మర్రి చెట్టు నీడలో...

మర్రి చెట్టు నీడలో...


కొన్ని సంవత్సరాల క్రితం సొంతూరు బాలసోర్‌ (ఒడిశా)కు వెళ్లినప్పుడు జరిగిన ఒక సంఘటన ఐటీ సెక్యూరిటీ కన్సల్టెంట్‌గా పనిచేసే వికాస్‌ దాస్‌ దృక్పథంలో గొప్ప మార్పు తెచ్చింది. ఆరోజు ఏమైంది? దుర్గా పూజా ఉత్సవాల్లో పాల్గొనడానికి బాలసోర్‌లోని తన ఇంటికి వెళ్లాడు వికాస్‌. ఆ ఇంట్లో ఏటా దుర్గామాత ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆ వేడుకలను చూడడానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి జనాలు వస్తుంటారు. ఈసారి అలా వచ్చిన వారిలో సుకియ అనే గిరిజన వృద్ధురాలు కూడా ఉంది. ఆరు బయట పూజ జరుగుతున్న ప్రదేశంలోకి ఆమె అడుగు పెట్టిందో లేదో కోపంతో పూజారి పెద్దగా అరిచాడు. వికాస్‌ కుటుంబ సభ్యులు ఆమెను తిట్టి వెళ్లగొట్టారు. ఈ సంఘటన వికాస్‌ను బాధకు గురి చేసింది.



‘ప్రపంచమంతా ఒకటే కుటుంబం’ అని చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. మాటల్లోని మంచి చేతల్లోకి రాకపోవడం అతడిని ఆలోచింపజేసింది.

ఆలోచించడం మాత్రమే కాదు... కోయిబనియా అనే చిన్న గ్రామానికి వెళ్లి రెండు నెలలు అక్కడే మకాం వేసి గిరిజనుల  సమస్యలపై ప్రత్యక్షంగా అవగాహన పెంచుకున్నాడు. ఆ తరువాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి కార్పొరెట్‌ కంపెనీలో పనిచేసే ఏడుగురు మిత్రులతో కలసి ‘వటవృక్ష’ (మర్రి చెట్టు) పేరుతో ఒక బృందాన్ని తయారుచేశాడు.



గిరిజనుల చేతిలో నైపుణ్యం ఉంది.కష్టపడేతత్వం ఉంది. అయితే తమ కష్టాన్ని ‘మార్కెట్‌’ చేసుకునే నైపుణ్యం లేదు. ఆ నైపుణ్యాన్ని అందించడానికి రంగంలోకి దిగింది ‘వటవృక్ష’. మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు హస్తకళల నుంచి మూలికా ఉత్పత్తుల వరకు వారి నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది.  ప్రతి ఇంటి తలుపు తట్టి గిరిజనుల ఉత్పత్తులను విజయవంతంగా మార్కెట్‌ చేయడం ప్రారంభించింది వికాస్‌ బృందం. మొదట్లో ఒక గ్రామంలో మొదలైన ‘వటవృక్ష’ నెట్‌వర్కింగ్‌ ఇప్పుడు పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్‌... మూడు రాష్ట్రాలకు విస్తరించింది.



72 బృందాలలోని 17,000 మంది గిరిజన స్త్రీలకు ‘వికాస్‌ బృందం’ చేయూత అందిస్తోంది. ఆర్థిక స్వాతంత్య్రం  కలిగించడంతో పాటు బృందాలలోని సభ్యులకు చదువు నేర్పించి విద్యావంతులను చేయడం  ప్రారంభించింది.ఒకప్పుడు వికాస్‌ ఇంటి పరిసరాల్లో నుంచి గెంటి వేయబడ్డ సుకియా ఇప్పుడు వ్యాపారిగా స్థిరపడింది. చిన్న చిన్న ఖర్చులకు కూడా ఇబ్బందులు పడిన సుకియాలాంటి మహిళలు ఇప్పుడు మర్రిచెట్టు నీడలో సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.‘‘

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top