పారిశ్రామిక హాలికుడు

పారిశ్రామిక హాలికుడు - Sakshi


లక్ష్మణరావు కిర్లోస్కర్

 మన దేశంలో ఆధునిక వ్యవసాయ పరికరాలకు పర్యాయపదం కిర్లోస్కర్. అధునాతన పరిజ్ఞానాన్ని మన దేశంలోని రైతులకు అందుబాటులోకి తెచ్చిన తొలితరం పారిశ్రామికవేత్తల్లో అగ్రగణ్యుడు లక్ష్మణరావు కిర్లోస్కర్. వ్యవసాయ రంగంలో శతాబ్దాల నాటి పద్ధతులనే అనుసరిస్తూ కుదేలవుతున్న రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచిన పారిశ్రామిక హాలికుడు ఆయన. పారిశ్రామిక రంగంలో వ్యాపార విస్తరణకు, లాభార్జనకు మాత్రమే పరిమితమైపోకుండా, అస్పృశ్యత వంటి సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి తన వంతుగా సంఘ సంస్కరణలకు కూడా దోహదపడ్డ దార్శనికుడు ఆయన.

 

 జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో విద్యాభ్యాసం

 భారతదేశంలో ఆధునిక వ్యవసాయానికి మూలపురుషుడు అనదగ్గ లక్ష్మణరావు కిర్లోస్కర్ 1869 జూన్ 20న అప్పటి మైసూరు, ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లా గుర్లాహోసూరు అనే కుగ్రామంలో జన్మించారు. పాఠశాల చదువు పూర్తయ్యాక 1885లో బాంబేలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో పెయింటింగ్ కోర్సులో చేరారు. చిత్రలేఖనంతో పాటు యంత్రపరికరాలపై మక్కువ ఉండటంతో మెకానికల్ డ్రాయింగ్ విభాగానికి మారారు. మెకానికల్ డ్రాయింగ్‌లో పట్టభద్రుడైన తర్వాత విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో అధ్యాపకుడిగా చేరారు.

 

 అప్పట్లో ఆయన నెల జీతం నలభై ఐదు రూపాయలు. ఉద్యోగం చేస్తూ పొదుపు చేసుకున్న సొమ్ముతో 1890లో సైకిల్ డీలర్‌షిప్ తీసుకున్నారు. బాంబే నుంచి సైకిళ్లను తీసుకొచ్చి బెల్గాంలో విక్రయించేవారు. సైకిల్ తొక్కడం నేర్పినందుకు ఒక్కొక్కరి నుంచి పదిహేను రూపాయలు వసూలు చేసేవారు. అప్పట్లో సైకిళ్ల ధరలు ఒక్కొక్కటి ఏడువందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉండేవి. కొంతకాలానికి బెల్గాంలో సైకిల్ రిపేర్ షాపును  కూడా ప్రారంభించారు. బెల్గాంలో ఆ సైకిల్ షాపు ఉండే ప్రాంతాన్నే ఇప్పుడు కిర్లోస్కర్ రోడ్డుగా పిలుస్తున్నారు.

 

 దేశీ విపణిలోకి తొలి ఇనుప నాగలి..

 వ్యవసాయ రంగంలో యంత్రాల వాడుకకు గల అవకాశాలను, అవసరాలను లక్ష్మణరావు కిర్లోస్కర్ అప్పట్లోనే గుర్తించారు. తొలి ప్రయత్నంగా బెల్గాంలో ఒక చిన్న పరిశ్రమను ఏర్పాటు చేసి గడ్డిని కోసే యంత్రాన్ని, ఇనుప నాగలిని తయారు చేశారు. అంతకు ముందు చెక్క నాగళ్లతోనే రైతులు తంటాలు పడేవారు. ఆ రోజుల్లో ఇనుప నాగలి వాడితే సాగుభూమి విషపూరితమైపోతుందనే మూఢనమ్మకం ఉండేది.

