నాన్న మెచ్చిన కూతురు!

నాన్న మెచ్చిన కూతురు!


అనంతరం: ప్రపంచమంతా తెలిసిన ప్రముఖ నటుడి ఇంటి తొలి సంతానంగా జన్మించింది క్యాథరీన్. తండ్రి చేయి పట్టుకుని అడుగులు వేయడం నేర్చుకుంది. తండ్రి ఒడిలో కూచునే ప్రపంచాన్ని తెలుసుకుంది. కానీ తండ్రి దారిలో నడవడానికి మాత్రం ఇష్టపడలేదు. నటన కంటే వాస్తవాల మీద ఆసక్తి చూపించింది. రచయిత్రి అయ్యింది. ఇంతకీ క్యాథరీన్ ఎవరో తెలుసా... ఆర్నాల్డ్ ష్వార్‌‌జ నెగ్గర్ ముద్దులపట్టి!

 

 క్యాథరీన్ గురించి మాట్లాడేటప్పుడు ఆర్నాల్డ్ మాటల ప్రవాహానికి ఆనకట్ట వేయడం కాస్త కష్టమే. కూతురి గురించి గుక్క తిప్పుకోకుండా చెబుతారాయన. తొలిసారి చేతుల్లోకి తీసుకున్న క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నప్పుడు ఆర్నాల్డ్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది.  ‘‘నేనెప్పుడూ ఇది చెయ్యి అని క్యాథీకి చెప్పలేదు. ఏం చేయాలో తనే నిర్ణయించుకుంది. తానేం చేసినా నేను ప్రోత్సహిస్తానని తనకు తెలుసు. తాను ఏం చేసినా నాకు పేరు తెచ్చే పనే చేస్తుందని నాకూ తెలుసు. అందుకే పెద్దగా కల్పించుకోను’’ అంటారు  మురిసిపోతూ.

 

 హాలీవుడ్ హీరోల పేరు చెప్పమని మన వాళ్లెవరినైనా అడిగితే వెంటనే నోటికొచ్చే పేర్లలో ఒకటి... ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్! టెర్మినేటర్, ప్రిడేటర్ వంటి సినిమాలతో భారతీయుల మనసులను అంతగా దోచారాయన. రాజకీయ నాయకుడిగా, ఇన్వెస్టర్‌గా కూడా ప్రపంచమంతటికీ చిరపరిచితుడైన ఆర్నాల్డ్‌కి నలుగురు పిల్లలు. ఆ నలుగురిలో పెద్దమ్మాయి... క్యాథరీన్. పిల్లలందరూ సమానమే అయినా... తండ్రి అయిన సంతోషాన్ని తొలిసారి రుచి చూపిన క్యాథరీన్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఆర్నాల్డ్‌కి. సాధారణంగా కొడుకు తన అడుగు జాడల్లో నడవాలని తండ్రి కోరుకుంటాడు. అయితే ఆర్నాల్డ్‌కి కొడుకులు ప్యాట్రిక్, క్రిస్టఫర్‌ల మీద కంటే... పెద్ద కూతురు క్యాథరీన్ మీదే నమ్మకం ఎక్కువ. తన ఆలోచనలను, ఆశయాలను నిలబెట్టే సత్తా ఆమెకి ఉందని ఆయన విశ్వాసం. అది నిజమే. క్యాథరీన్ చాలా తెలివైన అమ్మాయి. తండ్రికి మంచి పేరు తీసుకురావాలని తపిస్తుంది. కానీ ఆయన అడుగు జాడల్లో నడవాలన్న ఆలోచన మాత్రం ఆమెకు లేదు.

 

 క్యాథరీన్ తరువాత పుట్టిన ప్యాట్రిక్ మోడల్ అయ్యాడు. ఆ తరువాత నటుడు కూడా అయ్యాడు. కానీ క్యాథరీన్ మాత్రం నటన వైపు మొగ్గు చూపలేదు. అది చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే... ఆమె కచ్చితంగా నటి అవుతుందనే అనుకున్నారంతా. తండ్రే లోకంగా భావించే ఆమె తండ్రి బాటలోనే సాగుతుందని భావించారు. ఆమె అద్భుత సౌందర్యరాశి కావడం, నటి కాదగ్గ అన్ని లక్షణాలూ ఉండటం కూడా అలా అనుకునేలా చేశాయి. కానీ అందరి అంచనాలనూ తల్లకిందులు చేసింది క్యాథరీన్. తండ్రిని అమితంగా గౌరవించినా, కెరీర్ విషయంలో మాత్రం తన తల్లిని అనుసరించింది.  ఆర్నాల్డ్ భార్య, క్యాథరీన్ తల్లి మారియా ష్రివర్‌కి జర్నలిస్టుగా, రచయిత్రిగా మంచి పేరుంది. ఎందుకోగానీ... తండ్రి ఆలోచనల కంటే తల్లి భావాలే క్యాథరీన్‌నే ఎక్కువ ప్రభావితం చేశాయి. అందుకే మాస్ కమ్యునికేషన్స్ చదివింది. కెమెరా ముందుకు రానంటూ కలం పట్టుకు కూచుంది. 2010లో ‘రాక్ వాట్ యు హ్యావ్ గాట్’ అనే పుస్తకం కూడా రాసింది. మహిళలు ఎవరి మీదా ఆధారపడకూడదని, తమకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలని, ఆత్మవిశ్వాసంతో అడుగేయాలని చెబుతూ ఆమె రాసిన ఆ పుస్తకం విమర్శకుల ప్రశంసలు పొందింది.

 

 కూతురిలో అంత మంచి రచయిత్రి ఉందని ఊహించని ఆర్నాల్డ్ ఆశ్చర్యపోయారు. తన కూతురి అభిరుచిని మెచ్చుకున్నారు. ఆమె ఎంచుకున్న బాటలో తాను అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నిజానికి క్యాథరీన్‌కి పుట్టుకతోనే కొద్దిపాటి శారీరక, మానసిక రుగ్మతలు ఏర్పడ్డాయి. ఏడో తరగతి అయ్యేవరకూ చాలా ఇబ్బంది పడింది. ఆ తర్వాత కొద్దికొద్దిగా నిలదొక్కుకుంది. ఇదంతా కూడా ఆమె పట్టుదలతో సాధించింది అంటారు ఆమె గురించి తెలిసినవాళ్లంతా. ఏదైనా కూడా ఎందుకు సాధ్యం కాదు అన్న ప్రశ్న వేస్తుందామె. అనుకోవాలేగానీ చేయలేనిదేమీ లేదు అంటుంది దృఢంగా. అది తల్లి ఇచ్చిన ప్రోత్సాహం. అంతకంటే ముఖ్యంగా తండ్రి ఇచ్చిన ధైర్యం. తన తండ్రి గురించి చెప్పమంటే ఇలా చెబుతుంది క్యాథరీన్. ‘‘నాన్న పెద్ద సెలెబ్రిటీ. ఆయన ఇమేజ్ నన్ను చాలా ఆనందింపజేస్తుంది. కానీ ఆయన ఇమేజ్‌తో నేను ఎదగాలనుకోను. నాకు నేను సంపాదించుకున్న మంచిపేరుతో ఆయన ఇమేజ్‌ని మరింత పెంచాలనుకుంటాను.’’ ఈ ఆత్మవిశ్వాసం క్యాథరీన్ కళ్లలో, బాడీ లాంగ్వేజ్‌లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాన్ని చూసినప్పుడు ఆమె తండ్రి కళ్లలో గర్వం తొంగిచూస్తుంది!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top