తొమ్మండుగురు తోడేళ్లు

తొమ్మండుగురు తోడేళ్లు - Sakshi


బెస్ట్ కేస్

ఖమ్మంలో ఎస్‌పిగా ఉన్నప్పుడు పరిష్కరించిన కేసు నేను ఎప్పటికీ మరచిపోలేను. ఏడాదిపాటు కంటిమీద కునుకు లేకుండా చేధించిన కేసు. మహిళలపై దాడి కేసుల గురించి విన్నప్పుడల్లా నాకు ఖమ్మంలో జరిగిన సంఘటనే కళ్లముందుంటుంది. 2009లో జరిగిన సంఘటన ఇది. ఒకరోజు పొద్దునే ఫోన్‌కాల్స్ రావడం మొదలయ్యాయి. ఖమ్మం కొత్తగూడెం సిటికేబుల్‌లో బ్లూఫిల్మ్‌లు టెలికాస్ట్ చేస్తున్నారని ఫిర్యాదు. టీవీ పెట్టి చూస్తే రక్తం ఉడికిపోయే సంఘటన.



అందరూ అనుకుంటున్నట్టు అవి బ్లూఫిల్మ్ దృశ్యాలు కావు. ఒకమ్మాయిని తొమ్మిదిమంది రేప్ చేస్తున్నప్పుడు తీసిన ఫొటోలను వీడియోకింద తయారుచేశారు. బ్యాగ్రౌండ్‌లో సినిమాపాటలు పెట్టి వీడియో ప్లే చేస్తున్నారు. వెంటనే కేబుల్ ఆపరేటర్లను అరెస్ట్ చేశాం. కొందరు మార్ఫింగ్ వీడియో అన్నారు, ఇంకొందరు ఈ ప్రాంతానికి చెందిన చిత్రాలు కావన్నారు. కానీ నాకు, కొత్తగూడెం డిఎస్‌పికి ఆ రేప్ లోకల్‌దే అనిపించింది. రేప్‌కు గురైన అమ్మాయి ఫొటో ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిందో ఎంక్వైరీ చేయిస్తే అక్కడే ఒక గ్రామానికి చెందిన అమ్మాయని తెలిసింది.

 

తెలిసిన వ్యక్తి పనే...

మహిళాపోలీసులు మారువేషాల్లో అమ్మాయి దగ్గరికి వెళ్లి కౌన్సెలింగ్ చేసి, తల్లిదండ్రులను ఒప్పించి కేసు పరిష్కారానికి సహకరించమని చెప్పారు. కొద్దిగా టైం తీసుకున్నా ఒప్పుకున్నారు. మీడియావాళ్లు కూడా ఈ కేసు విషయంలో చాలా సహకరించారు. వారికి అమ్మాయి వివరాలు, కేసు వివరాలు తెలిసినా పత్రికల్లో, టీవీల్లో వార్తలు వేయకుండా సాయపడ్డారు. అమ్మాయి పేరు, వివరాలు బయటపెట్టకుండా ఆమెతో కేసు ఫైల్ చేయించాం. విషయం ఏంటంటే, అప్పటికి ఆ అమ్మాయిపై రేప్ జరిగి రెండేళ్లవుతోంది. పదో తరగతి చదువుకుంటున్న ఆ అమ్మాయి ఒకరోజు సాయంత్రం తెలిసిన వ్యక్తితో కలిసి ఆటోలో బంధువుల ఇంటికి బయలుదేరింది.



కొంత దూరం వెళ్లాక ఆటో గ్రామం శివార్లకు వెళుతుంటే ఆమె ప్రతిఘటించింది. తెలిసిన వ్యక్తి ఆమెను అరవకుండా నోరునొక్కి, చాకు చూపించి బెదిరించాడు. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లాక అక్కడ అతని స్నేహితులు మరో ఎనిమిదిమంది ఉన్నారు. ఆటో డ్రైవర్‌ని కాపలా పెట్టి తొమ్మిదిమంది అత్యాచారం చేశారు. ఈ సంఘటనను ఫొటోలు తీశారు. బాధితురాలు ఇంట్లోవాళ్లకి విషయం చెప్పింది. ఆడపిల్ల జీవితం. నలుగురికి తెలిస్తే పరువు పోతుందని నోరునొక్కుకుని ఊరుకున్నారు.



