మొదటి ప్రపంచ యుద్ధం ఘోరానికి నూరేళ్లు

మొదటి ప్రపంచ యుద్ధం ఘోరానికి నూరేళ్లు


కాలం గుండెల లో ఎప్పటికీ మానని గాయాన్ని మిగిల్చిన ఘటన అది. అత్యాధునిక ఆయుధాలూ, యూనిఫారాలూ ధరించిన రాతియుగపు మనుషులు చేసిన ‘మొదటి ఆధునిక యుద్ధ’మది. కాలం మీద అది తవ్విన రక్తకాసారాలు ఇప్పటికీ కమురు కంపును వెదజల్లుతూనే ఉన్నాయి.  అది చరిత్రను రోదింప చేసిన పెను విషాదం.  భవిష్యత్ తరాలు నిర్వేదంతో నవ్వుకునేటట్టు చేసిన పెద్ద ప్రహసనం కూడా అదే. ‘సకల యుద్ధాలకూ స్వస్తి చెప్పడానికి’ మొదలైనా, ఆ విఫల యత్నానికి పది లక్షల మందిని బలి చేసిన ఘోర యుద్ధమది. ప్రపంచ మానవాళి మీద చేదు జ్ఞాపకాల గుచ్ఛాన్ని విసిరి వెళ్లిపోయింది. ఆ మహా సమరంలో విజయం నెత్తుటి ధారలదీ, కన్నీటి చారికలదే. ఆధునిక చరిత్ర పొడవునా  ఆ  పీడకలల ఊరేగింపు ఆ యుద్ధం ఫలితమే. అదే నూరేళ్ల నాటి మొదటి ప్రపంచ యుద్ధం. గ్రేట్‌వార్.

 

కందకాలు

మొదటి ప్రపంచ యుద్ధం అనగానే మొదట గుర్తుకు వచ్చేవి కందకాలు లేదా ట్రెంచ్‌లు. ఎనిమిది లేదా తొమ్మిది అడుగుల లోతున, ఐదడుగుల వెడల్పున మైళ్ల కొద్ది వాటిని తవ్వి అందులో నుంచే యుద్ధం చేశారు. అయితే ఇవి భూలోక నరకాలను మరిపించేవి. వర్షం, మంచుతో ఇవి మోకాలిలోతు బురదతో ఉండేవి. ఎలుకలు లక్షలలో ఉండేవి. ఎక్కడ చూసినా శవాలు, వాటి నుంచి వస్తున్న కుళ్లిన వాసన. కందకాల పక్కనే తవ్వే మరుగుదొడ్ల నుంచి వచ్చే దుర్గంధం మరొకటి.  శవాల కళ్లు, కాలేయాలు తిని ఎలుకలు అసాధారణ పరిమాణంలోకి ఎదిగిపోయేవి. యుద్ధాన్ని రొమాంటిక్‌గా ఊహించుకుని వచ్చిన కుర్రాళ్లకీ, స్వచ్ఛంద సైనికులకీ వీటితో జీవితం మీద విరక్తి పుట్టిందంటే అతిశయోక్తి కాదు.



కందకంలోకి ప్రవేశించాక నా కాళ్లు ఎప్పుడూ పొడిగా లేవు అని రాసుకున్నాడొక సైనికుడు. ఈ భూమ్మీదకి ‘ట్రెంచ్‌ఫుట్’ ఒక కొత్త రోగాన్ని అవి తెచ్చాయి. కందకాల నుంచి ఆనాటి సైనికులు రాసిన ఉత్తరాలలో వాటిలోని స్థితిగతుల గురించి కలచివేసే, కంటి నీరు తెప్పించే అనేక వర్ణనలు ఉన్నాయి.

 

మొదటి ప్రపంచ యుద్ధం (జూలై 28, 1914-నవంబర్ 11, 1918) ఓ అగ్ని పర్వతంలా బద్ధలైన ఆకస్మిక ఘటన కాదు. దాదాపు నలభయ్ సంవత్సరాల వ్యవధిలో యూరప్‌లో సంభవించిన అనేక వికృత రాజకీయ, సైనిక పరిణామాలకు పరాకాష్ట. 1871 నుంచి జరిగిన యుద్ధాలూ, కుటిలత్వాన్ని రంగరించుకున్న దౌత్యాలూ, రహస్య ఒప్పందాల కారణంగా 1909 ప్రాంతానికే ఆ ఖండం రణ దాహంతో తహ తహలాడిపోతున్న రెండు శత్రు శిబిరాలుగా చీలిపోయింది. ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, జపాన్ ఒక శిబిరంలో చేరాయి. జర్మనీ, ఆస్ట్రియా-హంగెరీ ద్వంద్వ రాజరికం, టర్కీ, ఇటలీ (యుద్ధం వేళకి ఇంగ్లండ్ వైపు జరిగింది) వైరి శిబిరంగాను అవతరించాయి.

