ఆకుపచ్చ సూర్యదయం

ఆకుపచ్చ సూర్యదయం


జయపురం ఏనుగులు; ట్రేమన్‌హేర్, బాస్టియన్‌ల నాయకత్వంలో పోలీసులు ఒంజేరి దిశగా వస్తున్న సంగతి ఒకేసారి తెలిసింది రామరాజుకి. రిజర్వు దళం ఘాట్‌ మీదకు చేరడానికి చివరి మలుపు తిరిగే చోటనే పదిమందిని నిలిపాడు రామరాజు. ఘాట్‌కు పైన చాలా ఎత్తులో ఉంటుంది గిమిలి బాట. ఆ బాటను లక్ష్యంగా చేసి మరో పదిమందిని నిలిపాడు. ఏనుగులను దిగ్బంధనం చేసేందుకు ఇంకో పది మందిని నియమించాడు. మధ్యాహ్నం ఒంటిగంటన్నర ప్రాంతం. కొన్ని నిమిషాలు గడిచాయి, నిశ్శబ్దంగా. అప్పుడే గిమిలి దారే లక్ష్యంగా కాపు వేసిన రాజు దళం మొదట ఆ దృశ్యం చూసింది. ఓ జమేదారు, మరో పదిమంది పోలీసులు నక్కి నక్కి నడుస్తున్నారక్కడ. మరోపక్క ఘాట్‌ మీది మాటేసిన రాజు దళానికి ట్రేమన్‌హేర్, బాస్టియన్‌ దగ్గరవడం కనిపిస్తోంది. రక్తం మరిగిపోతోంది బాస్టియన్‌ని చూస్తుంటే. గంతన్న, మల్లు ఆవేశంతో ఊగిపోయారు. పడాలు గిమిలి దారికి గురిపెట్టిన బృందంలో ఉండిపోయాడు.



బాస్టియన్‌ రాక అతడికి తెలియదు. లేకపోతే ఏం జరిగేదో? అప్పుడే గంతన్న, మల్లు ఇద్దరికి ఒకేసారి అనుమానం వచ్చింది.అటు ట్రేమన్‌హేర్, బాస్టియన్‌; ఇటు పదిహేనుమంది వరకు ఉన్న రిజర్వు పోలీసులు అంత జాగరూకతతో ఎందుకు ఘాటీ ఎక్కుతున్నారు? కొండదళం ఉన్నట్టు తెలిసిపోయిందా? చుట్టూ చూసి, గతుక్కుమన్నారు అన్నదమ్ములు. మలుపు పక్కనే గుబురులో ఉన్న తమ దళ సభ్యుడిS తుపాకీ గొట్టం పైకి కనిపిస్తోంది కొద్దిగా. ట్రేమన్‌హేర్, బాస్టియన్, పోలీసులు, మూటలు మోస్తున్న కొండవాళ్లు పూర్తిగా ఘాట్‌ మీదకు చేరేదాకా వేచి ఉన్నాడు మల్లు.ఆ సమయంలోనే ట్రేమన్‌హేర్‌ బాస్టియన్‌కు సైగలతో ఏదో చెప్పడం కనిపించింది.బాస్టియన్‌ మూటలు మోస్తున్న కొండవాళ్లలో మొదటివాడికి ఏదో చెప్పాడు. వాళ్లంతా ఏనుగులు ఉన్న చోటికి నడవడం కనిపించింది.



ఇదంతా గమనిస్తున్న మావటీలలో గుబులు మొదలైంది. అంకుశంతో మెడ మీద పొడిచి ఏదో అన్నాడు మొదటి ఏనుగు మీది మావటి.ఆ ఏనుగు ముందు కాళ్లు వంచి నిలబడింది. మిగిలిన మావటీలు కూడా అలాగే చేయించారు. గిమిలి బాట మీద పోలీసులు ఇంకా వంగునే నడుస్తున్నారు.అక్కడ, తలల మీది సంచులు వేగంగా దించేశారు కొండవాళ్లు.అప్పుడే పెద్దగా అరుపు, ‘‘శ్రీరామరాజుకీ....!’’  వెంటనే స్పందన, ‘‘జై!’’దానితో పాటే బాణాల వర్షం మొదలైపోయింది. మధ్య మధ్య తుపాకులు పేలుతున్నాయి. మొదట మోత కోసం వచ్చిన కొండవాళ్లు, వెనుకే మావటీలు చిటికలో అన్నీ వదిలి మాయమైపోరు.గిమిలి బాట మీద ఉన్నవాళ్లు తల ఎత్తకుండా బాణాలు దూసుకు వస్తూనే ఉన్నాయి.



