శ్రీమతి దొంగగారు!


  మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు -  31

 మార్గరెట్ తన నలభై మూడో ఏట విజయవంతంగా ఓ నేరాన్ని చేసింది. ఐతే దాన్ని ఆమె నేరంగా భావించలేదు. నిస్సారమైన తన జీవితంలో దాన్ని మసాలాగా భావించింది. తనకి అవసరం లేకపోయినా పన్నెండు డాలర్ల తొంభై తొమ్మిది సెంట్స్ విలువ చేసే ఓ వెండి కడియాన్ని హ్యాన్సెన్స్ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లోంచి దొంగిలించింది.

 

 ఆ రాత్రి ఆమె సన్నగా కూనిరాగం తీస్తూ వంట చేసింది. తన భర్త జార్జ్‌కి దొంగతనం గురించి చెప్పలేదు. ఆ తర్వాత మరో మూడుసార్లు మార్గరెట్ ఆ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లోంచి బ్యాగ్‌లో పట్టే చిన్న చిన్న వస్తువులని దొంగిలించింది. ఖరీదైన ఫ్రెంచ్ పెర్‌ఫ్యూమ్ సీసా, లేడీస్ స్కార్ఫ్, హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచుకునే అద్దం... తన జీవితంలోకి సారం, మసాలా తిరిగి ప్రవేశించాయని ఆమెకి అనిపించింది.

   

 ‘‘ఒన్ మూమెంట్ మేడం’’

 మార్గరెట్ వెనక్కి తిరిగి చూసింది.‘‘మీరోసారి మా స్టోర్‌లోకి రావాలి.’’ఆమె అతన్ని అనుసరించి మేనేజర్ అనే బోర్డున్న గదిలోకి వెళ్లింది. ‘‘మిస్టర్ కేజిల్! ఈమె హ్యాండ్ బ్యాగ్‌లో డబ్బు చెల్లించని లేడీస్ ఈవెనింగ్ గ్లవ్స్ ఉన్నాయి’’ మార్గరెట్‌ని ఆపినతను చెప్పాడు.‘‘అలాగా?  దయచేసి మీ హ్యాండ్ బ్యాగ్ తెరుస్తారా?’’ కేజిల్ అడిగాడు. మార్గరెట్ వెన్నులోంచి వణుకు పుట్టింది.‘‘ఆ అవసరం లేదు. నా హ్యాండ్ బ్యాగ్‌లో డబ్బు చెల్లించనివి ఏమీ లేవు.

 

 ఇతను పొరపడ్డాడు’’ బింకంగా చెప్పింది.‘‘ఐతే పోలీసులే మిమ్మల్ని ఆ హ్యాండ్ బ్యాగ్‌ని తెరవమని కోరాల్సి ఉంటుంది. అప్పుడైనా మీరు దాన్ని తెరవక తప్పదు’’ కేజిల్ రిసీవర్ మీద చేతిని వేసి చెప్పాడు.పోలీస్, కటకటాలు ఆమె కళ్ల ముందు మెదిలాయి. వెంటనే ఆమె హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులోంచి గ్లవ్స్‌ని బయటికి తీసి టేబిల్ మీద పెట్టి చెప్పింది.‘‘పొరపాటున వీటిని హ్యాండ్ బ్యాగ్‌లో ఉంచుకున్నాను. సారీ.’’

 

 ‘‘మీ పేరు?’’‘‘మిసెస్ జార్జ్.’’

 ‘‘ఇతను మా స్టాల్ డిటెక్టివ్ బరండీ. మిమ్మల్ని కొద్దిరోజులుగా కనిపెడు తున్నాడు’’... పేరు రాసుకుని చెప్పాడు.ఆమె బరండీ వంక ఓరగా చూసింది. ‘‘మీరు బీదవారు కాదని మీ దుస్తుల్ని, బూట్లని బట్టి తెలుస్తోంది. కాని షాపులో దొంగతనం నేరం. ఈ రకం నేరం వల్ల దేశంలోని వ్యాపారస్థులు కోట్ల డాలర్లు నష్టపోతున్నారు. ఇక్కడ హ్యాన్సెన్స్‌లో మేము మీలాంటి నేరస్థులని ప్రాసిక్యూట్ చేయడానికి ఇష్టపడం. కాని నష్టాన్ని భరించుతూ కూడా పోలేం.

