ఆకుపచ్చ సూర్యోదయం

ఆకుపచ్చ సూర్యోదయం


అది ఆ కొండలలో కొత్త దృశ్యం. ఆగస్ట్‌ 22, 1922. మిట్ట మధ్యాహ్నం. నడినెత్తిన మండుతున్నాడు సూర్యుడు. ఆ అర్ధనగ్న సాయుధుల దండయాత్ర సన్నివేశం కొన్ని తరాలపాటు గుర్తుంటుంది.కవాతు చేస్తున్న ఆక్రోశం... నిశ్చయంగా అడుగేస్తున్న ధర్మాగ్రహం...శిరసెత్తి నడిచే ఆత్మగౌరవం– వీటినే రూపు కట్టిస్తున్నాయి, ఆ మూడు సమూహాలు. కొండల మీద మెరుపు వేగంతో కదిలిపోయే మేఘాల నీడల్లా ఉరుకుతున్నాయి ఆ సమూహాలు– లంబసింగి రోడ్డు ఎక్కడానికీ, చింతపల్లి వైపు సాగిపోవడానికీ. అంతా కలసి మూడొందలకు పైనే ఉన్నారు. కొండ ప్రజలు రక్తం చిందించి నిర్మించిన రోడ్డు... ఆ నెత్తుటిఫలం మీద హక్కు ప్రకటిస్తున్నట్టు  ధీమా ఆ నడకలో.



మొదటి సమూహానికి ముందు పంచపాండవుల్లా నడుస్తున్నారు ఐదుగురు. మధ్య నిలబడిన ఆ బలమైన యువకుని చేతిలో తప్ప మిగిలిన నలుగురి చేతులలోను విల్లంబుల్లున్నాయి. ఆ యువకుడు మాత్రం మూడు నాలుగు అడుగుల బాణాకర్రను ఎత్తి పట్టుకున్నాడు.ఆ కర్ర కొసన రెపరెపలాడుతోంది జెండా. శబరి కొండ మీద నుంచి బయలుదేరినప్పుడు ధరించిన జెండా.బారెడు పొడవు, మూరెడు వెడల్పు ఉంది, మూడు రంగులతో.పైన తెలుపు, మధ్య ఆకుపచ్చ. అడుగున ఎరుపు. తెలుపు, ఆకుపచ్చ రంగుల మీద రాట్నం బొమ్మ.హోంరూల్‌ ఉద్యమం కోసం పింగళి వెంకయ్యగారు రూపొందించిన పతాకం.మొలకు చిన్న గావంచా, తలకు చిన్న పాగా మాత్రమే ఉన్నాయి ఆ జెండాధారికి. చెమటతో తడిసిపోయి నిగనిగలాడుతోంది నల్లటి దేహం.



 మునసబు, ముఠాదారు పదవులను అనుభవించిన ఆ కొద్దిమంది మాత్రం కాసెకోక గోచీ పోసి పంచె కట్టారు. వాళ్లు బగత కులస్థులు. మోకాళ్ల దాకా ఉండి, ముందుకు కుచ్చు వేలాడుతూ వెనుక బిళ్ల గోచీలా కనిపిస్తుంది నలుపు, ఎరుపు ఇతర రంగులు కలసిన ఆ పంచె. తమ సాంఘిక ఆధిపత్యాన్ని ప్రకటిస్తూ బగతలే మెడలకు కంటెలు, కాళ్లకు కడియాలు, మొలలకు వెండి మొలతాళ్లు ధరించారు. తమది యుద్ధవీరుల వారసత్వమనీ, కులమనీ వాళ్లు నమ్ముతారు. కొందరు పుట్టగోచీతో కనిపిస్తున్నారు. ముందు భాగం కప్పుతూ, పిరుదులను కప్పని వస్త్రధారణ ఇది.



