హైటెక్ మాటలు... మూలాలు, ముచ్చట్లు


పదాలజీ

ఇదివరకు ఎక్కువగా ఎరుగని చాలా మాటలు హైటెక్ యుగంలో విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. సాధారణంగా వాడుకలో ఉన్న మాటలే వేర్వేరు అర్థాలతో వాడుకలోకి వచ్చాయి. అలాంటి కొన్ని మాటలు, వాటి మూలాల ముచ్చట్లు..


 

బ్లూటూత్

స్మార్ట్‌ఫోన్లు వాడే వారందరికీ చిరపరిచితమైన మాట ఇది. ఇంతకీ ఈ మాట ఎలా వాడుకలోకి వచ్చిందంటే, దాని వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. పదో శతాబ్దిలో హరాల్డ్ గార్మ్‌సన్ అనే రాజు స్కాండినేవియా ప్రాంతాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకు వచ్చాడు. గార్మ్‌సన్ రాజుగారికి ఒక పిప్పిపన్ను ఉండేది. అది నీలిరంగులో ఉండేది. కాలక్రమంలో ఆయనగారికి ‘బ్లూటూత్’ అనే నిక్‌నేమ్ స్థిరపడింది. అయితే, హైటెక్ యుగంలో ఏకీకృత వైర్‌లెస్ వ్యవస్థ కోసం ఇంటెల్, ఎరిక్‌సన్, నోకియా, ఐబీఎం కంపెనీలు నాలుగూ కలిసి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ వైర్‌లెస్ వ్యవస్థను అభివృద్ధి చేసిన బృందంలో పనిచేసిన ఇంటెల్ కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జిమ్ కర్డాక్ దీనికి స్కాండినేవియాను ఏకతాటిపైకి తెచ్చిన రాజుగారి స్ఫూర్తితో ‘బ్లూటూత్’గా నామకరణం చేశాడు.

 

గూగుల్

ప్రపంచవ్యాప్తంగా నెటిజనులందరికీ నిత్యావసర సెర్చింజన్ ఇది. సెర్చింజన్‌గా ప్రాచుర్యంలోకి రాక ముందు జనం దీనిని లెక్కలకు సంబంధించిన కంపెనీ అనుకునేవారు. నిజానికి ‘గూగుల్’ పేరు కూడా లెక్కలకు సంబంధించినదే కావడం విశేషం. ‘గూగోల్’ అనే పదం నుంచి ‘గూగుల్’ వచ్చింది. ఒకటి పక్కన వంద సున్నాలు పెడితే వచ్చే సంఖ్యనే ‘గూగోల్’ అంటారు.

 

వికీ

ఆన్‌లైన్ విజ్ఞాన సర్వస్వంగా గుర్తింపు పొందిన ‘వికీపీడియా’ సంక్షిప్త నామమే ‘వికీ’. హవాయిన్ భాషలో ‘వికీ వికీ’ అంటే త్వరగా అని అర్థం. ఆన్‌లైన్‌లో వివిధ వెబ్‌సైట్లలోని సమాచారాన్ని శరవేగంగా, సులువుగా నెటిజన్లకు అందించాలనే సంకల్పంతో ‘వికీ’ వ్యవస్థాపకుడు వార్డ్ కన్నింగ్‌హామ్ దీనికి ఈ పేరు పెట్టాడు.

 

స్పామ్

ఎదుటి వారిని ఆటపట్టించేందుకు డబ్బాల్లో పెట్టి పంపే గుర్తుతెలియని మాంసాన్ని ‘స్పామ్’ అనేవాళ్లు. బ్రిటిష్ హాస్యనటుడు మాంటీ పైథాన్ ఓసారి దీనిపై చిన్న ప్రయోగం చేశాడు. రెస్టారెంట్‌లోని వెయిట్రెస్‌లు, కస్టమర్లు అందరూ ఏకకాలంలో ‘స్పామ్.. స్పామ్,,’ అని పదే పదే అనాలని చెప్పడంతో అందరూ ‘స్పామ్.. స్పామ్’ అంటూ హోరెత్తించారు. ఇక ఇంటర్నెట్ వాడుకలోకి వచ్చాక చాట్ రూముల్లో, ఇన్‌బాక్సుల్లో చెత్తను నింపి ఊదరగొట్టే వారిని వారిని స్పామర్లు అనడం మొదలైంది. వారు నింపే చెత్తాచెదారాన్ని ‘స్పామ్’ అనడం వాడుకలోకి వచ్చింది.