ఎవరైనా సాహసించి నిలబడే ప్రయత్నం చేస్తే తుపాకీలు గర్జిస్తున్నాయి. బెదురుతున్న ఏనుగులు ముంగాళ్ల మీదే కదం తొక్కుతున్నాయి, ఘీంకరిస్తూ. ట్రేమన్‌హేర్‌ సాహసించి తన రివాల్వర్‌ తీసి బాణాలు వస్తున్న మలుపు దగ్గరి పొద మీదకు కాల్చాడు.మరుక్షణం దూసుకువచ్చింది ఓ బాణం. కుడి చెవిని తాకింది.‘‘అబ్బా....!’’ కెవ్వున అరిచాడు ట్రేమన్‌హేర్‌. రివాల్వర్‌ వదిలేసి, చెవి పట్టుకున్నాడు.ఇది చూసి బేజారెత్తిన బాస్టియన్‌ ఓ చెట్టు చాటుకు పరుగెత్తి, తొంగి చూడబోయాడు.అప్పుడే పొట్టిగా, మోటుగా ఉన్న ఓ చిన్న కత్తి ఒక పక్క నుంచి వచ్చి సర్రున చెట్టులో దిగింది. ముఖాన్ని... ఎడం కన్ను రెప్ప మీద వెంట్రుకలు రాసుకుంటున్నట్టే ఉంది కత్తి. బాస్టియన్‌ గొంతుకు గురిపెట్టి విసిరిన సంగతి అర్థమవుతోంది.



 చెట్లని చాటు చేసుకుంటూ పరుగెత్తాడు బాస్టియన్, నర్సీపట్నం వైపు.ట్రేమన్‌హేర్‌ బాధనీ, బాస్టియన్‌ పలాయనాన్ని చూసిన ఒంజేరి ఘాట్‌ మీది పోలీసులు ఎలాంటి ప్రతిఘటన ఇవ్వకుండానే వెనక్కి పరుగు లంఘించుకున్నారు. ‘‘ఆయుధాలు పడేసి పరుగెత్తండి. లేకపోతే చస్తారు!’’ వెనుక నుంచి పెద్ద కేక.కొందరు ఆయుధాలు కింద పడేసి చేతులు పైకెత్తి పరుగుతీశారు. కొండలలో నడక వేరు. పరుగు తీయడం వేరు. అవి ఎంత కష్టమో అనుభవానికి వస్తోంది– మైదానాల నుంచి వచ్చిన పోలీసులకి.



ట్రేమన్‌హేర్‌ కూడా పరుగుతీయాలని అటు తిరిగాడు. అంతే, ఒక తూటా వచ్చి కుడి పిక్కను తాకింది. ఇంకా గట్టిగా అరిచాడతడు. అప్పుడే గిమిలి బాట మీద మరో కేక. ఒక కానిస్టేబుల్‌ కిందపడి కొట్టుకుంటున్నాడు. తలకు తూటా చేసిన గాయం నుంచి పాకుతున్నాయి రక్తధారలు, పాము పిల్లల్లా. ఇక తప్పదన్నట్టు జమేదార్‌ సాహసించి నిలబడి కాల్చడం మొదలుపెట్టాడు. మిగిలిన వాళ్లు కూడా నిలబడి కాలుస్తున్నారు.పావుగంటకు పైగా కాల్పులు జరిపింది గిమిలి బాటలో ఉన్న రిజర్వు దళం.కొంతసేపటికి  వెనక వైపు నుంచి కూడా బాణాలు గిమిలి బాట మీదకి దూసుకురావడం మొదలైంది.



ఈ హఠాత్పరిణామానికి కంగు తిని, జమేదార్‌ జాగ్రత్తగా ఒంజేరి ఘాట్‌ కేసి చూశాడు.

