మహాన్‌ భారత్‌ 70 ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం

మహాన్‌ భారత్‌  70 ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం


మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇప్పటికి ఏడు దశాబ్దాలు పూర్తవుతున్నాయి. బ్రిటిష్‌ పాలన తర్వాత దేశ విభజన జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ అవతరించింది. సమాజంలోని అన్ని రకాల అసమానతలను తొలగించాలనే సంకల్పంతో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికతత్వం, సామ్యవాదం పునాదులుగా ఏర్పడిన దేశం మనది. ఏడు దశాబ్దాల ప్రస్థానంలో మన దేశం సాధించిన ఘన విజయాలు, వివిధ రంగాల్లో అధిగమించిన మైలురాళ్లు చాలానే ఉన్నాయి. అలాగే, మన దేశం నేటికీ ఎదుర్కొంటున్న సవాళ్లు, చవి చూసిన వైఫల్యాలు కూడా లేకపోలేదు. ఎన్ని సవాళ్లు, వైఫల్యాలు ఎదురైనా మన దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా మనుగడ సాగిస్తూనే ఉంది. ఈ డెబ్బయ్యేళ్లలో మనం సాధించిన అతిపెద్ద ఘనత ఏదైనా ఉందంటే అది మన ప్రజాస్వామ్యం మనుగడే! స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏడు దశాబ్దాల మన స్వాతంత్య్రంపై ఒక విహంగ వీక్షణం...



1

1947–1957

నవ నిర్మాణ దశాబ్దం




స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి పదేళ్లు భారత్‌కు నవ నిర్మాణ దశ. ఈ దశాబ్దిలోనే ఐదువందలకు పైగా ఉన్న సంస్థానాల విలీనం జరిగింది. అంబేడ్కర్‌ ఆధ్వర్యంలో దేశానికి దిశానిర్దేశం చేసే రాజ్యాంగం రూపొందింది. దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి స్వాతంత్య్ర సమరాన్ని ముందుకు నడిపిన మహాత్మాగాంధీ ఎలాంటి అధికార పదవినీ స్వీకరించలేదు. రాజ్యాంగ రచన, తొలి సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేంత వరకు రాజగోపాలాచారి గవర్నర్‌ జనరల్‌గా వ్యవహరించారు. స్వాతంత్య్రం వచ్చిన ఏడాదే కశ్మీర్‌ భూభాగం కోసం పాకిస్థాన్‌తో యుద్ధం జరిగింది. కశ్మీర్‌ భూభాగంలో కొంత ప్రాంతాన్ని పాక్‌ ఆక్రమించుకున్నా, ఎటూ తేలకుండానే యుద్ధం ముగిసింది.



 రాజ్యాంగం అమలులోకి తెచ్చిన రోజునే 1950 జనవరి 26న తొలి రాష్ట్రపతిగా బాబూ రాజేంద్ర ప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందడంతో జవహర్‌లాల్‌ నెహ్రూ తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికలను రూపొందించారు. అత్యున్నత ప్రమాణాలు గల విద్యాసంస్థలను స్థాపించాలనే లక్ష్యంతో ఐఐటీలకు నాంది పలికారు. వ్యవసాయానికి పన్ను నుంచి మినహాయింపు, కార్మికులకు కనీస వేతనాలు వంటివి అమలులోకి తెచ్చారు. కుల వివక్ష, అస్పృశ్యత నిర్మూలనల కోసం, మహిళలకు హక్కులు కల్పించడం కోసం చట్టాలు తెచ్చారు. సాధనా సంపత్తిని మెరుగుపరచడానికి భారీ ప్రాజెక్టులు, భారీ పరిశ్రమల స్థాపనకు నాంది పలికారు.



