బతుకు పుస్తకంలో... చివరి పేజీ

బతుకు పుస్తకంలో... చివరి పేజీ


కథ

ప్రేమ రాహిత్యానికి మించిన శాపం జీవితానికి మరొకటి ఉండదేమో! బీడువారిన హృదయంలో మేఘ శకలం తాకినట్టు... చెట్టు చిగిర్చినట్టు... ప్రేమభావం అంకురిస్తే, ఆ హృదయంలో ఆనందం ఆర్ణవమవుతుంది. అనురాగం అంబరమవుతుంది. నగరానికి కాస్త దూరంగా, ఇరుకు సందులో, మురిక్కాలవ పక్కన ఇటుకలు రాలుతున్న గోడ. మధ్యలో గుమ్మం, అలసటతో ఊడి వేలాడుతున్న తలుపులు. ‘‘క్షణకాలం సుఖానికై ప్రయాసపడి జీవితకాలాన్ని వృథామయం చేసుకొనే విలాసాలకు నిలయం’’ అది.



భయాన్ని, బిడియాన్ని వెంటేసుకొని సుఖాన్ని పొందాననే భ్రమతో కోర్కెలు తీర్చుకొనే రసహీనులు సంచరించే చోటది. ప్రేమలు పొందని జీవచ్ఛవాలకు ఆకలి తీర్చే పెంకుటిల్లది. వయసు మళ్లి ఆ పెంకుటిల్లు ఏ క్షణాన్నయినా కూలిపోయేలా ఉంది. ముందు పొడుగాటి వసారా. వెనక వరసగా గదులు. నేలంతా చెత్తా చెదారంతో ఉంది. ఒక మూల కుక్కపిల్లలు నిద్రపోతున్నాయి. మరో మూల ఎండిపోయిన శరీరాలు, వాడిపోయిన మల్లెదండలు. వసారాలో మూలగా నేలమీద ఒంటరిగా పడుకొని తలకింద చేతులు పెట్టుకొని శూన్యంలోకి చూస్తోంది గంగ.

 

‘‘రోగం తప్ప నాలో రాగం ఏది? అవును ‘డేగమ్మ’ చెప్పిన మాట నిజమే. ఇంక నన్నెవరు కోరుకుంటారు. ఈ పిప్పి ఒంట్లో ఇంకేం మిగిలింది!’’ నిట్టూర్పుతో పాటు అశ్రుకణం బుగ్గలమీద నుండి జారింది. ఆమె ఆలోచనలు ఎక్కడికెక్కడికో సుదూరంగా సాగిపోతున్నాయి. ఒకప్పుడు ఈ ఇల్లు ఇలా ఉండేది కాదు. ఖరీదైన మనుషుల రాకపోకలతో దర్జాగా, ఘరానాగా ధగధగలాడిపోయేది. ఇరుకు సందులు, మురిక్కాలవల్లేవు. తాజ్‌మహల్ గురించి తెలియని వాళ్లుండొచ్చు గానీ, ఈ ‘స్వీట్ మహల్’ గురించి తెలియనివాళ్లు లేరు.



పొడవాటి కార్లు, టెర్లిన్ సూట్లు, ఖరీదైన బూట్లు తిరిగిన ప్రదేశం అది. సరసులకు సుఖాన్ని పంచిపెట్టి, రిటైరైన ఒకావిడ ఈ ప్రమీలా రాజ్యానికి అధిపతి. వెంట్రుకను సైతం రెండుగా చీల్చగలిగే తీక్షణమైన చూపుతో, బలిసిన రాబందులా ఉండేది. అయినా ఆమె వినయంగా ఎవరికీ ఏ ఇబ్బందీ లేకుండా వ్యవహారాన్ని చక్కపెట్టడంలో పేరుగాంచింది. ఆమె అసలు పేరు ఎవరికీ తెలీదు. కానీ అందరూ పెట్టిన పేరు ‘డేగ’. ‘డేగమ్మా’ అంటూ ఎవరైనా పలకరిస్తే, ‘ఏం బాబూ’ అంటూ ఆప్యాయంగా ఎదురొస్తుంది. బిజినెస్ చేసేటప్పుడు కోపతాపాలకు తావివ్వకూడదని ఆమెకు బాగా తెలుసు.

