కుమారపురం స్టేషన్

కుమారపురం స్టేషన్


 - కె.అళగిరిస్వామి

 కుమారపురం ఒక అడవి స్టేషను. దానికి తూర్పుగా ఒక మైలు అవతల ఉన్న కుమారపురం అన్న గ్రామం, డెబ్భై అయిదేళ్లుగా ఆ స్టేషన్‌ను బహిష్కరిస్తూ వస్తోంది. ఆ చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు తమ జీవిత కాలంలో ఒకసారో రెండుసార్లో తీర్థయాత్ర చేస్తారు. ఈ యాత్రలకు రైళ్లూ అక్కరలేదు, బస్సులూ అక్కరలేదు. కొన్ని సందర్భాల్లో వాళ్లు వెళ్లవలసిన గ్రామం స్టేషను కంటే దగ్గరలోనే ఉంటుంది. అలాంటప్పుడు నడిచి వెళ్లకుండా స్టేషన్‌కు వచ్చి రెలైక్కుతారా ఎవరైనా?  ఈ స్టేషన్ చరిత్రలో మొట్టమొదటి సారిగా ఇక్కడ దిగిన ప్రముఖుడు సుబ్బ రామ అయ్యరు. కోవిల్‌పట్టి నుంచి మూడు రోజుల క్రితమే వచ్చాడు. కొత్తగా బదిలీ అయి వచ్చిన ఆ స్టేషన్ మాస్టర్‌కి బాల్యమిత్రుడు.

 

  తన మిత్రుణ్ని ఈ స్టేషన్‌కి ఆహ్వానించే సదవకాశం స్టేషన్ మాస్టర్‌కి కలిగింది. ఆయన పిల్లవాడికి ఆరో యేడు నిండింది. దాన్ని పురస్క రించుకుని మిత్రుణ్ని ఆహ్వానించాడు. సాయంకాలం ఆరు దాటిన తర్వాతే అక్కడికి రైళ్లు వస్తాయి. ప్లాట్‌ఫామ్ బెంచి మీద కూర్చుని పుస్తకం చదువుతున్న మిత్రుడి దగ్గరికి వచ్చి కూచున్నాడు స్టేషన్ మాస్టర్. ‘‘ఈ స్టేషన్‌కి ప్రయాణికులు వస్తూ పోతూ ఉంటారు కదా’’ అని నవ్వుతూ అడిగాడు అయ్యర్. ‘‘రాకే, నిన్న కూడా ఓ ప్రయాణికుడు ఈ స్టేషన్‌లో దిగాడు కదా’’ అన్నాడు స్టేషన్ మాస్టర్. బిగ్గరగా నవ్వాడు అయ్యర్. ‘‘ఎందుకని ఈ స్టేషన్ కట్టారు? ఇది లేకపోతే ఎవరు అఘోరించారని?’’

 

 ‘‘ఈ స్టేషన్... చుట్టుపక్కల గ్రామ స్థులకి మరో విధంగా సహాయ పడు తుంది. ఇలాగైనా లాభముందనే విషయం ఇక్కడికి బదిలీ అయ్యిన తర్వాతనే తెలుసు కోగలిగాను. ఇది వేసవి కాలం కావడం వల్ల చుట్టుపక్కల ఉండే గ్రామాలు మాగాణి భూములవడం చేత పచ్చగా లేవు. కానీ ఎప్పుడూ ఇలా ఉండవు. నవ ధాన్యాలు పండే భూమి. పొలం పనులు చేసేవారు తాగే నీటి కోసం కుండలతో ఇక్కడికి వస్తారు. కనుక ఈ విధంగానైనా స్టేషన్ వల్ల లాభం ఉంది. ‘‘అలా అయితే చలివేంద్రం కట్టాల్సిన చోట ఈ స్టేషన్ కట్టారన్నమాట.’’‘‘ఒకటి ఉండవలసిన చోట మరొకటి కడతాడు మానవుడు. అప్పుడు సవ్యంగా జరిగిన ఖర్చు కూడా అనవసరమైన ఖర్చుగా మారిపోతుంది. ప్రపంచమే అలా ఉన్నప్పుడు ఈ స్టేషన్‌ని విమర్శించడం ఎందుకు?’’ అన్నాడు స్టేషన్ మాస్టర్.