విద్యుత్తు, గనులు, ఉక్కు, వైమానిక రంగం, నౌకాయానం వంటి కీలక రంగాలను జాతీయం చేశారు. ఇదేకాలంలో 1953లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని కుదిపేసింది. ఆ సంఘటనతో కేంద్రం రాష్ట్రాల పునర్విభజన చేపట్టింది. తొలి దశలో 1956లో మద్రాసు రాష్ట్రాన్ని విడగొట్టి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అటు అమెరికాతోను, ఇటు రష్యాతోను సమాన సంబంధాలు కొనసాగించాలనే లక్ష్యంతో నెహ్రూ అలీన విధానానికి తెరతీశారు.



2

1957–1967

సరిహద్దు సమస్యల దశాబ్దం




రెండో సార్వత్రిక ఎన్నికల్లోనూ, మూడో సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ గెలుపొందింది. ఆ రెండుసార్లూ నెహ్రూనే మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నవ నిర్మాణ పథకాలను మరింతగా ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలు రూపొందించినా, పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో తలెత్తిన సరిహద్దు సమస్యల వల్ల అభివృద్ధి పథకాల అమలుకు అవరోధాలు ఏర్పడ్డాయి.



నెహ్రూ 1964లో కన్నుమూసిన తర్వాత లాల్‌బహదూర్‌ శాస్త్రి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవిలోకి వచ్చిన కొద్ది రోజులకే 1965లో వివాదాస్పద కశ్మీర్‌ అంశమై పాకిస్థాన్‌ మరోసారి భారత్‌తో యుద్ధానికి దిగింది. కశ్మీర్‌ సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించకపోయినా, రష్యా జోక్యంతో యుద్ధం సద్దుమణిగింది. భారత్‌–పాక్‌ల నడుమ శాంతి కోసం రష్యా కుదిర్చిన శాంతి ఒప్పందంపై సంతకం చేసేందుకు 1966లో లాల్‌బహదూర్‌ శాస్త్రి రష్యా వెళ్లారు. తాష్కెంట్‌లో ఆ ఒప్పందంపై సంతకం చేసిన రోజు రాత్రి అక్కడే బస చేసిన ఆయన అకస్మాత్తుగా కన్నుమూశారు. లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణంతో నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.



3


1967–1977


నోబెల్‌ విజేతలు: రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ (1913), సి.వి.రామన్‌ (1930), మదర్‌ థెరిసా (1979), అమర్త్య సేన్‌ (1998), ఖైలాశ్‌ సత్యార్థి (2014)



దూకుడు పెంచిన దశాబ్దం

నాలుగో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపుతో ఇందిరా గాంధీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టారు. మొదటి రెండు దశాబ్దాల్లో అభివృద్ధికి పునాదులు పడితే, మూడో దశాబ్దిలో దీర్ఘకాలిక లక్ష్యాల దిశగా దూకుడు పెరిగింది. ఈ దశాబ్దంలోనే ఆహార స్వయం సమృద్ధి కోసం హరిత విప్లవం, పాడి స్వయం సమృద్ధి కోసం క్షీర విప్లవం (ఆపరేషన్‌ ఫ్లడ్‌) మొదలయ్యాయి. దేశ పురోగతిలో ఇవి కీలక పాత్ర పోషించాయి. ఇదే దశాబ్దిలో భారత జనాభా 50 కోట్లు దాటింది. ఇందిరా గాంధీ ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో సామ్యవాద విధానాలను ప్రవేశపెట్టారు. బ్యాంకులను జాతీయం చేశారు.



పూర్వ సంస్థానాధిపతులకు ఇచ్చే రాజభరణాలను రద్దు చేశారు. ఈ చర్యలతో ఇందిరా గాంధీకి పార్టీలో వ్యతిరేకత ఏర్పడినా, ప్రజాదరణ మాత్రం బాగా పెరిగింది. కాంగ్రెస్‌ పార్టీ ఇందిరా గాంధీని బహిష్కరించడంతో ఆమె కాంగ్రెస్‌ (ఆర్‌) పేరిట సొంత కుంపటి పెట్టుకున్నారు. కామరాజ్‌ నాడార్, మొరార్జీ దేశాయ్‌ తదితరులు కాంగ్రెస్‌ (ఓ)గా ఏర్పడ్డారు. మరోవైపు వేర్పాటును కోరుకున్న తూర్పు పాకిస్థాన్‌కు మద్దతు పలకడంతో 1971లో మరోసారి పాకిస్థాన్‌తో యుద్ధం జరిగింది. పాక్‌ ఓటమి చెందడంతో తూర్పు పాకిస్థాన్‌.. బంగ్లాదేశ్‌గా అవతరించింది. యుద్ధం తర్వాత 1971లో జరిగిన ఐదో సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ (ఆర్‌) ఘన విజయం సాధించింది. మళ్లీ ప్రధాని పదవి చేపట్టిన ఇందిరా గాంధీ పాలనలో మరింత దూకుడు పెంచారు.