 

డేగ చేతికింద పదిమంది అమ్మాయిలున్నా గంగ అంటే ప్రత్యేకమైన ప్రేమ ఆమెకు. గంగ గొప్ప అందగత్తె కాకపోయినా కన్ను, ముక్కు తీరుగానే ఉండేవి. పది సంవత్సరాల పచ్చి పసితనాన్ని ముఖంలోను, ఆపై వచ్చిన ఇంపైన ఆరేళ్ల దోరతనాన్ని తన గుండెల్లో దాచుకొని, విందు భోజనంలా ఉండేది. పొయిటిగ్గా చెప్పాలంటే దోరపండ్లతో ఆరోగ్యంగా ఊగే కొమ్మలా ఉండేది. వయసు పుష్ఠితో మిసమిసలాడే రోజుల్లో గంగకు వేదనంటే వెర్రిగా, బాధంటే బోరుగా, ఆకలంటే ఆశ్చర్యంగానూ ఉండేది.

 

ఆవు వెనుక ఆంబోతులా ఈ లోకం చొంగకారుస్తూ తన వెంటే పడుతున్నట్లు తెగ పొంగిపోయేది. కార్లు, షికార్లు, పెర్‌ఫ్యూమ్‌లు, ఏసీలు, హోటళ్లు, డిన్నర్లతో ప్రతిరోజూ బిజీబిజీ. ఖద్దరు, ఖాకీలను సైతం తన కనుసైగలతో కట్టేసి, వారి మనస్సులను కొల్లగొట్టేయగలనని తెగ మిడిసిపడిపోయేది.

 ఏం భోగం! ఏం భోగం!! అంటూ తోటివాళ్లంతా ముక్కున వేలేసుకోవాలని, అసూయ, ఈర్ష్యలతో కుళ్లుకోవాలని తెగ ఉబలాటపడేది. గంగ కాలికి నేలతో పనిలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అదృష్టానికి యోగం పట్టినట్టు హాయిగా, మహరాణిలా ఉండేది. ఇదంతా తాను చేసుకున్న పుణ్యమనుకుంది పాపం! వెర్రి గంగ.

 

గంగ తలని గుండెల మీద పెట్టుకొని, ‘‘నువ్వు నా బంగారు బాతువి. నా రతనాల రాశివి. నా పైసల పైరువ’’ని డేగమ్మ మెచ్చుకుంటుంటే రేపటి కసాయే నేడు ప్రేమగా నూకలేస్తున్నదనే సత్యం తెలియని కోడిపిల్లలా మరింతగా ఆమెకు హత్తుకొని, డేగమ్మ పేరుకు తగింది కాదని, తన వెలుగని, తనని కాచే గొడుగని పదేపదే అనుకునేది.

 

గంగకు డేగమ్మ కాక, తన మనస్సుకు నచ్చిన మరో వ్యక్తి చలం. వీధి చివర చిన్న కిళ్లీ బడ్డీ అతనిది. కులాసా పురుషుల విలాసపు అలవాట్లే అతనికి బేరం. ఆ సగటు మనిషిని, అతని చిన్న జీవితాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయేది. ఎలా బతుకుతాడో అని జాలిగా పెదవి విరిచేది. ఏ అర్ధరాత్రో అలసిపోయి కారుదిగిన ఆమె ఇంటికి వెళ్లేది కాదు. షాపు దగ్గరికి వెళ్లి నిలబడేది. అతను చిన్నగా నవ్వి సోడా అందించేవాడు. అలా తాగిన ఎన్నో సోడాలకు గానీ, డ్రింకులకు గానీ ఆమె ఏనాడూ డబ్బులివ్వలేదు. ఓ ఓరచూపు, చిరునవ్వు తప్ప!



‘‘ఓయ్ చలం! సోడాలు, డ్రింకులు ఫ్రీగా ఇచ్చేస్తే నేను ఫ్రీగా దొరికేస్తాననుకుంటున్నావేమో, నన్ను పొందాలంటే నీకు కారుండాలి, ఒంటి నిండా ఓపికుండాలి, చేతి నిండా సొమ్ముండాలి. ఈ డొక్కు బడ్డీ కాదు కనీసం ఓ డిపార్ట్‌మెంటల్ స్టోరుండాలి. అవి సంపాదించి అప్పుడు కనబడు’’ అంటూ వెటకారించేది. ఎన్ని రకాలుగా మాట్లాడినా, చలం ఎప్పుడూ బదులివ్వలేదు, మౌనంగా నవ్వు తప్ప!

