహరుడు మన్నార్‌గుడి రాజగోపాలుడు

నయన మనోహరుడు  మన్నార్‌గుడి రాజగోపాలుడు


టూర్‌దర్శన్‌



తమిళనాట దేవాలయాలకు కొదవ లేదు. అందులోనూ విష్ణ్వాలయాలకు లోటు అసలే లేదు. సువిశాలమైన ప్రాంగణం, అద్భుతమైన శిల్పసంపద, ఆలయాల సంప్రదాయ వైభోగం అక్కడి ప్రత్యేకతలు. ఈ కోవకు చెందినదే తమిళనాడులోని మన్నారుగుడిలో గల రాజగోపాలస్వామి ఆలయం. దక్షిణద్వారకగా పేరొందిన ఈ ఆలయం అతి విశాలమైనది, అత్యంత పురాతనమైనదీ! రోజూ ఆరుమార్లు నిత్యపూజలతో, మూడు సంవత్సరోత్సవాలతో అంగరంగవైభవంగా అలరారే ఈ ఆలయంలో రథోత్సవం, చక్రతీర్థం, గరుడవాహన సేవ సుప్రసిద్ధమైనవి.



ఆలయ నిర్మాణం: 11వ శతాబ్దానికి చెందిన కుళోత్తుంగ చోళుడు ఇటుకలు, బంకమట్టితో నిర్మించగా, ఆయన తర్వాత వచ్చిన చోళ రాజులు దీనిని మరింత అభివృద్ధి పరిచారు. 16 వ శతాబ్దికి వచ్చేసరికి ఆలయం శిథిలావస్థకు చేరగా తంజావూరు నాయకరాజులు జీర్ణోద్ధరణ చేసి, మరింత విస్తారం చేశారు. 23 ఎకరాల స్థలంలో 192 అడుగుల ఎల్తైన రాజగోపురంతో, విశాలమైన కొలనుతో దక్షిణభారతదేశంలో అతిపెద్ద కొలనుగల ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. ప్రస్తుతం వెయ్యి స్తంభాలతో, 16 గోపురాలతో, ఏడు ప్రాంగణాలతో, ఏడు హాళ్లతో, తొమ్మిది ట్యాంకులతో, 24 విగ్రహాలతో అత్యంత పెద్దదిగా, నయన మనోహరంగా విలసిల్లే ఈ ఆలయంలో రుక్మిణీ సత్యభామాసమేత రాజగోపాలస్వామిగా శ్రీ కృష్ణుడు పూజలందుకుంటాడు. ఆలయానికి అనుబంధంగా1158 అడుగుల పొడవు, 837 అడుగుల వెడల్పుతో  హరిద్రానదిగా ఖ్యాతినొందిన కొలను ఉంటుంది. ఇది దేశంలోని అతిపెద్ద కొలనుల్లో ఒకటిగా పేరు పొందింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పంగుణి అనే తమిళ మాసంలో ఈ దేవాలయంలో 18 రోజులపాటు పంగుణి తిరువిళ అనే ఉత్సవం కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తారు.



తీర్థాలయం: ఈ ఆలయంలోని హరిద్రానదికి రాధాకృష్ణులు, గోపికలు కలసి జలకాలాడినదిగా పేరు. వారు జలక్రీడలాడటం కోసం పసుపు, చందనం, పన్నీరు తదితర సుగంధ ద్రవ్యాలు కలపడం వల్ల నదికి హరిద్ర అనే పేరు వచ్చింది. అందుకే కాబోలు నది నీరు ఇప్పటికీ పరిమళభరితంగా ఉంటుంది. ఈ నదిని కావేరీనది కుమార్తెగా భావిస్తారు స్థానికులు. నది మధ్యలో వేణుగోపాలస్వామి విగ్రహాన్ని చూస్తుంటే ఆయన మనతో కలసి జలక్రీడలాడుతున్నాడేమో అన్నంత సజీవంగా ఉంటుంది. రోహిణీ నక్షత్రం, తిరువోనం, పౌర్ణమి, అమావాస్య, సూర్య, చంద్రగ్రహణాల సమయాలలో భక్తులు నదిలో పవిత్రస్నానాలు చేస్తారు.



ఆలయానికి ఉత్తర దిశగా దుర్వాస తీర్థం, భృగుతీర్థం, గోపికాతీర్థం, రుక్మిణీ తీర్థం, అగ్నికుండతీర్థం, కృష్ణతీర్థం, శంఖుతీర్థం, చక్రతీర్థం, పంబనీ నది వంటి ఇతర తీర్థరాజాలున్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కదానికి ఒక్కొక్క చరిత్ర, ఆవిర్భావ గాధ, పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆలయానికి వచ్చినవారు ఈ తీర్థాలన్నింటిలోనూ పుణ్యస్నానాలు చేయడం ఆచారం.



