ఏడువేల కిలోమీటర్ల ప్రేమ..!

ఏడువేల కిలోమీటర్ల ప్రేమ..! - Sakshi


హృదయం


‘లవ్ ఈజ్ బ్లైండ్’ అంటారు. ప్రేమకు చూపు ఉండదట! మరి ఏముంటుంది? హృదయం. మరి హృదయానికైనా చూపు ఉండాలి కదా. ఉంటుంది కానీ పైపై చూపు ఉండదు. అంతర్నేత్రంతో లోలోపల చూస్తుంది. చూసినా అది రూపురేఖలు చూడదు. రూపాయలను చూడదు.



కులమేంటో చూడదు. మతమేంటో కూడా చూడదు. ఉత్తరమా దక్షిణమా, తూర్పా పడమరా, ఈ దేశమా ఆ దేశమా అని కూడా చూడదు. మరేం చూస్తుంది? ప్రేమను చూస్తుంది. ప్రేమను మాత్రమే చూస్తుంది. ఇందుకు మరొక తాజా

నిదర్శనం సునీల్ పరిహార్, నెటాలీ.






వీళ్ల కథ రైలు పట్టాల మీద దొరకలేదు. రక్తపు ఉత్తరాల్లో దొరకలేదు. నదిలో దొరకలేదు. సముద్రంలో దొరకలేదు. కథలన్నీ చేరే కంచిలోనూ దొరకలేదు. మరెక్కడ దొరికింది?



కాశీలో! ఉత్తర ప్రదేశ్‌లోని కాశీలో. సునీల్‌ది కాశీ. నెటాలీది స్విట్జర్లాండ్! ఇద్దరి మధ్య దూరం 7000 కి.మీటర్లు. విమాన మార్గంలో అయితే 4500 మైళ్ల దూరం. స్విట్టర్లాండ్ నుండి ఇండియా రావాలంటే ఒక దారిలో ఇటలీ, గ్రీసు, టర్కీ, సిరియా, ఇరాక్ దాటి రావాలి. ఇంకో దారిలో ఆస్ట్రియా, రొమేనియా, టర్క్‌మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దాటుకుని రావాలి.



ఏం? మగపిల్లాడు కదా, అబ్బాయే ఇండియా నుంచి స్విట్జర్లాండ్ వెళ్లకూడదా... అంత ప్రేమ ఉంటే?! ప్రేమ ఉంది కానీ, వెళ్లే స్థోమత లేదు. టెన్త్ క్లాస్‌లో బడి మానేసి, బతుకు తెరువుకోసం బొమ్మలేసుకుంటున్న వాడు అంతదూరం ఎలా వెళ్లగలడు? అందుకే అమ్మాయే ఇండియా వచ్చేసింది. స్విట్జర్లాండ్‌లో చేస్తున్న టీచర్ ఉద్యోగం మానేసి మరీ సునీల్ కోసం ఇండియా వచ్చేసింది. సునీల్ కోసం కాదు. సునీల్ ప్రేమ కోసం. అంతగా అతడు ఆమెను ప్రేమించాడు. ఇద్దరూ మెయిల్స్ పంపుకున్నారు. ఫోన్‌లో మాట్లాడుకున్నారు. చివరికి పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అనుకున్నారు.



ఇద్దరికీ రెండు దేశాల్లో ఎవరి కుటుంబాలు వారికి ఉన్నాయి. ఎవరి పెద్దలు వారికి ఉన్నారు. ఏడాది వ యసున్న వీళ్ల ప్రేమ గురించి రెండు దేశాల్లో, రెండు కుటుంబాలకీ తెలుసు. ఇండియా వెళ్తున్నానని నెటాలీ ఇంట్లో చెప్పి వచ్చింది. నెటాలీని ప్రేమించానని తన ఇంటికి తీసుకెళ్లి మరీ చెప్పాడు సునీల్. అలాగే పెళ్లి విషయం కూడా. కొడుకు మాట కాదనలేదు సునీల్ తల్లిదండ్రులు. అయితే పెళ్లి మాత్రం తమ కళ్లముందే జరగాలని ఆశపడ్డారు.



రెండు దేశాల మధ్య పెళ్లంటే ఇంట్లో పెళ్లి పందిట్లో జరిగితే సరిపోదు. అందుకే సునీల్, నెటాలీ కలిసి కాశీకి దగ్గర్లోని టికంఘర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ కోర్టులో అప్లికేషన్ పెట్టుకున్నారు. లాంఛనాలన్నీ (పెళ్లి లాంఛనాలు కాదు, అధికార లాంఛనాలు) పూర్తవడానికి రెండు నెలల సమయం పడుతుందనీ, అంతవరకు ఆగాలనీ అక్కడి అధికారులు చెప్పారు. అంతదూరం నుండి వచ్చిన దానిని ఎంతకాలమైనా ఆగుతాను అని నెటాలీ చిరునవ్వులు చిందిస్తుంటే , ఆమె భుజానికున్న బ్యాగును సరిచేస్తూ ఆమెను ప్రేమగా అనుసరిస్తున్నాడు సునీల్.



ఏడాది క్రితం సునీల్‌ను నెటాలీ కలుసుకున్నది తొలిసారిగా అతడి గ్యాలరీలోనే. ఆ తర్వాతే వారిలో ప్రేమ చిగురించింది. ఆన్‌లైన్‌లో అతడి బొమ్మల్ని ప్రేమించిన నెటాలీ, ‘లైఫ్’లైన్‌లో అతడిని ప్రేమించడం మొదలుపెట్టింది.



సునీల్ చక్కగా ఇంగ్లిషు మాట్లాడతాడు! నెలాలీ చక్కగా హిందీ అర్థం చేసుకోగలుగుతుంది. ఇక ప్రేమకు అడ్డేముంటుంది. ప్రేమకు దూరమేముందీ?

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top