దాన్ని లవ్వంటారా? ఏమో..!

దాన్ని లవ్వంటారా? ఏమో..! - Sakshi


ఇంటర్వ్యూ

తానొకటి తలిస్తే.. దైవం ఒకటి తలచిందంటారు.

అలా, రాశీఖన్నా కాపీ రైటర్ కావాలనుకుంటే దేవుడు ఆమెను హీరోయిన్ చేశాడు.

ఒక్కసారి ట్రై చేస్తే ఏం పోతుంది? అనుకుని ‘మద్రాస్ కెఫే’తో కథానాయిక అయ్యారు
రాశీఖన్నా.

హిందీ నుంచి తెలుగుకి వచ్చి, ఇక్కడ ‘మోస్ట్‌వాంటెడ్ హీరోయిన్స్’లో ఒకరయ్యారు.

ఇక, రాశీఖన్నాతో మాట్లాడదాం...


 

మీ గురించి తెలుసుకోవాలని ఉంది?

నేను పుట్టి, పెరిగింది, చదువుకున్నది ఢిల్లీలో. బాగా చదివేదాన్ని. స్కూల్లో నేనే టాపర్‌ని.

     

టాపర్స్‌కే లేడీ శ్రీరామ్ కాలేజీలో అడ్మిషన్ వస్తుందట కదా?

అవును. ఢిల్లీలో ఆ కాలేజ్ చాలా ఫేమస్. మంచి పర్సంటేజ్ వస్తేనే అడ్మిషన్ ఇస్తారు. నేను ఇంగ్లిష్ ఆనర్స్ చేశాను. అడ్వర్టయిజింగ్ ఫీల్డ్‌లో కాపీ రైటర్‌గా చేయాలన్నది నా కోరిక. ఓ మోడలింగ్ ఏజెన్సీవాళ్లు అడిగితే, మోడల్‌గా చేశాను. అట్నుంచి సినిమాల్లోకి వచ్చాను. హిందీ చిత్రం ‘ముంబయ్ కేఫ్’తో కథానాయికగా పరిచయమయ్యాను.

     

మీ కాలేజీలో ఈవ్ టీజింగ్‌లాంటివేమైనా?

అది గాళ్స్ కాలేజ్. అందుకని అలాంటివేవీ ఎదుర్కోలేదు.

     

పోనీ.. సీనియర్స్ ఎవరైనా మిమ్మల్ని ర్యాగింగ్ చేశారా. ర్యాగింగ్‌పై మీ అభిప్రాయం?

నన్నెవరూ అల్లరిపెట్టలేదు. ర్యాగింగ్ అనేది మహా ఘోరమైన విషయం. దాన్ని నిషేధించాలి.

     

కాపీ రైటర్ కావాలని యాక్టర్ అయ్యారు. ఎలా అనిపిస్తోంది?

రెండూ క్రియేటివ్ ఫీల్డ్సే. నేను హీరోయిన్ కావాలనుకోలేదు. కానీ, దేవుడు డిసైడ్ చేశాడు. ఇప్పుడు నటన అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడిపోయింది.

     

తెలుగు పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరవుతారని ఊహించారా?

కష్టపడి పని చేస్తే, చేసే పని మీద గౌరవం ఉంటే, నిజాయతీగా వ్యవహరిస్తే విజయం వరిస్తుందని నా నమ్మకం.

     

మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’ అప్పుడు కొంచెం బొద్దుగా ఉండేవారు. ఆ తర్వాత సన్నబడటానికి కారణం?

నేను బొద్దుగా ఉన్నప్పుడూ, ఇప్పుడు సన్నబడ్డాక కూడా ఇష్టపడుతున్నారు. ‘జిల్’ సినిమాలో చేసిన సావిత్రి పాత్రకు కొంచెం సన్నబడితే బాగుంటుంది... అనిపించింది. అందుకే తగ్గాను.  కొంతమంది తగ్గొద్దన్నారు. అయినా... తగ్గడం అంటే అంత సులువు కాదు. వెయిట్ ట్రైనింగ్, యోగా, వాకింగ్, డ్యాన్స్ ఇలా ఎన్నో చేసి తగ్గాను.

     

ఓకే, ఓసారి సమాజం గురించి మాట్లాడుకుందాం... ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాల గురించి విన్నప్పుడు ఏమనిపిస్తుంది?

గుండె పగిలినంత పనవుతుంది. ఆడ, మగ అనే విషయాన్ని పక్కనపెడితే సాటి మనిషిని ఇంతలా ఎలా గాయపరచ గలుగుతున్నారు? అని ఆవేశపడి పోతుంటాను.

     

ముఖ్యంగా మీ హోమ్‌టౌన్‌లో జరిగిన నిర్భయ సంఘటన ప్రపంచం ఉలిక్కిపడేలా చేసింది. ఆ తర్వాత ఢిల్లీలో అత్యాచారాలు ఇంకా పెరిగిపోయాయ్?

నిర్భయ సంఘటనకు నేను చాలా ఏడ్చాను. అసలు వాళ్లు మనుషులేనా? అనిపించింది. నా హోమ్ టౌన్ అనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆడవాళ్లపై లైంగిక దాడులు జరుగు తున్నాయి. అయితే, కొన్ని బయటకు రావడం లేదంతే.

     

మహిళలకు ఢిల్లీ సేఫ్ అనొచ్చా?


సేఫ్ ప్లేస్ అనేది ఎక్కడా లేదు. ఆడవాళ్లపట్ల మగవాళ్లకి గౌరవం ఉన్నప్పుడు, ఆడవాళ్లను ఓ వస్తువుగా చూడటం మానేసినప్పుడు ఏ ప్లేస్ అయినా సేఫే.

     

ఒకవేళ మీరు జడ్జ్ అయితే అత్యాచారం చేసే మగవాళ్లకు ఎలాంటి శిక్ష విధిస్తారు?

ఏ సామర్థ్యంతో ఇలాంటి నేరాలు చేస్తున్నారో అది లేకుండా చేయాలని తీర్పు ఇస్తా.

     

నేరాలు ఆగాలంటే ఏం చేయాలి?

కఠినంగా శిక్షించడంతో పాటు నేరగాళ్ల ఆలోచనా ధోరణిని మార్చాలి (ఆవేశంగా).



కొంచెం కూల్‌గా మాట్లాడుకుందాం. మీ తొలి ప్రేమ గురించి?

 ఎనిమిదేళ్ల వయసులో నా క్లాస్‌మేట్‌ని ఇష్టపడ్డాను. దాన్ని లవ్వంటారో ఏమో! నాకు తెలియదు. ఆ తర్వాత ఎవర్నీ ఇష్టపడలేదు.



ప్రేమను విశ్లేషించగలుగుతారా?

అది అనుభవించాలి తప్ప మాటల్లో చెప్పలేం.

     

మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? ఎరేంజ్‌డ్ మ్యారేజా?

నచ్చిన అబ్బాయి దొరికితే ప్రేమించి, పెళ్లి చేసుకుంటా. లేకపోతే ఇంట్లోవాళ్లు చూసిన అబ్బాయిని పెళ్లాడతా.

     

దేశ, విదేశాల్లో మీకు నచ్చిన ప్రదేశం?


మన దేశంలో రిషికేష్, ఊటీ. విదేశాల్లో స్పెయిన్.



ఫైనల్‌గా మీ జీవితాశయం ఏంటి?

ప్రేమను పంచడం...

- డి.జి. భవాని

కవర్ ఫొటో: శివ మల్లాల

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top