 

 ‘‘ఆరు నెలల్లో ఈ రాతి కట్టడం మీద ఇంత మమకారం ఎలా కలిగిందో ఆశ్చర్యంగా ఉంది’’ అన్నాడు అయ్యర్.స్టేషన్ మాస్టర్ కొంచెం ఉద్రేకం తెచ్చుకుని మాట్లాడసాగాడు. ‘‘కోవిల్ పట్టిలో పాఠశాల కట్టారు. ఎందుకో చెప్పండి చూద్దాం. ‘‘ఎందుక్కడతారు బడి? వందమంది విద్యార్థులు చదువుకు నేందుకే’’‘‘అలాగే అనుకుందాం. వందమంది విద్యార్థులు ఎందుకు చదువుతారు?’’ అడిగాడు స్టేషన్ మాస్టర్.  ‘‘జ్ఞానం వృద్ధి చేసుకునేందుకు పిల్లలు చదువుతారనేగా మీరు చెప్పే సమాధానం?’’ ‘‘మీతో మాట్లాడి జయించడమే? కుమారపురం స్టేషన్ శాశ్వతంగా ఉండనివ్వండి. అందువల్ల నాకేం నష్టం లేదు’’ అని అయ్యర్ ఏదో పుస్తకం తిరగేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కొంచెం సేపటికి స్టేషన్ నుంచి ఇంటికి బయలు దేరారు.

 

 మూడో రోజు పొద్దున్న ఎనిమిదింటి కల్లా ఉత్తరాది వెళ్లే ప్యాసింజర్ ఒకటి రావాలి. కోవిల్‌పట్టి సంతకు వెళ్లే ప్రయాణికులు నలుగురైదుగురు గోనె సంచులతో సహా స్టేషన్‌కు వచ్చారు. అయ్యర్ ఫలహారం పూర్తి చేసుకుని ప్లాట్‌ఫారం మీద వేపచెట్టు కింద ఉన్న బెంచి మీద కూర్చుని పుస్తకం చదవడం మొదలుపెట్టాడు. ఆయన చూపులు దూరాన ఉన్న గ్రామాల మీదికి వెళ్లాయి. ఆయన మనసులో ఆలోచనలెన్నో మెదులు తున్నాయి. అప్పుడు పడమరగా సుమారు అరమైలు దూరాన నలుగురైదుగురు త్వరత్వరగా స్టేషన్ వైపు నడిచి రావడం చూశాడు. ‘బడికింకా టైముంది, ఇలా చెమటలు పట్టేలా ఎందుకు వస్తున్నారు వీరు’ అని అయ్యర్ అనుకున్నాడు. ఆయనకది వెర్రితనం అనిపించింది.

 

 ఇంతలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ప్లాట్‌ఫారం మీదికి వచ్చి అక్కడే నిలబడ్డారు. ఎప్పుడో ఒక ఆవును కొన్న విషయాన్ని ఒక ఆసామి కథలా చెప్పుకు పోతుంటే మిగిలినవాళ్లు ఊకొడుతూ వింటున్నారు. అయ్యర్ వాళ్ల మాటల్ని శ్రద్ధగా విన్నాడు. ఆ మాటల్లో అర్థం ఉన్నట్లు ఆయనకు తోచింది. పరుగెత్తుకు వచ్చినవాళ్లలో ఒకాయన వృద్ధుడు, నలుగులు బాలురూను. ప్లాట్‌ఫారం చేరుకోగానే ‘‘టిక్కెట్లు ఇచ్చారా’’ అని అడిగాడు వృద్ధుడు. ఒకతను ‘‘ఇవ్వలేదు’’ అని బదులు చెప్పాడు. అంతా హమ్మయ్య అనుకున్నారు.