బగతల కంటే కింది స్థాయి కులాలు కొండరెడ్లు, కొండకాపులు ఈ పుట్టగోచీ పోసి కట్టుకుని, చిన్న తలపాగా ధరించారు. అందరి చెవులకీ ముక్కులకీ పోగులు ఉన్నాయి. ఈ తారతమ్యాలని ఒక ఇనుప చట్రంతో పోలవచ్చు. కానీ రామరాజు వీళ్లందరినీ ఇలా నడిపించగలిగాడు. చెమటోడుతున్న వాళ్ల వీపుల మీద వెదురుతో అల్లిన అమ్ములపొదులు వేలాడుతున్నాయి. అలుగు, బల్లెం, చురిక, కత్తి....... రకరకాల సంప్రదాయక ఆయుధాలు కనిపిస్తున్నాయి కొందిరి చేతుల్లో.  శబరికొండ మొదలు ప్రతి గ్రామంలోను కొత్తవాళ్లు చేరుతూనే ఉన్నారు. మొదటి సమూహం లంబసింగి రోడ్డు ఎక్కి, కొంచెం ముందుకు నడిచింది– ఎండుపడాలు నాయకత్వంలో.



గాం గంతన్న దొర నాయకత్వంలో నడుస్తున్న రెండో బృందం కూడా రోడ్డు మీద వచ్చింది. ఆ తరువాత మూడో బృందం. మూడు బృందాలకీ మధ్య కొద్ది కొద్ది దూరం.మూడో బృందానికి ముందు నడుస్తున్నాడు శ్రీరామరాజు. తెల్లని పంచె అడ్డకట్టు కట్టుకుని, పైన మరో తెల్లని వస్త్రం కప్పుకుని నడుస్తున్నాడు. అతడి చేతిలో కూడా విల్లంబులే ఉన్నాయి. కాళ్లకు చెప్పులు లేవు. పక్కనే గాం మల్లు దొర. ఇవతల పక్క మరో ఉద్యమకారుడు, విల్లంబులతో. రెండు రోజుల క్రితం కురిసిన వర్షంతో మానని ఓ మహా గాయాన్ని గుర్తుకు తెస్తోంది ఆ ఎర్ర కంకర రోడ్డు. గప్పీదొర బంగ్లా నిర్మానుష్యంగా ఉంది. అది కూడా దాటి ముందుకు నడిచారు. అప్పుడే, ఎత్తుగా ఉన్న రోడ్డును అతి కష్టం మీద ఎక్కుతున్న గోముటెద్దుల బండి కనిపించింది, ముందు వరసలో ఉన్నవాళ్లకి.



పొట్టిగా, బక్కగా ఉంటాయి, గోముటెడ్లు. వాటినే చచ్చేటట్టు బాదుతున్నాడు బండి తోలుతున్నవాడు. బండి చింతపల్లి నుంచి వస్తోందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటిదాకా బండిలో కూర్చున్న ఆ ఖాకీ బట్టల శరీరం చటుక్కున లేచి నిలబడింది. అతనికి తాటాకు గొడుగు పడుతున్న  ఆ గిరిజనుడు ఏదో చెప్పాడు కాబోలు.ఆ ఖాకీదుస్తుల మనిషి ఈరెన అప్పలస్వామినాయుడు. సాక్షాత్తు చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ఇన్స్‌పెక్టర్‌.



ఆ సమూహాన్ని చూసి విస్తు పోయాడు.ఖాకీ గుడ్డలు చూస్తే చాలు కొండవాళ్లు– ఒకడైనా, పదుగురైనా– ఆ పొద పక్కకీ, ఈ చెట్టు వెనక్కీ తప్పుకుంటారు. కానీ వీళ్లేమిటో! ఆ అడుగుల్లో బెరుకు లేదు. వాళ్ల కళ్లలో భయమూ లేదు. ఆ సమూహాలు సాగుతూనే ఉన్నాయి. మొదటివరసలోనే నడుస్తున్న కొలగాని సంగతులు అనే గిరిజనుడు ఒక్క క్షణం నిదానించి చూసి, వెంటనే  వెతుక్కుంటూ వచ్చి రామరాజుకు చెప్పాడు, ‘‘సామీ! చింతపల్లి సబిన్సుపెట్రు అప్పలసామినాయుడు ఇటే వస్తన్నాడు.’’ ఆయన ముఖంలో చిరునవ్వు.