 

ఇందులో ‘సూర్యుడు అస్తమించని’ దేశం ఇంగ్లండ్. ‘సూర్యుడి మీద స్థానం’ అని నినాదం అందుకున్న దేశం జర్మనీ. ‘ప్రపంచాధిపత్యం లేదా పతనం’ అంటూ జర్మనీ ఇంకో ఉప నినాదాన్ని కూడా  స్వీకరించింది. ఇవన్నీ కలిసి ఆ ఖండాన్ని మందుగుండు గోదాములా మార్చేశాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అపారమైన వ్యయంతో నిర్మించుకున్న మారణాయుధాల గుట్టలతో ఆ గోదామును నింపేశాయి. ఓ చిన్న రివాల్వర్ పేల్చి దానికి నిప్పు ముట్టించినవాడే గవ్‌రిలో ప్రిన్సిప్.

 

 సరాయేవో జంట హత్యలు


 ‘మా ప్రథమ శత్రువు ఆస్ట్రియా పాలకుడు’ - నరోద్నా ఓద్‌బ్రానా.

 ‘ఆస్ట్రియా పాలక హాబ్స్‌బర్గ్ వంశీకులు ఎవరు కనిపించినా చంపుతాం’- బ్లాక్‌హ్యాండ్.

బోస్నియా, హెర్జిగోవినా పాలనా కేంద్రం సరాయేవో నగరం గోడలన్నీ ఇలాంటి రాతలతో, పోస్టర్లతో నిండిపోయి, ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్న సమయంలో ఆస్ట్రియా-హంగెరీ ద్వంద్వ రాజరికానికి వారసుడు, హాబ్స్‌బర్గ్ వంశీకుడు ఫ్రాంజ్ ఫెర్డినాండ్.. భార్య సోఫీ చోటెక్‌తో కలసి అక్కడికే వచ్చాడు. సరాయేవో శివార్లలోనే ఉన్న ఫిలిపోవిక్ సైనిక శిబిరంలో ఉన్న 70,000 ఆస్ట్రియా సేన సంసిద్ధతను, తర్ఫీదును పరీక్షించే పేరుతో ఆ ప్రాంత గవర్నర్ జనరల్ ఆస్కార్ పొటియోరిక్  కావాలని యువరాజును రప్పించాడు.

 

ఈ పని ముగిశాక సరాయేవో సిటీ హాలు(విజేనికా)లో ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి ఫెర్డినాండ్ హాజరు కావలసి ఉంది. ఏ111 118 నెంబరు నలుపు రంగు 3 గ్రాఫ్ అండ్ స్టిఫ్ట్ స్పోర్ట్స్ కారులో మిల్జాకా నది ఒడ్డునే యాపిల్‌కే మార్గంలో గవర్నర్ పొటియోరిక్, ఫెర్డినాండ్ దంపతులు హాలుకు వెళుతుండగా ఒక యువకుడు డైనమైట్ విసిరాడు. అది తృటిలో తప్పి వెనుక కారు ముందు పడి పేలింది. అయినా ఫెర్డినాండ్  సన్మానానికి హాజరైనాడు.

 

