జనారణ్యం

జనారణ్యం


కథ

చంద్రశేఖర్ ఇండ్ల


‘‘జాగ్రత్తరోయ్ లక్ష రూపాయలు తీసుకెల్తున్నావ్...’’ అంటూ ఇంకో అరగంట తిన్నాడు యజమాని.



ఇంటికి వ్రేలాడదీసిన గుమ్మడికాయ పూర్తిగా కుళ్లిపోయి కంపు కొడుతోంది  ఆ ఇంట్లో. చెట్లన్నీ మౌనం పాటిస్తున్నట్లు తలలు దించుకున్నాయ్, ఆ ఇంటిముందు. కోడి కుయ్యాల్సిన టైంలో కుక్కబోరున ఏడుస్తోంది, ఆ వీధిలో.ఆ అరుపుల అలారంతో కళ్ళు తెరిచాడు మోహన్.

 

రక్తపుముద్దలా తూర్పున వేలాడుతున్నాడు సూర్యుడు, రాత్రి ఆయనది ఇరాక్‌లో డ్యూటీ అయ్యుంటుంది. మోహన్‌కి ఇంకొంచెం సేపు పడుకోవాలనుంది... కాని హైదరాబాద్ వెళ్ళాల్సిన పనుంది. అతను కుర్రోడేం కాదు నలభై ఆరేళ్ళ వయసుంది. హైదరాబాద్ పక్కనే కదా అనే తాత్సారమూ ఉంది. ఒళ్లిరుసుకున్నాడు, బాత్రూంకెళ్ళాడు, బయటకొచ్చి గబాగబా రెడీ అయ్యాడు. టీ పెట్టమని భార్యను లేపుదాం అనుకున్నాడు - లేపలేదు, మొదటిసారి.

 

పక్కరూంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరవుతున్న కొడుకు దగ్గరకు వెళ్ళాడు, ‘‘చదువుకుంటున్నావా’’ అన్నాడు, వెనుకనుంచి వెళ్లి కొడుకు తలమీద ప్రేమగా చెయ్యి వేసి నిమురుతూ. కొడుకు చిన్నోడేం కాదు ఇరవై నాలుగేళ్ల యువకుడు.

 ‘‘బ్యాంకుకు సంబంధించిన పోస్టులు పడ్డాయి నాన్నా, ఇప్పుడు కూడా మంచి ఇన్‌స్టిట్యూట్‌లో చేరకపోతే ఉద్యోగం రావడం కష్టం’’ అన్నాడు, ఆ కొత్త స్పర్శ తాలూకు భయంలోంచి, సందిగ్ధంలోంచి, అనుమానంలోంచి బయటకు రావడానికి.

 

‘‘రేపే చేరుదువు గాని, నేనూ మూడు నెలల నుంచి ఒక ప్లాటు పని మీద తిరుగుతున్నాను కదా, ఈ రోజు ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్, మన కమీషన్ లక్ష రూపాయలు, మంచి కాలేజ్‌లో చేరుదువుగాన్లే చదువుకో’’ అంటూ ఆ రోజులో మొదటిసారి నవ్వాడు మోహన్. కొడుకుకి ఆ నవ్వు నచ్చింది.అమ్మను లేపుతానుండు అంటూ ఇంట్లోకెళ్లబోయాడు కొడుకు. ‘‘వద్దొద్దులే నిద్రపోనివ్వు. దాన్ని డిస్టర్బ్ చెయ్యడం ఎందుకు? తలనొప్పి అని రాత్రంతా నిద్రపోలేదు పాపం’’ అన్నాడు బండిని స్టార్ట్ చేస్తూ. కానీ ఈ రోజు రాత్రి మోహన్ తన కుటుంబాన్నంతా డిస్టర్బ్ చెయ్యబోతున్నాడన్న విషయం ఈ కథ రాస్తున్న నాకు మాత్రమే తెలుసు.