 

స్ట్రీమ్

హైటెక్ యుగానికి ముందు స్ట్రీమ్ అంటే ప్రవాహం అనే అర్థమే వాడుకలో ఉండేది. స్ట్రీమ్ అంటే ప్రవహించే నది లేదా ఏరు వంటివే మనసులో మెదిలేవి. నెట్టింట మాత్రం ఈ పదానికి వేరే అర్థం వ్యాప్తిలోకి వచ్చింది. అయితే, అది కూడా ఒక రకంగా ప్రవాహమే. ఇంటర్నెట్‌లో ఒకచోటి నుంచి మరోచోటికి సమాచారం ప్రసారమయ్యే ప్రక్రియను ‘స్ట్రీమ్’ అనడం ఇటీవలి కాలంలో విరివిగా వాడుకలోకి వచ్చింది. నిజానికి సమాచార ప్రసారానికి పర్యాయంగా ‘స్ట్రీమ్’ అనే పదం 1920లోనే తొలిసారిగా వాడుకలోకి వచ్చినా, ఇంటర్నెట్ యుగంలో దీని వాడుక విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది.

 

కుకీస్

కుకీస్ అంటే పిల్లలు ఇష్టంగా తినే చిరుతిండిగానే చాలామందికి తెలుసు. ఇంటర్నెట్ యుగంలో ఈ పదం వేరే అర్థాన్ని సంతరించుకుంది. ఇంటర్నెట్‌లో యూజర్ నేమ్, పాస్‌వర్డ్ వంటి యూజర్ సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు కుకీస్ ఉపయోగపడతాయి. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ పదే పదే టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు ఈ-మెయిల్, సోషల్ మీడియా వెబ్‌సైట్లు వాడినప్పుడు తరచుగా కనిపించే ‘రిమెంబర్ మీ’ బటన్ కూడా కుకీనే. చైనా ప్రజల ‘ఫార్చూన్ కుకీ’ స్ఫూర్తితో ఈ ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేసిన సాఫ్ట్‌వేర్ నిపుణులు దీనికి ‘కుకీ’గా నామకరణం చేశారు. ‘ఫార్చూన్ కుకీ’ తమ అదృష్టం గోడ దాటి బయటకు పోకుండా కాపాడుతుందని చైనా ప్రజల నమ్మకం. సమాచారాన్ని కోడ్ దాటి బయటకు పోకుండా నిక్షిప్తం చేసే లక్షణం ఉండటంతో ‘కుకీస్’ పేరు స్థిరపడింది.

 

ట్వీట్

ఇంటర్నెట్ యుగంలో ఇదో కొత్త పదం. సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ‘ట్విట్టర్’ 2006లో మొదలైన తొలినాళ్లలో అందులో అభిప్రాయాలు వ్యక్తం చేయడాన్ని ‘ట్విట్టరింగ్’ అనేవారు. ‘ట్విట్టరింగ్’ను విశదీకరిస్తూ ‘పోస్ట్ ఎ ట్విట్టర్’ అప్‌డేట్’ అనే ట్యాగ్‌లైన్ కూడా ఉండేది. ఇంత పొడవుగా రాయాల్సి రావడంతో ‘ట్విట్టర్’ రూపకర్త క్రెయిగ్ హాకెన్‌బెర్రీకి ఇదంతా చిరాగ్గా అనిపించింది. తొలుత అతడు 2007లో ‘ట్విటెరిఫిక్’ యాప్ రూపొందించినప్పుడు ‘ట్విట్’ అనే మాటను వాడుకలోకి తెచ్చాడు. ట్విట్టర్ బృందంలోని మరో డెవలపర్ బ్లయినే కుక్ ‘ట్విటెరిఫిక్’లోనూ ‘ట్విట్’ ఉందని చెప్పి, 2008 జూన్‌లో దీనికి బదులు ‘ట్వీట్’ను వాడుకలోకి తెచ్చాడు. అప్పటి నుంచి లక్షలాది మంది ట్విట్టర్‌లో ట్వీటుతూనే ఉన్నారు.