ఈ కాలంలోనే 1974లో దేశంలోని తొలి అణుపరీక్ష విజయవంతంగా జరిగింది. అదేకాలంలో రాయ్‌బరేలీ నుంచి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఆమె సుప్రీంకోర్టు నుంచి షరతులతో కూడిన స్టే తెచ్చుకున్నారు. దీంతో ఆమె గద్దె దిగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. జయప్రకాశ్‌ నారాయణ్‌ నాయకత్వంలో ఉద్యమాన్ని ప్రారంభించాయి. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ ద్వారా ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఎమర్జెన్సీ అమలులోకి రావడంతో దేశం అతలాకుతలమైంది. ప్రభుత్వ వ్యతిరేకులంతా జైళ్ల పాలయ్యారు. ఎమర్జెన్సీ దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా మిగిలింది. తర్వాత 1977లో కాంగ్రెస్‌ ఆరో సార్వత్రిక ఎన్నికలకు పిలుపునిచ్చింది. ఎమర్జెన్సీతో విసిగి వేసారిన జనం ఆ ఎన్నికల్లో జనతా పార్టీని గెలిపించారు. మొరార్జీ దేశాయ్‌ తొలి కాంగ్రెసేతర ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.



4

1977–1987

సాంకేతిక ప్రగతి దశాబ్దం




జనతా పార్టీ ఎంతో కాలం మనుగడ సాగించలేకపోయింది. అంతర్గత కీచులాటల వల్ల మొరార్జీ దేశాయ్‌ 1979లో ప్రధాని పదవి నుంచి తప్పుకోగా, చరణ్‌ సింగ్‌ ప్రధానిగా మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ మరుసటి ఏడాదిలోనే ఏడో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ దశాబ్ది ప్రథమార్ధంలో పంజాబ్, అస్సాం ప్రాంతాల్లో శాంతి సామరస్యాలకు కొంత విఘాతం ఏర్పడినా, ద్వితీయార్ధంలో సాంకేతిక ప్రగతికి బీజాలు పడ్డాయి. ఇందిరా గాంధీ ప్రభుత్వం ఖలిస్థాన్‌ మిలిటెంట్లను అణచివేయడానికి చేపట్టిన ‘ఆపరేషన్‌ బ్లూస్టార్‌’ తీవ్ర పరిణామాలకే దారితీసింది. ఆ సంఘటన తర్వాత 1984 అక్టోబర్‌ 31న ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. ఆమె హత్య తర్వాత సిక్కులపై జరిగిన దాడులు తీవ్ర హింసాకాండకు దారితీశాయి.



సానుభూతి పవనాల ఫలితంగా 1984లో జరిగిన ఎనిమిదో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తిరుగులేని ఆధిక్యత లభించింది. యువనేత అయిన రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవిని చేపట్టారు. ఆయన అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే.. 1984 డిసెంబర్‌లో భోపాల్‌లో యూనియన్‌ కార్బైడ్‌ కర్మాగారంలో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన భారీ ప్రాణనష్టానికి దారితీసింది. రాజీవ్‌ గాంధీ పాలనలో పలు సంస్కరణలకు తెరతీశారు. అభివృద్ధికి అవరోధాలుగా నిలుస్తున్న పలు ప్రభుత్వ నిబంధనలను సడలించారు. రాజీవ్‌ సర్కారు శాస్త్ర సాంకేతిక రంగాలకు ఊతమివ్వడంతో అంతరిక్ష పరిశోధనలు, టెలికం రంగాలు ఊపందుకున్నాయి. దేశంలో ఐటీ రంగం ఊపిరి పోసుకుంది. బోఫోర్స్‌ కుంభకోణం వెలుగులోకి రావడంతో ‘మిస్టర్‌ క్లీన్‌’గా ఉన్న రాజీవ్‌ ఇమేజ్‌ అడుగంటింది. శ్రీలంకకు భారత శాంతిపరిరక్షక దళాలను పంపడం కూడా తీవ్రనష్టానికి దారితీసింది.



