ఖండాంతరాల్లో కొండల రాయుడు

ఖండాంతరాల్లో కొండల రాయుడు


విదేశాల నుంచి తరచూ తిరుమలకు రాలేని ప్రవాస భారతీయులు తమతమ ప్రాంతాల్లోనే స్వామి ఆలయాలు నిర్మించుకున్నారు. తిరుమల తరహా పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తూ తమ వారసులకు భారతీయ ధర్మాలను అలవరుస్తున్నారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, మలేషియా, సింగపూర్, రష్యా, జర్మనీ, శ్రీలంక, మయన్మార్, నేపాల్ వంటి అనేక దేశాల్లో వేంకటేశ్వర ఆలయాలున్నాయి. ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ప్రత్యేకంగానూ, ఒకే భవంతిలోని అంతస్తుల్లోనూ వివిధ దేవతా మూర్తులను ఆగమబద్ధంగా ప్రతిష్టించారు. విదేశాల్లో నిర్మించే ఆలయాలకు టీటీడీ ఇతోధిక సహకారం అందిస్తోంది. టీటీడీ శిల్పకళాశాలలో ఆగమశాస్త్ర బద్ధంగా సిద్ధం చేసిన శ్రీవేంకటేశ్వర స్వామితోపాటు వివిధ దేవతామూర్తుల విగ్రహాలను ఉచితంగా అందజేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం 2006 నుంచి విదేశాల్లో కూడా శ్రీనివాసకల్యాణాలు నిర్వహించింది. అమెరికా, కెనడా, బ్రిటన్, నేపాల్, వంటి ఎన్నో దేశాల్లోని ఆలయాల ఆహ్వానం మేరకు టీటీడీ విగ్రహాలతో తిరుమల ఆలయ తరహాలో కల్యాణోత్సవం నిర్వహించింది.

 

 సింగపూర్‌లో 130 ఏళ్లనాటి శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయం

 సింగపూర్‌లో వైష్ణవ ఆలయం నిర్మించాలని అక్కడి కమ్యూనిటీ నేతలు సంకల్పించారు. ఒక స్థలాన్ని 1851లో ఈస్టిండియా కంపెనీ నుంచి 26 రూపాయలా 6 అణాలకు రెండు ఎకరాలు కొనుగోలు చేశారు. 1885లో నిర్మాణం ప్రారంభమైంది. మొదట ఆలయాన్ని ‘నరసింగ పెరుమాళ్ కోయిల్’గా పిలిచేవారు.



1894లో ఆలయానికి అటూ ఇటూ ఇరువైపులా 25 వేల 792 అడుగుల స్థలం, మరొక ప్రాంతంలో 3,422 అడుగుల  స్థలం కొన్నారు. అది కూడా ఈస్టిండియా కంపెనీ నుంచే 999 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. 1966 నాటికి రాజగోపురం, పైకప్పు నిర్మాణాలు జరిగాయి. ఆ తర్వాత ‘నరసింగ’ నుంచి ‘శ్రీ శ్రీనివాస పెరుమాళ్ కోయిల్’గా పేరు మారింది.ఈ పురాతన ఆ ఆలయాన్ని 1978లో జాతీయ సంపదగా ఆ దేశం గుర్తించింది. 1987లో, 1992లో, 2005లో మూడుసార్లు ఆలయాన్ని మరింత తీర్చిదిద్దారు. వైకుంఠ ఏకాదశి, నవరాత్రులు, తిరుమల శనివారాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు.