చిత్రం, ఎవరూ లేరు. అంటే ఇంత సేపు అక్కడ ఉన్న వాళ్లతో యుద్ధం చేసిన కొండదళం సభ్యులు కూడా ఇప్పుడు గిమిలి బాటను లక్ష్యంగా చేసుకున్నారన్నమాట. తుపాకులు కాలుస్తూనే ఒంజేరి రోడ్డు ఘాట్‌ మీదకు దిగిపోయారు వాళ్లు. మందుగుండు అయిపోయింది.ఘాటీ మీద చెట్లను చాటు చేసుకుంటూ అక్క∙నుంచి పరుగు మొదలుపెట్టారు వాళ్లంతా. పది నిమిషాలు గడిచాయి. అంతా నిశ్శబ్దం. రిజర్వు దళం కకావికలైపోయింది.  క్షణం తరువాత దిక్కులు పిక్కటిల్లేటట్టు నినాదం–‘‘శ్రీరామరాజుకీ’’.......‘‘జై’’ మూడు వైపులా ఉన్న రామరాజు దళాలు ఘాట్‌ మీదకు వచ్చేశాయి.అందరినీ అభినందించాడు రామరాజు.



ఎర్రేసు ఏనుగుల దగ్గరకు వెళ్లి మెడ మీద గుద్దుతూ ఏదో అన్నాడు. అవి పూర్తిగా కాళ్లు మడిచి మోకరిల్లాయి. వాటి మీద ఉన్న సామగ్రినీ, కొండవాళ్లు దించిన రిజర్వు పోలీసుల సంచులనీ కొండదళం స్వాధీనం చేసుకుంది. సామాను దించాక ఏనుగులని అడవిలోకి తోలేశారు.ఘాటీ మీద పడి ఉన్న తుపాకులను, బూట్లను, క్రాస్‌బెల్ట్‌లు, బాయ్‌నెట్లను, టోపీలను ఏరారు కొందరు. కంబళ్లు అందరికీ పంచిపెట్టాడు రామరాజు.మిగిలినవి గ్రామంలో పంచిపెట్టమని ఈ సమాచారం అందించిన ఇద్దరు కుర్రాళ్లకి పురమాయించాడు గంతన్న. కొండదళం ఆనందానికి అవధులు లేవు.

4

తలుపు తీయగానే ముందు కనిపించిన ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆర్మిటేజ్‌ కు సెల్యూట్‌ చేశాడు స్కాట్‌ కవర్డ్‌. తడిసిన రెయిన్‌ కోటు విప్పి మేకుకి తగిలించి వచ్చాడతడు. ఉదయం నుంచీ వర్షమే. విశాలంగా ఉన్న ఆ గుండ్రటి టేబుల్‌ చుట్టూ ఆర్మిటేజ్‌తో పాటు  ఏజెన్సీ పోలీస్‌ సూపరింటెండెంట్‌ సాండర్స్, విశాఖపట్నం జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ మార్టిన్, నార్తరన్‌ రేంజ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ జార్జి, అతడి పక్కనే ట్రేమన్‌హేర్‌  కూర్చుని ఉన్నారు. తలపాగా చుట్టినట్టు బ్యాండేజీ ఉంది ట్రేమన్‌హేర్‌కి. ఒంజేరి ఘాట్‌ ఉదంతం గుర్తులు. కాలికి వేసిన బ్యాండేజీ కూడా విప్పలేదు.



ఒక కుర్చీలో కూర్చున్నాడు స్కాట్‌ కవర్డ్, ఎడం చేతిలోని చిన్న సంచిని టేబుల్‌ మీద పెట్టి. వెంటనే అతడికి కూడా ఒక ప్లేటు నిండా చేపల వేపుడు, ఒక గ్లాసులో బ్రాందీ పోసి తీసుకువచ్చి ఎదురుగా పెట్టాడు బంట్రోతు.ముఖం మీద ఉన్న వర్షపు నీటిని జేబురుమాలుతో తుడుచుకుంటూ అన్నాడు కవర్డ్, ఆర్మ్‌టేజ్‌తో.‘‘పెద్ద వ్యూహమే కనిపిస్తోంది!’’  ‘‘మొన్న దొరికిన ఉత్తరం గురించేనా? ఇప్పటిదాకా దాని గురించే అనుకున్నాం!’’ సాండర్స్‌ అన్నాడు.