5

1987–1997

ఆర్థిక సరళీకరణల దశాబ్దం




దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు దారి తీసిన దశాబ్ది ఇది. 1989లో జరిగిన తొమ్మిదో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాజయం ఎదురైంది. వి.పి.సింగ్‌ నేతృత్వంలోని జనతాదళ్‌ ఇతర మిత్రపక్షాలను కలుపుకొని నేషనల్‌ ఫ్రంట్‌గా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వి.పి.సింగ్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగా, ఇటు బీజేపీ, అటు వామపక్షాలు నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతుగా నిలిచాయి. అయితే, వి.పి.సింగ్‌ వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు మండల్‌ కమిషన్‌ నివేదిక అమలుకు పూనుకోవడంతో బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకుంది.



 ఫలితంగా ఏడాది తిరగక ముందే వి.పి.సింగ్‌ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత చంద్రశేఖర్‌ జనతాదళ్‌ (సోషలిస్టు) పేరిట వేరు కుంపటి ఏర్పాటు చేసుకుని, కాంగ్రెస్‌ మద్దతుతో ప్రధాని పదవి చేపట్టారు. చంద్రశేఖర్‌తో విధానపరమైన విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకుంది. ఫలితంగా ఏడు నెలల్లోనే చంద్రశేఖర్‌ గద్దె దిగాల్సి వచ్చింది. ఫలితంగా 1991లో పదో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో ఉండగా రాజీవ్‌ గాంధీ ఎల్టీటీఈ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు. ఎన్నికల్లో అధిక స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్, పీవీ నరసింహారావు నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.



 పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థిక సంస్కరణలకు తెరతీశారు. ఆర్థిక నిపుణుడైన మన్మోహన్‌ సింగ్‌ను ఏరికోరి మరీ ఆర్థిక మంత్రిగా నియమించుకున్నారు. పీవీ సర్కారు చేపట్టిన సరళీకరణ విధానాల ఫలితంగా వాణిజ్యం, పరిశ్రమలు, కమ్యూనికేషన్లు, ఐటీ, శాస్త్ర సాంకేతిక రంగాలు ఊపందుకున్నాయి. నిబంధనలను సడలించడంతో ప్రైవేటు రంగం బలపడటంతో పాటు విదేశీ పెట్టుబడులు కూడా రావడంతో దేశంలో ఉపాధి పెరిగింది. నిరుద్యోగం, పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. స్థూల జాతీయోత్పత్తి ఏడు శాతానికి ఎగబాకింది. ఈ దశాబ్దిలోనే భారత్‌ ప్రపంచ ఆర్థిక శక్తుల సరసన తన ఉనికిని చాటుకోగలిగింది.



ఆకాశాన్నంటిన మన గర్వం.. ఇస్రో!

ఐదు దశాబ్దాల కాలంలో పలు తిరుగులేని విజయాలను సాధించిన ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో), భారత్‌ పేరును ప్రపంచదేశాలన్నీ తలచుకునేలా చేసింది.



