మాయాపటం

మాయాపటం - Sakshi


నిజాలు దేవుడికెరుక: మనిషి జీవితం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అంటుంటారు పెద్దలు. అసలు నమ్మకం అంటే ఏమిటి? ఉన్నదాన్ని ఉన్నదని అనుకోవడమా?  లేనిదాన్ని కూడా ఉన్నదని ఒప్పుకోవడమా?  మొదటి ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు. కానీ రెండో ప్రశ్నకు సమాధానం ఇంతవరకూ తెలియలేదు. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ఎన్నో విషయాలు నమ్మదగనట్టుగా, అనుమానాస్పదంగా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇదొకటి.

 

 ‘‘మెర్సీ... ఓసారి ఇలారా’’... ఇంట్లోకి వస్తూనే భార్యను పిలిచాడు వివియన్.  ‘‘అబ్బా... ఎప్పుడూ ఏదో ఒక విధంగా తొందర పెడుతూనే ఉంటావు నువ్వు’’... ముద్దుగా విసుక్కుంటూ హాల్లోకి వచ్చింది మెర్సీ. ‘‘అంత విసుక్కోకోయ్... ప్రతిదీ నీకు చెప్పకుండా ఉండలేకపోవడం నా బలహీనత. ఏం చెయ్యమంటావ్ చెప్పు!’’ ‘‘ఆ చాలు కాకా పట్టింది. ఏంటి విషయం’’ అంది మెర్సీ నవ్వుతూ. ‘‘ఓసారి దీన్ని చూడు’’ అంటూ తన చేతిలోని ప్యాకెట్‌ని చూపించాడు. ‘‘ఏంటది’’ అందామె ఆసక్తిగా. తన చేతిలో ఉన్నదానికి చుట్టివున్న రంగు కాగితాన్ని జాగ్రత్తగా విప్పాడు వివియన్. ‘‘ఇప్పుడు చూడు’’ అన్నాడు ఆమెవైపు చూస్తూ. అతడి చేతిలో ఉన్న పెయింటింగ్‌ని చూస్తూనే... ‘‘వావ్, సూపర్బ్‌గా ఉంది వివ్’’ అంది సంబరంగా. ‘‘కదా... అందుకే నిన్ను పిలిచాను’’ అంటూ భార్య చేతికి దాన్ని అందించాడు. అపురూపంగా అందుకుందామె. దాన్ని శ్రద్ధగా పరిశీలించింది. ఓ చిన్నపిల్లాడు... లేత నీలం రంగు చొక్కా, ఆలివ్ రంగు నిక్కరు, అదే రంగు బూట్లు వేసుకున్నాడు. మూసివున్న తలుపు ముందు నిలబడివున్న ఆ బుజ్జిగాడి పక్కన ఓ ఆడపిల్ల ఉంది.

 

 ‘‘చాలా బాగుంది వివ్... దీన్ని చూసిందంటే రోజీ ఎగిరి గంతులేస్తుంది’’ అని... ‘‘రోజీ’’ అంటూ కేక పెట్టింది. ఆ పిలుపు వింటూనే లోపలి నుంచి పరుగులు దీస్తూ వచ్చింది నాలుగున్నరేళ్ల రోజీ. కూతుర్ని దగ్గరకు తీసుకుని.. ‘‘చూడు డాడీ ఏం తెచ్చారో’’ అంది పెయింటింగ్‌ని చూపిస్తూ. దాన్ని చూస్తూనే ‘‘బాగుంది మమ్మీ, ఇది నాకేనా’’ అంది ఆనందంగా. ‘‘నీకే డియర్. దీన్ని నీ రూమ్‌లోనే తగిలిద్దాం పద’’ అన్నాడు వివ్ కూతుర్ని ఎత్తుకుంటూ. ముగ్గురూ కలిసి రోజీ గదిలోకి వెళ్లారు. పాప మంచానికి ఎదురుగా ఉన్న గోడకి ఆ పెయింటింగ్‌ని తగిలించారు. కానీ ఆ పెయింటింగ్ తమ సంతోషాన్ని త్వరలోనే హరించబోతోందని వారికప్పుడు తెలియదు!