 

  రైతులు మొదట్లో ఇనుప నాగలిని కొనేందుకు ఏమాత్రం సుముఖత చూపలేదు. రెండేళ్లు తంటాలు పడి రైతుల చుట్టూ తిరిగి ఒక్క ఇనుప నాగలిని మాత్రమే విక్రయించగలిగారు కిర్లోస్కర్. పరిస్థితి అంత నిరాశాజనకంగా ఉన్న తరుణంలోనే కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన స్థలాన్ని ఖాళీ చేయాల్సిందిగా బెల్గాం మునిసిపాలిటీ కిర్లోస్కర్‌ను ఆదేశించింది. చేతిలో సొమ్ము కరిగిపోయి, దాదాపు వీధిన పడ్డ స్థితిలో మిగిలారు ఆయన. కష్టాల కడలిలో చిక్కుకున్న కిర్లోస్కర్‌కు అప్పటి ఔంధ్ పాలకులు అండగా నిలిచారు. కర్మాగారం ఏర్పాటుకు స్థలం ఇవ్వడంతో పాటు పదివేల రూపాయలు రుణ సాయం అందించి ప్రోత్సహించారు.

 

 మలుపు తిరిగిన చరిత్ర

 ఔంధ్ పాలకుల ఆసరాతో కిర్లోస్కర్ చరిత్ర మలుపు తిరిగింది. కుందాల్‌రోడ్డులోని రైల్వేస్టేషన్‌కు చేరువలో కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ పేరిట పరిశ్రమను స్థాపించారు. పరిశ్రమకు అనుబంధంగా ఏర్పడిన టౌన్‌షిప్ కిర్లోస్కర్‌వాడీగా పేరు పొందింది. వ్యవసాయ యంత్రాల ఉత్పత్తుల్లోకి అడుగుపెట్టిన ఈ పరిశ్రమ అనతికాలంలోనే దేశ దేశాలకు శాఖోపశాఖలుగా విస్తరించింది. కంపెనీ ఆస్తుల విలువ రూ.20 వేల కోట్లకు పెరిగింది. జపాన్ కంపెనీ టయోటా భాగస్వామ్యంతో 1997లో కార్ల తయారీ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టింది. కర్ణాటకలోని బిదాడిలో 432 ఎకరాల విస్తీర్ణంలో కార్ల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పారు. ఇందులో ఏటా లక్షకు పైగా కార్లు తయారవుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా కార్లు విక్రయించే సంస్థల్లో టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.

 

 అస్పృశ్యతా నిర్మూలనకు కృషి

 లక్ష్మణరావు కిర్లోస్కర్ కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదు సంఘసంస్కర్త కూడా. కరడు గట్టిన అస్పృశ్యత వంటి దురాచారాలు బలంగా వేళ్లూనుకున్న ఆ కాలంలోనే దానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. కిర్లోస్కర్‌వాడీలో అస్పృశ్యతను నిషేధించారు. పుట్టుకతోనే ఎవరూ చెడ్డవారు కాదు. పరిస్థితుల ప్రభావంతో కొందరు నేరస్తులుగా మారతారు. అలాంటి వారిని ఆదరించి అక్కున చేర్చుకుంటే సన్మార్గంలో పయనిస్తారనే  విశ్వాసంతో నేరస్తులుగా ముద్రపడి సమాజ నిరాదరణకు గురై ఇబ్బందులు పడుతున్న పాత నేరస్తులకు తన కర్మాగారంలో రాత్రి కాపలాదార్లుగా ఉపాధి కల్పించారు. సమానత్వాన్ని ఉపన్యాసాలకు పరిమితం చేయక స్వయంగా ఆచ రించి చూపిన ఆదర్శవాది లక్ష్మణరావు కిర్లోస్కర్.  తమ పారిశ్రామిక ఉత్పత్తుల ద్వారా భారతదేశ వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చివేసిన ఈ మహా దిగ్గజం 1956లో కన్నుమూసింది. ఆయన చిత్రంతో భారతీయ తపాల శాఖ 1969లో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసి గౌరవించింది.

 - దండేల కృష్ణ

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top