 

 దయచేసి మీ భర్తకి ఫోన్ చేస్తారా?’’కొద్దిగా సందేహించి, తర్వాత రిసీవర్ అందుకుని భర్తకి ఫోన్ చేసి చెప్పింది మార్గరెట్.‘‘హ్యాన్సెన్స్ నించి. నన్ను ఇక్కడ దొంగతనం నేరం మీద పట్టుకున్నారు’’... జరిగింది వివరించింది. భార్య చెప్పేది అతను నిశ్శబ్దంగా విన్నాడు. తర్వాత చెప్పాడు. ‘‘నేను అక్కడికి వస్తున్నానని మిస్టర్ కేజిల్‌తో చెప్పు. వుగంటలో.’’‘‘పోలీసులకి ఫిర్యాదు చేశారా?’’ పావుగంట తర్వాత జార్జ్ అడిగాడు.‘‘ఇంకా లేదు.’’

 

 ‘‘ఇది నమ్మశక్యం కాని విషయం. మా ఆవిడ దొంగ కాదు. ఆమెకా ఖర్మ పట్ట లేదు. ఇలాంటి లక్ష  గ్లవ్స్ కొనేంత డబ్బు మాకుంది’’ జార్జ్ గట్టిగా చెప్పాడు.‘‘మేం అంగీకరించం. కనీసం నాలుగుసార్లు మీ ఆవిడ తచ్చాడిన ప్రదేశాల్లోని సరుకు మాయం అయింది. ఐదోసారి కాపేసి పట్టుకున్నాం’’ అతనూ అంతే గట్టిగా చెప్పాడు.‘‘మీరు చెప్పేది నిజమేనా?’’ జార్జ్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘సరే. మీకు జరి గిన నష్టాన్ని నేను పూడుస్తాను. పోయిన మొత్తం సరుకు ఖరీదు చెల్లిస్తాను.’’మేనేజర్ ఆలోచించి చెప్పాడు. ‘‘సరే! కానీ మీ ఆవిడ మళ్లీ మా షాపు ఆవరణ లోకి రానని హామీపత్రం రాసివ్వాలి.’’‘‘రాదని నేను మీకు హామీ ఇస్తున్నాను మిస్టర్ కేజిల్. మీ నష్టాల మొత్తం ఎంతో చెప్తే రేపు ఉదయం నేను చెక్ రాసిస్తాను. దాన్ని నా వెంట తేలేదు.’’

 

 ‘‘మీరు ఎక్కడ పని చేస్తారు?’’

 వెంటనే జార్జ్ తన విజిటింగ్ కార్డ్‌ని ఇచ్చాడు. అతనో పెద్ద బ్యాంక్‌లో రీజనల్ మేనేజర్. అది తమకి అకౌంట్ ఉన్న బ్యాంకే కావడంతో కేజిల్ సంతృప్తి చెందాడు. ‘‘సరే. కాని దయచేసి చెక్ తేవడం ఆలస్యం చేయకండి’’ అన్నాడు.అప్పటికప్పుడు బరండీ బిల్‌ని తయారు చేయించి తెచ్చాడు. మొత్తం అరవై నాలుగు డాలర్ల డెబ్భై ఒక్క సెంట్లు.‘‘ఇంత చిన్న మొత్తం దొంగతనమా? నమ్మలేను’’ దాన్ని జేబులో ఉంచుకుంటూ జార్జ్ గొణిగాడు. కారులో ఇంటికెళ్తూ తన భార్యని అడిగాడు. ‘‘నువ్వెందుకు దొంగవయ్యావు? నా పొజిషన్ గురించి ఆలోచించలేదా? ఇది పేపర్లోకి ఎక్కితే నా పరువు, నా ఉద్యోగం ఏం కాను?’’

