స్త్రీ శక్తికి... సృష్టి ఆవిర్భావానికీ సంకేతం...కామాఖ్యాదేవి ఆలయం

స్త్రీ శక్తికి... సృష్టి ఆవిర్భావానికీ సంకేతం...కామాఖ్యాదేవి ఆలయం


అష్టాదశ శక్తిపీఠాలలో అగ్రగణ్యమైనది, శాక్తేయులకు అత్యంత ఆరాధనీయమైనదీ కామరూపాదేవి ఆలయం. పిలవని పేరంటానికి వెళ్లి, కన్నతండ్రి చేత ఘోరపరాభవం పొందిన సతీదేవి, అవమాన భారంతో ఆత్మత్యాగం చేస్తుంది. ఇది తెలిసి, అక్కడకు చేరుకున్న శివుడు విచలిత మనస్కుడై, ఆమె శరీరాన్ని భుజాలమీదకు ఎత్తుకుని రుద్రతాండవం చేస్తుంటాడు. సతీదేవి శరీరం అక్కడ ఉన్నంతసేపూ శివుడిని ఆపశక్యం కాదని తెలిసిన విష్ణువు తన చక్రాయుధాన్ని ఉపయోగించి, ఆమె శరీరాన్ని ఖండఖండాలు చేస్తాడు.



అవి 108 ఖండాలుగా భూలోకంలోని వివిధ ప్రదేశాలలో పడతాయి. ఆమె శరీరంలోని కీలకమైన భాగాలు పడిన ప్రదేశాలలో తిరిగి అత్యంత కీలకమైన ప్రదేశాలను గుర్తించి, ఆలయాలు నిర్మించారు పూర్వులు. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధిచెందాయి. వాటిలో అమ్మవారి యోనిభాగం నీలాచలం కొండలపై పడింది. అదే కామాఖ్యా పీఠంగా గుర్తింపు పొంది, కామాఖ్యాదేవి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడే దశమహావిద్యలనే పేరు గల కాళి, తార, భువనేశ్వరి, బగళాముఖి, ఛిన్నమస్త, భైరవి, ధూమావతి, కమలాంబిక, షోడశి, మాతంగి అనే పది వేర్వేలు ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయమూ ఒక్కో విద్యకు ప్రసిద్ధమైనది. ప్రధాన ఆలయం కామాఖ్యాలయమే.  



మరో కథ: సతీదేవి ఆత్మత్యాగానంతరం తీవ్రమైన వేదనతో తపస్సమాధిలో లీనమై ఉన్న పరమేశ్వరుని  మనస్సును మార్చాలని దేవతలు సంకల్పిస్తారు. ఇందులో భాగంగా మన్మథుడు సమయం చూసుకుని, పూలబాణాలు వేసి, ఆయనకు తపోభంగం కలిగిస్తాడు. దాంతో ముక్కంటి తన మూడవకంటిని తెరచి మన్మథుణ్ణి మసి చేస్తాడు. మన్మథుడికే కాముడు అనే పేరు. కాముణ్ణి దహించిన ప్రదేశం కనుక దీనికి కామాఖ్య అనే పేరొచ్చిందంటారు. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహంతో మన్మథుడు తిరిగి రూపాన్ని పొందాడు. అయితే కేవలం ఆయన భార్య రతీదేవికి మాత్రమే రూపంతో కనిపిస్తాడు. ఇక్కడి బ్రహ్మపుత్రానదిలో భస్మకూటమనే పర్వతం ఉండటం శివుడు మన్మథుని భస్మం చేయడం, తిరిగి ఆయన రూపం పొందాడనడానికి ప్రతీకగా నిలుస్తుంది.



ప్రత్యేకతలకు ఆలవాలం: ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న ఈ ఆలయం 16వ శతాబ్దంలో అన్యమతస్థుల దాడుల్లో ధ్వంసం కాగా, 17వ శతాబ్దంలో కుచ్‌ బీహార్‌ రాజు నరనారాయణుడు పునర్నిర్మించాడని శాసనాధారాలున్నాయి. తేనెపట్టు ఆకారంలో ఉన్న ఆలయ శిఖరం గణేశుడు తదితర దేవీ దేవతల శిల్పాలతో కనువిందు చేస్తుంది. మాంత్రికులకు, తాంత్రికులకు, వామాచారులకు, క్షుద్రపూజలు చేసేవారికి ఈ ఆలయమే ఆధారం. కారణం ఇది సతీదేవి యోని భాగం పడిన ప్రదేశం. కాబట్టి అమ్మవారు అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. మూడు మంటపాలుగా నిర్మించి ఉంటుంది.



అందులో మొదటి ప్రాకారంలో గుహలా ఉండే గర్భాలయంలో యోనిచిహ్నం ఉన్న నల్లటి బండరాయి ఉంటుంది. దానికే పూజలు జరుగుతాయి. అయితే ఆ రూపం కనిపించకుండా భక్తుల దర్శనానికి ముందే పూలతో నింపేస్తారు. ఆ గుహలోపల రాతి మీద ఎప్పుడూ జల వూరుతూ ఉంటుంది. అందువల్ల మూలవిరాట్టు ఎప్పుడూ తడిగా ఉంటుంది. గర్భాలయం అంతా చిత్తడిగా, జారుడుగా ఉంటుంది. ఆలయం బయటే శీతలాదేవి సన్నిధి ఉంటుంది. దీర్ఘవ్యాధులు ఉన్నవారు ఈమెను సేవించుకుంటే వాటినుంచి విముక్తి కలుగుతుందని ప్రతీతి. రెండవ మండపం చతురస్రాకారంలో, సువిశాలంగా ఉంటుంది. అదే అమ్మవారు కొలువై ఉన్న గుహాంతర్భాగంలోకి దారితీస్తుంది.



పూజలు– ఉత్సవాలు: అమ్మవారికి రోజూ చేసే పూజలు గాక దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా దుర్గాపూజ జరిపిస్తారు. ఇవిగాక ఫాల్గుణ మాసంలో దుర్గాడియుల్‌ అని దుర్గాదేవికి ప్రత్యేక పూజ ఉంటుంది. అదేవిధంగా  మానసాపూజ, పోహన్‌ బియా అంటే పుష్యమాసంలో కామేశ్వరుడికీ, కామేశ్వరీదేవికీ కల్యాణం జరిపిస్తారు. అదేవిధంగా చైత్రమాసం రాగానే, వసంత రుతు ఆగమనానికి సంకేతంగా వసంతపూజ జరుగుతుంది. ఇదే మాసంలో మదన డియుల్‌ అంటే కామదేవతకీ, కామదేవుడికీ పూజ జరుగుతుంది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top