మైలపడి పోయెనోయి- నీ మనుజ జన్మ!


తపాలా: మా పిల్లలకు చిన్నప్పుడే తెలుగుభాషపై అభిరుచి, అభిమానం ఏర్పడాలని కొంత ప్రయత్నించాను. దానికోసం  ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి తేలికైన పద్యాలను పాడి, తాత్పర్యాలను బోధించేవాణ్ని. వారికి చిన్నపోటీకూడా పెట్టేవాణ్ని. ఎవరు ఎక్కువ పద్యాలు రాగయుక్తంగా, భావయుక్తంగా పాడితే ‘ఇంత’ డబ్బు ఇస్తాననేవాణ్ని. అలా జాషువా, పోతన పద్యాలను కూడా కంఠతా పట్టించాను. ఈ కార్యక్రమమంతా మా పిల్లలు ప్రాథమిక పాఠశాల చదువులప్పుడే జరిగింది. హైస్కూలు చదువు కూడా అయిపోయి కాలేజీలో చేర్పించే సమయమొచ్చి మా అబ్బాయిని గుంటూరులో చేర్పించాను. ఎలాగూ ఇంత దూరం వచ్చాం. పాపయ్యశాస్త్రిగారిని చూసి పోవాలన్న కోరిక ఎన్నాళ్లనుండో ఉండటంతో, అప్పుడక్కడే ‘వార్త’ పత్రిక చీఫ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న మిత్రుడు పున్నా కృష్ణమూర్తితో మనసులోని మాట చెప్పాను.‘వెళ్దాం పదండి; నేనూ వారిని ఎన్నడూ చూడ్డం పడనేలేదు’ అన్నాడు. ముగ్గురమూ వెళ్లాం. బహుశా అది లక్ష్మీపురమయ్యుంటుంది. రైలుకట్ట అవతలుంది.

 

 శాస్త్రిగారు ఇంట్లోనే ఉన్నారు. నమస్కరించా!

 ‘‘అయ్యా! నేను నల్లగొండ జిల్లా నుండి వచ్చాను. మాకు ఖమ్మం అతి దగ్గరగా ఉంటుంది. వీడు మా అబ్బాయి సిద్ధార్థ. ఇక్కడే చదువుకుంటున్నాడు. వీరు, పున్నా కృష్ణమూర్తి - గుర్రం మల్లయ్యగారి మనవడు - మిమ్ము చూడాలని వచ్చాం’’ అన్నాను. మా పిల్లలకు నేర్పిన వారి పద్యాల గురించి చెప్పాను.

 ‘‘బుద్ధదేవుని భువిలోన పుట్టినావు

 సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమో

 అందమును హత్య చేసెడి హంతకుండ

 మైలపడిపోయెనోయి నీ మనుజ జన్మ!

 దీనితో పాటే, అమ్మచేతి తాలింపు కమ్మదనము - భరతదేశాన గుమగుమ పరిమళించెనన్న పద్యమూ, జాషువాగారి గబ్బిలంలోని పద్యాలూ, ఫిరదౌసిలోని పద్యాలు కూడా కొన్నింటిని కంఠతా పట్టించాను’’ అన్నాను.

 అప్పుడు శాస్త్రిగారు ఓ ఉదంతం చెప్పారు. అదే ఇప్పుడు మీకు చెబుతున్నది. ‘‘నన్ను తెలుగు అకాడెమీవారు సత్కరించడం కోసమని, అకాడెమీ డెరైక్టరుగారు ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చారు. అకాడెమీ కార్యక్రమాల గురించి, విశ్వవిద్యాలయపు తీరుతెన్నుల గురించి అనేక విషయాలు మాట్లాడాక, అతిథికి కాఫీ ఇవ్వడం కోసమని ఇంట్లోకి వెడుతూ, నా ఎడల వారి అభిమానానికి గుర్తుగా ఓ గులాబీని అందించాను. అప్పటికే నా భార్య కాలం చేసింది. అందువల్ల నేను కాఫీ చేసి పట్టుకురావడానికి కొంత సమయం తీసుకుంది.

 

 ఆశ్చర్యం, వారి వద్ద నేనిచ్చిన గులాబీ జాడ కనిపించనే లేదు. కాడ మటుకు టీపాయ్ మీద ఉంది. నేను గ్రహించిందేమంటే, వారు గులాబీ ఒక్కొక్క రేకును వలిచి నమిలి మింగేశారని! నా మొహం వివర్ణమైపోయింది. నాకు పువ్వుల ఎడ ఉన్న ఆర్ద్రతను ‘పుష్పవిలాపం’లో చెప్పానన్న విషయం నా అతిథికి తెలియనిది కాదు. అయినా ఇలా జరిగిందేమిటన్న ఆలోచన నన్ను ప్రశాంతంగా ఉండనీయలేదు’’ అన్నారాయన. పువ్వుల్ని ప్రేమించలేనివాడు తాడితుల్ని, పీడితుల్ని ఏం ప్రేమిస్తాడని ‘పుష్పవిలాపం’ పద్యాల ద్వారా చెప్ప ప్రయత్నించానని ముగించారు.

 

 మా అమ్మ

 ముక్కు గట్టిగా

 వుండాలి స్వామీ!

 

 మా తమ్ముడు బెంగళూరు లో ఉంటాడు.

 నేను, మా బాబు రిషి, వేసవి సెలవుల్లో బెంగళూరు వెళ్లాం. మా తమ్ముడికి నాలుగేళ్లు బాబు ఉన్నాడు. వాడి పేరు అక్షయ్.

 అక్షయ్ పుట్టినరోజున కొత్త బట్టలు వేసి, హారతి ఇస్తుంటే, ‘‘నేను దేవుడినా? నాకు హారతి ఇస్తున్నారు’’ అన్నాడు. మేమెంతో ఆశ్చర్యపోయాం.

 అక్షయ్‌కు వాళ్ల అమ్మ ముక్కు పట్టుకోవటమంటే ఎంతో ఇష్టం. వాళ్ల పక్కింటివాళ్లలో ఒకరు, ‘మీ అమ్మ ముక్కును నేను తీసేసుకుంటాను’ అని సరదాగా అన్నారు. వెంటనే వాడు కొంచెం దిగాలుగా దేవుడి గదిలోకి వెళ్లి, ‘‘మా అమ్మ ముక్కును స్ట్రాంగ్‌గా చేసి ఆంటీ తీసుకువెళ్లకుండా చూడు స్వామీ’’ అని నమస్కరిస్తుంటే, మా అందరికీ నవ్వు ఆగలేదు.

 అక్షయ్‌తో నేను ఆడుకుంటున్నప్పుడు మా ఇద్దరి తలలు ఢీ కొట్టుకున్నాయి. మరునాడు, ‘‘చూడు అక్షయ్, నా తల వాచిపోయింది’’ అని నేనంటే, వాడు వెంటనే, ‘‘వాచి పోయిందా? వాచ్ పోయిందా?’’అనగానే, వాడి రైమింగ్ వర్డ్స్‌కు ఆశ్చర్యపడి నవ్వుకున్నాం.

 - విజయశంకర్

 ద్రాక్షారామం

 - గుడిపూడి సుబ్బారావు

 మలక్‌పేట, హైదరాబాద్

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top