తిరిగి వస్తుంటే  మిల్జాకా నది మీదే ఉన్న లాటిన్ బ్రిడ్జికి  ఎదురుగా, షిల్లర్ మార్కెట్ అనే తినుబండారాల దుకాణం ముందు రాజ దంపతులను ప్రిన్సిప్  (బెల్జియంలో తయారైన 9ఎ- 17 ఎం ఎం (.380 ఎసిపి) ఫాబ్రిక్ నేషనల్ మోడల్, 1910 సెమీ ఆటోమేటిక్ పిస్తోలుతో) కాల్చి చంపాడు. ప్రిన్సిప్ బ్లాక్‌హ్యాండ్ రహస్యోద్యమ సంస్థ సభ్యుడే. ‘సోఫీ! నువ్వు పిల్లల కోసం బతకాలి’ అంటూనే ఫెర్డినాండ్ చనిపోయాడు. కొన్ని నిముషాలకు సోఫీ కూడా మరణించింది. అప్పటికి ఆమె గర్భవతి. ఆ ఇద్దరిదీ గొప్ప ప్రేమ కథ. వారి పెళ్లికి రాచరికం అంగీకరించలేదు. రాజ్యం అక్కరలేదని హెచ్చరించాక కొన్ని షరతుల మీద (మోర్గనాటిక్ మ్యారేజ్) పెళ్లి చేశారు.

 

ఎవరీ గవ్‌రిలో ప్రిన్సిప్?

సెర్బు జాతీయవాది ఇతడు. మొదటి ప్రపంచ యుద్ధంలో పేలిన మహా మారణాయుధాల కంటె ఇతడు పేల్చిన చిన్న రివాల్వర్ శబ్దమే చరిత్రను కంపించేలా చేసింది. యువరాజు ఫెర్డినాండ్‌ను హతమార్చాలని బ్లాక్‌హ్యాండ్, నరోద్నా ఓద్‌బ్రానా వంటి సెర్బు ఉగ్రవాద సంస్థలు కొన్ని నెలల నుంచి వేసిన పథకం వలెనే, హాబ్స్‌బర్గ్ వంశంతో, ఆస్ట్రియా ఆధిపత్యంతో సెర్బులకున్న వైరం కూడా లోతైనది.

 

గవ్‌రిలో బోస్నియాలోని గ్రహావా లోయలోని ఒబ్లజాజ్ గ్రామంలో పుట్టాడు. తండ్రి జావో ప్రిన్సిప్, ఇతర కుటుంబ సభ్యులంతా ఉద్యమకారులే. జూన్ 28, 1398న జరిగిన కొసావో యుద్ధంలో సెర్బు వీరుడు లాజరస్ చనిపోయినప్పటి నుంచి వీరి పోరాటం సాగుతోంది. విదోవ్‌దన్ పేరుతో ఆ రోజును అప్పటి నుంచి ప్రతి ఏటా తలుచుకుని పండుగ చేసుకుంటారు.  అప్పటి నుంచి సెర్బుల చాలా భూభాగాలతో పాటు మాంటెనీగ్రో, గ్రీస్, బల్గేరియా వంటి బాల్కన్ ప్రాంతాలన్నీ టర్కీ వశమైనాయి. తరువాత టర్కీ బలహీన పడడంతో 1878లో జరిగిన బెర్లిన్ కాంగ్రెస్‌లో కొన్ని ప్రాంతాలను ఇతర రాజ్యాల అధీనంలో ఉంచారు. అలా బోస్నియా, హెర్జిగోవినా ప్రాంతాలు ఆస్ట్రియా చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్ అధీనంలోకి వచ్చాయి. వీటిని కలిపి, పొరుగునే ఉన్న సెర్బియా, దానికి సమీపంలోని కొసావోనూ కలుపుకుని ‘విశాల సెర్బియా’ను ఏర్పాటు చేయాలన్నదే సెర్బుల ఉద్యమం ఉద్దేశం. అదే ఈ అశాంతికి కారణం.  అంటే ఆరు దశాబ్దాల నుంచి సెర్బులు చేస్తున్న పోరాటానికి ఇది పరాకాష్ట. సెర్బులు అంటే ఐరోపా దక్షిణాది స్లావ్ జాతీయులే.

 

ఆ కారణంతో జారిస్ట్ రష్యా సెర్బుల ఉద్యమానికి చిరకాలంగా దన్నుగా నిలబడింది. యువరాజు విజేనికా హాలుకు వెళుతుండగా డైనమైట్ విసిరిన మరొక యువకుడు కూడా బ్లాక్‌హ్యాండ్ సభ్యుడే. పేరు- నెడెల్కో కాబ్రినోవిక్.  యువరాజు ప్రయాణించిన యాపిల్‌కే దారిలో బాసిక్, ప్రిన్సిప్ సహా ఎనిమిది మందిని ఆయుధాలతో రహస్య సంస్థలు నిలబెట్టాయి. నిజానికి ఈ పథక రచన అంతా సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లోనే కల్నల్ డ్రాగూటిన్ సమక్షంలోనే జరిగింది. ఆయుధాలు కూడా అక్కడ నుంచే రహస్యంగా వచ్చాయి. సరిగ్గా విదోవ్‌దన్ పండుగ నాడే జూన్ 28, 1914- ఫెర్డినాండ్ సెర్బుల భూభాగంలో పర్యటనకు వచ్చాడు. కాబట్టి అతడు తిరిగి వెళ్లవలసింది- ఆస్ట్రియా రాజధాని వియన్నాకు కాదు, పైలోకాలకే అని సెర్బు జాతీయవాదులు నిశ్చయించుకున్నారు.