అప్పటికే గంతన్న, గోకిరి ఎర్రేసు, కర్రి కణ్ణిగాడు మరో నలుగురైదుగురు కూడా ఆ కబురుతో అక్కడికే వచ్చారు. అప్పుడన్నాడు రామరాజు, ‘‘మనవాళ్లని ఒక్క క్షణం ఆపండి!’’ఒకింత ఆవేశం కనిపిస్తున్నా, తొందరపడే ఉద్దేశం ఎవరికీ లేదు. అంత జనాన్ని ఒక్కసారి చూసేసరికి గోముటెద్దులు బెదిరి, అడుగు వెనక్కి వేయడం మొదలుపెట్టాయి. వాటి వీపుల మీద కర్రతో కొడుతూనే ఉన్నాడు, బండి తోలుతున్న ఆ గిరిజనుడు. ‘‘ఆపెహె!’’ విసుగ్గా, ఆందోళనగా అరిచాడు ఎస్‌ఐ.



ఖాకీబట్టలు ఎదురైనా ఆగకుండా ఇంతమంది ఎక్కడికి వెళుతున్నట్టు? ఆ బాణాలూ, బరిసెలూ ఎందుకు? తన ప్రాణానికి ముప్పు ఉందా? అప్పుడే గమనించాడు ఎస్‌ఐ– ఆ జనంలో ఐదారు చేతులలో నాటు తుపాకులు, ఇంకో రెండు మూడు మజిల్‌ లోడింగ్‌ గన్నులు ఉన్నాయి. ‘‘ఎవర్రా ఈళ్లంతా?’’ ఆగ్రహాన్ని దాచుకోలేక, ప్రదర్శించలేక సతమతమవుతున్నాడు నాయుడు.గొడుగు పట్టిన గిరిజనుడు నుదుటికి చేయి అడ్డం పెట్టి పరికించి చూస్తూ వణికిపోతూ చెప్పాడు.‘‘దొరా......! మళ్లీ.... పితూరీ కాబోలు?’’



‘‘నోర్ముయ్‌! వాళ్లలో నీకెవరైనా తెలిస్తే చెప్పు!’’ తడబడే మాటతో, కళ్లెర్ర చేస్తూ అన్నాడు నాయుడు. ‘‘చిత్తం... జనాన్ని ఆపుతున్నాడు చూడండి! ఆడు, బోనంగి పోతరాజు.’’ ‘‘వాడిదేవూరు?’’ ఉత్కం తో ఉన్నా పోలీసు బుద్ధి పోనిచ్చుకోవడంలేదు నాయుడు.‘‘శరబన్నపాలెం దొరా! ఇంకా.. జర్త ఎండుదొర, ఊరు–గుమ్మడిగూడెం. సాగిన సన్యాసి పడాలు, సింగంపల్లి. పిట్టల పోలయ్య, రామన్నపాలెం. తోట మరిడయ్య, నడింపాలెం. తగ్గి తాపన్న, ఈడిది గూడెం దొరా! ఆడిపక్కన ఉన్నోడు తగ్గి సోమన్నదొర, ఈడిదీ నడింపాలెమే. ఆ తెల్లటోడు, జర్తా తోకయ్య, పెద్దవలస.....కంకిపాటి శరభన్న పడాలు, గబలం సింగడు, మామిడి చిన్నయ్య, జగ్గి వీరయ్యదొర....’’ ఒక్కొక్కరినీ పోల్చుకుంటున్నాడతడు.



అప్పుడే గంతన్న, ఎండు పడాలు ముందుకు వచ్చి బండిని ఆపమన్నట్టు చేతులెత్తి సైగ చేశారు. ‘‘దొరా! దొరా! ఆ కాసెకోక గోచెట్టుకున్నోళ్లు ఇద్దర్లో ఒకడు గంతన్న, బట్టిపనుకులోడు. బేస్టిను దొరతో తగాదా ఆడికీ, ఆడి తమ్ముడు మల్లయ్యకీ. గంతన్న పక్కన ఉన్నాడు, ఆడు ఎండు పడాలు, పెద్దవలస! వస్తన్నాడే ఆ బండోడు, ఆడే మల్లయ్య. ఆ గెడ్డాపాయన.....’’ రామరాజు ఎవరో తెలియలేదతడికి.



