చోరుడు

చోరుడు - Sakshi


  మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు -  17

 ‘‘మిస్టర్ బార్టామ్. ఎవరైనా అయితే దొంగని పట్టుకోమని డిటెక్టివ్‌ని అర్థిస్తారు. కానీ నేను మిమ్మల్ని కోరేది మరొకటి’’ ఏండర్సన్ చెప్పాడు.

 

 ‘‘ఏమిటది?’’ బార్టామ్ నవ్వుతూ ప్రశ్నించాడు.

 ‘‘ముందుగా నా భాగస్వామి జాక్సన్ గురించి చెప్పాలి. మేమిద్దరం పదేళ్లుగా వ్యాపారం చేస్తున్నాం. ఇటీవల మా మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. జాక్సన్ దుర్మార్గుడని తెలిసినా, డాలర్‌ని రెండు డాలర్లు చేసే విద్య అతనికి తెలుసు కాబట్టి అతన్ని నా వ్యాపార భాగస్వామిగా కొనసాగించాను. నిన్న రాత్రి నేను మా ఇంట్లోకి వెళ్లేసరికి జాక్సన్ తన బ్రీఫ్ కేస్‌ని మూస్తూ కనిపించాడు. నన్ను చూసి నివ్వెరపోయాడు. ‘ఇక్కడేం చేస్తున్నావు?’ అని నేను ఆశ్చర్యంగా ప్రశ్నించాను.‘‘మన ఆఫీస్ తాళంచెవి, కొన్ని కాగితాలు నీకు ఇవ్వాలని వచ్చాను’’ తడబడుతూ చెప్పాడు.టేబుల్ మీద వాటిని చూపించి కొద్దిగా వణుకుతూ వేగంగా బయటికి వెళ్లిపోయాడు. అతని కారు శబ్దం వినిపించడం ఆగాక కానీ నేను తేరుకోలేదు. అతను నాకు చెందిన విలువైనదేదో దొంగిలించాడని అనిపిస్తోంది.’’

 

 ‘‘ఏం దొంగిలించాడు?’’

 ‘‘ఇంట్లో అన్నీ చూశాను. కానీ ఏది దొంగిలించాడో కనుక్కోలేకపోయాను. ఎందుకంటే నా దగ్గర నేను సేకరించిన వేల వస్తువులు ఉన్నాయి. అతను ఏదో దొంగిలించి తీసుకెళ్లాడని నాకు కచ్చితంగా తెలుసు. అది మీరు కనుక్కోవాలి’’ ఏండర్సన్ కోరాడు.

 ‘‘పోలీసులకి రిపోర్టు చేశారా?’’ బార్టామ్ అడిగాడు.

 

 ‘‘లేదు.’’

 ‘‘ఎందుకని?’’

 ‘‘అతను ఏం దొంగిలించాడో నాకు తెలీదుగా. మా ఇంటి నిండా అనేక విలువైన వస్తువులు ఉన్నాయి. వాటిని చాలా ఖరీదు పెట్టి కొన్నాను. ఉదాహరణకి ఆరు పురాతన వాచీలు ఉన్నాయి. ఆరా లేక ఏడా? సరిగ్గా గుర్తురావడం లేదు.’’

 

 ‘‘జాక్సన్ ఏదైనా ఎత్తుకెళ్లాడని మీకెందుకు అనిపించింది?’’ బార్టామ్ ప్రశ్నించాడు.

 ‘‘అతను వెళ్లాక, ఎవరో ఫోన్ చేసి చెప్పారు- జాక్సన్ మీ ఇంట్లోంచి ఏం దొంగిలించాడో మీరెప్పటికీ తెలుసుకోలేరు అని. వెంటనే వెతికితే వాచీలున్నాయి. అతను ఏం దొంగిలించాడో మీరు కనుక్కోగలరా?’’

 ‘‘ఇంట్లో ఎలాంటి విలువైనవి ఉన్నాయి?’’

 ‘‘చాలా. సేకరించిన అనేక తపాలా బిళ్లలు, పురాతన పుస్తకాలు, ఒకప్పటి ప్రేయసి ఫొటో, కొన్ని చిత్రాలు, అనేక విదేశీ కరెన్సీలు... ఇవి మీకు చెత్త అనిపించచ్చు కానీ, నాకు విలువైనవి. నా డైరీ ఎక్కడుందో నాకు తెలీదు. దాన్ని దొంగిలించి ఉంటే జాక్సన్ నన్ను బ్లాక్‌మెయిల్ చేయొచ్చు’’ ఏండర్సన్ చెప్పాడు. బార్టామ్ కొన్ని క్షణాలు ఆలోచించి చెప్పాడు.

 

 ‘‘అతను దేనినైనా బ్రీఫ్ కేస్‌లో పెట్టుకుంటుండగా చూశారా?’’