 

 యూరప్‌లో అతిపెద్ద ఆలయం ‘శ్రీవేంకటేశ్వర స్వామి టెంపుల్ ’ ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ రాష్ట్రంలో వెస్ట్‌మిడ్‌లాండ్ మహానగరంలో ‘శ్రీవేంకటేశ్వర స్వామి టెంపుల్ ’ ఉంది. ఇది యూరప్‌లో కెల్లా అతిపెద్ద హిందూ ఆలయంగా ప్రసిద్ధిపొందింది. 21.5 ఎకరాల విస్తీర్ణంలో 10 ఏళ్లపాటు నిర్మించారు. అక్కడి ప్రవాస భారతీయులు 1970 లో ఈ ఆలయ నిర్మాణాన్ని తలపెట్టారు. దానికోసం 1984లో ‘శ్రీవేంకటేశ్వర టెంపుల్ చారిటబుల్ ట్రస్ట్’ స్థాపించారు. 1996 వరకు విరాళాలు సేకరించారు. మిలీనియం కమిషన్ అప్రూవల్ తీసుకుని 1997లో ఆలయానికి పునాది వేశారు. 1999లో గణపతిని ప్రతిష్టించారు. తర్వాత శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహంతో పూజలు చేశారు. 2000లో ఆంజనేయ స్వామినీ, సుబ్రహ్మణ్య స్వామినీ ప్రతిష్టించారు.

 

  2002లో సుదర్శన చక్రతాళ్వార్, 2003లో నవగ్రహాల ప్రతిష్ట, 2004 నాటికి కమ్యూనిటీ హాలు నిర్మాణం జరిగింది. మరో రెండేళ్లకు వేంకటేశ్వర విగ్రహ ప్రతిష్టతో ఆలయం పూర్తి చేసి, వేడుకగా కుంభాభిషేకం నిర్వహించారు. 2007లో అనంత పద్మనాభస్వామిని ప్రతిష్టించి పుష్కరిణి ప్రారంభించారు. హిందువుల్లో చాలా మందికి దేవుడికి పుట్టువెంట్రుకలు సమర్పించటం సంప్రదాయం. విదేశాల్లో స్థిరపడి తిరుమలకు రాలేని ప్రవాసభారతీయులు అక్కడే ఉన్న శ్రీవేంకటేశ్వరాలయంలో తలనీలాలు సమర్పిస్తుంటారు. వాటిని నిర్వాహకులు ప్రత్యేకంగా తిరుమల చేరేలా ఏర్పాట్లు చేస్తారు.

 

 పిట్స్‌బర్గ్‌లో శ్రీవేంకటేశ్వర టెంపుల్

 1975లో అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ిపిట్స్‌బర్గ్‌లో శ్రీవేంకటేశ్వర టెంపుల్ నిర్మించారు. అమెరికాలో ఇదే శ్రీవారి పురాతన ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ఆలయానికి ఆగస్టు 1975లో పునాది వేశారు. టీటీడీ నుంచి శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాలు పంపారు. 1976లో మూలమూర్తిని ప్రతిష్టించి, తరువాతి సంవత్సరం మహాకుంభాభిషేకం నిర్వహించారు. 1978లో రాజగోపురం, 1979లో పుష్కరిణి నిర్మించారు. 1986లో సహ స్ర కలశాభిషేకం మొదటి ప్రత్యేక పూజ నిర్వహించారు. 1989లో ఆలయానికి జీర్ణోద్ధారణ జరిగింది. తిరుమల తరహాలో అర్చన, అభిషేకం, సత్యనారాయణ పూజ, కల్యాణోత్సవం, హోమాలు, ఇతర వైదిక పూజలు జరుగుతున్నాయి.

 