 ఏ తెల్లవారుజామునో గంగకు మెలకువ వస్తే, చలం గుర్తుకు వచ్చేవాడు.



బీదరికంలో ఉన్నా అతను అంత స్వచ్ఛంగా, హాయిగా మల్లెలు విరిసినట్టు, వెన్నెల కురిసినట్టు ఎలా నవ్వగలుగుతున్నాడు. ఇన్ని భోగాలుండి కూడా తను ఎందుకు నవ్వలేకపోతోంది. ఎంత ఆలోచించినా జవాబు దొరికేది కాదు. ‘‘సౌఖ్యమివ్వడానికి ధనమూ, ఆస్తీ ముఖ్యమనుకున్నంత కాలం ఏ విలువలకీ స్థలముండదని, నిర్వ్యాజమైన స్నేహం, స్వచ్ఛమైన హృదయం ఉంటేనే గాని మధురమైన నవ్వును నవ్వలేమని...’’దౌర్భాగ్యపు గంగకు ఎలా తెలుస్తుంది.

   

సంవత్సరాలు కాలగర్భంలో కలసిపోయాయి. చీకటి చిత్తడిలో ఒళ్లలసిపోయింది. ఒత్తిడితో వయసు నలిగింది. ‘తను పండులా ఎందరికో అంది, చివరికి తనువులో పుండును మిగుల్చుకుంది’. గతంలో కురిపించిన ప్రేమమూర్తుల ప్రేమ చచ్చిపోయింది. పైపై రంగు వెలసిపోయింది. కడకు గంగ చీడయింది. దరిద్రానికి దారయింది. ఆనాటి నవ్వులు, చూపులు, చేతలు, ముచ్చట్లు, పలకరింతలు ఒక్కసారిగా బూటకంగా, మాయగా కనిపించాయి. ఆదరణకు, ఆప్యాయతలకు నోచని బతుకని తెలిసినా వెర్రిగా వెంపర్లాడింది.

 

ఆనాడు తెలియని పాన్‌పరాగ్ నవ్వులు, మత్తు గుండెలు, మైకం చూపులు, సిగరెట్ పొగలు, రాసక్రీడలు, బలవంతపు వేధింపులు, గోళ్ల రక్కులు, పళ్ల కరుపులు తలచుకొని తను ఎంత హీనంగా బతికిందో, వయస్సు అందం పోయి ఎంత ఒంటరయ్యిందో, తను అమ్మలా భావించిన డేగమ్మ అసలు స్వరూపం తలచుకొని తలచుకొని గుండెలు పగిలేలా కనులు కరిగేలా భోరుమంది. తన వయసుపైన, ఒంటిపైన మోజు, ప్రేమ తన మనసుపై లేదని మోసపోయానని కుమిలిపోయింది.

 

మానసికంగా గానీ, శారీరకంగా గానీ ఏ లాభం లేని చోట ప్రేమ పుట్టదని, ప్రతి మనిషి ఏదో ఒకటి ఆశించే స్వార్థంతో ప్రేమిస్తాడని, నిస్వార్థమైన ప్రేమ ఒక సత్యం కాని స్వప్నమని, కలుషితం, కల్మషం ప్రేమను బతకనివ్వవని తెలుసుకొని, గద్దముక్కుతో చిత్రవధ అనుభవిస్తున్న ఎలకపిల్లలా వణికిపోయింది.రోడ్డు వెడల్పు చేసే మిషతో చలం కిళ్లీబడ్డీ కూలదోసేసరికి ఎక్కడికెళ్లాడో ఏమిటో మళ్లా ఆమెకు కనబడలేదు.

 

డేగమ్మ కాలితో డొక్కలో తన్నేసరికి ఉలిక్కిపడి లేచింది గంగ. ఆలోచన్లు తెగిపోయాయి. అప్పటికే చీకటిపడింది. దూరంగా కోడిగుడ్డు దీపం వెలుగుతోంది. తిండి తిని రెండ్రోజులయ్యిందేమో ఆ తన్నుకి ఒక్కసారిగా కళ్లు బైర్లుకమ్మాయి. తల విదిలించి భారంగా చూస్తే మసక వెలుతురులో బండ ముక్కు, గార పళ్లతో ఎలుగ్గొడ్డులా కనిపించింది డేగమ్మ. ‘‘కొంచెం హుషారుగా ఉండవే, ఆ కునుకుపాట్లేంటే దైద్రంగా’’, ‘‘అన్నం తిని రెండ్రోజులయ్యింది’’ చెప్పింది గంగ. ‘‘నీ మూలంగ ఓ పైసా లేదు. అన్నం కావాలంట. అన్నం... నిన్ను నమ్ముకుని ఓ కప్పు టీ పెట్టుబడి పెట్టినా తిరిగి రాదు. ఊ.. ఊ... లే. లేచి పౌడరు కాసింత ఎక్కువగా రాసుకుని కూకో. ఎవడో ఒకడు గంతకు తగ్గ బొంతొత్తాడు.’’

