అదృశ్య శక్తి సాధ్యమేనా?

అదృశ్య శక్తి సాధ్యమేనా? - Sakshi


ప్రయత్నం

అదృశ్య శక్తులతో రాకాసి మూకలు చెలరేగి సాగించే యుద్ధబీభత్స ఘట్టాలను పురాణాల్లో చదువుకునే ఉన్నాం. అలనాడు రామాయణ కాలంలో మారీచుడు, ఇంద్రజిత్తు, మహాభారత కాలంలో అలంబసుడు, ఘటోత్కచుడు వంటి వారు అదృశ్య యుద్ధాలలో ఆరితేరిన వీరులు. మాయలు, మంత్రాల శక్తులతో వారు కంటికి కనిపించకుండా, శత్రువులను ముప్పు తిప్పలు పెట్టేవారు. అదంతా పురాణకాలం.



అప్పట్లో మంత్రాలకు చింతకాయలేం ఖర్మ, ఏకంగా తలకాయలే తాటికాయల్లా తెగిపడేవి. పురాణకాలం గతించి, నవీనకాలం వచ్చింది. నవీనకాలంలో మనుషులు తెలివి మీరారు. యుద్ధవిద్యల్లో మార్పులు వచ్చాయి. కత్తులు, కటార్లు, బరిసెలు, ఈటెలు, గదలు, ధనుర్బాణాలు వంటి ఆయుధాలు రంగస్థలానికీ, సినీరంగానికే పరిమితమయ్యాయి.



ఆధునిక రణరంగాలలోకి తుపాకులు, ఫిరంగులు, బాంబులు కురిపించే యుద్ధవిమానాలు, క్షిపణులు, రాకెట్లు వచ్చి పడ్డాయి. దివ్యాస్త్రాలు ఉన్నాయో లేదో నవీన మానవులకు తెలియదు గానీ, అణ్వస్త్రాలు సృష్టించే బీభత్సం మాత్రం హిరోషిమా, నాగసాకిల సాక్షిగా బాగానే తెలుసు. ఆధునిక కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. అయితే, అక్కడితోనే యుద్ధకాండ సమసిపోలేదు. అంతర్యుద్ధాలు, శీతల యుద్ధాలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.



వీటికి తోడు అత్యంత శాంతికాముకులైన అగ్రరాజ్యాలు శాంతిస్థాపన కోసం, ఉగ్రవాద నిర్మూలన కోసం సాగించే యుద్ధాలు సరేసరి! అధునాతన యుద్ధకాండ మరీ మొనాటనస్‌గా మారిపోతోందని అగ్రరాజ్యమైన అమెరికా దిగులు పెట్టేసుకున్నట్లుగా ఉంది. యుద్ధరంగంలో మొనాటనీని బద్దలు కొట్టేందుకు పురాణ రణతంత్రాన్నే వినూత్నంగా తెరపైకి తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అదృశ్య యుద్ధాలతో కంటికి కనిపించకుండానే శత్రువులను తుదముట్టించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.



ఏడాదిన్నర వ్యవధిలోనే తన సైనికులకు అదృశ్య కవచాలను సమకూర్చేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే ఈ అదృశ్య కవచాలు, ఊసరవెల్లి మాదిరిగా పరిసరాలకు తగినట్లుగా రంగులు మార్చేసుకుంటాయి. వాటి ప్రభావంతో వాటిని ధరించిన సైనికులు ఇతరులకు కనిపించరు. ఎడారులు, అడవులు, పర్వత ప్రాంతాలలోనే కాదు, పట్టణ ప్రాంతాల్లో సైతం ఈ అదృశ్య కవచాలు సునాయాసంగా రంగులు మార్చేసుకోగలవు.



వీటి బరువు కూడా ఒకటిన్నర కిలోల లోపే ఉంటుంది కాబట్టి సైనికులకు కూడా పెద్దగా భారం కాదు. అదృశ్య కవచాలకు విద్యుత్తు సరఫరా చేసే పరికరాలు దానిలోనే ఉంటాయి. ఆ పరికరాల బరువు అరకిలో లోపే ఉంటుంది. కెనడాకు చెందిన హైపర్‌స్టీల్త్ బయోటెక్నాలజీ సంస్థ ఇప్పటికే ఈ అదృశ్య కవచాల నమూనాలను అమెరికన్ మిలటరీ సైంటిస్టులకు ప్రదర్శించింది. వారు అందులో మరిన్ని మార్పులను కోరుకున్నారు. వారు కోరుకున్న మార్పులతో తుది నమూనా రూపొందించడానికి దాదాపు ఏడాదిన్నర పడుతుందని కెనడా సంస్థ చెబుతోంది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top