ఆలయ ఉత్సవాలు: తమిళనాడులోని తంజావూరు జిల్లా కోయిల్‌ పాథీ, కూళం పాథీ అనే సామెతతో ప్రసిద్ధి. అంటే ఆలయాలు సగం, పుష్కరిణులు సగం అని. ఇది మన్నార్‌గుడి ఆలయానికి పూర్తిగా వర్తిస్తుంది.



ఆలయ ఉనికి: మన్నార్‌గుడి రాజగోపాల ఆలయం తంజావూరు జిల్లా తిరువరూరుకు 28 కిలోమీటర్ల దూరంలోని మన్నార్‌గుడిలో ఈ ఆలయం ఉంది.



క్షేత్రపురాణం: కుంభకోణం వద్దగల చంపకవనానికి చేరువలో హేమపుష్కరిణి తీర్థం ఒడ్డున Ðð య్యీ ఎనిమిది మంది రుషులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. వారిలో వహ్నిముని ఒకరు. ఆయనకు గోపిలర్, గోప్రలాయర్‌ అని ఇద్దరు కుమారులు. బాల్యం నుంచే వారికి మోక్షాపేక్ష తప్ప మరే ధ్యాసా లేదు. నిత్య తపోనిష్ఠాగరిష్ఠులు. వారి కఠోర  తపస్సుకు మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. తమను ఈ భవబంధాలనుంచి తప్పించి, శాశ్వత కైవల్యాన్ని కలిగించవలసిందిగా కోరారు వారు. అందుకు స్వామి నవ్వి, ‘‘మీరు ద్వారక వెళ్లి, అక్కడ కన్నయ్యను దర్శించుకుని రండి, అప్పుడు మీకు మోక్షం లభిస్తుంది’’ అని చెప్పి అంతర్థానమయ్యాడు. వెంటనే వారు పరమానందంతో తమకు తారసిల్లిన పుణ్యనదులన్నింటిలోనూ స్నానం చేస్తూ, ద్వారకను వెదుక్కుంటూ వెళ్లసాగారు. దారిమధ్యలో వారికి నారదముని కనిపించాడు. ఆయన కు నమస్కరించి, ‘‘మేము ద్వారకకు వెళ్లాలనుకుంటున్నాము. ఇక్కడినుంచి ఎలా వెళ్లాలి, కన్నయ్యను ఎలా కలవాలి?’’ అని అడిగారు. అందుకు నారదుడు నవ్వి, ‘‘మీరు కలవాలనుకుంటున్న స్వామి అవతార పరిసమాప్తి కూడా అయిపోయింది. ఆయన ఇప్పుడు వైకుంఠానికి చే రిపోయాడు. ఆయనను మీరు ఇక కలవలేరు’’ అన్నాడు.



ఆ మాటలను భరించలేనట్లు వారు రెండుచెవులూ మూసుకుంటూ, ‘‘అయ్యో, మాకిక దారి ఏది’’ అంటూ అక్కడే స్పృహతప్పి పడిపోయారు. వారి అనన్య భక్తికి పరవశించిన నారదుడు వారిని లేవనెత్తి, ‘‘విచారించవద్దు. మీరు ఇక్కడకు సమీపంలోని హరిధ్రానదిలో స్నానం చేసి, ద్వారకాధీశుడైన కన్నయ్యకోసం తపస్సు చేయండి. ఆయన మీ కోరిక తీరుస్తాడు’’అని చెప్పి అంతర్థానమయ్యాడు. వారు  సంవత్సరం పాటు తీవ్రంగా తపస్సు చేసిన పిమ్మట రాజగోపాలుడు ప్రత్యక్షమై, ఏం కావాలో కోరుకోమన్నాడు. ‘‘భగవాన్‌ మాకు మీరు వెన్నదొంగగా ఉండగా చూడాలని ఉంది. గోపికలతో కలసి జలక్రీడలాడుతుండగా దర్శించాలని ఉంది. యశోదమ్మ నిన్ను చెట్టుకు కట్టివేస్తుండగా చూడాలని ఉంది. గోపబాలుడిగా పశుపాలన చేస్తుండగా వీక్షించాలని ఉంది.... ’’ ఇలా 30 కోరికలు కోరారు. స్వామి వారు కోరినట్లుగా తన బాల్యం నుంచి, అవతార పరిసమాప్తి వరకు తన లీలలన్నీ వారికి చూపాడు. ఆ సమ్మోహన మూర్తిని, ఆయన చూపిన దివ్యలీలలను కన్నులారా దర్శించిన మునిబాలురు ఆనందంతో పరవశించిపోతూ, ‘‘స్వామీ, నీవు ఇక్కడ వేణుగానం చేస్తూ, గోవులను కాస్తూ, నీ పత్నులయిన రుక్మిణీ సత్యభామలతో సహా నువ్విక్కడే ఉండిపో’’ అని కోరారు. వారు కోరిన విధంగా వరం ఇచ్చి విష్ణువు వారికి మోక్షప్రాప్తి కలిగించాడు. ఆయనే రాజగోపాలస్వామి. ఆ ప్రదేశం మన్నారు గుడి కావడంతో ఆయన మన్నారు గుడి రాజగోపాలస్వామిగా ప్రసిద్థిగాంచాడు.