 

పోయొస్తా అనలేదు, ‘‘పోతున్న’’ అన్నాడు బండెక్కి కిక్క్ కొట్టి. డర్రర్ ర్ ర్... మని శబ్దం; కొడుకు గుండెల్లో, తల్లి చెవుల్లో. ఆ శబ్దం ఇంటి చుట్టూ ఆవరించివున్న నిశ్శబ్దంలో కలిసిపోయింది.

 ‘‘నేను  ఎదురు రాకుండా కాలు బయటపెట్టడు, చెప్పకుండానే పోయాడేంటి మీ నాన్న’’ కొడుకు నడిగింది గబగబా బయటికొచ్చిన సులోచన, మొగుడు పోయిన రోడ్డునే చూస్తూ.

 జుయ్యియ్యి మని ఒక పేడ పురుగు కుళ్లిపోయిన గుమ్మడికాయ చుట్టూ తిరుగుతోంది. ఈగను వెంటాడుతున్న బల్లి ఒకటి మోహన్ ఫొటోపై కదలకుండా నుంచుంది సరిగ్గా తలమీద.



హైదరాబాద్. పార్క్‌లో ఏదో అలికిడి అయినట్టుంటే లిప్పుల్లాకుల్లోంచి బయటకొచ్చిందో కుర్రజంట.

 ‘‘హ్యాపీ... బర్డే... టూ... యూ...’’ అన్నాడు, చెవి మీద ముద్దు పెడుతూ అమ్మాయితో.

 ‘‘థ్యాంక్స్’’ అంది ఇంకో ముద్దు ఎక్స్‌పెక్ట్ చేస్తూ.

 ‘‘కళ్ళు మూసుకో నీకో గిఫ్ట్ ఇస్తా’’ అన్నాడు బ్యాగు జిప్పు ఓపెన్ చేస్తూ.

 చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకొని కళ్ళు మూసుకుంది, ఆ కళ్ళల్లో చీకటి దేనికైనా తెగించమంటుంది.

 తను అనుకున్నట్టే మొదట ముద్దు పెట్టాడు- వెంటనే ఆమె చేతిలో ఒక బాక్స్ పెట్టాడు.

 కళ్ళు తెరవమన్నాడు, తెరిచింది- కళ్ళని, ఆ బాక్స్‌ని.

 

‘‘సెల్ ఫోనా’’ గుండె జల్లు మంది ఆ పదహారేళ్ళ అమ్మాయికి.

 ‘‘నచ్చిందా’’ అన్నాడు.

 ‘‘నచ్చింది, కానీ మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు’’

 ‘‘తెలిస్తేనే కదా చంపేసేది, పగలంతా నేను నీ పక్కనే కాలేజ్‌లో ఉంటాను కాబట్టి ఫోన్ని స్విచ్ ఆఫ్ చెయ్, అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక స్విచ్ ఆన్ చెయ్. నువ్వు రింగివ్వు చాలు- నేను ఫోన్ చేస్తా, ముందు నువ్వే హలో అను తరువాతే నేను, ఎలా వుంది ప్లాను’’ అన్నాడు సెల్‌ఫోన్లో నంబరు ఫీడ్ చేస్తూ.

 

అది విని స్వర్గంలో వున్న దేవదాసు, పార్వతి ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు, మనం ఈ కాలంలో పుడితే బాగుండేదని.

 సరిగ్గా ఆ పార్క్ దగ్గరకు వచ్చే సరికి మోహన్‌ని లారీ గుద్దింది, ముందు పళ్ళు ఊడిపోయాయి. నోటి నిండా రక్తం, కళ్ళు మూతలు పడుతున్నాయ్, బలవంతంగా కళ్ళు తెరిచాడు, కల... పగటి కల.



గట్టిగా నిట్టూర్పు విడిచాడు బండి పక్కన పార్క్ చేస్తూ. సిగిరెట్ ముట్టించాడు. ‘ఈ రోజు అది ఎదురురాకపోయే సరికి ఏదోలా ఉంది’ అనుకున్నాడు. ఫోన్ చేసాడు కొడుక్కి. ఫోన్ కలవలేదు. ఏదీ కలవదు మనుషుల్ని కలవర పెట్టాలనుకున్నప్పుడు.