‘‘ఈ తిరుగుబాటుకీ, గాంధీ సహాయ నిరాకరణకీ లంకె పెట్టాలని చూస్తున్నాడు రామరాజు.’’ చెప్పాడు కవర్డ్‌. ‘‘ఐసీ’’ జార్జి, మార్టిన్, సాండర్స్‌ ఒకేసారి అన్నారు. ట్రేమన్‌హేర్‌ మాత్రం మౌనంగానే ఉన్నాడు.‘‘ఇదిగో అనువాదం, అసలు!’’ కూడా తెచ్చిన సంచిలో నుంచి ఆ ఉత్తరం, దాని ఇంగ్లిష్‌ అనువాదం తీసి ఆర్మిటేజ్‌కి అందించాడు కవర్డ్‌. రాత్రి ఏడుగంటల ప్రాంతం. నర్సీపట్నంలో డీఎస్‌పీ కార్యాలయంలోని ఆ చిన్న హాలు నిశ్శబ్దంగా ఉంది. పెట్రోమాక్స్‌ లైటు మాత్రం చిన్నగా శబ్దం చేస్తూ మండుతోంది. వర్షపు జల్లుబ్దం బయటనుంచి వినిపిస్తోంది.



రామరాజు తునిలో ఉండే పేరిచర్ల సూర్యనారాయణరాజుకి రాశాడు. రెండురోజుల క్రితం ఇద్దరు కొండవాళ్లు కోటనందూరు దగ్గర అనుమానాస్పదంగా కనిపించారు. ఎక్కడికిరా అని ఎవరో అడిగితే  తుని వెళ్లాలన్నారు. అదో సీఐడీ కంట పడింది. వాళ్లనే వెంటాడాడు. తుని గ్రామంలో కూడా ఎవడినో అడ్రస్‌ అడిగారు. వాడు అడ్రస్‌ చెప్పాడు. దాంతో పాటే, ఏం పని? అని  ఆరా కూడా తీశాడు. ఈ ఉత్తరం సంగతి చెప్పేశారు.సీఐడీ అరెస్టు చేసి, ఆ ఉత్తరంతో సహా తీసుకొచ్చి కవర్డ్‌కు అప్పగించాడు.ఆ కాగితాలు పక్కనే ఉన్న సాండర్స్‌కి ఇస్తూ, కవర్డ్‌తో అన్నాడు.‘‘ఆ తుని వాడు కూడా అరెస్టయినట్టే కదా!’’ ‘‘వెంటనే కోటనందూరు నుంచే పోలీసులని పంపించి అరెస్టు చేయించాను!’’ అన్నాడు కవర్డ్‌.సెప్టెంబర్‌ 16న రాసిన ఉత్తరమది. మరునాడే దొరికిపోయింది.



మిత్రమా!

నేను యుద్ధమును ప్రారంభించితిని. ఇంతవరకు నాలుగు ప్రదేశములలో మన సైన్యము బ్రిటిషు సైన్యమును ఓడించినది. ప్రతి పోరాటమునను భగవానుని దయ వలన జయము మన పక్షమునకే లభించినది. మన పూర్వ స్నేహమును జ్ఞప్తికి తెచ్చుకుని నీవు బయలుదేరి రావలెను. మృత్యువు జననమును వెన్నంటియే యుండును. ప్రతి మానవుడు వాని వంతు వచ్చినప్పుడు మరణించవలసిందే. మానవ శరీరములు శాశ్వతములు కావు. కానీ, కీర్తి అపకీర్తి శాశ్వతములు.  క్షత్రియులకు యుద్ధము సహజము. ఎవరైతే జయాపజయాలను, కష్టసుఖములను, చీకటివెలుగులను సమభావముతో చూడగలరో వారే ఆత్మ సాక్షాత్కారము పొందగలరని భగవద్గీత బోధించుచున్నది. మనకు యుద్ధములో విజయము లభించిన ఎడల భౌతికానందము పొందగలము.