    

 మర్నాడు ఉదయం... ‘‘మమ్మీ...’’ కూతురి అరుపు వినగానే చేతిలో ఉన్న గిన్నెను వదిలేసింది మెర్సీ. గాజు గిన్నె నేలమీద పడి భళ్లున బద్దలయ్యింది. గాజు ముక్కలు గుచ్చుకుంటాయేమోనన్న ధ్యాస కూడా లేకుండా రోజీ గదికి పరుగుదీసింది మెర్సీ. రోజీ మంచం మీద కూర్చుని ఉంది. పెద్దగా ఏడుస్తోంది. కంగారుపడిపోయింది మెర్సీ. ‘‘ఏమైంది బేబీ... ఏమైనా కల వచ్చిందా?’’ అంది గుండెలకు హ త్తుకుంటూ.‘‘మమ్మీ... మమ్మీ... ఆ పాప, ఆ బాబుని చంపేస్తోంది’’ అంది కంగారుగా.అర్థం కాలేదు మెర్సీకి. ‘‘పాప బాబుని చంపేస్తోందా? ఏ పాప.. ఏ బాబుని’’ అంది అయోమయంగా. ‘‘అదిగో... ఆ పాపే, బాబుని చంపేస్తోంది’’ అంటూ పెయింటింగ్ వైపు చూపించింది రోజీ. భయంతో వెక్కిళ్లు వచ్చేస్తున్నాయి. కచ్చితంగా కలగని ఉంటుందని అనుకుంది మెర్సీ. ‘‘అవునా... నువ్వేం భయపడకు. అలా చేయొద్దని ఆ పాపకు నేను చెబుతాలే. సరేనా’’ అంది పాప కళ్లు తుడుస్తూ. సరేనన్నట్టు తలూపింది రోజీ.

 

 కానీ మర్నాడు ఉదయం కూడా అచ్చు అదే జరిగింది. నిద్రలేచి ఏడుస్తోన్న రోజీ దగ్గరకు వెళ్తే ముందురోజు చెప్పిన కథే చెప్పింది. ఒకే కల వరుసగా ఎందుకొస్తుందో అర్థం కాక కలవరపడింది మెర్సీ. విషయాన్ని వివియన్‌కు చెప్పింది. ‘‘అది చిన్నపిల్ల... ఏ టీవీలోనో ఏదో చూసి జడుసుకుని ఉంటుంది. ఒక పని చెయ్. నువ్వీ రోజు తనతోనే పడుకో’’ అన్నాడు వివియన్. సరేనంది మెర్సీ. ఆ రాత్రి కూతురి పక్కనే పడుకుంది. పాపని నిద్రపుచ్చేసి తనూ నిద్రలోకి జారుకుంది. మాంచి నిద్రలో ఉండగా పాప ఏడుపు వినిపించినట్టు అనిపించి ఉలిక్కిపడి లేచింది మెర్సీ. కానీ రోజీ ప్రశాంతంగా నిద్రపోతోంది. ఏడుపు మాత్రం వినిపిస్తూనే ఉంది. పైగా అంతకంతకూ ఎక్కువవుతోంది. ఆమెకి తెలిసి చుట్టుపక్కల ఇళ్లలో కూడా చిన్నపిల్లలు ఎవరూ లేరు. మరి ఈ ఏడుపు ఎక్కడి నుంచి వస్తు న్నట్టు?! ఆమె గుండెల్లో దడ. నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ గదంతా పరికించి చూసింది.