 ‘‘సరే బయలుదేరదాం’’ అంది సర్దుకుంటూ ఆ పదహారేళ్ళ యువతి.

 ‘‘అప్పుడే వెళ్తావా’’ అన్నాడు.



 ‘‘మనల్ని ఎవరో చూస్తున్నట్లుంది’’ అంది.

 ‘‘ఎవరూ’’ గుబురు పక్కకొచ్చి చూసాడు, సిగిరెట్ తాగుతున్న మోహన్‌ని.

 ‘‘అవునవును ఇంకో చోటికెళ్దాం పద’’ సలహా ఇచ్చాడు.

 ఇద్దరూ కదిలారు. ఆ అమ్మాయే మోహన్ చావుకు కారణమవుతుందన్న విషయం నాకు తెలుసు. పాపం మోహన్‌కు గాని ఆ అమ్మాయికి గాని ఆ విషయం తెలియకపోవడమే విధి.



హైదరాబాద్‌లోనే మధ్యాహ్నం.

 రెండ్రోజులనుండి ఏడుస్తూనే ఉంది తను.

 ‘నవమాసాలు మోసి కనింది చంపడానికా’ తనను తనే ప్రశ్నించుకుంది, బక్కపలచని ఇరవై నాలుగేళ్ళ యువతి. ఇల్లంతా పేదరికపు కంపు.

 ‘‘నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఈ ముదనష్టపుది మూడోది’’ అన్నాడో మగాడు, ఆ యువతి మొగుడు, ఆ మూడురోజుల పసికందు పాలిట యముడు, స్వయానా తండ్రి.





 ‘‘నీకు దండం పెడతా వద్దు’’ అంది తను.

 ‘‘అయితే మిగతా ఇద్దర్ని కూడా తీసుకొని మీ ఇంటికి బయల్దేరు’’ అన్నాడు, ఆ చిన్న పిల్లల్ని మూడు వీర్యపు చుక్కల్లా చూస్తూ.

 చూస్తూ చూస్తూ పసికందును చంపలేదు- మొగుడ్ని కాదనుకొని బ్రతకలేదు, కొన్ని జీవితాలు అంతే అస్తవ్యస్తం.

 ఈ రాత్రే ఆ పసికందును ఒదులుకోవాలనుకుంది, పాపను గుండెలకు హత్తుకుంది, చివరి చూపు చూసింది, క్షమాపణ వేడుకుంది.

 

ఆ కసాయి తండ్రికి తెలియదు తను చావదని, తనను కాపాడేవాడున్నాడని, తన చావును అతను తీసుకొని అమరుడవుతాడని.

 సరిగ్గా నేనిలా చెబుతున్నప్పుడే మధ్యాహ్నం హోటల్లో అన్నం తింటున్న మోహన్‌కి పొరబోయింది, ‘ఎవరో తలచుకుంటున్నట్లున్నారు’ అనుకొని నీళ్ళు తాగాడు.

 ఆ  నీళ్ళ ధార గొంతులోకి జారుతోంది- సూర్యుడు కొండల్లోకి జారినట్టు. ఇంకెవరు తలచుకుంటారు మోహన్ని మృత్యువు కాక.



హైదరాబాద్‌లోనే రాత్రయింది.

 ‘‘పెంటనా కొడుకులు పని చేయించుకునేటప్పుడు బాగానే చేయించుకుంటారు, డబ్బులివ్వబోయే సరికి తెగులు మొదలయ్యిద్ది’’ తిట్టుకుంటూ సెల్‌ఫోన్ తీసాడు మోహన్ ఇంటికి ఫోన్ చెయ్యడానికి, ఆలస్యమవుతుందని చెప్పడానికి. సెల్ స్విచ్చాఫ్, ఖర్మంటే అదే.