 యుద్ధములో మనము మరణించిన ఎడల మనము వీరస్వర్గము నలంకరించి అనందించగలము. అందువలన ఈ విషయములన్నింటిని నేను జాగ్రత్తగా ఆలోచించి, దేశ క్షేమము కొరకు యుద్ధము అనివార్యమని పూర్తిగా విశ్వసించి ఈ సమరమును ప్రారంభించినాను. ఈ ఉత్తరము చేరిన వెంటనే నీవు తప్పక బయలుదేరి వస్తావని పూర్తిగా నమ్ముచున్నాను. ఇంకనూ ఎవరైనా వస్తే నీతో తీసుకుని రావలెను. ఒకసారి నీవు బయలుదేరి వచ్చి ఇచ్చట నేను పోరాటమును సాగించుటకు చేసిన ఏర్పాట్లను చూడవలెను. అవి నీకు నచ్చకపోయిన ఎడల తిరిగి వెళ్లిపోవచ్చును. అక్కడ పేకేటి వారి అబ్బాయి ఉంటే తప్పక నీతో తీసుకొని రావలెను. మిత్రులకు నా అభినందనలు.



అల్లూరి శ్రీరామరాజు

ఆర్మిటేజ్‌ తనలో తాను నవ్వుకుంటూ బ్రాందీ గ్లాసు ఎత్తి రెండు గుక్కలు తాగాడు. ‘‘ఎందుకు నవ్వుతున్నారు?’’ అన్నాడు కవర్డ్‌.‘‘ఆ ఉత్తరం చదివితే ఎవరికైనా నవ్వొస్తుంది.’’ అన్నాడు సాండర్స్‌.‘‘ ఏం రాశాడు!  క్షత్రియులకు యుద్ధం సహజమా?! అంటే రామరాజు అడవిలో క్షత్రియ పాలన ఆరంభిస్తాడా ఏమిటి? నిజమే, ఈ అడవికి రాజైపోవాలని దురాశ. ఎవరితో డీకొంటున్నాడో తెలుసా వాడికి? గ్రేట్‌వార్‌ విజేతతో. వీరస్వర్గం అలంకరిస్తాడా! చివరికి జరిగేది అదే. ఇంక ఉపేక్షించడం అనవసరం. మైదాన ప్రాంతాలు తోడొస్తే ఇంకా తలనొప్పి.’’ అన్నాడు ఆర్మిటేజ్‌.‘‘మీరేమిటి నోరు విప్పడం లేదు?’’ అన్నాడు సాండర్స్, ట్రేమన్‌హేర్‌తో.‘‘మనం ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉన్నామేమో?!’’ అన్నాడతడు.



5

‘‘ఇరవై ఒకటో తేదీన రామరాజు గూడెం దగ్గర గాలికొండ మీద ఏదో ఉత్సవం జరుపుతున్నాడట!’’ టాల్‌బట్‌తో చెప్పాడు సాండర్స్‌. ఇద్దరూ కోరాపుట్‌ నుంచి వచ్చినవాళ్లే. నర్సీపట్నం డీఎస్సీ కార్యాలయంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ‘‘సీఐడీ రిపోర్టేనా?’’ అన్నాడు టాల్‌బట్, విసుగ్గా.‘‘అదే, కానీ నమ్మదగినదే. అయినా రిపోర్టు వచ్చిన తర్వాత మన వంతు ప్రయత్నం చేయకపోతే అదో రగడ!’’ అన్నాడు సాండర్స్‌. మళ్లీ తనే అన్నాడు ‘‘ఇప్పుడెందుకో ఉత్సవం?’’ ‘‘విజయోత్సవమే అయి ఉండాలి!’’ తాపీగా అన్నాడు టాల్‌బట్‌. ‘‘విజయోత్సవమా? నాకు తట్టనేలేదు.