 

 ఆ నలుగురు పిల్లల చూపులూ అయ్యరు మీద పడ్డాయి. వాళ్లకు ఆయన మీద ఆదరభావం కలిగింది. తనవైపు కన్నార్పకుండా చూస్తోన్న పిల్లల్ని గమనించి అడిగాడు అయ్యరు. పిల్లలూ అయ్యరూ ఒకరికొకరు చూసుకుంటూనే ఉన్నా, పలకరించేందుకు మాత్రం ఎవరూ ప్రయత్నించలేదు. స్టేషన్ మాస్టర్ టిక్కెట్‌తో అయ్యరు వద్దకు వచ్చాడు. ‘‘ఈ చోటు మీకు బాగా నచ్చినట్లుంది, ఇక్కడే కూర్చున్నారు?’’‘‘మంచి గాలి’’ అంటూ టిక్కెట్ తీసుకున్నాడు అయ్యరు. ‘‘అలా అయితే ఈసారి సెలవులకి ఇక్కడికే రండి.’’‘‘అలాగే కానీయండి. రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసినప్పుడు మనం ఇక్కడ ఉండలేమా?’’

 

 బండి వచ్చే వేళయ్యింది. స్టేషన్‌లోకి వెళ్లిపోయాడు స్టేషన్ మాస్టరు. సకాలంలో బండి వచ్చింది. అయ్యరు ఎక్కిన పెట్టెలోనే ఆ వృద్ధుడు, పిల్లలు ఎక్కారు. ఓ కిటికీ దగ్గర కూర్చున్నాడు అయ్యరు. ఆయన ఎదురు వరుసలో వాళ్లంతా కూర్చున్నారు. రైలు కదిలింది. కొన్ని నిమిషాలు గడిచాయి. పిల్లలతో మాట్లాడ్డం మొదలు పెట్టాడు అయ్యరు. ‘‘ఎక్కడికిరా ప్రయాణం’’ అని అడిగాడు. ఏం బదులు చెప్పాలో పిల్లలకు తెలియలేదు. వాళ్ల తరఫున వృద్ధుడు చెప్పాడు... ‘‘కోవిల్‌పట్టికి వెళ్తున్నారు. పెద్ద బళ్లో చేర్చాలి.’’‘‘ఏ క్లాసులో చేరతారు?’’‘‘మా ఊళ్లో ఆరో క్లాసు పాసయ్యారు. అక్కడ ఏడో క్లాసులో చేరాలి.’’‘‘వీళ్ల ఊళ్లో ఏడో క్లాసు లేదా?’’‘‘లేదు. సర్కారువారి శాంక్షనుకి దరఖాస్తు పెట్టారు. చాలా దూరం ప్రయాణమా?’’ వృద్ధుడు అడిగాడు.

 

 ‘‘మధుర దాకా వెళ్లాలి. అక్కడొక పెళ్లి.’’‘‘ఎంతమంది పిల్లలు మీకు?’’ అడిగాడు వృద్ధుడు. ‘‘అందరు పిల్లలూ నా పిల్లలే. కంటేనా పిల్లలవుతారా? ఈ నలుగురూ నా పిల్లలే. ఏమంటారు?’’ ‘‘మీరన్నట్లు లోకంలో ఉన్న పిల్లలంతా మన పిల్లలే. వీళ్లలో ఒక్కడే నా మనవడు. మిగిలినవాళ్లంతా వాడితో పాటు చదువుకునేవాళ్లు. చివర కూర్చున్నాడే, ఆ అబ్బాయివాళ్లు కొంచెం పేదవాళ్లు. వాణ్ని ఎలా చదివించడమా అని వాళ్ల నాన్న సలహా అడిగాడు. మా పిల్లలతో పాటు వాడూ చదువుకుంటాడు, వాడికయ్యే ఖర్చు నేను భరిస్తానని ధైర్యం చెప్పాను’’ అని చెప్పాడు.

 

