రాజుగాడు

రాజుగాడు - Sakshi


ఉదయాన్నే... అంటే మరీ ఉదయాన్నే కాదు. ఇంట్లోవాళ్లు లేపగా లేపగా, దుప్పటి లాగగా లాగగా, చివరకు ముఖాన నీళ్లు కొట్టించుకున్న తర్వాత లేస్తే, వెంటనే పనులు! ఏదో నూతిలో నాలుగు బిందెలు నీళ్లు తోడామా, ఐదో బిందె ఒంటిమీద పోసుకుని దానికి స్నానం అని పేరు పెట్టామా, ఇంట్లో పనులు ఎగ్గొట్టడానికి ఒక గంట ముందే హైస్కూల్‌కి బయల్దేరామా అన్నదే జీవితం. అయినా ఒక్కోసారి తప్పేది కాదు. గేదెలకు నీళ్లు పట్టడం, వాటి దగ్గర పేడ ఎత్తడం, పాలు పితకడం... ఇలా వయసుకు మించిన పనులు. పెద్దోళ్ల దృష్టిలో బాధ్యత. ఇంట్లో అందరినీ పనికి పంపి నన్నొక్కడినే బడికి పంపిస్తున్నందుకు నిర్వర్తించాల్సిన బాధ్యత. దాని పేరు చేయిసాయం (ఎన్నాళ్లయిందీ మాట విని).

 

ఆ రోజు పొద్దున్నే పాలకేంద్రానికి పాలు తీసుకెళుతున్నా. సరిగ్గా ఆయీది పెద్దమ్మగారి ఇంటి వరకు వెళ్లేసరికి ఎదురుగా వచ్చాడు. ముఖంలోకి కళ్లు పెట్టి ఏదో తెలిసిన ముఖంలా చూశాడు. నాకు అర్థం కాలేదు. పక్కకు తప్పుకోమన్నా వినలేదు. తప్పించుకు వెళుతుంటే భూమి గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతుంది అన్నట్టు, వాడు నా చుట్టూ తిరిగి మళ్లా నా ముందుకే వచ్చి అడ్డగిస్తున్నాడు. మా వీధిలో ఇలాంటి వాళ్ల పరాచికాలు మామూలే కానీ, మరీ కాస్త చనువెక్కువైనట్టుగా అనిపించింది. నాకు ఒక్క క్షణం వళ్లు మండింది. కోపంలో నుంచి ఆలోచన పుట్టింది. అప్పటివరకు నా ముందు ఉన్న అడ్డంకిని మాత్రమే చూసిన నేను, వాడి కళ్లలోకి చూశాను. ఏదో తెలిసిన ముఖం, ఎక్కడో పరిచయం, ప్చ్... పరిచయం కాదు బంధమే అనిపించింది. అరే... కొంపదీసి మన రాజుగాడు కాదు కదా అనే సందేహం కలిగింది. పిలిస్తే పోలా!

 

‘అరే రాజుగా...’ అన్నాను అనుమానంగా.

అంతే! ఒక్కసారిగా ఎగిరి గంతేసి నన్ను అల్లుకున్నాడు. నా కాళ్లకు బంధం వేసినంత పనిచేశాడు. నా గుండెలమీద తడిచేస్తూ ఏదో రాసే ప్రయత్నం చేశాడు. డౌటే లేదు వాడు రాజుగాడే. వాడి ఆరాటం చూస్తే, నా కళ్లు చెమర్చాయి. పాలకేను పక్కనపెట్టి వాడిని తనివితీరా మరోసారి చూశాను. తల నిమిరాను. నేను గుర్తించినందుకు సంతోషమో, వాడు నన్ను కలిసినందుకు ఆనందమో తెలియదు గానీ, ఆ క్షణం నా ముందు మోకరిల్లాడు. ఏదేదో చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ భావోద్వేగాలు తట్టుకోలేక, వాడికి నచ్చిన డ్యాన్స్ చేశాడు. ఆ స్టెప్పులన్నీ నాకు గుర్తుచేసే ప్రయత్నంలో మరింత ఉద్వేగానికి లోనయ్యాడు.