 

యుద్ధారంభం

తన కుమారుడు అనుమానాస్పద స్థితిలో చనిపోతే, తమ్ముడు కొడుకు ఫెర్డినాండ్‌ను ఆస్ట్రియా చక్రవర్తి జోసెఫ్ యువరాజుగా ప్రకటించాడు. అతడు కూడా ఇలా దుర్మరణం చెందడం ఆ వృద్ధ చక్రవర్తిని తీవ్రంగా బాధించింది. ‘భగవదేచ్ఛ ఇలా ఉంది!’ యువరాజు మరణవార్తను మోసుకువచ్చిన టెలిగ్రామ్ చూశాక జోసెఫ్ అన్న మాట ఇదే. ఎనభయ్ ఏళ్ల జోసెఫ్  గొప్ప నిర్వేదంలో పడిపోయాడు. కానీ ఆస్ట్రియాకు సన్నిహితుడు, ఫెర్డినాండ్ మిత్రుడు, జర్మనీ చక్రవర్తి విల్‌హెల్మ్ రంగంలోకి దిగి సెర్బియాకు గుణపాఠం చెప్పే పనికి ఆస్ట్రియాను సిద్ధం చేశాడు. జూలై 5, 1914న విల్‌హెల్మ్ ఆస్ట్రియాకు ‘బ్లాంక్ చెక్’ ఇచ్చాడు. సెర్బియా టర్కీకి పక్కలో బల్లెం మాదిరిగా ఉంది.

 

దీనితో ఈ విధంగా సెర్బియాను లొంగదీయాలని  విల్‌హెల్మ్ పాచిక పన్నాడు.  టర్కీ అండతో విల్‌హెల్మ్ బాగ్దాద్-బెర్లిన్ రైలు మార్గాన్ని నిర్మించాడు. చమురు రవాణాయే దీని ఉద్దేశం. అక్కడి చమురు నిల్వల మీద ఆనాడే విల్‌హెల్మ్ కన్నేశాడు. ఆ క్రమంలో అతడు ‘ఇస్లాం పరిరక్షకుడు’ అంటూ తనను తాను చిత్రించుకున్నాడు. జర్మనీ అండతో ఆస్ట్రియా జూలై 23, 1914న సెర్బియాకు అల్టిమేటం జారీ చేసింది. కుట్రదారులను ఆస్ట్రియాకు అప్పగించాలన్న షరతు సహా 10 షరతులను విధించింది. వాటిని ఏ దేశమూ ఆమోదించలేదని ఆస్ట్రియాకు తెలుసు. సెర్బియాను యుద్ధంలోకి దించే వ్యూహంలో భాగంగానే ఆ అల్టిమేటం పంపారు. అయినా రెండు తప్ప మిగిలిన షరతులను సెర్బియా ఆమోదించింది. అయినా ‘ధిక్కారం’ పేరుతో ఆస్ట్రియా జూలై 28న సెర్బియా మీద యుద్ధం ప్రకటించింది. ఆస్ట్రియా ఉనికి బాల్కన్ ప్రాంతాలు లేదా సెర్బుల భూభాగాల మీద విస్తరించడం ఇష్టం లేని రష్యా ఆ మరునాడే సేనల తరలింపును ఆరంభించింది.