అప్పుడే వచ్చాడు రామరాజు. వెనకే మల్లు.గంతన్న, ఎండుపడాలు, మరో నలుగురు వెంటరాగా పది బారల అవతల ఉన్న బండి దగ్గరకు నడిచాడు రామరాజు. ‘‘అప్పలస్వామినాయుడు గారూ! నా పేరు అల్లూరి శ్రీరామరాజు!’’ అన్నాడు ఎంతో మన్ననతో.‘‘విన్నాను.’’ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ సమాధానం ఇచ్చాడు నాయుడు.‘‘వినివుంటే సంతోషం. మేం చింతపల్లిలో ఏం చేయబోతున్నామో చూస్తే ఇంకా సంతోషం. ఇంకాసేపటికి మనం మీ పోలీస్‌ స్టేషన్‌లోనే కలసి ఉండేవాళ్లం. ముందే కలిశాం, ఇలా.’’ అన్నాడు రామరాజు.  



‘‘ఏంటీ! పితూరీ చేస్తారా? తొక్కేస్తాం!’’ అన్నాడు మరింత పొగరుతో, ఎస్‌ఐ.‘‘మర్యాద!’’ గంతన్న, మల్లు, పడాలు ఒక్కసారే అన్నారు, నాయుడికేసి చూస్తూ. మాట నిదానంగా ఉన్నా, హద్దు మీరితే నాలుక తెగుతుందన్న హెచ్చరిక కూడా ఉంది అందులో. ఆ మూడు సమూహాల జనం ఒక్క అడుగు మాత్రమే ముందుకు వేశారు, ఆ క్షణంలో. ఈ అలజడికి గోముటెద్దులు బెదిరి, అటూ ఇటూ కదిలాయి. కంగుతిన్నాడు ఎస్‌ఐ.వెంటనే రామరాజు అన్నాడు, ‘‘పడిపోతారు. దిగి రండొకసారి!.’’బుద్ధిగా దిగి రాజు దగ్గరకు వచ్చాడు నాయుడు.



‘‘మీరు ప్రభుత్వోద్యోగులు. మర్యాద మన్నన ఇకనైనా నేర్చుకోక తప్పదు. లేదంటే వీళ్లే నేర్పిస్తారు నాయుడుగారు!’’ అన్నాడు రామరాజు.కొన్ని లిప్తల తరువాత శ్రీరామరాజే అన్నాడు, ‘‘నిజమే నాయుడుగారూ! ఇది ప్రభుత్వ ధిక్కారమే.  ఆ ప్రభుత్వానికి కాపుదలగా ఉండే ఈ పోలీసు విభాగాన్ని ఎదిరిస్తున్నాం. కానీ మాది పితూరీ కాదు. వినండి. మేం చింతపల్లిలో చేయబోయే పని– మీ పోలీసు స్టేషన్‌ మీద దాడి!’’



ఈ మాట చాలా కంగారు పెట్టింది నాయుడిని, వెంటనే చేతులు కట్టుకున్నాడు. క్క నిమిషం తరువాత మళ్లీ రామరాజు అన్నాడు, ‘‘ఈ అడవిబిడ్డలంతా.. పట్టపగలు మీ స్టేషన్‌ను కొల్లగొడుతున్నారు. మీ ఆయుధాలు తీసుకుంటున్నారు. అవి ఈ ప్రభుత్వం మీదే ఎక్కుపెడతారు! వెనక్కి వస్తారా? ముందుకు వెళతారా? మీ ఇష్టం. అర్థమైంది కదా! పోలీస్‌ స్టేషన్‌ మీద దాడి చేస్తున్నామని ముందే చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడ ఆపాం.’’అంటూనే చింతపల్లి వైపు అడుగు వేశాడు రామరాజు. మళ్లీ కదిలింది కొండదళం. సబ్‌ఇన్స్‌పెక్టర్‌ అలా చేతులు కట్టుకుని మాట్లాడడం చూసి నిబిడాశ్చర్యంలో మునిగారు కొండవాసులు.