 

హ్యాక్

యంత్ర పరికరాలను చిందరవంద చేసి పడేయడాన్ని వివరించేందుకు ‘హ్యాక్’ పదాన్ని ఎంఐటీ 1955లో తొలిసారిగా ఉపయోగించింది. నేర పరిభాషలో ‘హ్యాక్’ అంతకు ముందు నుంచే వాడుకలో ఉంది. ఇష్టానుసారం నరికేయడాన్ని, పిడిగుద్దులు కురిపించడాన్ని కూడా ‘హ్యాక్’ అనే అంటారు. ఆ తర్వాత రెండు దశాబ్దాలకు 1975లో కంప్యూటర్ ప్రోగ్రామర్ల కోసం రూపొందించిన పారిభాషిక నిఘంటువులో ‘హ్యాకర్’ అనే పదం తొలిసారిగా చేరింది. ‘హ్యాకర్’ పదానికి ఎనిమిది నిర్వచనాలను అందులో ఇచ్చినా, అందులో చివరిగా ఇచ్చిన నిర్వచనమే ఇప్పుడు వాడుకలో ఉంది. దురుద్దేశపూర్వకంగా కంప్యూటర్లలో చొరబడి సమాచారాన్ని కొల్లగొట్టే వారిని హ్యాకర్లుగా వ్యవహరించడం మొదలైంది. ఇదే అర్థంతో ‘న్యూయార్క్ టైమ్స్’ 1990లో ప్రచురించిన ఒక వ్యాసంలో ‘హ్యాకర్’ పదాన్ని మూడుసార్లు వాడింది.

 

బగ్

బగ్ అంటే కీటకం లేదా సూక్ష్మజీవి అనే అర్థం తెలిసిందే. కంప్యూటర్లలో తలెత్తే సమస్యలనూ ‘బగ్’ అనడం ఇటీవలి కాలంలో బాగా వాడుకలోకి వచ్చింది. నిజానికి కంప్యూటర్ల పరిభాషలో ఈ పదం 1947లోనే వచ్చి చేరింది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ శాస్త్రవేత్త గ్రేస్ హోపర్ 1947లో తన హార్వర్డ్ మార్క్-2 కంప్యూటర్‌పై పనిచేస్తుండగా, అకస్మాత్తుగా అది నిలిచిపోయింది. తెరపై ఒక కీటకం ఆకారం కనిపించింది. కంప్యూటర్ వ్యవస్థలో సమస్య తలెత్తడంతో ఇంజనీర్లు దానిని సరిదిద్దే ప్రయత్నంలో ఉండగా, ఈ పరిస్థితి ఎదురైంది. అప్పటి నుంచి కంప్యూటర్లలో తలెత్తే ఇక్కట్లను ‘బగ్’ అని పిలవడం మొదలైంది.

 

మౌస్

మౌస్ అనగా మూషికము అనగా ఎలుక అని అందరికీ తెలిసిందే. కంప్యూటర్లలో వాడే మౌస్‌కు ఆ పేరు ఎందుకొచ్చిందో మాత్రం చాలా మందికి తెలియదు. అయితే, మౌస్ ఆవిర్భావం వెనుక చిన్న చరిత్ర ఉంది. డగ్లస్ సీ ఎంజెల్‌బార్ట్ పాతికేళ్ల వయసులో కంప్యూటర్ రంగంలోకి వచ్చినప్పుడు పరిస్థితులు దారుణంగా ఉండేవి. కంప్యూటర్ పరిమాణం ఏకంగా ఒక గది అంత ఉండేది. కంప్యూటర్ల పనిని సులువు చేసే ప్రయత్నాల్లో భాగంగా 1968లో తొలిసారిగా మౌస్‌ను రూపొందించారు.



శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏర్పాటైన కంప్యూటింగ్ కాన్ఫరెన్స్‌లో దీనిని ప్రదర్శించినప్పుడు ప్రశంసలు వెల్లువెత్తినా, ఇది వాడుకలోకి వచ్చేందుకు దాదాపు రెండు దశాబ్దాలు పట్టింది. మెకింటోష్ పర్సనల్ కంప్యూటర్లు మార్కెట్‌లోకి విడుదలైనప్పుడు, వాటితో మౌస్ వాడుకలోకి వచ్చింది. కంప్యూటర్ తెరపై కనిపించే కర్సర్‌ను ‘క్యాట్’ అనేవారు. కంప్యూటర్ వెలుపల ఉన్న తోక పరికరాన్ని కదిలించినప్పుడల్లా తెరపై ‘క్యాట్’ కదలాడుతుండటంతో దీనికి ‘మౌస్’గా నామకరణం చేశారు.  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top