 చికాగోలో హిందూ ఆలయాలు

 అమెరికాలోని చికాగో మహానగరంలో 1977లో హిందూ ఆలయాల నిర్మాణం జరిగింది. ఒక ఆలయంలో సీతాలక్ష్మణ, ఆంజనేయసమేత శ్రీరామచంద్రుడు కొలువై ఉన్నాడు. మరోచోట లక్ష్మీ సమేత వేంకటేశ్వర స్వామి, రాధాకృష్ణులు వెలశారు. సమీప ప్రాంతంలోనే గణేషుడు, శివుడు, దుర్గాదేవి, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతి దేవి, నటరాజ, అయ్యప్పస్వామి, నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ నిర్మించిన శ్రీరామ ఆలయాన్ని 10వ శతాబ్దంనాటి చోళుల దేవాలయ సంస్కృతిలో నిర్మించటం విశేషం. 1893లో వివేకానంద చికాగోలో చేసిన చిరస్మరణీయ ఉపన్యాసానికి చిహ్నంగా ఆయనకు పది అడుగుల ఇత్తడి ప్రతిమను నిర్మించారు. స్వామి వివేకానంద వేదాంత కేంద్రం కూడా ఉంది.

 

 అమెరికాలో మరికొన్ని ఆలయాలు

 కాలిఫోర్నియా రాష్ట్రంలోని కలబాసాస్ మహానగరంలో  శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని 1981లో నిర్మించారు. ఇక్కడ అర్చకుల కోసం ప్రత్యేక గదులు నిర్మించారు. ఇల్లినాయిస్ రాష్ర్టంలోని అరోరా మహానగరంలో 20 ఎకరాల్లో శ్రీవేంకటేశ్వరస్వామి టెంపుల్ ఉంది. 1985లో నిర్మాణం ప్రారంభించి 1996లో కుంభాభిషేకం నిర్వహించారు. జార్జియా రాష్ట్రం అట్లాంటా మహానగరంలో మరో ‘శ్రీవేంకటేశ్వర స్వామి టెంపుల్’ ఉంది. టెనెస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ నగరంలో ‘శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి టెంపుల్’ ఉంది. న్యూజెర్సీలో కూడా ‘శ్రీవేంకటేశ్వర టెంపుల్’ ఉంది.

 

 ఆలయాలన్నింటా కూచిపూడి, భరతనాట్యం, హరికథ వంటివాటిని నేటి తరానికి అందించటం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆదివారాలు, సెలవు రోజుల్లో తెలుగు, సంస్కృతం, కన్నడ, తమిళం, హిందీ మొదలగు ఆయా ప్రాంతాల మాతృభాషల్ని బోధిస్తున్నారు. శ్రీరామనవమి, జన్మాష్టమి, నరక చతుర్దశి, దసరా, వినాయక చవితి, మకర సంక్రాంతి పండగల్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు.

 

 విదేశీ ఆలయాలన్నీ సంప్రదాయ రీతుల్లోనే...

 విదేశాల్లోని ఆలయాలను కూడా సనాతన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగానే నిర్మిస్తారు. దక్షిణ భారత దేశ ద్రవిడ శిల్పరీతులతోపాటు ఆధునిక సాంకేతికతను కూడా మేళవిస్తారు. ఆయా దేశాల్లోని వాతావరణ పరిస్థితులు, ఆ ప్రాంతంలోని నేల సారవంతాన్ని బట్టి ఆలయ నిర్మాణాలు చేపడతారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు కూడా ఆలయ నిర్మాణంలోని డిజైన్లపై ప్రభావం చూపుతాయి. ఇక ఉత్తర భారత సంప్రదాయానికి చెందిన ఇస్కాన్ శ్రీకృష్ణ ఆలయాలు, స్వామి నారాయణ్ ఆలయాలు పూర్తి శిల్పకళతో నిర్మిస్తారు. ఉన్న స్థలాన్ని సంపూర్ణంగా వినియోగించుకునేలా... ఆయా దేవతామూర్తులకు వేర్వేరుగా పూజాసంప్రదాయాలు కొనసాగించేలా ముందుగానే డిజైన్ చేసుకుని, నిర్మాణాలు పూర్తి చేస్తారని విదేశీ ఆలయ నిర్మాణాలపై పరిశోధనలు చేసి, లండన్‌లోని లీడ్స్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్‌లో ప్రావీణ్యం పొందిన ఆర్కిటెక్ట్ పోలు సాయి శ్రీకాంత్ తెలిపారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top