 

అప్పటికే వాడు బాగా బక్కచిక్కిపోయాడు. కొత్త ప్రదేశం. ఎన్ని అడ్డంకులు దాటుకుని వచ్చాడో వాడి వళ్లు చూస్తేనే అర్థమవుతోంది. అసలే ఊరికి కొత్త ముఖం. ఎంతమంది దాడిచేసి ఉంటారు. ఎన్ని ప్రమాదాలు తప్పించుకుని ఉంటాడు. రాజుగాడు కాబట్టి రాగలిగాడు అనిపించింది. ముందు వాడిని ఇంటికి తీసుకెళ్లాలి. తర్వాతే పాలకేంద్రానికి. వెనక్కి తిరిగాను. ఒక్కసారి మళ్లీ ‘రాజూ..!’ అన్నాను. అప్పటికే వాడు నాకంటే రెండడుగులు ముందున్నాడు. వెనకుండి ముందుకు నడిపించే రకం కాదు వాడు. ముందుండి నడిపించే నికార్సయిన రకం.

 

ఇంటికి వెళ్లగానే ఎదురుగా అన్నయ్య, నాన్నలను చూశాడు. ఒక్కసారిగా వాడికి వచ్చిన ఒక విషాద రాగంలో గద్గద స్వరాన్ని వినిపిస్తూ నాన్నను హత్తుకున్నాడు. తప్పిపోయిన కొడుకు ఇంటికి తిరిగొచ్చినంత ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు నాన్న. గారాముగా వాడిని దగ్గరకు తీసుకుని ‘ఎలా ఉన్నావురా? ఏమైపోయావ్ ఇన్నాళ్లూ...’ అంటూ కుశలం అడిగాడు. అన్నింటికీ రాజుగాడిది ఒకటే సమాధానం. రిథమ్‌లో సాగే వినసొంపైన సంగీతంలా ఉంటుంది వాడూ వాడి మాటా, వాడి మూలుగూ. పావలా ఇస్తే గానీ, బడికి వెళ్లని నాతోనే అలా ఉన్నవాడు, పావలా ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే నాన్నతో ఎలా ఉంటాడో చెప్పాలా! పైగా వాడు లాజిక్కు, మేజిక్కులతో పనిలేకుండా బతికే రకం. నాన్నను చుట్టేశాడు. చెప్పాల్సినవన్నీ చెప్పేశాడు. ఇంతలో అన్నయ్య పిలుపు వినపడింది. ఆళ్లిద్దరి అనుబంధం గురించే చెప్పుకోవాలిక. అబ్బో! అదో పెద్ద ముత్యాలసుబ్బయ్య సినిమా. ఒకరిని చూడకుండా ఒకరు ఉండేవాళ్లు కాదు. రాజా... అని ఒక్క పిలుపు పిలిస్తే చాలు.



ఏడెకరాల మామిడితోటలో ఏ మూలన ఉన్నా నాలుగు ఉరుకుల్లో ఎదురుగా నిలబడేవాడు. ఆడుంటే చాలు, ఏడెకరాల తోటకూ ఏడున్నరడుగుల మనిషి కంటే పెద్ద కాపలా! వెయ్యి కోతులు కలిసి మందగా వచ్చినా, ఒక్క కొత్త మనిషి తోటలో అడుగుపెట్టినా పరుగులు తీయించేదాకా వదిలిపెట్టేవాడు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ తోటకు మా నాన్న రాజైతే, మా అన్నయ్యకు రాజుగాడే రాజు.

 

మామిడితోట కాపు అయిపోయి అప్పటికే ఆరునెలలు దాటిపోయింది. మేమంతా తోట ఖాళీ చేసి వస్తున్నప్పుడు తప్పిపోయిన రాజుగాడు ఇన్నాళ్లకు మళ్లీ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అన్నయ్యను తనివితీరా హత్తుకున్నాడు. ఏదో తన బాధలు, ఆనందాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హమ్మయ్యా! నా పని అయిపోయింది అనుకుంటూ మళ్లీ పాలకేంద్రానికి బయల్దేరా.సరిగ్గా వారం గడిచింది. రాజుగాడు మా ఇంట్లోనే ఉన్నాడు. అందరికీ ఆ తోటలో గడిపిన రోజులు గుర్తుచేస్తున్నాడు. రోజూ వీధిలో తన సాటివాళ్లతో ఒకటే గొడవలు, అరుపులు. అయినా సరే... నాన్న మాట దాటి ఒక్క అడుగు ముందుకు వేయకుండా అలా వీధి అరుగుమీదే కాలక్షేపం చేస్తున్నాడు.