 కొండవాళ్లు పండగలూ, ఉత్సవాలూ జరుపుకుంటూ విర్రవీగిపోతున్నారని రిపోర్టు వెళితే సెయింట్‌ జార్జ్‌ ఫోర్టు దృష్టిలో మనమంతా చవటల్లా మిగులుతాం.’’ అన్నాడు సాండర్స్‌.‘‘అది నిజం!’’ నిర్లిప్తంగానే అన్నాడు టాల్‌బట్‌. ‘‘చింతపల్లి దాడి జరిగిన సరిగ్గా నెలరోజులకి విజయోత్సవం చేస్తున్నాడన్నమాట. ఇంతకీ మనమిద్దరమే ఫోర్సుతో వెళ్లాలన్నాడు ఆర్మిటేజ్‌l.’’ చెప్పాడు సాండర్స్‌. పెద్దవలసలో ఉండి బలగాలనూ, వ్యూహం అమలునీ టాల్‌బట్‌ పర్యవేక్షించాలనీ,  గూడెం కొండలలో గాలికొండ మీదకు సాండర్స్‌ వెళ్లి ఉత్సవాన్ని భగ్నం చేయాలనీ నిర్ణయించుకున్నారు.



ఒక పటాలం పెద్దవలస వస్తున్న సంగతి, మరో పటాలం గాలికొండ వైపు కదులుతున్న సంగతి కొన్ని నిమిషాలలోనే రామరాజుకి తెలిసిపోయింది. పెద్దవలస– ఎండుపడాలు అడ్డా.  ఏం జరుగుతున్నదో గ్రామస్థులు ప్రతి క్షణం కబురందిస్తున్నారు. ముందు పెద్దవలసలో ఉన్న పోలీసు శిబిరాన్ని చెదరగొడితే, గాలికొండ వైపు కదులుతున్న సాండర్స్‌ వెనక్కి రాకతప్పదు. గంతన్నకు అదే చెప్పి పంపాడు రామరాజు. ఒక కొండవాలు మీద ఉన్న చింతచెట్లు ఎక్కి కూర్చున్నారు, నలభయ్‌ మంది వరకు కొండదళం సభ్యులు. శిబిరం నుంచి సాండర్స్‌ పటాలంతో గాలికొండ బయలుదేరాడు.  పెద్దవలసలో తిష్ట వేసిన టాల్‌బట్‌ బలగాలు వంట ప్రయత్నంలో ఉన్నాయి.



అప్పుడే కొండదళం సభ్యులతో కలసి శిబిరం మీద హఠాత్తుగా వచ్చి పడ్డారు పడాలు, గంతన్న. చిన్న ప్రతిఘటన కూడా లేదు. పోలీసులంతా చింతపల్లి వైపు పారిపోవడం మొదలుపెట్టారు. గుర్రం ఎక్కుతూ ఒక కానిస్టేబుల్‌ని పిలిచి సాండర్స్‌ను తప్పించుకోమని చెప్పి పలాయనం చిత్తగించాడు టాల్‌బట్‌. గాలికొండ వెళితే ఇంకెంత ప్రమాదం! సంగతి తెలిసిన సాండర్స్‌ ప్రశ్నించుకున్నాడు. వేరే దారిలో నర్సీపట్నం బయలుదేరాడు. సాయంత్రం కొండదళం విజయోత్సవ సంరంభంతో గాలికొండ దద్దరిల్లిపోయింది. ‘‘ఈ విజయాలకు సంతోషిద్దాం. మరో విజయాన్ని కూడా సాధిద్దాం!’’ అని సందేశం ఇచ్చాడు రామరాజు.

6

అది బొమ్మెత్తుపొద్దు.ముఖం ఎత్తి సూర్యుడిని చూడవలసిన వేళ. అంటే ఉదయం తొమ్మిది గంటల సమయం. ఐదుగురు సభ్యులున్న ఆ అడ్వాన్స్‌ పార్టీ అక్కడకు వచ్చి ఆగింది. అడ్వాన్స్‌పార్టీకి దాదాపు ఇరవై అడుగుల వెనక ఉన్నారు– క్రిష్టఫర్‌ విలియం స్కాట్‌ కవర్డ్,  లయోనల్‌ నెవిల్లీ హైటర్‌. కవర్డ్‌ లాగే హైటర్‌ కూడా అసిస్టెంట్‌ పోలీసు సూపరింటెండెంట్‌ హోదా కలిగిన ఉన్నతోద్యోగి.