ప్రారంభం: 1969 ఆగస్టు 15

సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ప్రారంభం: 1971

మొదటి శాటిలైట్‌ లాంచ్‌: 1975 ఏప్రిల్‌ 19 (ఆర్యభట్ట శాటిలైట్‌)

చంద్రయాన్‌ – 1 ప్రయోగం: 2008 అక్టోబర్‌ 21

మంగళయాన్‌ ప్రయోగం: 2013 నవంబర్‌ 5

పీఎస్‌ఎల్‌వీ–సీ 37: 2017 ఫిబ్రవరి 15. ఒకే రాకెట్‌లో 104 శాటిలైట్స్‌ లాంచ్‌ (ప్రపంచ రికార్డు)



6

1997–2007

సంకీర్ణ రాజకీయాల దశాబ్దం




పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్ల పాలనాకాలాన్ని పూర్తి చేసుకున్నాక 1996లో జరిగిన పదకొండో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. పీవీ హయాంలో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత బీజేపీ బలం పెరగడంతో ఎన్నికల్లో తన స్థానాలను పెంచుకోగలిగింది. అయినా సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం లేకపోవడంతో మిత్రపక్షాలతో కలసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి అటల్‌బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, పార్లమెంటులో జరిగిన బలపరీక్షలో వీగిపోవడంతో వాజ్‌పేయి సర్కారు పదమూడు రోజుల్లోనే గద్దె దిగాల్సి వచ్చింది. దీంతో జనతాదళ్‌ తన పద్నాలుగు మిత్రపక్షాలతో కలసి యునైటెడ్‌ ఫ్రంట్‌ కూటమిని ఏర్పాటు చేసుకుని, దేవెగౌడ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.



 ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ బయటి నుంచి మద్దతు ప్రకటించింది. తర్వాత కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకోవడంతో దేవెగౌడ పదవి కోల్పోయారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ మరో రెండు పార్టీల మద్దతును కూడగట్టుకుని ఈసారి ఐకే గుజ్రాల్‌ను ప్రధానిగా ఎన్నుకుంది. కొద్దికాలానికే కాంగ్రెస్‌ మళ్లీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఐకే గుజ్రాల్‌ సర్కారు కుప్పకూలింది. ఫలితంగా 1989లో పన్నెండో సార్వత్రిక ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను దక్కించుకున్న పార్టీగా అవతరించినా, మెజార్టీకి చాలా దూరంగానే మిగిలింది. మిత్రపక్షాలతో కలసి వాజ్‌పేయి నేతృత్వంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వాజ్‌పేయి సర్కారు పోఖ్రాన్‌లో అణుపరీక్షలు చేపట్టింది. అణుపరీక్షలకు పర్యవసానంగా అమెరికా, జపాన్‌లు భారత్‌పై ఆర్థిక ఆంక్షలు విధించాయి.



రెండోసారి అధికారంలోకి వచ్చిన వాజ్‌పేయి సర్కారు పదమూడు నెలల్లోనే.. అంటే, 1999 ఏప్రిల్‌లో కుప్పకూలిపోయింది. తిరిగి 1999 సెప్టెంబర్‌లో పదమూడో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అంతవరకు వాజ్‌పేయి ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగారు. అదేకాలంలో కశ్మీర్‌లోని సరిహద్దుల వద్ద ఉగ్రవాదుల చొరబాట్లు సాగుతున్నట్లు గుర్తించడంతో కార్గిల్‌ యుద్ధం జరిగింది. భారత సైన్యం యుద్ధంలో సాధించిన విజయం పదమూడో సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం  చూపాయి. ఫలితంగా ఎన్డీఏ కూటమికి ఇదివరకటి కంటే ఆధిక్యత పెరిగింది. ముచ్చటగా మూడోసారి వాజ్‌పేయి ప్రధాని పదవి చేపట్టారు. ఈసారి పూర్తికాలం పదవిలో కొనసాగారు. మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది తిరిగేలోగానే మూడు కొత్త రాష్ట్రాలను (ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌) ఏర్పాటు చేశారు.