 ‘‘ఈ నా కొడుకులు బార్ లోంచి బయటకొచ్చేలోపు చాలా టైం అయ్యేలా ఉంది, ఇదంతా అది ఎదుర్రాకపోవడం వల్లే జరిగింది’’ అనుకుంటున్నప్పుడు అక్కడ సులోచన కూడా అదే అనుకుంటూ ఉండడం వారిద్దరి అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం.

 



కరెక్టుగా రాత్రి 11:30కు లక్ష రూపాయలు అందాయి, కళ్ళలో నీళ్ళు తిరిగాయి మోహన్కి. గొంతెమ్మ కోరికలు గుర్తుకు రాలేదు, కొడుకు గుర్తొచ్చాడు. బార్ గుర్తుకురాలేదు, భార్య గుర్తొచ్చింది. మిడిల్ క్లాస్ మెంటాల్టీ. ‘ఇన్ని డబ్బులు చూస్తే గుండాగి చచ్చిద్ది’ అనుకున్నాడు, డబ్బులు లెక్కపెడుతూ తన భార్యను ఊహించుకుంటూ.

 ‘‘జాగ్రత్తరోయ్ లక్ష రూపాయలు తీసుకెళ్తున్నావ్, అసలే దొంగనాకొడుకులెక్కువ హైదరాబాద్లో’’ అంటూ ఇంకో అరగంట తిన్నాడు యజమాని.

 

‘మూడు నెలలు కష్టపడిన సొమ్ము, దొంగలపాలు కాకూడదు’ అనుకున్నాడు, డబ్బుని రెండు సగాలు చేశాడు, సగం లోపలి జేబులో, సగం బండి జేబులో పెట్టాడు, సగం పోతే సగమైనా మిగులుతాయని. మిడిల్ క్లాస్ ఐడియా.

 మోహన్కి తెలియదు ఆ డబ్బులు దొంగలు కన్నెత్తి కూడా చూడరని. అసలు దొంగలు అనే వాళ్ళే మోహన్కి ఎదురుకారని.



హైదరాబాద్‌లోనే అర్ధరాత్రి.

 జనారణ్యమంతా దుప్పట్లో దూరి నిద్రపోతున్నట్టు నటిస్తోంది. మేమున్నాం నిద్రపొండంటూ పోలీస్ పెట్రోలింగ్ హారన్లు అభయం ఇస్తున్నట్లు మోగుతున్నాయ్. నిద్రొస్తదేమోనని రైలు సందడి చేసుకుంటూ పట్టాల మీద పరిగెడుతోంది.

 హైదరాబాద్ చివరి కాలనీ, దాటితే ఏడు కిలోమీటర్లలో మోహన్ ఇల్లు. క్షేమంగానే ఉన్నాడు మోహన్ ఆ పొత్తిగుడ్డల్లో చుట్టి దారిపక్కన పడేసివున్న మూడురోజుల పసికందు ఏడుపు విననంతవరకు.

 

ఆ పసికందు, మగ అహంకారపు మాట విని కడుపుతీపిని చంపుకున్న తల్లి కూతురు. ఎవరి ప్రేమకూ నోచుకోని ఆ పిల్లను వీధికుక్క కళ్ళార్పకుండా చూస్తోంది.

 వదిలేసి వెళ్దామనుకున్నాడు, వెళ్ళలేకపోయాడు, వద్దనుకుంటూనే బండాపాడు, చూసాడు, చేతుల్లోకి తీసుకున్నాడు. ‘నన్ను కాపాడే వాడొచ్చాడ్రా’ అనుకుందేమో ఆ పిల్ల ఏడుపాపింది. వీధి కుక్క కోపంగా చూస్తోంది ఇద్దర్నీ.

 చుట్టూ చూసాడు నిశ్శబ్దపు శ్మశానంలో సమాధుల్లా ఉన్నాయి ఇళ్లన్నీ అక్కడ. ఆ పాపెవరో ఆ ఇంటి వాళ్ళని అడుగుదాం అనుకున్నాడు.

