ఐ లవ్ యు నాన్న...

ఐ లవ్ యు నాన్న...


పొద్దున్న లేస్తూ లేస్తూనే ఆదివారపు ఆహ్లాదం అందంగా ఆవరించుకుంది. లేచి ఫ్రెష్ అయి, రోజూ ఉండే స్కూల్, ఆఫీస్ హడావుడి లేదు కాబట్టి కాఫీ కలుపుకుని బాల్కనీలోకి వచ్చా. రెండు రోజుల క్రితమే తెచ్చిన మొక్కలకు అందంగా విరిసీ విరియని గులాబీ పూలను చూస్తుంటే, అవి పాలు కారే పసిపాప నవ్వులలా అనిపించాయి. అలా చూస్తూ ఎంతసేపు ఉన్నానో తెలీదు.

 

నా ఆరేళ్ల కూతురు ‘అమ్మా’ అంటూ వచ్చి చుట్టుకుపోయింది. మామూలుగా స్కూలుకి లేపుతుంటే లేవడానికి మారాం చేసే నా కూతురు ఆదివారం మాత్రం నేను లేపకముందే లేస్తుంది. అస్సలు సతాయించకుండా రెడీ అయిపోతుంది. వాళ్ల నాన్న రెడీ అయి వచ్చేసరికి పాలు తాగి, నీట్‌గా డ్రెస్ చేసుకుంటుంది.ఇంతకూ చెప్పలేదు కదూ! ఆదివారం మా అమ్మాయి అంత బుద్ధిమంతురాలు అవడానికి కారణం.. వాళ్ల నాన్నతో పాటు మార్కెట్‌కి వెళ్లవచ్చు. వారానికి సరిపడే స్టేషనరీ, చాక్లెట్స్, బిస్కెట్స్ తెచ్చుకోవచ్చు. అదీకాక స్పెషల్ ఐస్‌క్రీం తినిరావచ్చు కదా అందుకు.



ఆ వేళ కూడా ఇద్దరూ బ్రేక్‌ఫాస్ట్ చేసి బయలుదేరారు. ఆ క్షణం మా అమ్మాయి నవ్వులో ఎంతో సంతోషం. వాళ్లను అలా చూస్తుంటే, నాకు, మా నాన్నగారికి మధ్య ఉన్న అనుబంధం గుర్తొచ్చింది. నేను, నాన్న ఫ్రీగా మాట్లాడుకునేది చాలా తక్కువ. నా ఇద్దరు చెల్లెళ్లు నాన్నతో సరదాగా, ఫ్రీగా మాట్లాడుతుంటారు. నాకెందుకో నాన్నతో మాట్లాడాలంటే ఏదో తెలియని మర్యాదతో కూడిన భయం. కానీ నాకు, మా నాన్నగారికి మధ్య ఉన్న రిలేషన్ ప్రత్యేకమైంది. నేను చెప్పకపోయినా నా ఫీలింగ్స్ నాన్న బాగా అర్థం చేసుకుంటారు. పెళ్లయిన ఈ పదేళ్లలో ఎన్నోసార్లు నాన్నకు ‘వస్తున్నా’ అని చెప్పకుండా విజయవాడ వెళ్లి, సడన్‌గా సర్‌ప్రైజ్ ఇద్దాం అనుకునేంతలో, ‘‘బడే (పెద్దోడా)’’ అని పిలుస్తూ నాన్న ఎదురొచ్చి నన్ను సర్‌ప్రైజ్ చేసేవారు. ‘‘మీకెలా తెలుసు మేము వస్తున్నామని, ఎవరూ చెప్పలేదు కదా’’ అంటే, ‘‘నాకు అనిపించింది నువ్వు వస్తావని’’ అనేవారు.



నాకెప్పుడైనా మనసు బాగోక నాన్నకు ఫోన్ చేద్దాం అని అనుకునేలోపు నాన్నే కాల్ చేసేవారు. నంబర్ చూడగానే మనసులో ఏదో తెలియని ధైర్యం... నాన్న నాతో ఉన్నారని. నాన్న గొంతు వినగానే, టెన్షన్ మొత్తం మాయమైపోయేది. ఆయన ప్రాణం మాలోనే ఉందా అన్నట్టు బతికే నాన్నకు నేనేం చేయగలను... నాన్నంటే నాకెంత ఇష్టమో ఎలా చెప్పగలను... అని ఆలోచిస్తుంటే మొబైల్ రింగ్‌టోన్‌తో నా ఆలోచనలకు ఫుల్‌స్టాప్ పడింది. నాకు తెలుసు ఆ కాల్ కచ్చితంగా ‘నాన్న’ నుండే అని. కాల్ లిఫ్ట్ చేయగానే నేను అనే మొదటి మాట: ‘ఐ లవ్ యూ నాన్న’...

 - ఎం.డి.ముజస్సిమ్, D/o సాదిక్ హుస్సేన్, హైదరాబాద్

 



‘జిందా’ సంస్కారి

మాది హైదరాబాద్. వేసవి సెలవుల్లో మా పెద్దక్కగారింటికి వెళ్లాం. పదిహేను రోజుల తరువాత తిరిగి రైల్లో వస్తున్నాం. మేమెక్కిన కంపార్ట్‌మెంట్‌లో ఒక చిన్న సంఘటన జరిగింది. రైల్లో పల్లీలు, పండ్లు, దువ్వెనలు లాంటివన్నీ అమ్మేవాళ్లు వస్తున్నారు, వెళ్తున్నారు. అలాగే ‘జిందా తిలిస్మాత్’ చిన్న సీసాలు అమ్మే అతను వచ్చాడు. అతనికి దాదాపు పద్దెనిమిది ఏళ్లుంటాయి. ‘జిందా తిలిస్మాత్, జిందా తిలిస్మాత్’ అంటూ అరిచాడు. అది విన్న ఒకామె, ‘‘ఏం జిందా తిలిస్మాత్ అయ్యా, వెళ్లు వెళ్లు. రైల్లో ఎవరు కొంటారు దాన్ని’’ అంటూ ఛీత్కారంగా అరిచింది. అతను ఎంతో అవమానంగా ఫీలై, పక్క కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్తున్నాడు.

 

ఇంతలో ఛీత్కరించినామె కెవ్వున కేక పెట్టింది. ఆమె కిటికీ పక్కన కూర్చుని, మోచేయి కిటికీపైన పెట్టింది. కిటికీ బోల్ట్ కాస్త లూజ్ అయ్యి, ఆమె చేతిపైన పడింది. పక్క కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్తున్న అతను, ఆమె కేకకి వెంటనే వెనక్కి వచ్చాడు. అతన్ని ఛీత్కరించి రెండు నిమిషాలు గడవకముందే ఆ సీసా అవసరం ఆమెకు కలిగింది. ఆ కుర్రాడు  ఒక సీసా వంపి, ఆమె మోచేతిపైన రాసి మసాజ్ చేశాడు. అతనికి ఆమె సారీ చెప్పలేదు. కనీసం సీసా డబ్బులు కూడా ఇవ్వలేదు. అతను డబ్బులు అడగనూలేదు. అతని సంస్కారానికి ఎంతో ముచ్చటేసింది.

 - ఎస్.ఇందిరా నాగేంద్ర,  వనస్థలిపురం, హైదరాబాద్

 

ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు,మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి.



మా చిరునామా: తపాలా, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34.  funday.sakshi@gmail.com

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top