 ‘స్వర్ణ చతుర్భుజ’ పథకంతో ప్రధాన జాతీయ రహదారులను విస్తరించారు. అయితే, గుజరాత్‌లో గోద్రా సంఘటన దరిమిలా జరిగిన మతకల్లోలాలు బీజేపీ ప్రతిష్ఠను దిగజార్చాయి. ‘భారత్‌ వెలుగుతోంది’ నినాదంతో బీజేపీ 2004 నాటి పద్నాలుగో సార్వత్రిక ఎన్నికల్లో ముందస్తు పోటీకి వెళ్లినా... ఓటమి చవిచూడక తప్పలేదు. మిత్రపక్షాలను కూడగట్టుకుని యూపీఏ కూటమిని ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. యూపీఏ సర్కారుకు వామపక్షాలు కూడా బయటి నుంచి మద్దతు ప్రకటించాయి. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.



రేడియో నుంచి మొదలై....

రేడియో ప్రారంభం: 1930

1947లో ఉన్న మొత్తం రేడియో స్టేషన్లు: 6

ఎఫ్‌.ఎం.రేడియో ప్రారంభం: 1977

టెలివిజన్‌ (దూరదర్శన్‌) ప్రారంభం: 1959

కలర్‌ టీవీ ప్రవేశం: 1982

ప్రైవేట్‌ చానళ్లు, కేబుల్‌ టీవీ ప్రవేశం: 1991–92

ప్రస్తుతం ప్రసారంలో ఉన్న శాటిలైట్‌ చానళ్ల సంఖ్య: 1600లకు పైనే

దేశం మొత్తమ్మీద ఉన్న టీవీ సెట్ల సంఖ్య: 16.7 కోట్లు

 

కంప్యూటర్‌ కనెక్ట్‌

భారత్‌లో కంప్యూటర్‌ ప్రవేశం: 1956

ఈవీఎస్‌ ఈఎమ్‌ కంప్యూటర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది: 1967

ఇంటర్‌నెట్‌ ప్రవేశం: 1995 ఆగస్టు 15 (వీఎస్‌ఎన్‌ఎల్‌ )

దేశవ్యాప్తంగా ఉన్న ఇంటర్‌నెట్‌ యూజర్స్‌: 45 కోట్లు



సైన్స్‌ అండ్‌ టెక్నాలజీతో పరుగులు

1951 ఆగస్టు 18న నాటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ తీసుకున్న సంస్కరణ నిర్ణయాలతో మన దేశంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ అన్నది పరుగులు పెట్టడం మొదలైంది.

ఐఐటీ ప్రారంభం: 1951 ఆగస్టు 18 (ఖరగ్‌పూర్‌)

ఇప్పుడున్న ఐఐటీల సంఖ్య: 23

డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ప్రారంభం: 1958

మొట్టమొదటి అణు ప్రయోగం: 1974



ఫోన్‌ మోగింది...

భారత్‌లో 1850లో టెలీగ్రాఫ్‌తో మొదలైన టెలి కమ్యూనికేషన్స్‌ ప్రస్థానం ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నెట్‌వర్క్‌ (మొబైల్, టెలిఫోన్‌)గా అవతరించింది.



మొబైల్‌ ఫోన్‌ ప్రవేశం: 1995 జూలై 31

మొబైల్‌ ఫోన్‌ వాడుతున్న జనాభా: 118 కోట్లు (దేశ జనాభాలో 91 శాతం)  స్వాతంత్య్రం వచ్చాక ఇండియా పోస్ట్‌ సర్వీసులు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ప్రస్తుతం లక్షా యాభై వేలకు పైనే ఉన్న పోస్టాఫీసులు, 5 లక్షల 50 వేలకు పైనే ఉన్న ఉద్యోగులతో ఇండియా పోస్టల్‌ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టల్‌ నెట్‌వర్క్‌.



ప్రపంచమంతా ఆడుతోంది మన సినిమా!

స్వాతంత్య్రం వచ్చాక భారతదేశంలో సినిమా అన్నది ఓ పెద్ద ఇండస్ట్రీగా ఎదిగింది.

ఏటా ఇండియన్‌ సినీ పరిశ్రమ నిర్మిస్తున్నన్ని సినిమాలు మరింకే సినీ çపరిశ్రమా నిర్మించడం లేదు. సుమారు 1,000 సినిమాలు ఏటా నిర్మితమవుతున్నాయి.