 కాసేపటికి అయ్యరు పుస్తకం తెరిచి చదవడం మొదలుపెట్టాడు. ఆ పుస్తకం పేరులోని అక్షరాలు కూడబలుక్కుని ఆనా కెరీనా, లియో టాల్‌స్టాయ్ అని మెల్లగా చదివాడో పిల్లవాడు. అది అయ్యరు చెవిలో పడింది. పుస్తకం చదువుతున్నట్టు పైకి నటిస్తూ, వాళ్ల మాటలు వింటున్నాడు అయ్యరు.  ‘‘పిల్లలు బాగా చదివేవారిలా కనిపిస్తున్నారు’’ అన్నాడు ఒకతను వృద్ధుడితో.‘‘పల్లెటూరి పిల్లలైనా చదువు గట్టిదే. పంతులుగారలాంటివారు. హెడ్ మాస్టర్ గారు కన్నతండ్రిలా పిల్లలకు పాఠాలు చెప్పాడు. ఆయనలా కన్నతండ్రి కూడా పిల్లల పట్ల అంత ప్రేమగా ఉండడని నా అభిప్రాయం’’ అన్నాడు వృద్ధుడు. ‘‘బాగా చదవండర్రా’’ అన్నాడతను.‘‘ఈ కుర్రాళ్లు చదువులోనే కాదు, పనిపాటుల్లోనూ సిసింద్రీలే’’ అన్నాడు వృద్ధుడు. ‘‘పనిపాటులా?’’

 

 ‘‘అవును. పని చెయ్యకపోతే ఎలా? బడికి వెళ్లేముందు ఆవుల్ని మేపుతారు. పత్తిగింజలు రుబ్బుతారు. ఇలా ఇంటి పనులు చేసిన తర్వాతే బడికి వెడతారు.’’‘‘భేష్! అలావుండాలి. బతకనేర్చిన వాడి లక్షణం అది. పనిపాటులు తెలీని చదువు చదువవుతుందా అసలు? అటువంటి వాడివల్ల ఊరికేవన్నా లాభంవుందా? పోనీ వాడికి మాత్రం లాభం వుందా? నేను రెండో క్లాసు దాటలేదు. బీఏ ఎమ్మేలు చేసివుంటే ఉద్యోగం చేసేవాణ్ని. అలా చేస్తే యిన్నేళ్లుగా నావల్ల విద్యార్థులకు వుపకారం జరిగివుండేదా? నలుగురికీ సహాయ పడడమే చదువవుతుంది. అంతేకాని వూరివాళ్లని బెదరగొట్టే చదువు మాత్రం వద్దనే వద్దు.’’

 

 చదువుతున్నట్టు నటిస్తున్న అయ్యరు పుస్తకం మూసివేసి కోటు జేబులో ఉంచాడు. అందరూ దిగే సన్నాహంలో ఉన్నారు. అయ్యరూ, ఆ పిల్లలు, వృద్ధుడు అంతా బండి దిగారు. స్టేషను బయటికి రాగానే గుర్రపు బండి కోసం ఎదురుచూస్తూ నుంచున్నాడు అయ్యరు. కోవిల్‌పట్టి స్టేషన్లో పోర్టరుగా పనిచేస్తున్న ఒకతను ఒక మూల నుంచున్నాడు. ఆ రోజు అతనికి రాత్రి డ్యూటీ. పిల్లల్నీ వృద్ధుణ్నీ చూసి ‘రండి రండి’ అన్నాడు. వాళ్లెందుకు వచ్చారో తెలుసుకున్నాడు. మాటలను బట్టి వాళ్లంతా ఒకూరి వాళ్లేనని అర్థమయ్యింది అయ్యరుకి. వాళ్లను తన ఇంటికి ఆహ్వానించాడు. టిఫిన్ వగైరాలు అక్కడే. ఆ రాత్రి అక్కడేవుండి, మరునాడు వెళ్లవచ్చునని అతనన్నాడు.

 

 అయ్యరుకు గుర్రపుబండి దొరికింది. ఎక్కాడు. బండి మలుపు తిరిగేవరకూ ఆయన దృష్టి పిల్లల మీదే ఉంది. కుమారపురం స్టేషను, స్టేషన్ మాస్టర్‌తో జరిగిన సంభాషణ, వేపచెట్ల కమ్మని గాలి, నల్లని మట్టిలోంచి వచ్చిన సువాసన, చదువంటే యేమిటో రైల్లో జరిగిన సంభాషణ, పిల్లల అక్షరజ్ఞానం, పేద పోర్టరు విందు పిలుపూ... ఇవన్నీ స్ఫురణకు వచ్చాయి. ఇరవై నిమిషాల రైలు ప్రయాణంలో ఇరవై సంవత్సరాలు చదివినా తెలుసుకోలేని విషయాలు తెలిసిన ఒక సంతోషం. అయ్యరు ఇల్లు చేరుకున్నాడు. వృద్ధుణ్ని, పిల్లల్ని పోర్టరు ఇంటికి తీసుకు వెళ్లాడు. గ్రామంలో భోజనం చేసి రావడం వల్ల వాళ్లేమీ తినలేదు. కాని పోర్టరు చేసిన బలవంతం వల్ల కాఫీ మాత్రం తాగారు. మధ్యాహ్న భోజనం చేస్తామన్నారు. ఆ తర్వాత అంతా బడికి వెళ్లారు.