 

‘‘ఆకలికి ఎంత పౌడరద్దితే మాత్రం అందం వస్తాది డేగమ్మ! గుండెల్లో పుండు రేగినట్టు మంటగా ఉంది. కాళ్లు జవజవ లాడిపోతున్నాయి. రోగిష్ఠిదాన్నైపోయాను. డాక్టరు దగ్గరికి తీసుకెళ్లి బాగు చేయించు. నీ కాళ్లు పట్టుకుంటాను. నే బాగైతే నీకే కదా ఉపయోగపడతాను’’ అంటూ దీనంగా, బతుకు మీద ఆశతోనూ దయ, ప్రేమ పొందని వెలితితో హృదయ విదారకంగా అడిగినా, ఆ పాషాణం కరగలేదు.

 ‘‘డాట్రు దగ్గరికా... నీ మీద రూపాయి కర్సెట్టినా దండగేనే.



ఇందాక సెలంగోడు, ఆడేనే కిళ్లీ కొట్టోడు అవుపించాడు. నీ కోసం పదేపదే కలవరించేత్తున్నాడు. ఆడి సూపు నీ మీదకి మళ్లిందేటా అని ఆచ్చర్యపడ్డాను. ఆ రోగాపుదెందుకు, కొత్త పిట్టలొచ్చినాయి రమ్మంటే... నువ్వే కావాలన్నాడు. ఆడెంత ఎర్రోడో సూడు నిగనిగలాడే వయస్సుల ఒగ్గేసి ఇపుడు దేవుల్లాడుతున్నాడు. ఎల్లు. ఎంటనే ఎల్లు. మళ్లీ ఆడిమనసు మారి పోగల్దు. తచ్చనం ఎల్లిపో. ఎల్లి ఆడికాడే కాపరముండు’’ ఆడి ఇల్లెక్కడో ఎరుకనా!’’ అంటూ చెప్పుకుపోతోంది డేగమ్మ.

 

చలం మాట వినేసరికి గంగ ఉలిక్కిపడింది. ఆ సమయంలో చలం దగ్గరకు వెళ్లాలనిపించింది. లేని ఓపిక తెచ్చుకొని, లేచి నిలబడింది. కాళ్లు నిలవడం లేదు. ‘‘రిచ్చా బండి తెప్పించవా డేగమ్మా! అంత దూరం నడవలేను’’ అని కన్నీళ్లతో అడిగినా, కరగలేదు సరికదా, ‘‘ఛీ! ఛీ! నీయమ్మ. నువ్వు తిరిగి రావాలా పాడా, నువ్వు బతుకుండి నాకు పైసా తెత్తావనే నమ్మిక నాకు లేదు. నువ్వు ఆడనే సచ్చి నాకు దహనం కచ్చులు తగ్గించు’’ అంది.



అది విన్న గంగ కొత్త బ్లేడుతో గుండెను కోసినట్టు వణికిపోయింది. ‘‘ఈడ్చి తన్నినా నాకాడ దమ్మిడీ నేదు. నడవలేకపోతే దేక్కుంటూ ఎల్లు’’ అంటూ బయటకు నెట్టేసింది డేగమ్మ. గంగ తూలిపోయి గోడను పట్టుకొని నిలదొక్కుకుంది. ఒకసారి చుట్టూ చూసింది. ప్రపంచమంతటా ప్రేమ, దయ, చచ్చికాలుతున్న శవంలా వికృతంగాను, భయంగాను కనిపించింది.

