విశ్వాసమే విజయధ్వజమై!

విశ్వాసమే విజయధ్వజమై! - Sakshi


వర్తమానాన్నే కాదు భవిష్యత్‌ను కూడా అంచనావేయగలిగేవారే ఉత్తమ వ్యాపారులవుతారు. మన దేశంలో ఇ–కామర్స్‌ అంతగా  ఊపందుకోని రోజులవి. ‘ఇ–కామర్స్‌ మార్కెట్‌’కు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ఆరోజుల్లోనే అంచనా వేశారు సచిన్‌ బన్సాల్, బిన్నీ బన్సాల్‌. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఢిల్లీ (ఐఐటిడీ)లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ కలసి చదువుకున్నారు చండీగఢ్‌కు చెందిన సచిన్, బిన్నీలు. చదువు పూర్తయిన కొంత కాలానికి ప్రసిద్ధ ఇ–కామర్స్‌ కంపెనీ ‘అమెజాన్‌’లో కొంత కాలం పనిచేశారు. ‘రెగ్యులర్‌ జాబ్‌లో చాలెంజింగ్‌ అనేది ఉండదు’ అనే విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం ఉండేది. ఆ సమయంలోనే సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనవచ్చి ఉద్యోగానికి రాజీనామా చేశారు. భారీ మొత్తంలో బడ్జెట్‌ లేదు.



అయితే ‘భారీ బడ్జెట్‌’తో మాత్రమే ఒక వ్యాపారం విజయవంతం అవుతుందనే దానిపై నమ్మకం కూడా లేదు. తమ దగ్గర ఉన్న చిన్నపాటి పొదుపు మొత్తాలతో కష్టాన్ని నమ్ముకొని రంగంలోకి దిగారు. 2007లో బెంగళూరులో ‘ఫ్లిప్‌కార్ట్‌’ను ప్రారంభించారు.వైఫల్యాల గురించి అవగాహన ఉన్నప్పుడు విజయప్రస్థానం మొదలవుతుంది. ‘ఆన్‌లైన్‌లో ఎక్కువమంది టికెట్లు కొంటున్నప్పుడు... షాపింగ్‌ మాత్రం ఎందుకు చేయరు?’ అనుకున్నారు కంపెనీ మొదలు పెట్టడానికి ముందు. అయితే అప్పటికే ఉన్న కొన్ని చిన్న ఇ–మార్కెటింగ్‌ కంపెనీలు పెద్దగా సక్సెస్‌ కాలేదు. డెలివరీలు ఆలస్యం కావడం, రాంగ్‌ ప్రొడక్ట్‌ డెలివరీలు... మొదలైన కారణాలు నిలువెత్తు వైఫల్యాలుగా కనిపిస్తున్నాయి.పుస్తకాల విక్రయంతో మొదలైంది ‘ఫ్లిప్‌కార్ట్‌’ ప్రస్థానం. చిన్న పట్టణం నుంచి పెద్ద పట్టణం అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా పుస్తకప్రియులకు మెరుగైన సేవలను అందించింది. కొరియర్‌ సర్వీస్‌ అందుబాటులో లేని చోట తపాలా శాఖ సేవలను ఉపయోగించుకుంది.



ప్యాకింగ్‌ నుంచి కొత్త సాఫ్ట్‌వేర్‌ గురించి ఆలోచించడం వరకు ప్రతిపనీ చురుగ్గా చేసేవారు సచిన్, బిన్నీలు. పోటీదారుల కంటే ముందుండాలంటే ‘బ్యాడ్‌ క్వాలిటీ సర్వీస్‌’కు దూరంగా, ‘కస్టమర్‌ సర్వీస్‌’కు దగ్గరగా ఉండాలనే ప్రాథమిక సూత్రాన్ని ఒంటబట్టించుకుంది ఫ్లిప్‌కార్ట్‌. పరిస్థితులను గమనిస్తూ ఎప్పటికప్పుడు గమ్యాన్ని మార్చుకునేది. తప్పుల నుంచి గుణపాఠాలు తీసుకునేది.‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ’ సౌకర్యాన్ని కలిగించడంలాంటివి ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేకతను చాటాయి. క్రెడిట్‌ కార్డు లేనివారికి, క్రెడిట్, డెబిట్‌ కార్డులు ఎలా ఉపయోగించాలో తెలియని వారికి, అవి ఉపయోగించడానికి సౌకర్యంగా లేని వారికి ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ’ ఉపయోగపడింది. ఇప్పుడు మనదేశంలో ఎన్నో ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లు ఈ ఆప్షన్‌ను అనుసరిస్తున్నాయి.



పుస్తకాల విక్రయంతో మొదలైన ‘ఫ్లిప్‌కార్ట్‌’ ప్రయాణం స్వల్పకాలంలోనే మొబైల్, మూవీస్, మ్యూజిక్, గేమ్స్, కెమెరాలు, కంప్యూటర్లు... ఇలా రకరకాల విభాగాల్లోకి దూసుకెళ్లింది. కస్టమర్, సప్లయర్‌లో విశ్వాసం నింపగలగడమే తొలి విజయం అనుకొని ఆ దిశగా ప్రయత్నించి విజయం సాధించింది ఫ్లిప్‌కార్ట్‌. పబ్లిసిటీ కోసం లక్షలు ఖర్చు పెట్టకుండానే మౌత్‌ పబ్లిసిటీతో ఫ్లిప్‌కార్ట్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.నాలుగు లక్షల పెట్టుబడి, అయిదు మంది సిబ్బందితో మొదలైన ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పుడు వేల కోట్ల టర్నోవర్‌తో, 4500 మంది ఉద్యోగులతో లార్జెస్ట్‌ ఇ–కామర్స్‌ పోర్టల్‌గా దేశంలో అగ్రగామిగా నిలిచింది.‘ఒక ఆలోచన రావడం... అద్భుతం. ఆ ఆలోచన ఆచరణలోకి రావడం అదృష్టం. ఆచరణ ఫలవంతం కావడం గొప్ప అదృష్టం’ అని ఫ్లిప్‌కార్ట్‌తో నిరూపించారు సచిన్, బిన్నీ ద్వయం.



పేరులో నేముంది?

తమ కంపెనీకి ఏ పేరు పెట్టాలనే దాని గురించి రకరకాలుగా ఆలోచించారు సచిన్, బిన్నీలు. ఏ పేరు పెట్టినా క్యాచీగా ఉండాలనుకున్నారు. ‘ఇది కేవలం పుస్తకాల విక్రయాలకు సంబంధించినదే’ అనే అర్థం ఆ పేరులో ధ్వనించకూడదు. ఆ పేరు అన్ని విభాగాలకు వర్తించేలా ఉండాలనుకుంటూ  ‘ఫ్లిప్పింగ్‌ థింగ్స్‌ ఇన్‌ టు యువర్‌ కార్ట్‌’ అనే వాక్యాన్ని అనుకున్నారు. దీన్నే కుదించి  ‘ఫ్లిప్‌కార్ట్‌’ పేరును ఖాయం చేశారు. పేరుకు తగ్గట్టుగానే వినియోగదారుల బండిలోకి సరుకులను వేగంగా చేరవేయడంలో విజయం సాధించారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top