 

 ఆమె కళ్లు ఎదురుగా గోడకు వేళ్లాడుతోన్న పెయింటింగ్ మీద పడ్డాయి. రెండు క్షణాలు దానివైపే తీక్షణంగా చూసింది మెర్సీ. అంతే... ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. ఎందుకంటే... ఎందుకంటే పెయింటింగ్ ఖాళీగా ఉంది. అందులో పిల్లాడు కానీ, వాడి పక్కనే ఉండాల్సిన అమ్మాయి కానీ లేదు! తను చూస్తున్నది నిజమో కాదో ఒక్క క్షణం అర్థం కాలేదు మెర్సీకి. కళ్లు నులుముకుని మళ్లీ చూసింది. తాను చూసింది ముమ్మా టికీ నిజమే. ఏం జరుగుతోందసలు?గబగబా మంచం దిగింది. పాపను తీసుకుని బయటకు పరుగుదీసింది. అప్పటికింకా ఆఫీసు పని చూసుకుంటూనే ఉన్నాడు వివియన్. పాపతో కంగారుగా వచ్చిన మెర్సీని చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘ఏమైంది’’ అన్నాడు ఆతృతగా.

 

 ‘‘అక్కడ... ఎవరో ఏడుస్తున్నారు. చూస్తే ఎవరూ లేరు. పెయింటింగ్‌లో పిల్లాడు కానీ, పాప కానీ లేదు. ఖాళీగా ఉంది’’. అయోమయంగా చూశాడు వివియన్. ఆమె చెప్పేదేంటో అస్సలు అర్థం కాలేదు. ‘‘ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు’’ అంటూ పాప గదిలోకి నడిచాడు. అతడికే ఏడుపూ వినిపించడం లేదు. పెయింటింగ్ కూడా మామూలుగానే ఉంది. మెర్సీ భ్రమపడి ఉంటుందేమో అనుకున్నాడు. ధైర్యం చెప్పాడు. కానీ అతడి గుండె జారిపోయే సంఘటన ఒకటి కొన్ని రోజుల తర్వాత జరిగింది. ఆ రోజు రాత్రి మెర్సీ, పాప త్వరగా నిద్రపోయారు. వివియన్ చాలాసేపు టీవీ చూశాడు. కళ్లు మూతలు పడుతుండటంతో టీవీ ఆపి లేచాడు. గదిలోకి వెళ్లబోతుండగా రోజీ గదిలోంచి ఏవో శబ్దాలు వినిపించాయి. దాంతో అటుగా నడిచాడు. లోపలికి అడుగు పెడుతూనే అతడి ఒళ్లు ఝల్లుమంది. కిటికీ దగ్గర ఇద్దరు పిల్లలు నిలబడివున్నారు. అచ్చు... పెయింటింగ్‌లో మాదిరిగానే. కాళ్లు వణికాయి వివియన్‌కి. వెంటనే పెయింటింగ్ వైపు చూశాడు. అది ఖాళీగా ఉంది. భయంతో వెన్నులోనుంచి దడ పుట్టింది. మళ్లీ కిటికీ వైపు చూశాడు. ఈసారి పిల్లలు లేరు. ఏమయ్యారా అని చూస్తే పెయింటింగ్‌లో ఉన్నారు. అది ఎప్పటిలాగే ఉంది.

 

 అప్పుడర్థమయ్యింది వివియన్‌కి... మెర్సీ చెప్పేదంతా నిజమేనని. ఆ పెయింటింగ్‌లో ఏదో మాయ ఉందని, అది ఇంట్లో ఏదో అలజడి సృష్టిస్తోందని. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఆ పెయింటింగ్‌లోని పిల్లాడు వివియన్‌కి అక్కడక్కడా కనిపించాడు. నిజానికి చిత్రంలో బాబు పక్కన ఉన్నది పాప కాదు, పాప బొమ్మ. అయినా కూడా ఇంట్లో ఒక పాప అక్కడక్కడా కనిపించి మాయమవుతూ ఉండేది. పైగా ఒక్కోసారి ఆమె తుపాకీతో బాబుని తరుముతూ ఉండేది. వివియన్‌కి, మెర్సీకి, రోజీకి... అందరికీ కనిపించారు వాళ్లు. మెర్సీ హడలిపోయేది. పాప జడుసుకుని జ్వరం తెచ్చుకునేది. దాంతో ఆ పెయిం టింగ్‌ని తమ నుంచి దూరం చేయాలనుకున్నాడు వివియన్. దాన్ని తీసుకెళ్లి బయట పారేశాడు. అక్కడితో వారికి పీడ విరగడయ్యింది. కానీ ఆ పీడ ఆ తర్వాత చాలామందికి అంటుకుంది. ఎందరినో భయభ్రాంతులకు గురి చేసింది. అసలింతకీ ఆ పెయింటింగ్ ఎక్కడిది? ఎందుకిలా అందరినీ భయపెడుతోంది?

