దిద్దుబాటు

దిద్దుబాటు


పిల్లల కథ

వీరవర్మ అనే ముక్కోపి అవంతీపురాన్ని పాలించేవాడు. మంత్రులు, సేవకులు తరచూ అతడి ఆగ్రహాన్ని చవిచూస్తుండేవారు. ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతేనన్న సత్యాన్ని గ్రహించిన తెలివిగల మంత్రులు నిత్యం అతడిని పొగడటం అలవాటు చేసుకున్నారు. పొగడ్తల మత్తులో వీరవర్మ నెమ్మదిగా మంత్రుల దారిలోకి వచ్చాడు. కొన్నాళ్లకు పొగడ్తలు విననిదే నిద్రపట్టని స్థితికి చేరుకున్నాడు.

 

ఇలా రోజులు గడుస్తుండగా, వర్షాకాలం వచ్చింది. రాజ్యంలో నదులన్నీ పొంగిపొర్లి వరదలు ముంచెత్తాయి. సహాయక చర్యలు ప్రారంభించేలోగానే, వాటిలో తలెత్తబోయే లోటుపాట్లను కప్పిపుచ్చుకోవడానికి మంత్రులందరూ పొగడ్తలు అందుకున్నారు.

 ‘ప్రభూ! మీ కరుణాకటాక్షాలు ప్రజలపై ఉండబట్టే నదులు కూడా ఆనందంతో ఉప్పొంగి మీకు జేజేలు పలుకుతున్నాయి.. ’ అంటూ స్తోత్రపాఠాలు ప్రారంభించారు

 ఇంతలో వచ్చిన అధికారులు.. వరదల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వీరవర్మకు వివరించారు. సహాయక చర్యలకు కావలసిన పైకాన్ని ఖజానా నుంచి తీసుకు వెళ్లమని ఆదేశించాడు వీరవర్మ.

 

ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు, పంటలు పోగొట్టుకున్న వారికి నష్టపరిహారం, వ్యాధుల బారిన పడ్డ వారికి వైద్య సౌకర్యాలు.. మొత్తానికి వీటి ఖర్చులు ఖజానాపై పెనుభారాన్నే మోపాయి.

 ‘ప్రభూ! వరదలు వచ్చిన వెంటనే మీరు స్పందించే తీరు దేవునికైనా సాధ్యం కాదేమో? ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే రాజాధిరాజులు మీరు!’ అంటూ మళ్లీ పొగిడారు మంత్రులు.. ఆ పొగడ్తకు వీరవర్మ పులకించిపోయాడు.

 

ఏడాది గడచింది. ఇప్పుడు రాజ్యం కరువు బారినపడింది. పంటలు పండలేదు సరికదా, ప్రజలు దాహం తీర్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.

 ‘ప్రభూ! మేఘుడు మీ రాజసానికి అసూయ చెంది పారిపోయాడు. ఈ దుర్భిక్షాన్ని గట్టెక్కించే ధీరులు తమరు మాత్రమే’ అంటూ పొగడ్తలు లంకించుకున్నారు మంత్రులు.

 ‘కరువు నివారణ ఇప్పటికిప్పుడు అసాధ్యం. పొరుగు రాజ్యాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోండి. కావలసిన పైకాన్ని ఖజానా నుంచి తీసుకోండి’ అంటూ ఫర్మానా జారీ చేశాడు వీరవర్మ.

 

దీంతో ఖజానా ఖాళీ అయినా కరువు సమస్య తీరింది.

 యథాప్రకారం పొగడ్తలు అందుకున్నారు మంత్రులు.. వాటిని వీరవర్మ వీనులవిందుగా ఆస్వాదించాడు.

 మరో ఏడాది గడచింది. ఈసారి ప్రకృతి అనుకూలించి, పంటలు బాగానే పండాయి. ఖజానా నింపుకోవడానికి ఇదే తగిన తరుణం అనుకున్న వీరవర్మ ప్రజలపై ఎడాపెడా పన్నులు వడ్డించాడు. ‘పన్ను’పోటుకు ప్రజలు చిర్రెత్తిపోయారు. ప్రజాగ్రహం ముందు మంత్రుల పొగడ్తలు పనిచేయలేకపోయాయి. పరిస్థితి విషమించడంతో వీర వర్మ నేరుగా ప్రజలతో ముఖాముఖి అయ్యాడు.

 

‘ప్రభూ! మొదటి సంవత్సరం వరదల రూపంలో ప్రకృతి మనకు నీరు ప్రసాదించింది. దూరదృష్టితో ఆనకట్టలు నిర్మించి నీటిని నిల్వ ఉంచి ఉంటే, వరంగా మారేది. అలా నిర్మించకపోవడంతో అది శాపమై, నష్టాన్ని మిగిల్చింది. ఆ నీరే నిల్వ ఉంటే రెండో సంవత్సరంలో వచ్చిన కరువుకు తక్షణ నివారణగా ఉపయోగపడేది. ప్రజలకూ నష్టం తప్పేది’ అన్నాడు ఒక పౌరుడు.

 

మరొక పౌరుడు లేచి, ‘ప్రభూ! ప్రభుత్వ సాయం అంతంత మాత్రమేనని మీకు తెలియంది కాదు. అధిక పన్నులు మమ్మల్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టే ప్రమాదం ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఆదుకుంటే ఖజానా ఎప్పటికైనా నిండే అవకాశం ఉంటుంది’ అన్నాడు.

 

విమర్శలన్నీ వీరవర్మకు శూలాల్లా గుచ్చుతున్నాయి. వాటిలో వాస్తవం ఉండటంతో ఆలోచనలో పడ్డాడు. ప్రజాగ్రహం తిరుగుబాటుగా మారక ముందే దిద్దుబాటు చర్యలు చేపట్టాలనుకున్నాడు. పన్నులు తగ్గించాడు. పౌరుల శ్రమశక్తితో రాజ్యాభివృద్ధికి బాటలు వేయడం ప్రారంభించాడు. కొద్దిరోజులకే మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు వీరవర్మ.    

 - బి.వి.పట్నాయక్

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top