ఎవర్నీ నమ్మక!

ఎవర్నీ నమ్మక!


 మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు -  13

 దొంగలు ఎందుకు పట్టుబడతారో కొన్ని కారణాలని నెల్సన్ వెస్ట్ అన్వేషించాడు. ఒకరి కంటే ఎక్కువమంది దొంగలు భాగస్వాములుగా ఉంటే, ఒక్కడు పట్టుబడ్డా మిగిలినవారి పేర్లు చెప్తాడు. దొంగతనాన్ని ఒక్కడే చేయాలి. లేదా తోటివాళ్లు మోసం చేసే అవకాశం ఉంది. లోభం కూడా కూడదు. కొంతతో తృప్తి చెందాలి. తన ఈ ఆదర్శాల వల్ల వెస్ట్ ఇంతదాకా నేరం చేయలేదు. చివరకి ఓ రోజు అతనికి ఆ అవకాశం వచ్చింది. ‘గ్రేటర్ ఆరిజోనా రియాల్టీ కంపెనీ’లో నెల్సన్ వెస్ట్ సేల్స్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆ రోజు దాని యజమాని సిమ్సన్ వెస్ట్‌ని పిలిచి, కొత్త ఫోర్డ్ కారు తాళం చెవి ఇచ్చి చెప్పాడు.

 

 ‘‘ఓ కోటీశ్వరుడు దీన్ని కొనడానికి బయట వేచి ఉన్నాడు. ట్రయల్ రన్‌గా ఎడారిలో దీన్ని నడపాలని కోరాడు. ఎడారిలోని క్రిస్టియన్ మోనాస్ట్రీకి ఈ కారుని బహూకరిస్తాట్ట. అంతేకాక ఇక్కడ ఉన్న మంచి బేంక్ పేరు అడిగితే చెప్పాను. ఇంకో మంచి బేంక్ పేరు కూడా అడిగాడు. బేంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా తీసుకెళ్లు.’’

 ‘‘అలాగే’’ వెస్ట్ చెప్పాడు. హాథ్‌వేని ఫోర్డ్ కారులో ఎక్కించుకుని ఎడారిలోకి బయలుదేరాడు వెస్ట్. దారిలో హాథ్‌వే, తను ఈస్ట్‌నించి అక్కడికి కొత్తగా వచ్చానని, తనకి బంధుమిత్రులు ఎవరూ లేరని, ఒంటరివాడినని చెప్పాడు.‘‘ఈస్ట్ నించి ఇక్కడికి వచ్చి సెటిలవుతున్నారా? ఇది మంచి రాష్ట్రం’’ వెస్ట్ చెప్పాడు.‘‘ముందుగా ఏదైనా మంచి బేంక్ ముందు కారు ఆపు. నా దగ్గర చాలా డబ్బుంది. రెండు బేంక్‌లకి తీసుకెళ్లు. రెండు లక్షల డాలర్లని ఒక్క బేంక్‌లోనే నమ్మి ఉంచలేం’’... హాథ్‌వే కోరాడు.

 

 ‘అంత డబ్బే!’ అని వెస్ట్ మనసులో ఆశ్చర్యపోయాడు.

 ‘‘అలాగే. ఇక్కడికి దగ్గరలో నీసా అనే చోట ఓ మంచి బేంక్ ఉంది. దాని బ్రాంచ్‌లు రాష్ట్రం అంతటా ఉన్నాయి. మొత్తం అందులో డిపాజిట్ చేసి, రేపు మీరు కొంత మొత్తం ఇంకో బేంక్‌కి బదిలీ చేయచ్చు’’ వెస్ట్ సూచించాడు. నీసాలోని ఓ బేంక్ ముందు కారుని ఆపాడు. హాథ్‌వే లోపలికి వెళ్లాక వెస్ట్ ఆట వస్తువులు అమ్మే ఓ దుకాణంలోకి వెళ్లి ఒక గేలన్ పట్టగల మ్యూరియాటిక్ ఏసిడ్ జగ్గులు ఐదు కొన్నాడు. ఆ ఏసిడ్‌ని స్విమ్మింగ్ పూల్ కడగడానికి ఉపయోగిస్తారు. హాథ్‌వే తిరిగి బేంక్‌లోంచి బయటికి వచ్చేసరికి వెస్ట్ సిద్ధంగా ఉన్నాడు.

