విషాదం నుంచి ప్రేమలోకి !

విషాదం నుంచి ప్రేమలోకి !


హృదయం: అంతులేని డబ్బున్నపుడు పంచుకోవడానికి అందరూ ఉంటారు. అంతులేని విషాదం ఉన్నపుడు పంచుకోవడానికి మిగిలి ఉండేవారు అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్లు బాధను పంచుకుని ప్రేమను ఇచ్చినపుడు జీవితాలు ఎంత ఆనందంగా ఉంటాయో ఈ కుటుంబం చెబుతుంది.

 

 జోయ్ వాల్కో! అంతవరకు అక్షరం ముక్క రాయని ఈ వ్యక్తికి చెప్పడానికి ఎన్నో విషయాలున్నాయి. అవి సంతోషాలు కాదు. ఎడతెగని భావోద్వేగాలు. హృదయంలోంచి తన్నుకువస్తున్న ఆ ఫీలింగ్స్ బ్లాగులో అక్షరాలుగా మారుతున్నాయి. ఆయన రచయిత కాదు, కేవలం విధి బాధితుడు. పెళ్లయ్యాక, ఇద్దరు పిల్లలు పుట్టాక సంతోషంగా నడుస్తున్న జోయ్ జీవితంలో పెను విషాదం.

 

 ఆనందాలకు కేంద్రబిందువు వంటి జోయ్ భార్యకు కేన్సర్. ఆ విషాద వార్తను జీర్ణించుకునేలోపే ఆమె తనను విడిచి వెళ్లిపోయింది. ఆమెతో పాటే సర్వ ఆనందాలు పోయాయి. అనూహ్యంగా కలిగిన ఆ ఒంటరితనపు అనుభవాలు బ్లాగులో జోయ్ రాస్తుంటే... మరోవైపు ఆ బ్లాగు పాఠకురాలు అయిన కిమ్‌బ్రన్సన్‌కు తన జీవితం గురించి చదువుకుంటున్నట్ల్లే ఉంది! నిజానికి ఆమెకు ఆ బ్లాగు గురించి తెలియదు. కానీ ఓ ఫ్రెండు ద్వారా తెలుసుకుని చదవడం మొదలుపెడితే తనలో తనే మాట్లాడుకుంటున్నట్ల అనిపించింది ఆమెకు. కిమ్ బ్రన్సన్‌ది కూడా సరిగ్గా జోయ్ పరిస్థితే. అచ్చం అలాంటి జీవితమే ఆమె అనుభవిస్తోంది. చిత్రమైన విషయం ఏంటంటే.. కిమ్ భర్త కూడా కేన్సర్‌తోనే చనిపోయాడు. జోయ్ భార్య, కిమ్ భర్త...ఇద్దరూ ఒకే సమయంలో చనిపోయారు!

 

  వారి అంత్యక్రియలు కూడా ఒకేచోట జరిగాయి. ఇద్దరికీ ఇద్దరు పిల్లలున్నారు. అక్కడ భార్యను పోగొట్టుకుని జోయ్ బాధపడుతుంటే, ఇక్కడ భర్తను పోగొట్టుకుని కిమ్ బాధపడుతోంది. అందుకే జోయ్ చెబుతున్న విషయాలు తను చెప్పాలనుకుంటున్న విషయాల్లాగే ఉన్నాయి. ఆ బ్లాగు చదువుతుంటే తన బాధలను చెప్పుకోవడానికి, జీవితం వెతుక్కోవడానికి ఒక వ్యక్తి దొరికిన ఫీలింగ్ కలిగింది కిమ్‌కు. అయితే ఆమె పూర్తిగా జోయ్‌తో కనెక్ట్ అవడానికి ఏడాది సమయం పట్టింది. ఆ ఏడాదిలో తమ జీవితాలు ఎంత దగ్గరగా ఉన్నాయో కిమ్ బ్రన్సన్‌కు స్పష్టంగా అర్థమైంది. చివరకు బ్లాగు ద్వారానే అతడిని పరిచయం చేసుకుంది. ఓ సాయంత్రం ఇద్దరూ నేరుగా కలుసుకున్నారు. ఇపుడు ఒక బ్లాగరు, ఒకరు రీడరు కాదు వాళ్లు. ఇద్దరు ఒంటరులు. జీవితంలో ఎక్కడైనా మనసు బరువు దించే ప్రేమ దొరుకుతుందేమో అని వెతుకుతున్న ప్రేమబాటసారులు.

 

 ‘‘నేను మీ బ్లాగులో నా జీవితాన్ని చూసుకున్నాను’’ అని జోయ్‌తో అంది కిమ్. అతడు ఆమెను అర్థం చేసుకోగలిగాడు. ఇద్దరి పిల్లలు టీన్స్‌లో ఉన్నారు. అమ్మ ప్రేమను మిస్సయిన క్లారీ, ఎమిలీకి, తండ్రి ప్రేమను మిస్సయిన జేక్, ట్రెవోర్‌లకు... జీవితంలో తోడును కోల్పోయిన జోయ్-కిమ్‌లకు... అందరికీ ఒకటవాలనిపించింది. ఏడాది పాటు ఎన్నోసార్లు, ఎన్నో సాయంత్రాలు, ఎన్నో విందుల అనంతరం... వారిదొక  అందమైన కుటుంబం అయింది. అందమైన ఇల్లయింది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top