 

అయినా డేగమ్మకు మనసేంటి, మనసే ఉంటే మాపై వ్యాపారమేంటి. నా పిచ్చిగానీ పాము కోరకు కరుణేంటి. నడిరోడ్డులో చక్రం కిందపడి నలిగే తొండల్ని, కప్పల్ని ఎవరైనా తిరిగి చూస్తారా? చూడరు. ఎందుకంటే వాటితో ఎవరికీ పని లేదు కాబట్టి. గంగ వాటితో అన్వయించుకొని కుమిలిపోయింది. ఈ వెధవ లోకంలో ఆప్యాయతలు, ప్రేమలు స్వార్థానికి కప్పిన అందమైన ముసుగులు. తనలాంటి ఆడదాని బతుకు పుస్తకం చివరిపేజీ ఇలాగే ఉంటుంది.

 

చివరి రక్తం బొట్టు వరకూ రక్తాన్ని పాలుగా పిండి, చివరికి వట్టిపోయిందని కసాయి వేటుకు పంపే రక్కసిలా, నిర్దయగా, కర్కశంగా గంగను బరబరా ఈడ్చుకుంటూ వెళ్లింది డేగమ్మ. గంగ తనలో తాను మాట్లాడుకుంటూ, చీకటిలో తడబడుతూ నడుస్తోంది. అందం, ఆరోగ్యం తనని కాపుకాసే రోజుల్లో ఎన్నో అడుగులు ఆబగా తన వెంటే ఉండేవి. వాటికి తమ్ముడు, తండ్రి, తాత వయస్సులుండేవి. అందం వాడిపోయి, ఆరోగ్యం వీడిపోయేసరికి, చీకటిలో గంగకి తన నీడే తన వెంట కనిపించక... ఒంటరితనం ఎంత భయంకరమైనదో తెలుసుకొని కదిలిపోయింది. అయినా ఇప్పుడు చలానికి నేనెందుకు? పూర్వపు గంగలాగే ఉన్నాననుకుంటున్నాడా? ఎందుకో చలాన్ని తల్చుకొని జాలిగా నవ్వుకుంది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ప్రాణాల్ని కళ్లలో పెట్టుకొని నడుస్తోంది.

 

అకస్మాత్తుగా ఆమెకు కుక్కల అరుపులు వినిపించాయి. గబగబా అటు నడిచింది. ఖరీదైన బొచ్చు కుక్కను కొన్ని ఊర కుక్కలు గాయపరుస్తున్నాయి. గంగ ‘అయ్యో పాపం’ అంటూ బలవంతంగా ఓపికను కూడగట్టుకొని, ఆ కుక్కల్ని తరిమేసి బొచ్చు కుక్కను ఆప్యాయంగా ఎత్తుకుంది. చర్మ రోగంతో దాని వెంట్రుకలు రాలిపోయి చర్మంపై పుండ్లు పడి, రసి కారుతూ వికృతంగా ఉంది. ఇదీ నాలా బతికి చెడ్డదిలా ఉంది అనుకుంది. అందం లేదని, చీడని, పీడని, పిల్లలు ముట్టుకుంటే రోగం అంటుకుంటుందని దీనిని నడిరోడ్డుపై విడిచిపోయుంటాడు దీని యజమాని.

 

ఎలాగైతేనేం డేగమ్మ చెప్పిన అడ్రసు ప్రకారం చలం ఇల్లు చూసి తెల్లబోయింది. చిన్న పెంకుటిల్లు, గోడలన్నీ మాసిపోయి బీదరికాన్ని చూపిస్తున్నాయి. బయట కిళ్లీబడ్డీ మూసి ఉంది. వీధి తలుపులు దగ్గరకు చేరవేసున్నాయి. తట్టబోయి క్షణం సేపు ఆగింది. ఆమె శరీరం ఒక్కసారిగా కంపించింది. సిగ్గుతో మనసు చచ్చి వేయి ప్రశ్నలతో జీవచ్ఛవంలా నిలబడింది. కుళ్లిన వంటి వాసనను దాచిపెట్టిన పైపై రంగు పౌడరు కరిగిపోయింది. కడుపుమంట ఒళ్లంతా పాకి నిలువునా కాల్చేస్తున్నట్టుంది. కళ్లు జీవాన్ని కోల్పోతున్నాయి.