    

 ఎందరికో నిద్ర లేకుండా చేసిన ఆ చిత్రాన్ని బోస్టన్‌కు చెందిన బిల్ స్టోన్‌హామ్ అనే చిత్రకారుడు చిత్రించాడు. 1972లో అతడి మొదటి భార్య రాన్... ‘హ్యాండ్స్ రెసిస్ట్ హిమ్’ పేరుతో ఓ కవిత రాసింది. వెంటనే ఆ కవిత స్ఫూర్తితో ఈ చిత్రాన్ని గీశాడు. ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ నటుడు జాన్ మార్లీ భారీ మొత్తాన్ని చెల్లించి కొనుక్కున్నాడు. తర్వాత అతడు దాన్ని మరో వ్యక్తికి అమ్మేయడంతో ఆ పెయింటింగ్ చేతులు మారడం మొదలైంది. చివరికి ఎవరి దగ్గరకు చేరిందో తెలియకుండా పోయింది. 2000వ సంవత్సరంలో హఠాత్తుగా ఓ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యింది.

 

 ఒక వ్యక్తి ఉన్నట్టుండి ‘ద హ్యాండ్స్ రెసిస్ట్ హిమ్’ పెయింటింగ్‌ను అమ్ముతానంటూ బేరం పెట్టాడు. మొదట చాలామంది కొనడానికి ఆసక్తి చూపిం చారు. కానీ తర్వాత వెనక్కి తగ్గారు. ఎందుకంటే అతగాడు ఆ పెయింటింగ్ కొనుక్కున్నవారికి ఎలాంటి వింత అనుభవాలు ఎదురవుతాయో ఏకరవు పెట్టాడు. (అతడు చెప్పిన వాటినే కథనంగా అందించాం). అది చదివి అందరి గుండెలూ గుభేల్‌మన్నాయి. పైగా పెయింటింగ్‌లోని పిల్లలు బయటకు వచ్చినప్పుడు తీసిన ఫొటోల్ని నెట్‌లో అప్‌లోడ్ చేశాడా వ్యక్తి. వాటిని చూశాక ఎవ్వరూ చిత్రాన్ని కొనడానికి ముందుకు రాలేదు. చివరికి మిషిగన్‌కు చెందిన ఓ గ్యాలరీ యజమాని స్మిత్ దాన్ని కొనుక్కున్నాడు.

 

  గ్రాండ్ ర్యాపిడ్స్ నగరంలో ఉన్న అతడి గ్యాలరీలో ఆ పెయింటింగ్ ఇప్పటికీ ఉంది. గ్యాలరీకి వచ్చేవాళ్లంతా ఏవైనా వింతలు జరుగుతుందేమోనని గంటలపాటు ఆ పెయింటింగ్ వైపే చూస్తూంటారు. స్మిత్ కూడా చాలాసార్లు దాన్ని పరిశీలించాడు. కానీ తనకు అలాంటివేమీ కనిపించలేదంటాడు. మరి ఈ పెయింటింగ్ గురించి దాన్ని అమ్మిన వ్యక్తి చెప్పిన మాటల సంగతేంటి? అవన్నీ అబద్ధాలా? మూఢనమ్మకాలా? పుకార్లా? ఆ కథలు ఎలా పుట్టుకొచ్చాయి? ఒకవేళ నిజం కాదనుకుంటే పెయింటింగ్‌లో మార్పులు జరుగుతున్నప్పుడు తీసిన ఫొటోల సంగతేంటి? అవి కూడా కల్పితాలేనా? ఏమో... నిజాలు దేవుడికెరుక!

 - సమీర నేలపూడి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top