మూలమూర్తి వర్ణన: రజత కవచాలంకారంలో, వంటì పై కేవలం ధోవతి మాత్రం ధరించి, గోవు గంగడోలు నిమరడానికన్నట్లుగా ముందుకు వాలి, చెవులకు మకర కుండలాలు మెరుస్తుండగా, కుడిచేతిలో బంగారు శూలం, పశువులను అదిలించే చర్నాకోల, ఎడమచేతిని సత్యభామ మీద ఉంచి, నయన మనోహరంగా దర్శన మిస్తాడు. ఉత్సవ విగ్రహాలు శ్రీదేవి, భూదేవిలతో కూడుకుని పరావాసుదేవుడి రూపంలో కనువిందు చేస్తాయి.  



ఆలయంలో గణేశుడు, వేణుగోపాలుడు, వేంకటేశ్వరస్వామి వారితో సహా మొత్తం 24 దేవతా సన్నిధులున్నాయి. ఆలయ ప్రాకారాలు అద్భుతమైన శిల్పసంపదతో కనువిందు చేస్తాయి. తిరువుణ్ణాజీ ప్రాకారం, గరుడ ప్రాకారం, చంపక ప్రాకారం, కాశీ ప్రాకారం, నాచ్ఛియార్‌ ప్రాకారం తదితర ఏడు ప్రాకారాలు, వల్లాల మహరాజ మండపం, వెయ్యిస్తంభాల మండపం, గరుడ వాహన మండపం, యానై వాహన మండపం, పాలకాణి మండపం, వెన్నై తాఝీ మండపం, పున్నై వాహన మండపం అనే ఏడు పెద్ద మండపాలతో ఎటుపోయి ఎటువస్తున్నామో తెలియనంత సువిశాలంగా ఉంటుంది ఆలయ ప్రాంగణం. ఈ క్షేత్రం ఉన్న ప్రదేశాన్ని చంపకారణ్యమంటారు. ప్రాచీన కాలంలో ఇక్కడ చంపక వృక్షాలుండేవి. ఇప్పుడు పున్నాగ వృక్షాలున్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ పున్నాగ ఉత్సవం కూడా నిర్వహిస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల పునర్జన్మ ఉండదని, సిరిసంపదలకు లోటుండదని నమ్ముతారు. హరిద్రానదిలో స్నానమాచరించిన వారికి చర్మవ్యాధులు తొలగిపోతాయని, కోరుకున్న వారితో వివాహం జరుగుతుందని కూడా భక్తుల విశ్వాసం.     

– డి.వి.ఆర్‌. భాస్కర్‌



ఇతర సందర్శనీయ స్థలాలు

తిరువారూరులోని త్యాగరాజ స్వామి ఆలయం, వేలాంగిణి మాత ఆలయం, జంబావనోదై దర్గా, శ్రీ మురుగన్‌ ఆలయం, శ్రీతిళ్లైవిలగంలోని కోదండరామాలయం, కూతనూరులోనిశ్రీ సరస్వతీ ఆలయం, అగ్నిపురీశ్వరాలయం, అనంత మాంగళం ఆంజనేయస్వామి

ఆలయం, కమలాలయం చుట్టుపక్కల చూడదగ్గ సందర్శనీయ స్థలాలు.



ఎలా వెళ్లాలి?

విమాన మార్గం: తిరుచిరాపల్లి ఏర్‌పోర్ట్‌నుంచి 110 కిలోమీటర్లుంటుంది. తిరుచిరాపల్లి నుంచి బస్సులోనూ, రైలులోనూ వెళ్లవచ్చు.

రైలు మార్గం: నాగపట్నం రైల్వేస్టేషన్‌లో దిగితే అక్కడినుంచి 24 కిలోమీటర్ల దూరంలో గల మన్నార్‌గుడి ఆలయానికి చేరేందుకు ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులూ ఉన్నాయి.తమిళం, తెలుగు, మలయాళం, ఉర్దూ, ఇంగ్లీషు భాషలు ఇక్కడివారికి తెలుసు కాబట్టి తెలుగువారు వెళ్లినా భాషతో పెద్ద ఇబ్బంది ఉండదు.ఆలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది. ఏ వేళలో వెళ్లినా భోజనానికి ఇబ్బంది ఉండదు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top