 

 తర్వాత ఎడారిలోని మోనాస్ట్రీ వైపు ఫోర్డ్‌ని పోనిచ్చాడు. సగం దూరం వెళ్లాక గ్లవ్ కంపార్ట్‌మెంట్ తెరిచి వెస్ట్ అందులోంచి రివాల్వర్ తీసి, హాథ్‌వేని రెండుసార్లు కాల్చాడు. చుట్టుపక్కల ఇరవై మైళ్లదాకా అంతా నిర్మానుష్యంగా ఉంటుందని అతనికి తెలుసు. కారుని ఆపి, హాథ్‌వే జేబులు వెదికాడు. నీసా బేంక్ బ్రాంచ్  ఇచ్చిన చెక్ బుక్, రెండు లక్షలకి డిపాజిట్ స్లిప్ కూడా కనిపించాయి. కనపడినవన్నీ తీసుకున్నాడు. హాథ్‌వే శవాన్ని బయటికి లాగి రాళ్ల వెనక పడేశాడు. తర్వాత ఏసిడ్‌తో అతని మొహాన్ని కాల్చేశాడు. భవిష్యత్తులో ఎవరైనా అతని శవాన్ని కనుగొన్నా అతన్ని గుర్తించలేరు. తర్వాత ఖాళీ జగ్గులని కారులో పెట్టి ఇంటికి వెళ్లిపోయాడు.

    

 ‘‘హాథ్‌వే ఫోర్డ్ విషయంలో ఏమన్నాడు?’’ సిమ్సన్ ప్రశ్నించాడు.

 ‘‘కొనేట్టుగానే ఉన్నాడు.’’ హాథ్‌వే జేబులో దొరికిన వాటిలో న్యూయార్క్ డ్రైవర్స్ లెసైన్స్, సోషల్ సెక్యూరిటీ కార్డు మొదలైనవి ఉన్నాయి. తను వచ్చిన చోట ఎవరితోనైనా సంబంధం ఉందని సూచించే కాగితాలేవీ దొరకలేదు. ఒంటరివాడు అన్నది నిజమేనని అనిపించింది.కొద్దిసేపు అతను హాథ్‌వే సంతకాన్ని ప్రాక్టీస్ చేశాడు. సరిగ్గా చేశాననే తృప్తి కలిగాక మూడు వేల డాలర్స్‌కి గ్రేటర్ ఆరిజోనా రియాల్టీ కంపెనీ పేరుమీద చెక్ రాసి, హాథ్‌వే సంతకం చేసి ‘ఫోర్డ్ కారు కోసం’ అని దాని వెనక రాసి, దాన్ని సిమ్సన్‌కి పోస్ట్ చేశాడు.

 

 మర్నాడు సిమ్సన్ ఆ చెక్ తెచ్చి చూపించి చెప్పాడు.

 ‘‘వింత మనిషి! చెక్ పంపాడు. ఉత్తరం కానీ, ఫ్రం అడ్రస్ కానీ లేదు. ఎక్కడ ఉంటున్నాడు?’’

 ‘‘నాకు తెలీదు. చెక్ వచ్చింది కాబట్టి అతనే కాంటాక్ట్ చేస్తాడు.’’

 సిమ్సన్ లంచ్‌కి వెళ్ళొచ్చాక ఆయనతో వెస్ట్ చెప్పాడు.

 ‘‘మీరన్నట్లు అతను వింత మనిషే. ఇందాక ఫోన్ చేసి, కొన్ని వారాలు ఊరు వదిలి వెళ్తున్నానని, వచ్చాక ఫోర్డ్‌ని తీసుకుంటానని చెప్పాడు.’’

 ‘‘డబ్బు ముట్టింది. తర్వాత అతని ఇష్టం’’ సిమ్సన్ చెప్పాడు.