ఇలాంటి సంఘటనలు జరిగినపుడు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనే మీడియావార్తలు వింటూనే ఉంటాం. కానీ చాలామంది పోలీసులు తమ ఇంటి ఆడపిల్లకు అన్యాయం జరిగినట్టు భావించి పనిచేస్తారు.

 

24 గంటల్లో...


అత్యాచారం జరిగిన ఏడాది తర్వాత ఆ కిరాతకులు దాన్ని సీడీగా తయారుచేసి ఆ అమ్మాయికి పంపారు. మళ్లీ వాళ్లు చెప్పినచోటుకు రాకపోతే కేబుల్‌టీవీలో ప్రసారం చేస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. బాధితురాలు రానని చెప్పింది. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి తెలిసినవాడే అయినా ఏం చెయ్యలేని దుస్థితి! ఎన్నిసార్లు బెదిరించినా అమ్మాయి లొంగకపోయేసరికి వాళ్లు కేబుల్‌టీవీ ఆపరేటర్లకు డబ్బిచ్చి దీన్ని ప్రసారం చేయించారు. తన రెండేళ్ల నరకం గురించి బాధితురాలు మాకు చెప్పుకొస్తుంటే డిపార్టుమెంట్‌లో ప్రతిఒక్కరు ఆవేశంతో ఊగిపోయారు. ఆ కిరాతుకుల్ని వీలైనంత త్వరగా పట్టుకోవాలన్న పట్టుదలతో ఎవరికివారు టీమ్‌ల మాదిరిగా విడిపోయి పనిచేశారు.



కొత్తగూడెం డిఎస్‌పి, ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఇన్స్‌పెక్టర్లు, కానిస్టేబుళ్లు అందరూ ఇదేపనిలో పడ్డారు. 24గంటల్లో తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. వారిలో పద్దెనిమిదేళ్ల కుర్రాడి నుంచి యాభైఅయిదేళ్ల పెద్దమనిషి వరకూ ఉండడం సిగ్గుచేటనిపించింది. ఆ పనిచేసింది కుర్రాళ్లయితే యువత చెడు మార్గంలో పోతుందని చెప్పుకుంటాం. కానీ యాభై ఏళ్ల వయసున్న వ్యక్తులున్నారంటే ఎలాంటి సమాజంలో ఉన్నామోనని అందరం తలదించుకున్నాం.

 

అన్ని కేసులు...

అత్యాచారం చేసిన వారిని అరెస్టు చేయడంతో మాపని పూర్తవ్వలేదు. వారిచ్చిన ఫొటోలను వీడియోలా తయారుచేసిన నలుగురు కుర్రాళ్లను ఐటియాక్ట్ కింద అరెస్టు చేశాం. ఆటోడ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నాం. అందరిపై కేసులు పెట్టాం. గ్యాంగ్ రేప్, కిడ్నాపింగ్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్... అన్నీ ఫైల్ చేశాం. కొత్తగూడెం పోలీస్‌స్టేషన్‌కి కోర్టు కిలోమీటరు దూరం ఉంటుంది. మామూలుగా నిందితుల్ని కోర్టుకి జీపులోనే తీసుకెళతాం. కానీ ఈ కేసులో నేను వీరిని రోడ్డుపై అందరికీ వీళ్ల గురించి తెలిసేలా నడిపించుకుని తీసుకురమ్మన్నాను. సాక్ష్యాలన్నీ పక్కాగా ఉండాలి కదా! రెండేళ్ల తర్వాత కూడా బాధితురాలికి చేసిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అలాగే అత్యాచారానికి సంబంధించి తయారుచేసిన సీడీలో ఉన్న ఫొటోలు మార్ఫింగ్‌వి కావన్న  రిపోర్టు  కూడా వచ్చింది. కేసు సీరియస్‌నెస్‌ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టిగేషన్ డిఎస్‌పి రేంజ్ ఆఫీసర్‌కి అప్పజెప్పారు.

 

యావజ్జీవం...

