బంగారంలాంటి మనసు!

బంగారంలాంటి మనసు!


ఆమె సుపరిచిత ఉద్యమకారిణి కాదు.ఉపన్యాసకురాలు అంతకంటే కాదు.ఒకమంచి పనిచేయడానికి ఉద్యమించే స్వభావం, ఉర్రూతలూగించే ఉపన్యాస చాతుర్యం అవసరమే కావచ్చుగానీ అవి లేకపోయిన ‘చిత్తశుద్ధి’, ‘నిబద్ధత’ ఉంటే చాలు నిశ్శబ్దంగా కూడా సమాజానికి పనికొచ్చే మంచి పని చేయవచ్చని నిరూపించారు కాజల్‌ రాయ్‌.ఛత్తిస్‌ఘడ్‌ రాష్ట్రం జష్పూర్‌ జిల్లాలోని సన్నా గ్రామానికి చెందిన కాజల్‌ వార్డ్‌ మెంబర్‌. ఊళ్లో సగానికి మందికి పైగా ‘బహిరంగ మలవిసర్జన’ అలవాటు ఉంది. ఈ అలవాటును మాన్పించడానికి ఒక తనవంతుగా ఏంచేయాలి? అని ఆలోచించి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయడం ప్రారంభించింది.ఆమె ప్రచారం కొద్దిమందికి నచ్చింది.



కొద్దిమందికి చాదస్తంగా అనిపించింది.నచ్చిన వాళ్లు అప్పో సప్పో చేసి మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. నచ్చని వాళ్లు మాత్రం వెటకారం చేయడం, సాకులు వెదకడం ప్రారంభించారు. ‘సర్కార్‌కేం? ఎన్నయినా చెబుతుంది. మా దగ్గర డబ్బు ఉండద్దూ’ అని కొందరంటే...‘మా తాతముత్తాతలు పొద్దున లేచి వనాలకే పోయారు. మేమూ అదే చేస్తున్నాం. కొత్తగా ఇదేమిటి?’ అని కొందరు దీర్ఘాలు తీశారు.అందరికీ ఓపికగా సమాధానం చెప్పింది కాజల్‌. ‘బహిరంగ మలవిసర్జన’ అలవాటు పూర్తిగా తొలగిపోవాలనే మన లక్ష్యం విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరు పూనుకోవాలి అని చెప్పింది.



‘మరుగుదొడ్డి అంటే నాలుగు గోడల నిర్మాణం కాదు... మన ఆత్మాభిమానానికి నిలువెత్తు ప్రతీక’ అని ఆమె చెప్పిన మాట చాలామందిని సూటిగా తాకింది.‘‘నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఇంటి దగ్గర మరుగుదొడ్డి కట్టుకోవాలని నాకు కూడా ఉంది. కాని మా పరిస్థితి నీకు తెలుసు కదా తల్లీ’’ అన్నారు కొందరు.అప్పుడు ఆలోచనలో పడిపోయింది కాజల్‌.ప్రార్థించే పెదవులతో పాటు సహాయం చేసే చేతులు కూడా కావాలి. అప్పుడు ఆమెలో ఒక కొత్త ఆలోచన చోటు చేసుకుంది.



‘బహిరంగ మలవిసర్జన మానండి. మరుగుదొడ్లు కట్టుకోండి’ అని పదేపదే పోరే బదులు ‘నా దగ్గర ఇంత డబ్బుంది. మీకు సహాయపడగలను’ అని చెబితే బాగుంటుంది కదా అనుకుంది. కాని తన దగ్గర మాత్రం డబ్బులు ఎక్కడివి?వెంటనే తన దగ్గర ఉన్న నగలు గుర్తుకువచ్చాయి. వాటిని తాకట్టు పెట్టడం ద్వారా వచ్చిన సొమ్ముతో గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించడానికి అవసరమైన సహాయం చేయడానికి  రంగంలోకి దిగింది. ముందు తన వార్డ్‌ నుంచి పని మొదలుపెట్టింది. ఇప్పటి వరకు వందకుపైగా టాయిలెట్ల నిర్మాణానికి అవసరమైన సహాయాన్ని అందించింది కాజల్‌ రాయ్‌.



కాజల్‌ గురించి విన్న జిల్లా ఉన్నతాధికారులు ఆమెకు ‘నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌’లో భాగంగా ఇటుకల తయారీలో శిక్షణలను ఇప్పించారు. తాను నేర్చుకున్న విద్యను ఇతర మహిళలకు కూడా నేర్పించి టాయిలెట్లు నిర్మించుకోవాలనుకునేవారికి అవసరమైన ప్రాథమిక వస్తువులను తయారుచేసుకోవడానికి వీలు కల్పించింది కాజల్‌.ఇటుకల తయారీ మాత్రమే కాదు... సొంతంగా టాయిలెట్‌లు నిర్మించుకోవాలనుకునేవారికి, స్టెప్‌ బై స్టెప్‌ ఎలా నిర్మించుకోవాలో నేర్పించింది కాజల్‌.



‘‘నగలు తాకట్టు పెట్టి నువ్వు చాలా పిచ్చి పని చేశావు’’ అంటూ బాధ పడ్డారు  చుట్టాలు పక్కాలు.‘‘గవర్నమెంట్‌ నీకు మంత్రి పదవి ఏమైనా ఇస్తుందా ఏమిటి?’’ అని ఆటపట్టించే ప్రయత్నం చేశారు కొందరు.నగలు తాకట్టు పెట్టినందుకు బాధపడలేదు.సూటిపోటి మాటలకు వెనకడుగు వేయనూ లేదు.‘‘నేను చేసిన పని వల్ల మంచి జరిగితే చాలు’’ అనుకుంది కాజల్‌.ఒక వార్డ్‌ మెంబర్‌గా కాజల్‌ రాయ్‌ పేరు సన్నా గ్రామానికి మాత్రమే తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం జష్పూర్‌ జిల్లాతో పాటు ఛత్తిస్‌ఘడ్‌ రాష్ట్రం మొత్తానికి ఆమె పేరు సుపరిచితం అయింది.‘‘నా మెడలో ఉన్న హారం కంటే... నా గ్రామంలో ఉన్న మరుగుదొడ్డిని చూసి గర్వపడతాను’’ అంటున్న కాజల్‌ రాయ్‌ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top