అడ్వాన్స్‌ పార్టీలో ఉన్న జయరాంనాయుడు వెనక్కి వచ్చి చెప్పాడు ఇంగ్లిష్‌లో. ఒంగోలు నుంచి గాలింపు కోసం మన్యం వచ్చాడు. ‘‘ఇదే సార్‌! దామనపల్లి’’ వెంటనే స్కాట్‌ కవర్డ్‌ కుడి చేయి పైకెత్తి ఏదో సంకేతించాడు.ఆవేళ రామరాజు దళం భోజన సామగ్రి కోసం దామనపల్లి వస్తుందని కచ్చితమైన సమాచారం ఉంది పోలీసులకి.ఎక్కడివాళ్లు అక్కడే నిలిచిపోయారు. చిట్టచివర ఉన్న ఆ రెండు ఏనుగులు, ఒక్క నిమిషం తరువాత ఆగాయి. వాటి వెనకే నడుస్తున్న కంచరగాడిదలు కూడా ఏదో అర్థమైనట్టు అలాగే నిలబడిపోయాయి.



వాటి మీద మంచినీళ్లు, ఆహార పదార్థాలు, కంబళ్లు ఉన్నాయి. ఇంకా– ప్రాథమిక చికిత్సకు అవసరమయ్యే సరంజామా ఉంది.చుట్టూ పరికించి చూశాడు కవర్డ్‌. కాస్త లోతట్టునే ఉంది ఊరు. తాటాకు గొడుగులు ఎండలో పెట్టినట్టు ఉన్నాయి గుడిసెలు. నాలుగో అయిదో ఇళ్లు మాత్రం పెద్దవి. కనుబొమలు ముడిపడ్డాయి కవర్డ్‌కి. గుడిసెలను చూసి కాదు, వాటి ముందు నిలబడిన ఆడామగా, ముసలీ ముతకా ఏదో చర్చించుకుంటున్నారు, పెద్ద పెద్ద గొంతులతో.కొన్ని క్షణాల ముందు అక్కడ ఏదో కలకలం రేగినట్టే ఉంది.‘‘జయరాం! ఏదో జరిగినట్టే ఉంది. వాళ్లని అడుగు!’’ అన్నాడు కవర్డ్‌.



అదే ఆలోచన వచ్చిన జయరాం వెంటనే రెండడుగులు వేసి, చేతులు ఊపుతూ పెద్ద గొంతుతో పిలిచాడు, ‘‘అరేయ్‌! మిమ్మల్నే ఇట్రండి! ఇక్కడ ఇక్కడ.’’అప్పుడు చూశారు వాళ్లంతా పైకి.అంతే, పులిని చూసినట్టు చాలామంది, అంతా తలో దిక్కుకు పరుగెత్తారు. ‘‘అరేయ్‌! అరేయ్‌! ఆగండి! ఇట్రండి!’’ అన్నాడు బెదిరింపుగా జయరాం.నలుగురు మాత్రం వచ్చి జయరాం నాయుడు ఎదురుగా నిలబడ్డారు, భయం భయంగా.అంతా గోచీలు పెట్టుకుని ఉన్నారు. నల్లటి శరీరాలు. చింపిరి జుట్లు.



‘‘పితూరీ దండేదైనా ఇటొచ్చిందా?’’ 303 రైఫిల్‌ని భూమి మీద ఆనుస్తూ అడిగాడు జయరాం. మాట్టాడలేదు వాళ్లు. ‘‘నోరు పెగల్దేరా! తల తీసేస్తాం నా కొడకల్లారా! వచ్చారా లేదా?’’ గట్టిగా అన్నాడు జయరాం.‘‘వచ్చారు దొరా! మా కాడన్నీ దోచుకుపోయారు.’’ అన్నాడు ఒక యువకుడు భయపడుతూ.తుపాకీని మళ్లీ అమాంతం భుజం మీద వేసుకుంటూ అడిగాడు జయరాం, ‘‘ఎటు పోయార్రా!’’ ‘‘ఈ ఘాటీ దిగి, ఈ దారంటే.....’’ మరో యువకుడు చెప్పాడు, చేత్తో చూపిస్తూ.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top