    

 గ్లెండేల్‌లో మరో బేంక్‌లో హాథ్‌వే పేరున వెస్ట్ అకౌంట్‌ని తెరిచాడు. తనకి హాథ్‌వే జేబులో దొరికిన చెక్ బుక్, పాస్ బుక్‌లని ప్రూఫ్‌గా చూపించాడు. గ్లెండేల్ బ్రాంచ్‌కి ఎనభై ఐదు వేల డాలర్లు బదిలీ చేయడానికి చెక్‌ని ఇచ్చాడు. ఐతే ఆ డబ్బుని అతను ముట్టుకోలేదు. తర్వాతి రెండు వారాలు నీసా బ్రాంచ్  మీద అనేక చెక్స్ రాసి, గ్లెండేల్ బ్రాంచ్‌లో నగదు తీసుకున్నాడు. అలా ఏభై వేల డాలర్లు తీసుకున్నాక ఇక ఆపేశాడు. ఇంకా గ్లెండేల్ బ్రాంచ్‌లో ఎనభై ఐదు వేల డాలర్లు, నీసా బ్రాంచ్‌లో అరవై రెండు వేల డాలర్లు మిగిలి ఉన్నాయి.హాథ్‌వే బేంక్ చెక్ బుక్‌లని, ఇతర కాగితాలని వెస్ట్ కాల్చేశాడు. బేంక్‌లో సేఫ్ డిపాజిట్ బాక్స్‌ని తెరిచి అందులో డబ్బుంచాడు తప్ప తన అకౌంట్‌లో డిపాజిట్ చేయలేదు.వెస్ట్ తను అనుకున్న అన్ని నియమాలనీ ఈ నేరంలో పాటించాడు. తోడు దొంగని తీసుకోలేదు. లోభానికి పోలేదు. మాయమైన హాథ్‌వే గురించి ఎవరైనా ప్రశ్నించినా అతనితో చివరగా మాట్లాడింది తను కాదు. గ్లెండేల్ బేంక్ కేషియర్ ఆఖరివాడు అవుతాడు. మాయమైన హాథ్‌వేకి, తనకి సంబంధాన్ని పోలీసులు కనుక్కోలేరు. తనకి, గ్లెండేల్ బ్రాంచ్‌కి కూడా ఎలాంటి సంబంధం లేదు.

    

 కొన్ని వారాల తర్వాత ఓ రోజు సిమ్సన్... వెస్ట్‌ని ప్రశ్నించాడు.

 ‘‘హాథ్‌వే ఫోర్డ్‌ని తీసుకోవడం ఏమైంది?’’

 ‘‘నాకు తెలీదు.’’

 ‘‘అతను దొంగని నీకు తెలుసా?’’

 ‘‘ఏమిటి?!?’’

 ‘‘ఈస్ట్‌లో తను పనిచేేన  బేంక్‌లోంచి రెండు లక్షల డాలర్లని దొంగిలించి ఇక్కడికి పారిపోయి వచ్చాడు. ఆ చెక్‌ని డిపాజిట్ చేయడానికే నన్ను బేంక్ గురించి అడిగాడు.’’‘‘మీకిదంతా ఎలా తెలుసు?’’ వెస్ట్ ఆశ్చర్యంగా అడిగాడు.‘‘ఎఫ్‌బీఐవాళ్లు అతని కోసం వెదుకుతూ ఇక్కడికి వచ్చారు. ఇటీవల హాథ్‌వేని చూసింది నువ్వు, నేను, గ్లెండేల్ బ్రాంచ్  కేషియర్. అతన్ని కూడా పిలిచారు. ఐతే అతని పేరు హాథ్‌వే కాదు. అది దొంగ పేరు మాత్రమే. అసలు పేరు జడ్సన్ లాంటిదేదో. కేషియర్, ఎఫ్‌బీఐ వాళ్లు నా గదిలో ఉన్నారు. మనం ముగ్గురం ఎఫ్‌బీఐవాళ్లు తెచ్చిన జడ్సన్ ఫొటో హాథ్‌వేదో, కాదో గుర్తించాలి. పద’’ అన్నాడు.తనని కేషియర్ హాథ్‌వేగా గుర్తిస్తాడని గ్రహించిన వెస్ట్‌కి అనిపించింది, నేరస్తుడు ఎవర్నీ నమ్మకూడదన్నది సత్యం అని. తన బాధితుడ్ని కూడా నమ్మకూడదని తను ఆలస్యంగా తెలుసుకున్నాడని.

 (లాటన్ ఓ కోనర్ కథకి స్వేచ్ఛానువాదం)

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top