 

  బడి వరండాలో ఉండమని చెప్పి పోర్టరు ప్రధానోపాధ్యాయుని గదికి వెళ్లాడు. ఇడైసేవల్ గ్రామం నుంచి ఏడో తరగతిలో చేరాలని నలుగురు పిల్లలు వచ్చినట్టు తెలియజేశారు. ఆయన వెంటనే ఒక ఉపాధ్యాయుణ్ని పిలిచి, రెండు మూడు ప్రశ్న పత్రాలు ఇచ్చి, ఆ విద్యార్థుల్ని పరీక్షించవలసిందిగా చెప్పాడు.ఒక గదిలో నలుగురు పిల్లల్నీ విడివిడిగా కూర్చోపెట్టారు. ఉపాధ్యాయుడు ప్రశ్నలు చదివాడు. అన్నీ ఇంగ్లిషులోనే ఉన్నాయి. పిల్లలు వాటిని రాసుకున్నారు. ఒక్క గంటలో జవాబులు రాయాలని ఉపాధ్యాయుడు చెప్పాడు. పిల్లలు రాయడం మొదలుపెట్టారు. పోర్టరూ వృద్ధుడూ బయటికి వచ్చి, ఒక చింతచెట్టు కింద కూర్చుని, ఊరి విషయాలు ముచ్చటించుకోసాగారు.

 

 పదిన్నరకల్లా ఇంగ్లీషు పరీక్ష అయిపోయింది. తర్వాత లెక్కలు, తమిళం, సామాన్య విజ్ఞాన శాస్త్రం మొదలైనవాటిలో జరిగాయి పరీక్షలు. అన్నీ పన్నెండుకల్లా అయిపోయినాయి. విద్యార్థులంతా మధ్యాహ్నం  భోజనానికి ఇళ్లకు వెళ్లారు. వాళ్లను ఆ నలుగురు పిల్లలూ ఎగాదిగా చూస్తూ నిలబడ్డారు. పరీక్షలు పెట్టిన ఉపాధ్యాయుడు వాళ్లను గదిలోనే కూర్చోబెట్టి, సమాధాన పత్రాలు త్వరత్వరగా దిద్ది, మార్కులు వేశాడు. తర్వాత ప్రధానోపాధ్యాయుని గదికి వెళ్లాడు. అప్పుడు పోర్టరూ వృద్ధుడూ అక్కడికి వచ్చారు. ‘‘పరీక్షలు బాగా రాశారా’’ అడిగాడు పోర్టరు. ‘‘లెక్కలే కష్టంగా ఉన్నాయి.’’

 ‘‘ఇంగ్లీషు?’’ ‘‘చాలా తేలిక.’’

 

 ‘‘హెడ్‌మాస్టరుగారు చెప్పిన ప్రశ్నలే వచ్చాయి. ఒక్క క్షణంలో రాశాను’’ అన్నాడు ఒకడు. మిగిలినవాళ్లూ అన్నారు.‘‘ఇంగ్లీషు కనక బాగా రాస్తే పాసయినట్టే’’ అని పోర్టరు చెపుతూ ఉండగా వృద్ధుడు... ‘‘మా ఊరి పంతులుగారు ఎలాంటివాడని! ఇక్కడేం అడుగుతారో తెలుసుకుని, అక్కడే అన్నీ చెప్పేశాడు. అదీ తెలివంటే’’ అని ఇడైసేవల్ ప్రధానోపాధ్యాయుణ్ని నోరార ప్రశంసించాడు.‘‘అయితే ఆయన ఘటికుడన్నమాట.’’‘‘మరేమనుకున్నావ్. అందుకు తగ్గట్టుగా ఆయన గుణం కూడా బంగారం. ఇలాంటి పంతులుగారు మన వూరికి ఇంతవరకూ రాలేదనుకో. పిల్లలంటే ఆయనకి మహా ప్రేమ. ఆ తర్వాత నువ్వే ఆలోచించుకో’’ అన్నాడు వృద్ధుడు సగర్వంగా. అంతా ఫలితం కోసం ఎదురుచూస్తూ మాటల్లో మునిగిపోయారు.