 

నీకు నా ముఖం చూపించలేను. నన్ను క్షమించు అంటూ ఆమె వెనుదిరగబోయింది. నెమ్మదిగా తలుపులు తెరచుకున్నాయి. చలం నవ్వుతూ ఆమెను లోపలికి ఆహ్వానించాడు. గాలిలో తేలుతున్నట్టు తనకు తెలీకుండానే గదిలోకి నడిచింది గంగ. కళ్లముందు కంచంలో అన్నం కలిపి ముద్దతో ఎదురొచ్చి నోటికి అందించేసరికి వేరే ధ్యాస గానీ, ఆశ గానీ లేకుండా ఆత్రంగా అందిస్తున్న ముద్దలను మింగుతూ, పొలమారుకుంటూ... కంటి నిండా తల్లిపాలులా ఏ మలినమూ లేని స్వచ్ఛమైన నీరు నింపుకొని సొమ్మసిల్లి, ఒక్కసారిగా నేలకూలిపోయింది గంగ. రెండ్రోజుల ఖాళీ కడుపు ఆత్రంగా నిండేసరికి, ఇముడ్చుకోలేక టెలిఫోను వైరులా మెలితిరిగిపోయింది.

 

ఆకలిని, గుండెల్లో బాధని పళ్ల బిగువున బిగించి, కళ్లుమూసి భరిస్తుంటే అది తమ ప్రతాపమని, తనని తన్మయంలో ముంచేశానని మురిసిపోయే విటులనే చూసిన గంగ, మొదటిసారిగా అమ్మలా ఆకలిని తెలుసుకున్న చలాన్ని చూసి, ‘‘నన్ను క్షమించు. నీకు నన్ను అర్పించుకోలేను. ఎందుకు రమ్మన్నావు? నీకు తెలియదు నన్నెంత క్షోభ పెడుతున్నావో, ఇంకా నామీద కోరికుందా? దరిద్రాన్ని ఎవరైనా కోరుకుంటారా? రోగాన్ని ఎవరైనా కోరి తెచ్చుకుంటారా?’’

 

‘‘అవును. చలం బాబూ. ఒకమాట అర్థంకాక అడుగుతున్నాను. నీ షాపులో ఎంతో సొమ్ము నేను దొరతనంగా వాడుకున్నాను గదా! ఏదో బాకీ చెప్పి, గొడవపెట్టి నన్ను ఆనాడే పొందలేకపోయావా? నువ్వు నాకు అన్నం పెట్టిన పుణ్యానికి నేను నీకు రోగాన్ని ఇవ్వలేను. నన్ను క్షమించు’’ అంటూ బోరుమని ఎక్కెక్కి ఏడ్చింది. నా ముఖం నీకు చూపించలేను. అంటూ భార హృదయంతో వెనక్కి తిరుగుతుంటే...

 

‘‘గంగా! నిజంగా నీవు పవిత్ర గంగాజలానివి. మలినం చేసిన సమాజాన్ని వదలి నిన్ను చీదరించుకునే సంస్కార హీనుణ్ని కాదు నేను. అలసిపోయి బతుకుమీద ఆశ చచ్చిన నీకు ఒకరి తోడవసరం, ఓ నీడవసరం. అందుకే నిన్ను చేరదీయాలనుకున్నాను. నాకు బాగా తెలిసినదానివి, లోకం తీరు బాగా తెలుసుకున్నదానివి. కాబట్టి నీతి, నిజాయితీలతో కొత్త జీవితం ప్రారంభించు. నా బడ్డీ పక్కనే ఓ చిన్న టీకొట్టు పెట్టుకుందువు’’ అంటూ నా కొత్త బతుకు గురించి చలం చెప్పుకుంటూ పోతుంటే గంగకు ఆత్మీయత గాలి వలెనే, కాంతి వలెనే అనేక రూపాలుగా సర్వత్రా వ్యాపించినట్టయ్యింది.



నీరసించిన కళ్లకు దివ్యమైన వెలుగొచ్చినట్టయ్యింది. ఆశ చచ్చిన ఒంటికి తెలియని బలమొచ్చినట్టయ్యింది. నాకెవరూ లేరు, ‘అనాథ’ననే పదానికి చావొచ్చినట్టయ్యింది. మానవతకు రూపొచ్చినట్టయ్యింది. కనిపించని దైవం ఎదురొచ్చినట్టయ్యింది. దగ్దమయ్యే నికృష్ఠ జీవితానికి అతను ఒకింత ఓదార్పయితే, ఆమె కంటి కొన మాటున ఒదిగిన భాష్పం అతని మీదున్న దైవ భావానికి సాక్ష్యంగా నిలిచింది. ‘‘దేహాలు ఉపయోగించకుండా, హృదయాలలో ప్రేమను నిలుపుకోగల మనుషులు... ధన్యులు... దేవతలు’’

- కె.వి.ఎస్.ప్రసాద్

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top