కొసరాజుతో రోజులు మారాయి...

కొసరాజుతో రోజులు మారాయి... - Sakshi


నా పాట నాతో మాట్లాడుతుంది...

ఏ పాటైనా రాయగలిగిన - రాస్తున్న నిన్ను ‘విప్లవకవి’ అన్నట్టే- అటు ‘జయమ్ము నిశ్చయమ్మురా’, ఇటు ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ రాసినా నా తండ్రిని సినీజానపద కవి సార్వభౌముడనే అంటారు తేజా.. అంటూ మొదలెట్టింది కొసరాజు పాట.

 మహాకవిగా గుర్తింపు వచ్చాక సినీకవి అయినాడు కొసరాజు. 1931లోనే జమీందారులకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం మొదలై, దానికి నాయకత్వం వహిస్తున్న కొసరాజు మునిస్వామి నాయుడి ప్రోత్సాహంతో ‘కడగండ్లు’ రైతు గేయాలు రాశారు.

 

పింగళి లాగే 1930 దశకంలో సినీరంగంలో అడుగుపెట్టి వెనక్కివెళ్ళి, మళ్ళీ 1950 దశకంలో వచ్చి విజృంభించిన కొసరాజు అస్మదీయ జనకులు.

 మాటల రచయిత డి.వి.నరసరాజు పట్టుదలతో, మహా దర్శకుడు కె.వి.రెడ్డి ‘పెద్దమనుషులు’ చిత్రానికి 1952లో మూడు పాటలు రాయడం, ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో కొసరాజు కలంబలం తెలిసింది. అయితే, ‘రోజులు మారాయి’ సినిమాలో ఏడు పాటలు రాయడంతో కొసరాజు రోజులు మారిపోయాయి’ అంది కొసరాజు పాట.

 

600 చిత్రాల్లో 870 పాటలు రాశారు కొసరాజు. 1986 అక్టోబర్ 27న సురేష్ ప్రొడక్షన్స్ ‘గురుబ్రహ్మ’కు బుర్రకథ రాసిన రాత్రే కన్నుమూశారు.

 ‘మూగమనసులు’లో ‘గౌరమ్మా నీ మొగుడెవరమ్మ’ పాటలో ఒక దగ్గర ‘అది పెళ్లామంటే చెల్లదులే పళ్లు పదారు రాలునులే’ అని రాశాడు. పళ్లు 32 కదా 16 అని ఎందుకు రాశాడు! ‘పళ్లు’ ‘పదారు’ యతి కోసమని కొందరు చర్చించారట. యతి కోసమో, ప్రాస కోసమో కాదు ‘పదహారు’ సంఖ్య నూతన యవ్వనాన్ని సూచించే వయస్సుకు సంబంధించింది. పదహారేళ్ల మీద ఎన్నో పాటలు వచ్చాయి.

 ‘పదారు పళ్లురాలునులే’ అంటే నీ పడుచు పొగరు దించేస్తా అన్నది లోతైన అర్థం. సాహిత్యాన్ని, సమాజాన్ని, జీవితాలను కాచి వడబోసిన కవిఋషి తాత్త్వికుడు కొసరాజు. పద్యాలు, చారిత్రక కావ్యాలు, ద్విపద కావ్యాలు, బుర్రకథలు, లఘు కావ్యాలు, వ్యంగ్యం, తాత్వికత కలగలసిన సినీగీతాలు, ‘రైతుజన విధేయ రాఘవయ్య’ అంటూ ఆటవెలదులను రచించిన నా తండ్రిని కేవలం ‘జానపద సినీకవి’ అంటే నాకు చిర్రెత్తిపోదూ అంది కొసరాజు పాట.

 

నేను ఆ పాటను సేదదీర్చి, ‘తల్లీ, నీవే సినీగీతానివి’ అంటే నేను 1957లో తోడికోడళ్లు చిత్రంలోని ‘ఆడుతుపాడుతు పనిచేస్తుంటే’ పాటను అంది గారాబంగా - గర్వంగా.

 తోడికోడళ్లు చిత్రం సంగీతం మాస్టర్ వేణు

 మహానటీనటులు అక్కినేని - సావిత్రి

 సందర్భం నీళ్లు పొలానికి చేతులతో ఎత్తిపోయడం. దోసిళ్లతో కాదు దొన్నెతో- దాన్ని గూడేయటం అంటారు. దాని కోసం ఏయన్నార్, సావిత్రి కొంత శిక్షణ కూడా తీసుకున్నారు. అత్యంత సహజంగా తెరకెక్కించారు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు. గూడేస్తున్న సందర్భంలో పాట కావాలి. అందరి చూపు కొసరాజుపైనే -

 

శ్రమ సౌందర్యాన్ని లలిత శృంగారంలో రంగరించి రాయగల విలువ తెలిసిన నెలరాజు, కవితల రాజు కదా కొసరాజు. ఇంక మొదలైంది. అలవోకగా, అవలీలగా కవిరాజు చేతిలో...

 ‘ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నట్లు రాయగూడదు నాన్నా’ అన్నాను నేను. శభాష్ అంటూ అలాగే మొదలెట్టాడు. పాడేది భార్యాభర్తలు.. భర్త సాన్నిధ్యంలో ఉంటే కైలాసాన్నైనా మోయగలిగే బలవంతురాలవుతుంది సుకుమారమైన భార్య కూడా. అలాగే భార్య పక్కనే ఉంటే ఎంత పనైనా ఎడం చేత్తో అలుపుసొలుపు లేకుండా చేయగలడు భర్త.

 

ఇంకేముంది పల్లవి పూర్తయింది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపూ సొలుపే మున్నది/ ఇద్దరమొకటై చేయికలిపితే ఎదురేమున్నది. మనకు కొదవేమున్నది.

 ఇంక చరణం -

 ‘గూడేస్తున్న చెలి ఒంపులు ఒయ్యారం ఊగుతూ.... విసురుతూవుంటే ఆమె గాజుల శబ్ద సంగీతం అలవాటైన భర్త గుండెఝల్లుమనిపించదూ’ అలా వెళ్లూ అన్నాను క్షణంలో చరణం పూర్తి చేశాడు.

 

ఇంక ఏదో కొత్తగా చెప్పాలి ఈ శ్రమసౌందర్యాన్ని అపురూపంగా అపూర్వంగా చెప్పాలి. ఒకసారి కుంకుమశోభతో మెరిసే సావిత్రి నుదురు నెలవంకనూహించుకో అన్నాను. వెంటనే నా తండ్రి కొసరాజుకు చెమటతో తడిసి చెదిరే కంకుమ రేఖ జారి పెదలవులపై మెరిసినట్టనిపించి

 ‘‘చెదరి జారిన కుంకుమ రేఖలు

 పెదవులపైన మెరుస్తువుంటే

 తీయని తలపులు నాలో ఏవో

 తికమక చేస్తువున్నవి’’ అని పూర్తి చేశాడు. ఈ చరణమే ఒక శ్రమ సౌందర్యానందలహరిలా లేదూ అంది పాట-

 జోహర్ తాతా! కొసరాజా అన్నాను.

 అలా నన్ను అందంగా తీర్చిదిద్ది ఆదుర్తి, మాస్టర్ వేణు ద్వారా మీకొదలి తాను వెళ్ళిపోయాడంటూ ‘రసవన్నగం’లా నా రస హృదయంలో ఘనీభవించింది.             

- డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top