 

 ఆపదలోంచి బయటపడ్డ మిసెస్ జార్జ్ చిరాకుగా చెప్పింది. ‘‘నా గురించి కూడా మీరు ఆలోచించాలి. ఉదయం లేచి బ్రేక్ ఫాస్ట్ తిని బ్యాంక్‌కి వెళ్లేలోగా మీరు నాతో మాట్లాడేది నాలుగు ముక్కలు. రాత్రి ఆలస్యంగా వస్తారు. అలసిపోయి నిద్రపోతారు. శని ఆదివారాలు గోల్ఫ్ ఆడటానికి వెళ్తారు. ఇక మన మధ్య ఎగ్జయిటింగ్‌గా ఏం జరుగుతోంది? స్పయిస్ కోల్పోతున్నాను.’’‘‘స్పయిస్? అంటే?’’ జార్జ్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ‘‘షాప్‌లో పట్టుబడకుండా దొంగిలించి బయటకి రావడం స్పయిస్’’... సూటిగా చెప్పింది.‘‘షాప్‌లో దొంగతనం స్పయిసా?’’ఆ రాత్రి ఇద్దరూ చెరొక పడక గదిలో పడుకున్నారు. మర్నాడు ఉదయం జార్జ్ హ్యాన్సెన్స్ సూపర్ బజార్‌వాళ్లు ఇచ్చిన బిల్‌ని చూసి, ఆ మొత్తానికి చెక్ రాసి, బ్యాంక్‌కి వెళ్తూ దారిలో ఆగి కేజిల్‌కి దాన్ని ఇచ్చి రసీదు తీసుకున్నాడు.

 

 బయటికి వస్తూ ఆ షాపు వైపు చూశాడు జార్‌‌జ. ఆ దుకాణం చాలా రద్దీగా ఉంది. కౌంటర్ టాప్ మీద చాలా సరుకు ఆకర్షణీయంగా అమర్చి ఉంది. వాటిని చూసి తన భార్య... వ్యామోహంలో పడటంలో ఆశ్చర్యం లేదు అనుకున్నాడు.‘ఎగ్జయిట్‌మెంట్, స్పయిస్’ అని భార్య ఉపయోగించిన పదాలు గుర్తుకు వచ్చాయి. ఆ సరుకు చూశాక అతనికి కొద్దిగా అర్థం అయినట్లు అనిపించింది. ఆ రాత్రి భార్య చెప్పిన విషయాలని ఆలోచించాడు. ఆ మాటల్లోనూ కొంత నిజం ఉందనిపించింది.

   

 మర్నాడు సాయంత్రం జార్‌‌జ ఇంటికి వచ్చేసరికి మార్గరెట్ బ్రిడ్జ్ క్లబ్‌కి వెళ్లింది. ఒంటరిగా ఉన్న జార్జ్ ఈవెనింగ్ పేపర్ని తెరిచాడు. కాని దాని మీద మనసుని కేంద్రీకరించలేకపోయాడు.  ఏ వయసులో ఐనా సరే... ఎవరూ ఎగ్జయిట్‌మెంట్‌కి, స్పయిస్‌కి దూరం కాకూడదు.  జార్జ్ టీపాయ్ మీద ఉన్న ప్యాకెట్‌లో నుంచి ఓ సిగరెట్‌ను తీసి నోట్లో పెట్టుకున్నాడు. తర్వాత జేబులోంచి సిగరెట్ లైటర్ని తీశారు. ఓసారి దాని వంక తేరిపార చూశాడు. ఆ సరికొత్త సిల్వర్ ప్లేటెడ్ లైటర్ బరువుగా ఉంది. దాన్ని వెలిగించి సిగరెట్ అంటించుకుని లైటర్ని టేబిల్ మీద ఉంచాడు.  తను కోల్పోయిన, తన భార్య ఆరోపించిన ఎగ్జయిట్‌మెంట్, స్పయిస్ తను కొన్ని గంటల క్రితం హ్యాన్సెన్స్‌లో పొందానని అతనికి అనిపించింది. ఐతే తన భార్యలా తను ఎన్నడూ పట్టుబడడు అనే ధీమా అతనిలో ఉంది.



 (కెరోల్ మేయర్స్ కథకి స్వేచ్ఛానువాదం)

 ‘‘పోలీసులకి ఫిర్యాదు చేశారా?’’ పావుగంట తర్వాత జార్జ్ అడిగాడు. ‘‘ఇంకా లేదు.’’ ‘‘ఇది నమ్మశక్యం కాని విషయం. మా ఆవిడ దొంగ కాదు. ఆమెకా ఖర్మ పట్ట లేదు. ఇలాంటి లక్ష  గ్లవ్స్ కొనేంత డబ్బు మాకుంది’’ జార్జ్ గట్టిగా చెప్పాడు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top