 ‘‘లేదు. మూయడమే చూశాను.’’

 ‘‘అతను అంతకుమునుపే బ్రీఫ్ కేస్‌లో పట్టని పియానోనో, అలాంటి ఇంక దేన్నైనానో కారులో ఎక్కించి ఉండచ్చు. బ్రీఫ్ కేస్ మూస్తూండగా చూడడంతో అందులోనే ఏదో తీసుకెళ్లాడని మీరు భ్రమపడి ఉంటారేమో?’’

 ‘‘పెద్దవి... ఉన్న స్థానంలోంచి మాయమైతే ఇట్టే గ్రహించగలను. అవేమీ మాయమవలేదు. ఓసారి జాక్సన్‌కి మా ఇంట్లోని ఓ తపాలా బిళ్లని చూపించి అది విలువైన తపాలా బిళ్ల అవడానికి ఎన్‌గ్రేవింగ్‌లో గల తప్పుని చూపించాను. ఇప్పుడు పోయిన వస్తువు లేదా వస్తువులు ఏమిటో నాకు అర్థం కావడం లేదు.’’

 

 ‘‘సరే. నేను ప్రయత్నిస్తాను. జాక్సన్ అడ్రస్, ఫొటో ఇవ్వండి’’ బార్టామ్ కోరాడు.

 అతను అనుకున్న దానికన్నా ఎక్కువ ఫీజు ముట్టజెప్పాడు ఏండర్సన్.

 జాక్సన్‌ని ఇరవై నాలుగ్గంటల సేపు బార్టామ్ రహస్యంగా అనుసరించాడు. కానీ ఉపయోగం లేకపోయింది. అతను బద్ధకస్తుడిలా ఇంట్లోంచి బయటికి రానేలేదు. బయటికి వెళ్తే, అతని ఇంటిని రహస్యంగా సోదా చేయాలనుకున్న బార్టామ్ కోరిక నెరవేరలేదు.

 జాక్సన్‌నే కలిసి ‘ఏం దొంగిలించావు’ అని అడగాలనుకున్నాడు. కానీ అది తన వృత్తికి సరిపోదని విరమించుకున్నాడు.

 జాక్సన్ దొంగిలించిన వస్తువు ఏదో తెలుసుకోకుండానే రోజులు వారాలుగా మారాయి.

 

   

 ఐదేళ్లు గడిచాక ఓ రోజు ఏండర్సన్ మరణించాడని అతని భార్య దినపత్రికలో ప్రచురించిన సంస్మరణని బార్టామ్ చదివాడు. అతనికి వెంటనే జాక్సన్ గుర్తొచ్చాడు. ఏండర్సన్ ఫ్యూనరల్‌కి బార్టామ్ హాజరయ్యాడు. దానికి జాక్సన్ కూడా వచ్చాడు.

 ‘‘నన్ను మీకు పరిచయం చేసుకోనీండి మిస్టర్ జాక్సన్. నా పేరు బార్టామ్. నేను డిటెక్టివ్‌ని. ఐదేళ్ల క్రితం ఏండర్సన్ అకస్మాత్తుగా తన ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు బ్రీఫ్ కేస్‌ని మూస్తున్నారు. అతన్ని చూసి కళవళపడ్డారు. అది నిజమేనా?’’  

 ‘‘నిజమే’’ జాక్సన్ అంగీకరించాడు.

 

 ‘‘మీరు ఏదైనా దొంగిలించారా?’’

 ‘‘అవును.’’

 ‘‘అది విలువైందేనా?’’

 ‘‘దాన్ని పోగొట్టుకుంటే ఎవరైనా మథనపడతారు కాబట్టి విలువైనదే. నేను దొంగిలించిన దాని గురించి రోజూ తలచుకుంటూనే ఉన్నాను.’’

 ‘‘దాన్ని మీరు ఆ బ్రీఫ్ కేస్‌లోనే ఉంచి తీసుకెళ్లారా?’’

 ‘‘ఆ బ్రీఫ్ కేస్ ఖాళీది అన్న రహస్యం ఏండర్సన్‌కి తెలీదు.’’

 ‘‘ఐతే మీరు దొంగిలించిన వస్తువులని జేబులో పెట్టి తీసుకెళ్లారా?’’

 ‘‘నేను అతని ఇంట్లోంచి ఏ వస్తువునీ దొంగిలించలేదు.’’

 ‘‘మరి? ఇందాక దొంగనని ఒప్పుకున్నారు?’’ బార్టామ్ ప్రశ్నించాడు.

 ‘‘నేను దొంగిలించింది అతని మనశ్శాంతిని’’ జాక్సన్ మృదువుగా చెప్పాడు.

 (ఐజక్ అసిమోవ్ కథకి స్వేచ్ఛానువాదం)

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top