 

ఈ దూకుడు ఆపాలని హెచ్చరిస్తూ జర్మనీ ఆగస్టు 1, 1914న రష్యా మీద యుద్ధం ప్రకటించింది. అయితే మొదట జర్మనీ తన సేనను నడిపించినది మాత్రం ఫ్రాన్స్ దిశగా. ష్లీఫెన్ పథకం ప్రకారం రష్యా, ఫ్రాన్స్‌లను ఏకకాలంలో దాసోహమనిపించుకోవాలని జర్మనీ వ్యూహం. దారిలో ఉన్న లక్సెంబర్గ్ విధ్వంసం, తరువాత పక్కనే ఉన్న బెల్జియం విధ్వంసం వరసగా జరిగిపోయాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు దాదాపు నలభయ్ కిలోమీటర్ల దూరంలోని మోన్స్ వరకు జర్మనీ సేనలు వచ్చేశాయి. అదో అత్యంత శక్తిమంతమైన సేన. తటస్థ దేశమైన బెల్జియం మీద దాడికి నిరసనగా ఆగస్టు 4న ఇంగ్లండ్ జర్మనీ మీద యుద్ధం ప్రకటించి, సేనలను ఇంగ్లిష్ చానెల్ మీదుగా ఫ్రాన్స్ వైపు కదిలించింది.   మోన్స్ (ఫ్రాన్స్ సరిహద్దు) దగ్గర ఇంగ్లండ్, ఫ్రాన్స్ సేనలు జర్మనీతో తలపడి ఆపాయి. యుద్ధంలో ప్రతిష్టంభన ఏర్పడింది. భూ ఉపరితలం మీద నిలబడి ఎక్కువ సమయం యుద్ధం చేయడం సాధ్యం కాలేదు. అయితే వెనక్కు తగ్గే యోచన ఎవరికీ లేదు. దీనితో అవసరమైనవే కందకాలు (ట్రెంచ్‌లు). ఫ్రాన్స్ సరిహద్దు నుంచి బెల్జియం సరిహద్దుల వరకు దాదాపు ఏడు వందల కిలోమీటర్ల మేర ఈ కందకాలు తవ్వి అందులో ఉండి సైన్యాలు నాలుగేళ్లు యుద్ధం చేశాయి.

 

లూసిటేనియా పేల్చివేత: అమెరికా ప్రవేశం

ఇటలీ మొదట జర్మనీ శిబిరంలోనే ఉన్నా, సంవత్సరం తరువాత యుద్ధ ఫలితాలను బట్టి ఇంగ్లండ్ శిబిరం వైపు మారింది. ఇక ‘యూరప్ దగ్ధమైతే మనకేమిటి?’ అన్నదే మొదట అమెరికా అనుసరించిన విధానం. కానీ లూసిటేనియా నౌక పేల్చివేత (మే 7, 1915) అంతిమంగా అమెరికాను యుద్ధంలోకి దిగేటట్టు చేసింది.  ఇదొక ఘోరమైన సంఘటన. ఇంగ్లండ్‌కు చెందిన ఈ నౌక టైటానిక్ వంటిదే. న్యూయార్క్ నుంచి మే 1, 1915న అట్లాంటిక్ సాగర జలాలలో లివర్‌పూల్‌కు బయలుదేరిన ఈ నౌకలో 1,248 షెల్స్ (యుద్ధంలో ఉపయోగించే శక్తిమంతమైన బాంబులు) ఉన్నాయని ఆరోపణ. ఐరిష్ తీరానికి 8 మైళ్ల దూరంలోనే జర్మనీకి చెందిన యూ-బోట్ యూ-20 టార్పెడోను ప్రయోగించి పేల్చివేసింది. నౌకలో ఉన్న 1,924 మందిలో 1,119 మంది చనిపోయారు. అందులో అమెరికన్లు 128 మంది.  ఈ నౌకలో ప్రయాణించవద్దని అప్పుడు అమెరికా పత్రికలు అన్నింటిలోను జర్మనీ ప్రకటనలు ఇవ్వడం విశేషం. ఈ నౌకా మార్గ రక్షణ వ్యవహారాలు చూస్తున్నవాడు అప్పటి ఇంగ్లండ్ నౌకా విభాగం అధిపతి  విన్‌స్టన్ చర్చిల్.  కానీ అమెరికాను యుద్ధంలో దించేందుకు కావాలనే టార్పెడోను నౌక వైపు మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. 1917లో  ఎన్నికలు ముగిసిన తరువాత అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ఏప్రిల్ 6న జర్మనీ మీద యుద్ధం ప్రకటించాడు.