ఈ బాలిక కేసుని జిల్లా జడ్జి జగన్నాథ్ రెడ్డిగారి దగ్గర్నుంచి అందరూ సీరియస్‌గా తీసుకున్నారు. కలెక్టర్ ఉషారాణి కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండు రోజులకోసారి ఎంతవరకు వచ్చిందంటూ ఎంక్వయిరీలుండేవి. మా డిపార్టుమెంట్ సంగతంటారా... అందరినీ కటకటాల వెనక్కి నెట్టేవరకూ ఎవరూ నిద్రపోయేట్టు లేరు. కేసుని ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకి తరలించారు. ఏడాది తిరక్కుండా తీర్పు వచ్చింది. తొమ్మిదిమందికి జీవితఖైదు పడింది. ఆటో డ్రైవర్‌కి పది సంవత్సరాల జైలు శిక్ష. సీడీలు చేసిన నలుగురు కుర్రాళ్లకి  ఐదేళ్లజైలు శిక్ష, యాభైవేల రూపాయల జరిమానా విధించారు.

 

అక్కడితో అయిపోలేదు...

మా దృష్టికి వచ్చిన కేసుని సాక్ష్యాలతో సహా కోర్టులో ఫైల్ చేశాక నేరస్తుడికి శిక్ష పడడంతో మామూలుగా మా పని పూర్తయిపోతుంది. కానీ ఈ కేసు విషయంలో అలా అనుకోలేదు. బాధితురాలి సంక్షేమం కోసం మేం చేయాల్సిన పనులన్నీ పూర్తిచేయాలనుకున్నాను. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అప్పటికి  2003- 28 జీవో ప్రకారం గ్యాంగ్‌రేప్ బాధితురాలికి ప్రభుత్వం లక్ష రూపాయల నష్టపరిహారం ఇస్తుంది.



ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినపుడు 25 వేలు, చార్జ్‌షీటు దాఖలు చేసినపుడు 25 వేలు, కేసు ట్రయిలర్ అయ్యాక మిగతా 50 వేల రూపాయలు ఇస్తారు. ఈ బాధితురాలికి కూడా ఆ నగదు అందేలా చేశాం. అలాగే హైదరాబాద్‌లో దుర్గాబాయి దేశ్‌ముఖ్ పాలిటెక్నిక్ కళాశాలలో మహిళా బాధితులకు 70 శాతం రిజర్వేషన్ ఉంటుంది. జిల్లా కలెక్టర్‌గారి సాయంతో ఆ బాధితురాలికి  సీటు ఇప్పించాం. ఓ స్వచ్చంద సంస్థ సాయంతో అవసరమైన కౌన్సెలింగ్‌లు చేయించాం. మొదటిసారి ఆ అమ్మాయిని చూసినపుడు బాధనిపించింది. డిప్లమా పూర్తిచేసిందని తెలిశాక సంతోషం కలిగింది.

 

కనీస బాధ్యత...

రేప్ కేసులు వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్‌కి ఈ కేసు ఫైలు ఉపయోగపడుతుందని కేసు తీర్పు కాపీని అన్ని జిల్లాల ఎస్‌పీలకు పంపించారు. కేసు పరిష్కారం తర్వాత నాకు, కొత్తగూడెం డిఎస్‌పికి, ఇన్‌స్పెక్టర్‌కి పై అధికారుల నుంచి ప్రశంసా పత్రాలు వచ్చాయి. ఇక్కడ మరోసారి నేను మెచ్చుకోవాల్సినవారు ఖమ్మం మీడియా ప్రతినిధులు. ఒక్క వార్త కూడా రాకుండా, బాధితురాలి వివరాలు నలుగురికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. మహిళలపై దాడులకు సంబంధించిన కేసుల పరిష్కారంలో పోలీసులకు మీడియా నుంచి, పబ్లిక్ నుంచి అవసరమైన సహకారం అందకపోతే మా కష్టం మొత్తం వృథా అయిపోతుందని ఈ సందర్భంగా మరొకసారి గుర్తుచేస్తున్నాను.

రిపోర్టింగ్: భువనేశ్వరి

ఫొటో: రాజేశ్

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top