ఒక్క కొత్త మనిషి తోటలో అడుగుపెట్టినా పరుగులు తీయించేదాకా వదిలిపెట్టేవాడు కాదు. ఆ తోటకు మా నాన్న రాజైతే, మా అన్నయ్యకు రాజుగాడే రాజు.



ఒకరోజు పొద్దున్నే రాజుగాడి సడిలేదు. ఉన్నాడా అంటే ఉన్నాడంతే. తొలి కోడి సడిచేశాక... తెల్లారి సూర్యుడు సడిచేశాక... పక్షులు సడిచేశాక... పశువులు సడిచేశాక కూడా ఇంట్లో ఉన్నవాళ్ల సడిలేకపోతే నాన్న అస్సలు భరించలేడు. ‘రాజూ’ ‘రాజూ’ అంటూ పిలిచాడు. అయినా సడిలేదు. రెండో మారు కాదు కదా... వాడి పేరులో రెండో అక్షరం కూడా పూర్తికాకుండా వచ్చి వాలిపోయే గుణం వాడిది. అయినా జాడలేదు. నాన్న వెంటనే వీధి అరుగు మీదకు వెళ్లి చూశాడు. ఒకటే వాసన... ఏదో తెలియని ఒక దుర్గంధం. రాజుగాడు కదల్లేకుండా పడుకున్నాడు. దగ్గరగా వెళ్లిన నాన్న వెంటనే అమ్మను ఒక్క గసురుగా పిలిచాడు.



ఆ భయానికి నేను కూడా వెళ్లాను. అప్పటికే రాజుగాడి తల నాన్న ఒడిలో ఉంది. తలపై ఏదో గాయం లాంటిది కానీ తగిలిన దెబ్బ కాదు. ఏదో మాయరోగం. తిన్నగా లోపలి సరుకంతా కనిపిస్తోన్నంత గాయం. నాన్న వాడిని బుజ్జగిస్తున్నాడు. ఆ నొప్పి తెలిసి ఓదారుస్తున్నాడు. రాజుగాడి కళ్లంట నీళ్లు కారుతున్నాయి. చాలాకాలం తర్వాత వారం క్రితం వాడు మమ్మల్ని కలుసుకున్నప్పుడు కారిన నీళ్లు కావవి. కచ్చితంగా కన్నీళ్లే. పట్టరాని బాధ ఏదో ప్రాణం పిండుతుంటే వచ్చే కన్నీళ్లవి. వాడి ముఖం చూస్తే దుఃఖమొస్తున్నా ముక్కు మూసుకోకుండా ఉండలేకపోయాను.

 

ఇంతలో అన్నయ్య వచ్చాడు. ‘అయ్యో ఏదో మాయదారి జబ్బు అంటుకున్నట్టుంది’ అన్నాడు. ఆ వాసన భరించలేక ముక్కు ముందు అరచేతిని అటూ ఇటూ ఆడించాడు. ఇక రాజుగాడు బతకడని అన్నయ్య ఒక నిర్ణయానికి వచ్చేశాడు. వాణ్ని ఆ స్థితిలో చూడలేక, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నాన్న మాత్రం రాజుగాడికి సపర్యలు చేస్తూ అమ్మతో ఏదో చెప్పాడు. ఆయనకు ప్రకృతి వైద్యం బాగా తెలుసు. మొత్తానికి ఒక మందు తయారుచేశాడు.

 

ప్రతిరోజు నాన్నే రాజుగాడికి మందు పూసేవాడు. ఆ సమయంలో తన చేతుల్ని డాక్టర్ కంటే పరిశుభ్రంగా ఉంచుకునేవాడు. ఇంకెవ్వరినీ దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదు. రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి వాడి ఆరోగ్యం చెక్ చేసుకుని... మధ్యరాత్రి మళ్లీ ఒకసారి లేచి మందు రాసేవాడు. సరిగ్గా రెండు వారాలు గడిచింది. మేమంతా ఆశ్చర్యపోయాం. నెత్తిమీద చిల్లు పూడుకుపోయింది. రాజుగాడు మళ్లీ మామూలైపోయాడు. నాన్న ముందు ఎప్పుడూ రాముడు ముందు హనుమంతుడిలా నిలబడేవాడు. నిత్యం ఆ కళ్లలో నాన్నకు నమస్కరిస్తున్న చెమ్మ కనిపించేది. అలా కోలుకున్నాక, రాజుగాడు నాలుగేళ్లు బతికాడు.