 

యుద్ధ రంగాలు

మొదటి ప్రపంచ యుద్ధం పశ్చిమ యుద్ధరంగం (ఫాన్స్- బెల్జియం మధ్య) తూర్పు యుద్ధం రంగం (రుమేనియా-రష్యా మధ్య) ఇటాలియన్ ఫ్రంట్, గల్లిపోలీ (టర్కీ) కేంద్రాలుగా జరిగింది. కానీ ఈ యుద్ధంలో అనేక చిన్న చిన్న యుద్ధాలు కనిపిస్తాయి. మోన్స్ యుద్ధం మొదలు  మార్నే, టానెన్‌బర్గ్, అర్రాస్, ఐపర్, వెర్డన్, జట్లాండ్, సొమ్మె, పాశ్‌చాండల్ వంటి అనేక యుద్ధాలు కనిపిస్తాయి. ప్రతి యుద్ధం ఘోరమైనదే.  నాలుగేళ్ల పాటు సగటున గంటకు  230 మందిని బలి తీసుకున్న ఘోర యుద్ధమిది. అర్రాస్ యుద్ధంలో విజయం సాధించి పెట్టి కెనడా (నాడు బ్రిటిష్ వలస) స్వతంత్ర దేశమైంది.

 

నాలుగేళ్లు సాగిన ఈ యుద్ధం చరిత్ర మీద ఏ విప్లవమూ వేయలేనంత ముద్రను వేసింది. వ్యవస్థలను తలకిందులు చేసింది.  యుద్ధానికి అంకురార్పణ చేసిన జర్మనీ, దాని ప్రోద్బలంతో యుద్ధాన్ని ఆరంభించిన ఆస్ట్రియా-హంగెరీ, పరోక్ష కారణమైన టర్కీ, సెర్బులకు అండగా, జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగిన రష్యా - ఆ నాలుగు మహా సామ్రాజ్యాలు కూలిపోయాయి. రష్యాకు లెనిన్ నాయకత్వం వచ్చింది అప్పుడే. చిత్రం ఏమిటంటే-  ఈ ఘోర యుద్ధంలో అంతిమ విజేతలు సెర్బులే. అయితే ఇది చరిత్రలో అంత ప్రాధాన్యం లేని విషయంగా మిగిలిపోయింది. కొన్ని శతాబ్దాల విశాల సెర్బియా స్వప్నం సాకారమౌతూ  సెర్బియాను కలుపుకుని కింగ్‌డమ్ ఆఫ్ సెర్బ్స్, క్రొయేట్స్ అండ్ స్లొవేన్స్ ఆవిర్భవించింది. అప్పటికి కొద్ది నెలల క్రితమే ఏప్రిల్ 28, 1918న టెరిజిన్ సైనిక కారాగారం (ప్రాగ్ శివార్లలో ఉంది)లో  గవ్‌రిలో ప్రిన్సిప్ చనిపోయాడు. కానీ కింగ్‌డమ్ ఆఫ్ సెర్బ్స్ ఆవిర్భవించిన ఆ క్షణంలో కారాగారం  పరిసరాలలోని ఓ శ్మశాన వాటికలో జైలు అధికారి పుణ్యమా అని రహస్యంగా ఖననమైపోయి, గుప్తంగా ఉన్న  గవ్‌రిలో సమాధిలో ప్రేతాత్మ ముఖం మీద ఓ చిరునవ్వు విరిసి ఉండాలి! కానీ 1915 నుంచి దాదాపు 1938 చివరి వరకు నిర్మించిన కొన్ని లక్షల యుద్ధ మృతుల సమాధుల కింద ఉన్న ఆత్మలు మాత్రం ఇప్పటికీ కుమిలిపోతూనే ఉండి ఉండవచ్చు.

 - డా॥గోపరాజు నారాయణరావు

(గ్రేట్ వార్ ఘటనల ఆధారంగా ఈ వ్యాసకర్త రాసిన నవల ‘క్రిస్మస్‌చెట్టు’ ప్రస్తుతం కినిగె డాట్ కామ్ వెబ్‌సైట్‌లో లభ్యమవుతోంది.)