 

ఎదురుగా ఉన్న ఇంటిదగ్గరకు వెళ్ళాడు, తలుపుకొట్టాడు తియ్యలేదు, కాలింగ్బెల్ నొక్కాడు మోగలేదు. ఇంకో ఇంటికి వెళ్ళాడు. సరిగ్గా ఆ ఇంటి మీదే, అర్ధరాత్రి అమ్మానాన్నకి తెలియకుండా, పార్క్‌లో బర్త్ డే గిఫ్టుగా ప్రియుడిచ్చిన ఫోన్లో మాట్లాడుతున్న పదహారేళ్ళ అమ్మాయి మోహన్ని చూసింది, భయపడింది.

 ‘‘దొంగా దొంగా’’ అని పెద్దగా అరిచింది.

 మోహన్కి దొంగెవరో అర్థంకాలేదు.

 

ఆ అరుపులు విని, కడుపునిండా తిని హాయిగా పడుకునివున్న పెంపుడు కుక్క భౌభౌమని అరుస్తూ దాని డ్యూటీ అది చేసింది. ఈలోగా నలుగురు కుర్రాళ్ళు విక్కెట్లు, క్రికెట్ బ్యాట్లు తీసుకుని మోహన్ మీద పడ్డారు. అతడెవరో చెప్పనిస్తేగా!

 మోహన్ మూతి మీద వికెట్ దెబ్బ పడింది. పళ్ళు విరిగాయ్. రక్తం నోరంతా. ఇంకో దెబ్బ మోకాలి మీద, తలమీద. అరిచాడు, కూలబడ్డాడు. కొడుకు గుర్తొచ్చాడు, భార్య గుర్తొచ్చింది, ఈ విషయం తెలిస్తే అది గుండె పగిలి చచ్చిపోద్దీ అనుకున్నాడు.



ఇదంతా అది ఎదుర్రాక పోవడం వల్లే అనుకున్నాడు, ఏడుపొచ్చింది, కన్నీళ్లు రాలేదు, రక్తం వచ్చింది చెవుల్లోంచి.మోహన్ని కొట్టద్దని కాబోలు మూడు రోజుల పసికందు గుక్కపట్టి ఏడ్చింది.

 ఒక అపార్ట్మెంట్‌లో ఒంటరిగా వున్న ముసలిదాన్ని చంపి బంగారం తీసుకెళ్ళిన కసాయివాడనుకొని, ఒంటరిగా వెళ్తున్న ఆడవాళ్ళ మెళ్ళో పుస్తెల తాడు తెంపుకెళ్ళే చైన్ స్నాచర్ అనుకొని, ఇళ్ళముందు నిలబెట్టున్న బండ్లను తీసుకెళ్ళే దొంగోడనుకొని...

 పోలీసులొచ్చారు చివర్లో- చనిపోయాడని నిర్ధారించడానికి. ‘‘ఏమయ్యా అతను దొంగోడైనా ఒక మనిషే కదంటయ్యా, కొట్టి చంపేశారు!  ఏం మనుషులయ్యా బాబు మీరు అన్నాడు’’

 ‘‘చచ్చిపోతాడనుకోలేదండి’’ గొణిగాడో కుర్రాడు గుంపులోంచి.

 

అంతమంది హంతకుల మధ్య ఒక మానవత్వమున్న మనిషి చెయ్యని తప్పుకు నెత్తురు ముద్దలా మారిపోయినా, అతని కళ్ళు మాత్రం తెరుచుకొని తెల్లగా ప్రశాంతంగా జనాలు మర్చిపోయిన శాంతిని గుర్తుచేస్తూ. ఆ గుంపులో ఉన్న ఒక కుర్రాడు బండి కవర్లోవున్న యాభై వేలు తీసుకుని జేబులో దాచుకున్న విషయం నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఇవేమీ తెలియని మూడు రోజుల పసికందు ప్రశాంతంగా నిద్రపోతోంది పోలీసు వ్యాన్లో. ఆ అమ్మాయే మోహన్ చావుకు కారణమవుతుందన్న విషయం నాకు తెలుసు. పాపం మోహన్‌కు గాని ఆ అమ్మాయికి గాని ఆ విషయం తెలియకపోవడమే విధి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top