1954 : అక్టోబర్‌ 10: జాతీయ సినీ అవార్డులు మొదలయ్యాయి.



1955: ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్‌ రే తెరకెక్కించిన ‘పథేర్‌ పాంచాలి’ ప్రపంచ సినిమాను ఆకర్షించింది.



1957: ఆస్కార్‌కు మొదటిసారి ఒక ఇండియన్‌ సినిమా నామినేట్‌ అయింది. మదర్‌ ఇండియా (దర్శకుడు : మెహబూబ్‌ ఖాన్‌)



1983: భాను అతేయ ఆస్కార్‌ అవార్డును అందుకున్న మొదటి భారతీయురాలు.



1992: ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్‌ రే ఆస్కార్స్‌లో లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు.



1999: బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అవార్డులు గెలుచుకున్న దిల్‌సే సినిమా.



2002: లగాన్‌ సినిమా ఆస్కార్‌కు నామినేట్‌ కావడంతో పాటు పలు ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో పేరు తెచ్చుకుంది.



2009: ఎ.ఆర్‌.రెహమాన్, రసూల్‌ పోకుట్టి, గుల్జార్‌ ఆస్కార్‌ అవార్డులు అందుకున్నారు.



 

2017: ఇండియన్‌ సినిమా మార్కెట్‌ స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ‘బాహుబలి’. ఇప్పటికీ పలు చోట్ల ప్రదర్శితమవుతోన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన వసూళ్లు:1725 కోట్ల రూపాయలు.



7

2007–2017

అంతరిక్ష విజయాల దశాబ్దం




మన్మోహన్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కారు గతంలో పీవీ మొదలుపెట్టిన సరళీకరణ విధానాల అమలును మరింత వేగవంతం చేసింది. ఏకంగా ఆరు కోట్ల కుటుంబాలకు లబ్ధి కలిగేలా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. అమెరికాతో కీలకమైన అణు సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికాతో ‘అణు’బంధం దరిమిలా వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ, పార్లమెంటులో జరిగిన బలపరీక్షలో మన్మోహన్‌ సర్కారు నిలదొక్కుకుంది. ఇదే దశాబ్ది ప్రారంభంలో తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్‌ పదవిలోకి వచ్చారు. ఇక అంతరిక్ష రంగంలో భారత్‌ ఈ దశాబ్దిలో అనేక ఘన విజయాలను మూటగట్టుకుంది. 2008లో చేపట్టిన చంద్రయాన్‌–1 ప్రయోగం విజయవంతమైంది. తొలి కమర్షియల్‌ రాకెట్‌ ఇటాలియన్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షానికి చేర్చింది.



 పొరుగుదేశంతో సత్సంబంధాల కోసం ఒకవైపు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తున్న సమయంలోనే 2008లో జరిగిన ముంబై ‘ఉగ్ర’దాడుల్లో పాక్‌ లింకులు బయటపడ్డాయి. దీంతో పాకిస్థాన్‌తో శాంతి చర్చలు స్తంభించిపోయాయి. ఈ పరిస్థితుల్లో 2009లో జరిగిన పదిహేనో సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ మళ్లీ అధికారాన్ని దక్కించుకోగలిగింది. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా, 2013లో ‘ఇస్రో’ చేపట్టిన ‘మంగళ్‌యాన్‌’ ప్రయోగం కూడా విజయవంతమైంది. అంగారకునిపైకి  వ్యోమనౌకను పంపిన సంస్థల్లో ‘ఇస్రో’ నాలుగోది అయినా, తొలి ప్రయత్నంలోనే విజయవంతమైన మొట్టమొదటి సంస్థగా అరుదైన ఘనత సాధించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన యూపీఏ సర్కారుకు దాదాపు ఆది నుంచే అగ్నిపరీక్షలు ఎదురయ్యాయి.