 

బ్రిటిష్ ఇండియా సేనలు పది లక్షలు

మొదటి ప్రపంచ యుద్ధంతో బ్రిటిష్ ఇండియా ప్రమేయం తక్కువదేమీ కాదు. పది లక్షల సైన్యం, మూడు లక్షల ఇతర సిబ్బంది యుద్ధ రంగాలకు వెళ్లారు. అందులో 62,000 మంది చనిపోయారు. యుద్ధం తరువాత చనిపోయిన వారిని కలిపితే మొత్తం 74,187 మంది. 67,000 మంది గాయపడ్డారు. (ఆ దారుణ యుద్ధంలో చనిపోయిన మొత్తం సైనికుల సంఖ్య పది లక్షలు.) ఫ్రాన్స్, ఈజిప్ట్, గల్లిపోలీ, మెసపుటేమియా యుద్ధ రంగాలలో వీరు ఎక్కువగా పోరాడారు. ఐపర్ యుద్ధంలో పాల్గొన్న భారత సిపాయీ ఖుద్‌అదాద్ ఖాన్ ఆ యుద్ధంలో విక్టోరియా క్రాస్‌ను అందుకున్నాడు. ఇంతకీ 1902లో బ్రిటిష్  ఇండియా సైనిక దళాల సర్వ సేనానిగా ఉన్న లార్డ్ కిష్నర్ యుద్ధ సమయంలో ఇంగ్లండ్ ప్రభుత్వంలో యుద్ధ మంత్రిగా పని చేశాడు. ఇతడి పిలుపు మేరకే కొన్ని లక్షల మంది బాలలు యుద్ధంలో చేరారు. మూడు ఖండాలలో, దాదాపు 33 దేశాల సైన్యాలు గ్రేట్‌వార్‌లో తలపడ్డాయి.

 

భారత్-మహాయుద్ధం

ఇంగ్లండ్ వలసగా భారతదేశం ఈ యుద్ధంలో పాల్గొన్నది. ముఖ్యంగా పంజాబ్ శక్తి మేరకు సాయం చేసింది. అప్పటిదాకా అరవై వేలు ఉన్న సిక్కు సైన్యం, మొదటి ప్రపంచ యుద్ధంలో చేరండి అంటూ ఇంగ్లండ్ ఇచ్చిన పిలుపునకు తీవ్రంగా స్పందించింది. ఆ సంఖ్య మూడు లక్షలకు చేరింది. అలాగే పది లక్షల రూపాయల వార్ బాండ్లు పంజాబ్‌లోనే అమ్ముడుపోయాయి. ఫ్రాన్స్‌లో సిక్కు సైనికులు పడిన వేదన కొన్ని ఉత్తరాలలో నిక్షిప్తమై ఉంది.

 

అంహిసాయుత పథంలో భారత స్వాతంత్య్రోద్యమాన్ని నడుపుతున్న మహాత్మా గాంధీ ఈ యుద్ధానికి బేషరతు మద్దతు ప్రకటించి విమర్శల పాలైనారు. నిజానికి ఆయన ఎప్పుడు ఇంగ్లండ్ యుద్ధంలో దిగినా స్వచ్ఛందంగా సేవలు అందించాడు. 1906 నాటి జులూ యుద్ధం, బోయర్ యుద్ధంలోనూ ఆయన ఆంగ్లేయులకు తన వత్తాసు పలికాడు. దీనిని అనిబిసెంట్ వంటి వారు కఠిన పదజాలంతో విమర్శించారు కూడా. 1918 ఏప్రిల్‌లో వైస్రాయ్ జరిపిన యుద్ధ గోష్టిలో తీసుకున్న నిర్ణయం మేరకు గుజరాత్ అంతా తిరిగి గాంధీ యువకులను పోగు చేయడానికి ప్రయత్నించి విఫలమైనాడు. ఊరికి పది మంది అంటూ ఆయన ఇచ్చిన నినాదం అపహాస్యానికి గురైంది. మొత్తం పది మంది కూడా రాలేదు. అయితే భారతీయ సైనికులను ఆ యుద్ధంలో ఉపయోగించుకునే హక్కు ఇంగ్లండ్‌కు లేదనీ, ఒకవేళ ఉపయోగించుదలుచుకుంటే దేశానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చే విషయం మీద ఒక హామీ ఇవ్వాలనీ మహమ్మదాలి జిన్నా కోరాడు. నిజాం నవాబు సహా, దేశంలోని ఎందరో సంస్థానాధీశులు యుద్ధానికి నిధులూ, సైనికులను సమకూర్చి పెట్టి ప్రభు భక్తిని చాటుకున్నారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top