 

 కొంచెం సేపయ్యింది. పరీక్ష పెట్టిన ఉపాధ్యాయుడు అక్కడికి వచ్చి వృద్ధుణ్నీ పోర్టర్నీ ఆ నలుగురు పిల్లల్నీ ప్రధానోపాధ్యాయుని గదికి తీసుకు వెళ్లాడు. అప్పుడు వాళ్ల సంతోషం మాయమయింది. భయం ఆవరించింది వాళ్లని.  ‘‘ఇలా రండి’’ అంటూ ఒక గదిలోకి తీసుకు వెళ్లాడు. అంతా లోపలికి వెళ్లారు. ప్రధానోపాధ్యాయుణ్ని చూడగానే పోర్టరు నమస్కరించాడు. వృద్ధుడు చేతులు జోడించాడు. కాని చేతులు వణికాయి. పిల్లలు అలాగే నిలబడిపోయారు. ఆశ్చర్యంలో మునిగిపోయిన వాళ్ల కళ్లు పెద్దవైనాయి. తమంతట తామే తెరుచుకున్నాయి నోళ్లు.

 

 కుమారపురం స్టేషన్ నుంచి టాల్‌స్టాయ్ పుస్తకం చేత పుచ్చుకుని తమతో పాటు ప్రయాణం చేసిన ఆయనే ఇక్కడ ప్రధానోపాధ్యాయుడుగా ఆసీనుడై ఉన్నాడు. ఇలా జరుగుతుందని పిల్లలు ఎలా అనుకోగలరు?‘‘రండి’’... నవ్వుతూ ఆయన వాళ్లని ఆహ్వానించాడు. ‘‘పెద్ద పంతులుగారికి దణ్నం పెట్టండి’’ అని పోర్టరు చెప్పిన తర్వాత, వాళ్లు నమస్కరించారు. ‘‘ప్రశ్నలన్నీ కష్టంగా ఉన్నాయా?’’ అని అడిగి, నవ్వాడు సుబ్బరామ అయ్యరు. ఆ నవ్వులోని అందమూ ఆకర్షణా ప్రేమా చూసి ఒక కుర్రవాడి కళ్లు చెమ్మగిల్లాయి. ఆయన అడిగిన ప్రశ్నకు బదులు చెప్పకుండా అలాగే నిలబడిపోయారు.  తర్వాత ‘‘మీ పేరు చెప్పండి’’ అడిగాడు.‘‘నారాయణస్వామి, శ్రీనివాసన్, సుబ్బయ్య, తిరుపతి.’’

 

 ‘‘అంతా పాస్’’ అన్నాడు అయ్యరు. ఆ నలుగురు పిల్లల కళ్లనుంచి ఆనందాశ్రువులు రాలాయి. ‘‘అంతా ఏడో క్లాసులో చేరండి. బాగా చదువుకోండి. ప్రతి పరీక్షలోనూ మంచి మార్కులు తెచ్చుకోవాలి’’ అని, వృద్ధుణ్ని వుద్దేశించి ‘‘మీ పంతులుగారే కాదండీ, ఈ ఊరి ఉపాధ్యాయులు కూడా తండ్రి వంటి వాళ్లే. అంతేనా?’’ అని నవ్వుతూ అడిగాడు అయ్యరు.‘‘అందులో సందేహం ఏముందండీ’’ అన్నాడు వృద్ధుడు తన సహజ ధోరణిలో. మళ్లీ నమస్కరించాడు.సుబ్బరామ అయ్యరు మందహాసం చేశాడు. ‘‘వెళ్లి రండి’’ అని వాళ్లను పంపించిన తర్వాత కూడా ఆయన మనస్సులో కుమారపురం స్టేషను మెదలసాగింది. తనలో తాను ‘అది పెద్ద బడి’ అనుకున్నాడు సుబ్బరామ అయ్యరు.  

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top