ఆ నాలుగేళ్లలో వాణ్ని ఎప్పుడు దగ్గరగా చూసినా నాన్నకు భజన చేస్తున్న భక్తుడిలా, నాన్న రుణం తీర్చుకోవడానికి బతుకుతున్నవాడిలా కనిపించేవాడు. వాడు ఇక లేడు అన్న క్షణాన మాత్రం నాన్న కళ్లలో మొదటిసారి నీళ్లు చూశాను. తట్టుకోలేకపోయాడు. బతుకుతున్న ప్రాణం కంటే, బతికించుకున్న ప్రాణం పోయినప్పుడు కలిగే బాధ ఎక్కువ.

 ఏం చేశాం మేం రాజుగాడికి? నెలలో పాతికసార్లు మేము అన్నం తినగా మిగిలిన గంజి పోశాం. కంచంలో పెట్టించుకున్న అన్నమంతా తినలేనప్పుడు ఆ నాలుగు మెతుకులు రాతిచిప్పలో వేసేవాళ్లం. అన్నయ్యకు నాకు బోర్‌కొట్టిన ప్రతిసారీ ‘ఒరేయ్ రాజూ..!’ అని ప్రేమగా పిలిచి కాసేపు ఆడుకునేవాళ్లం.



నాన్న ఒక్కడే తను తినే ముద్దలో కాస్త పంచి పెట్టేవాడు. ఈమాత్రం దానికి ఆ రాజుగాడు మాకు ఎంత చేశాడని! ఊరు చివర అడవి చెంతన తోట మధ్యలో పిల్లా పాపలతో ఉన్న మా కుటుంబం మొత్తాన్ని రాత్రంతా కాపలా కాసేవాడు. తోటలోకి ఒక కోతి రాకుండా, ఒక దొంగ రాకుండా రాత్రి పగలు తేడా లేకుండా కాపలా కాసేవాడు. నాకైతే వాడెప్పుడూ జూలు విదిల్చిన సింహంలా కనిపించేవాడు. అయినా సరే మాకు కోపమొచ్చి కొడితే తోకాడించుకుంటూ పడేవాడు. ముద్దుగా మూలిగేవాడు. చివరికి వాణ్ని మర్చిపోయి వచ్చేసినా ప్రాణాలకు తెగించి మమ్మల్ని వెతుక్కుంటూ ఊళ్లోకొచ్చాడు.

 

రాజుగాడు చనిపోయాక నాన్న ఒక్కటే మాటన్నాడు. నాతో వైద్యం చేయించుకోవడానికే వెతుక్కుంటూ వచ్చినట్టున్నాడు. రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చాడ్రా అని. ఆ మాట విన్నప్పుడు మా కుటుంబం మొత్తానికి కళ్లు చెమర్చాయి. నిజంగా రాజుగాడు మనిషి కాదు. మనిషిని చదివినవాడు. మనసెరిగినవాడు. సృష్టి ధర్మంగా వచ్చిన పేరు కాబట్టి తప్పదు కానీ, వాణ్ని ‘కుక్క’ అనాలంటే ఇప్పటికీ నాకు మనసొప్పదు. తిడుతున్నట్టుగా, కించపరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. మనిషిగా నన్ను నేను తక్కువ చేసుకుంటున్న భావన కలుగుతుంది. బహుశా! అంత విశ్వాసం మనుషుల్లో చూడకపోవడం వల్ల కావచ్చు! రాజుగాడిని మాత్రం చేతులు జోడించి అడుగుతున్నా క్షమించమని! తప్పనిసరై ఇలా ఒక్కసారి తన జన్మను గుర్తుచేసినందుకు కాదు... ఇన్నాళ్లూ వాడిని గుర్తుచేసుకోనందుకు! సారీ రా రాజుగా.                   - పూడి శ్రీనివాసరావు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top