హృదయం: ఇంగ్లిష్ వైఫ్... ఇండియన్ లైఫ్..

హృదయం: ఇంగ్లిష్ వైఫ్... ఇండియన్ లైఫ్..


తల్లిదండ్రులకు చెప్పకుండా చేసుకునే ప్రేమ వివాహమే... ‘గంధర్వ వివాహం’ అని అభి చెప్పాడు.  కేవలం దండలు మార్చుకోవడం మినహా ఈ పెళ్లిలో ఇంకేమీ ఉండదన్నాడు. ఆ గుడిలోని దేవుడు తప్ప మా పెళ్లికి మరెవరూ సాక్షులు లేరు.

 - లారెన్

 

 వారి మతాలు వేరు... వర్ణాలు వేరు. దేశాలు కూడా వేరే. కానీ ప్రేమ ఈ అంతరాలన్నింటినీ తొలగించేసింది. ఆమె అతని కోసం అంతా వదిలేసి, దేశం దాటి దేశం వచ్చేలా చేసింది. కొత్త మనుషుల్లో కొత్త సంస్కృతిలో కలిసిపోయేలా చేసింది. ఆశ్చర్యపరిచే ఈ ప్రేమకథ సంగతులేంటో ఆమె మాటల్లోనే విందాం రండి. నా పేరు లారెన్. మాది ఇంగ్లండ్. అక్కడే పుట్టి, పెరిగా. ఫార్మసీలో మాస్టర్స్ కూడా పూర్తిచేశా. చిన్నప్పటినుంచీ ఇండియా గురించి చాలా విన్నా. ఇక్కడి సంస్కృతుల గురించి తెలుసుకున్నా. ఎప్పటికైనా ఈ దేశానికి ఓసారి రావాలని అనుకునేదాన్ని. కానీ ఇక్కడే వచ్చి నివాసముంటానని ఎప్పుడూ అనుకోలేదు. దీనికి కారణం అభిరామ్!

 2012... అప్పుడు నేను ఫార్మసీలో మాస్టర్స్ చేస్తున్నా. ఆన్‌లైన్‌లో వెజిటేరియన్ ఫోరమ్‌లో చేరాను. అందులో కలిశాడు అభిరామ్. అప్పటిదాకా నేను కొత్తవాళ్లతో ఎప్పుడూ ఛాటింగ్ చేసింది లేదు.


కానీ ఎందుకో తెలియదు, అతను పలకరిస్తే పలికాను. మాట కలిపాను. అతనితో మాట్లాడుతుంటే ఏదో తెలియని అనుభూతి. వారం రోజుల్లోనే మా మాటల ప్రవాహం ఎక్కడికో వెళ్లిపోయింది. మా మధ్య ఉన్న అన్ని హద్దుల్నీ చెరిపేసింది. మా మనసులు కలిసిపోయాయి. ఎన్నో ఏళ్ల పరిచయమున్నవారిలా మా జీవితాల గురించి ఎంతో మాట్లాడుకున్నాం. ఓ కొత్త వ్యక్తితో ఇంత మాటలేంటి అనిపించింది. కానీ అతనితో మాట్లాడకుండా ఉండలేకపోయాను. ఓ దశలో తనకూ నాకూ పూర్వ జన్మ బంధమేమైనా ఉందా అన్న సందేహం కలిగింది. అంతలా దగ్గరైపోయాడు అభిరామ్. వెంటనే అతణ్ని కలవాలనిపించింది. కానీ అప్పటికతను న్యూజెర్సీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి, ఉద్యోగం చేస్తున్నాడు. మా ఛాటింగ్ మొదలైన వారం రోజులకే అభి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు.

 

 నా ఆనందానికి హద్దుల్లేవు. మరో మాట మాట్లాడకుండా సరే అనేశా. అంతే. అభి మరో వారానికి ఉద్యోగం వదిలేసి, ఇండియాకు ఫ్లయిట్ టికెట్ బుక్ చేసేశాడు. అయితే అతను ఇండియాకు వెళ్లింది వయా ఇంగ్లండ్! నాకింకా ఆ మధుర క్షణాలన్నీ గుర్తున్నాయ్. హీత్రూ విమానాశ్రయంలో నేను అతని కోసం ఎదురుచూడటం, అతను అరైవల్స్‌లో కనిపించగానే నా గుండె వేగంగా కొట్టుకోవడం, అతణ్ని కలిసినప్పటి ప్రత్యేకమైన అనుభూతిని  ఎప్పటికీ మరిచిపోలేను.

