ప్రేమయుద్ధం

ప్రేమయుద్ధం


 ‘యుద్ధంలో ప్రేమ ఉండకపోవచ్చు. ప్రేమలో మాత్రం యుద్ధం ఉంటుంది. అది తమతో తాము చేసుకునే యుద్ధం కావచ్చు. విధితో చేసే వింత యుద్ధం కావచ్చు!   

 ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ గురించి చాలా సార్లు విన్నాడు విల్‌ఫ్రెడ్. కానీ ఎలీన్‌ని చూసిన తర్వాతే దాన్ని రుచి చూశాడు. వైద్య విద్యార్థి అయిన విల్‌ఫ్రెడ్ కేంబ్రిడ్జిలో జరిగిన ఓ పార్టీలో ఎలీన్‌ను చూసి ప్రేమలో పడిపోయాడు. ఆమెను పరి చయం చేసుకొని, ఆ పరిచయాన్ని  స్నేహంగా మలచుకునేవరకు నిద్రపోలేదు.

 

 ‘‘ఎలీన్ ఎవరనుకుంటున్నావు? సంప న్నురాలు. స్విట్జర్లాండ్‌లో చదువుకుని వచ్చింది.  నువ్వేమో మధ్యతరగతి వాడివి. ఆమె నీతో స్నేహం చేసి ఉండొచ్చు కానీ ప్రేమించదు. ఒకవేళ ప్రేమించినా పెళ్లి అనేది కలలో మాట!’’ అన్నాడు ఓ స్నేహితుడు. అదృష్టవశాత్తూ ఆ మాటలు తథాస్తు దేవతలు వినలేదు. విల్‌ఫ్రెడ్, ఎలీన్‌ల స్నేహం ప్రేమగా మార డానికి ఎన్నాళ్లో పట్టలేదు. కానీ ఆ ప్రేమకు పెద్దల అనుమతి మాత్రం లభించలేదు. ‘‘బుద్ధిగా చదువుకోమంటే ఇదా నువ్వు చేస్తోంది! మా పరువు తీయకు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు నిన్ను అల్లుడిగా ఎలా చేసుకుంటారనుకుంటున్నావు?’’ అని విల్‌ఫ్రెడ్‌ను కడిగి పారేశాడు అతడి తండ్రి. ఆ విషయాన్ని ఎలీన్‌తో చెప్పాడు విల్‌ఫ్రెడ్. ‘‘పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుందాం’’ అంది ఎలీన్. తల్లి దండ్రులు పంపే డబ్బు మీదే ఆధారపడిన విల్‌ఫ్రెడ్ ఆలోచనలో పడ్డాడు.

 

 ‘‘ఏం ఆలోచించవద్దు. అన్నీ సర్దుకుంటాయి’’ అని ధైర్యం చెప్పింది. ఏడు నెలల తరువాత వాళ్ల పెళ్లి మాల్‌బన్ రిజిస్టర్ ఆఫీసులో రహస్యంగా  జరిగింది. సమయం వచ్చినప్పుడు పెద్దలకు చెబుదామనుకున్నారు. ఎలీన్ లండన్‌లోని కెన్సింగ్‌టన్‌లో ఉన్న తమ భవంతికి వెళ్లింది. విల్‌ఫ్రెడ్ మెడికల్ కాలేజీకి వెళ్లాడు. పేరుకే పెళ్లి. ఆమె అక్కడ... ఈయన ఇక్కడ!అంతలో మొదటి ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ము కున్నాయి. ఇంగ్లండ్ ప్రభుత్వ నియమం వల్ల విల్‌ఫ్రెడ్ ‘లండన్ రైఫిల్ బ్రిగేడ్’లో చేరక తప్పింది కాదు. కానీ బెంగ పడుతుందన్న భయంతో ఆ విషయం ఎలీన్‌కు చెప్పలేదు. సైన్యంలో చేరి బెల్జియం వెళ్లిన తర్వాత చెప్పాడు. ఆమెకు తరచూ ఉత్తరాలు రాస్తుండేవాడు.

 

 యుద్ధం మొదలైంది. కన్నుమూసి తెరిచేలోగా భీకరంగా మారింది. ఎందరినో కబళించింది. మరెందరినో గాయపర్చింది. ఆ గాయపడిన వారిలో విల్‌ఫ్రెడ్ కూడా ఉన్నాడు. పాపం ఆ విషయం ఎలీన్‌కు తెలీదు. అతని నుంచి ఉత్తరాలు రాకపోవ డంతో ఆమెలో ఆందోళన మొదలైంది. అతడెలా ఉన్నాడో అని పరితపించింది. అంతలో విల్‌ఫ్రెడ్ గురించిన వార్త ఆమెకు అందింది. అతడిని చూడాలని తపించింది. కానీ ఆ సమయంలో సైనికులను పరామర్శించడంపై అప్రకటిత  నిషేధం ఉంది. అయినా ఆగలేదు ఎలీన్. ఫారిన్ సెక్రటరీ సహాయంతో అనుమతి తెచ్చుకుంది. యుద్ధభూమిలోకి ఒంటరిగా ప్రవేశించి భర్తను చేరుకుంది.

 

 విల్‌ఫ్రెడ్ స్పృహలోనే ఉన్నాడు. కానీ మాట్లాడే స్థితిలో లేడు. తీవ్రంగా గాయ పడ్డాడు. బతకడం కూడా కష్టమన్నారు వైద్యులు. దాంతో అతడిని తీసుకుని  ఇంగ్లండ్‌కు వచ్చేసింది ఎలీన్. అది నచ్చక  ఎలీన్ కుటుంబం ఆమెను వెలివేసింది. అయినా లెక్క చేయలేదామె. విల్‌ఫ్రెడ్‌ను లండన్‌లోని హాస్పిటల్‌లో చేర్పించింది. విల్‌ఫ్రెడ్ బతికాడు. కానీ శరీరంలోని కొంత భాగం చచ్చుబడిపోయింది. ఆ స్థితిలో అతణ్ని అమ్మలా అక్కున చేర్చు కుంది ఎలీన్. ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసు కుంది. విల్‌ఫ్రెడ్‌కి వచ్చే ఆర్మీ పెన్షన్‌తో కుటుంబాన్ని నడిపింది. రాజకుమారిలా పెరిగిన ఆమె, ఓ సాధారణ గృహిణిలా తన బాధ్యతలు నిర్వర్తించింది. జీవి తాంతం భర్తకు తోడుగా నిలిచింది. అతడి లోని శూన్యపు చీకటిని తరిమేసి తన నవ్వులతో  వెలుగులు నింపింది.         

 

 ఎన్నో చారిత్రక గ్రంథాలు, నవలలు, నాటకాలు రాసిన జోనాథన్ స్మిత్... ఎలీన్, విల్‌ఫ్రెడ్‌ల ప్రేమ ఆధారంగా ‘విల్‌ఫ్రెడ్ అండ్ ఎలీన్’ పుస్తకం రాశారు. ఇది ఆయనకెంతో పేరు తెచ్చింది. బీబీసీలో సీరియల్‌గానూ ప్రసారమైంది.

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top