 ఒకవైపు పలు నగరాల్లో ఉగ్రవాదుల దాడులు, మరోవైపు వరుసగా వెలుగులోకి వచ్చిన కుంభకోణాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇదే దశాబ్దిలో సుదీర్ఘ ఉద్యమం తర్వాత తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించింది. ఈ పరిస్థితుల్లో 2014లో జరిగిన పదహారో సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ఘనవిజయం సాధించింది. పూర్తి ఆధిక్యత ఉన్నా, మిత్రపక్షాలతో కలసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది చేపట్టిన పెద్దనోట్ల రద్దు, ఇటీవలే అమలులోకి తెచ్చిన జీఎస్టీ ఆర్థిక రంగంపై ప్రభావం చూపాయి. మోడీ సర్కారు వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మార్గం సుగమం చేసింది. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచేందుకు మోడీ సర్కారు చేపట్టిన ‘స్వచ్ఛ భారత్‌ అభియాన్‌’ పలు ప్రాంతాల్లో సత్ఫలితాలనే ఇస్తోంది. స్వాతంత్య్రం తర్వాత ఇప్పటికి ఏడు దశాబ్దాలను పూర్తి చేసుకున్న దేశం ఏ దిశగా ముందుకు సాగుతుందో వేచి చూడాల్సిందే!



వీటిల్లో ముందున్నాం...

తృణధాన్యాలు, బెండకాయ, జామ, మామిడి, దానిమ్మ, బొప్పాయి, అరటి, టీ, ఉల్లి, నిమ్మ లాంటి వ్యవసాయ ఉత్పత్తుల్లో ఇండియా మొదటి రెండు స్థానాల్లో ఉంది.



వ్యవసాయ

ఉత్పత్తులు    ఉత్పత్తి (టన్నుల్లో)

బియ్యం    10.47 కోట్లు

గోధుమ    8.8 కోట్లు

మామిడి    1.53 కోట్లు

అరటి    1.42 కోట్లు

టీ    12.33 లక్షలు

(2015–16 గణాంకాలు)




బంగారం వినియోగంలో భారత్‌ మొదటి స్థానంలో ఉంటోంది. ఏటా 650 టన్నుల నుంచి 850 టన్నుల వరకు బంగారం వినియోగం జరుగుతోంది.



క్రీడా రంగంలో మెరుపులు

1928: ఒలింపిక్స్‌లో మన జాతీయ క్రీడ హాకీ తిరుగులేని విజయాలకు నాంది పలికింది. (1928 నుంచి 1980 వరకు భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో 8 బంగారు పతకాలు సాధించింది.)

1952: ఒలింపిక్స్‌లో భారత్‌ వ్యక్తిగత ఖాతాలో మొదటి పతకం సాధించింది. కేడీ జాదవ్‌ (రెజ్లింగ్‌)

1958: ఏసియన్‌ గేమ్స్‌లో రన్నర్‌ మిల్కా సింగ్‌ రెండు బంగారు పతకాలు సాధించారు.

1975: భారత హాకీ జట్టు వరల్డ్‌ కప్‌ సాధించింది.

1983: భారత క్రికెట్‌ జట్టు ప్రపంచ కప్‌ సాధించింది.

2000: విశ్వనాథన్‌ ఆనంద్‌ వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌ షిప్‌ సాధించారు.

2008: ఒలింపిక్స్‌ వ్యక్తిగత ఖాతాలో భారత్‌ మొదటి బంగారు పతకం సాధించింది. అభినవ్‌ బింద్రా (రైఫిల్‌ షూటింగ్‌).

2010: కబడ్డీ వరల్డ్‌ కప్‌లో భారత్‌ చాంపియన్‌గా అవతరించింది. ఆ తర్వాత జరిగిన ఐదు వరల్డ్‌ కప్‌లనూ ఇండియానే సొంతం చేసుకుంది.

2011: భారత క్రికెట్‌ జట్టు ప్రపంచ కప్‌ సాధించింది.

2012: ఒలింపిక్స్‌లో భారత్‌ ఆరు పతకాలు సాధించింది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top