 

 అభిని చూడగానే ఇతనే నా భర్త అన్న భావన కలిగింది. ముంబైకి అభి కనెక్టింగ్ ఫ్లయిట్ ఎక్కడానికి ఇంకా పది గంటల సమయముండటంతో ఆ సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాం. అండర్‌గ్రౌండ్‌లో లండన్ విహారానికి బయల్దేరాం. కొన్ని రోజుల ముందు అసలు పరిచయమే లేని వ్యక్తితో కలిసి అలా నడుస్తుంటే కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను. లండన్‌లో ఆ రాత్రి మేం మాత్రమే ఉన్న భావన కలిగింది. తర్వాత అతను ముంబై ఫ్లయిట్ పట్టుకుని ఇండియాకు వెళ్లిపోయాడు. నేను నా ఫైనల్ ఎగ్జామ్స్ రాశాను. ఆ తర్వాత కాలం గడవడం కష్టంగా అనిపించింది. తర్వాత మేం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈసారి ముంబై ఫ్లయిట్ ఎక్కే వంతు నాది. తనే నా జీవితం అనుకుని, అన్నీ వదిలేసి 2013 జూన్‌లో ఇండియాకు బయల్దేరాను.

 

 ఇండియాలో అడుగుపెట్టగానే ఎదురుగా అభి కనిపించాడు. నన్ను కారు ఎక్కించాడు. ఇద్దరం నాగ్‌పూర్ దగ్గర్లోని ఓ గుడికి చేరుకున్నాం. అక్కడ దారిలో రెండు పూలదండలు తీసుకున్నాం. అభి పూర్వీకులు కట్టించిన ఆ గుడిలో దండలు మార్చుకుని,  వివాహం చేసుకున్నాం. ఆ గుడిలోని దేవుడు తప్ప మా పెళ్లికి మరెవరూ సాక్షులు లేరు. అభి నా నుదుటిపై కుంకుమ దిద్దాక, ‘మన పెళ్లయిపోయింది’ అన్నాడు. ఒకరి చేతిలో ఒకరి చేయి వేసుకుని అక్కడి నుండి బయల్దేరాం. నేరుగా నాగ్‌పూర్‌లోని అభి ఇంటికి వెళ్లాం. అభి ముందే చెప్పి ఉంచడంతో వారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు.

 

 ఇప్పుడు నాగ్‌పూరే నా నివాసం. ఇంకెప్పటికీ ఇక్కడే నా జీవితం. అభిపై నేను పెట్టుకున్న నమ్మకం వృథా కాలేదు. ఇక్కడే కన్సల్టెంట్ మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తూ, నన్ను మహరాణిలా చూసుకుంటున్నాడు. నా అత్తమామలు, బంధువులు కూడా నాపై ఎంతో అభిమానం చూపిస్తున్నారు. నాకీ జీవితం అద్భుతంగా అనిపిస్తోంది.

 

  ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు నాకు అద్భుతంగా అనిపిస్తున్నాయి. ఇక్కడి భాష నేర్చుకుంటున్నా. ఇక్కడి తిండికి అలవాటు పడ్డా. ఒక్కోసారి తలుచుకుంటే ఇదంతా కలలా అనిపిస్తోంది. ప్రేమకు ఇంత శక్తి ఉందా? పూర్తిగా భిన్న ధృవాలైన వ్యక్తుల్ని కూడా ఇలా ఒక్కటి చేస్తుందా అనిపిస్తోంది.  నా అనుభవాల్ని వృథా కానివ్వకుండా www.englishwifeindianlife. com అనే వెబ్‌సైట్ ద్వారా నా ప్రేమ, పెళ్లి, మిగతా జీవితం గురించి అన్ని విషయాలూ పంచుకుంటున్నా. మీరూ ఓసారి క్లిక్ చేసి చూడండి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top