అప్పుడే కొటికల బాలయ్య పాట అందుకున్నాడు– ‘‘వెరవడు చంద్రయ్య....... వెనుదీయడు.....’’ఒక్కసారిగా అందుకున్నారంతా.‘‘వాడి నడుము నట్టెడి లేడికావించు’’‘‘వాడు శిరసు సిమ్మాలమ్మ గద్దెగావించు....’’వాడి పండ్లు పగడాల పట్టు తోరాలు.’’ద్వారబంధాల చంద్రయ్యని గుర్తు చేసే పాట. నాయుడు భరించలేçకపోయాడు. ఒక్కసారిగా బండెక్కి, ‘‘పగ్గాలు వదల్రా! ముందుకే పోనీ!’’ నర్సీపట్నం వైపు చూపిస్తూ అరిచాడు.దూరంగా లోయలనీ, కొండలనీ ప్రతిధ్వనింపచేస్తూ ఆ పాట– ‘‘వెరవడు చంద్రయ్య......’’



రెండు గంటలవుతూ ఉండగా చింతపల్లి చేరుకుంది రామరాజు సేన.చింతపల్లి–లంబసింగి రోడ్డుకు పక్కనే, పెద్దవలస, రంపుల ఘాటీ పోయే మార్గంలో– ఒక ఒంపులో కట్టారు పోలీస్‌ స్టేషన్, పెద్ద తాటాకు ఇల్లు.కోలాహలం విని బయటకొచ్చారు ముగ్గురు కానిస్టేబుళ్లు. గుండెలదిరిపోయాయి.ఉరుకుతున్నారు గిరిజనులు. అందరి చేతులలోను ఆయుధాలే. అది పితూరీయేనని తీర్మానించుకుని, తలా ఒక దిక్కుకు పరుగెత్తారు. పితూరీ అంటే పోలీసుల రక్తం చూస్తారు. స్టేషన్‌ తగలబెడతారు. అదే వాళ్ల నమ్మకం.



ఆ ముగ్గురినీ పట్టుకుంది రామరాజు దళం. అందులో ఒక కానిస్టేబుల్‌ తనను పట్టుకున్నవాళ్ల కేసి భయం భయంగా చూశాడు. తన కుడిభుజం పట్టుకున్న ఆ మనిషి ఎవరో కాదు, కోలంకి కన్నడు. అంటే చింతపల్లి బారిక. పెంట్రపాడు దగ్గర కలసిన యాభై మందిలో అతడూ ఒకడు. నిజానికి ఆ ఊరి మునసబు పాత్రలు, బియ్యం ఇచ్చి పంపితే, అప్పగించడానికి వచ్చి, వాళ్లలో కలసిపోయాడు.‘‘కట్టెయ్యండి!’’ గట్టిగా చెప్పాడు గాం గంతన్న.పైప్రాణాలు పైనే పోయాయి వాళ్లకి. ముగ్గురినీ తీసుకెళ్లి స్తంభాలకి కట్టేశారు. పైగా నలుగురు వంతున ఒక్కొక్క కానిస్టేబుల్‌ దగ్గర కాపలా. అప్పుడే రామరాజు ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు.అంతా పక్కకి తప్పుకుని దారి ఇస్తుంటే, వేగంగా లోపలికి నడిచాడాయన.వెనకే మల్లు, గంతన్న, పడాలు, సంకోజి పండడు, కణ్ణిగాడు, ఎర్రేసు వెళ్లారు.నాలుగు గదులున్నాయి.



 వాటిలో రెండింటికి తాళాలు. వాటిని పగలకొట్టి వెతికారు.రామరాజు స్వయంగా ఎస్‌ఐ టేబుల్‌ మీద ఉన్న స్టేషన్‌ డైరీ తీసుకుంటూ అడిగాడు, ‘‘ఎన్ని దొరికాయి పడాలు?’’‘‘పదకొండు తుపాకులు. ఐదు కత్తులు. పద్నాలుగు బాయ్‌నెట్లు. తూటాలు లెక్కపెట్టాలి.’’‘‘లెక్కి పెట్టండి!’’ అంటూ స్టేషన్‌ డైరీ తెరిచాడు రామరాజు.పది సంచులలో ఉన్న మందుగుండును అంతా కలసి లెక్కపెడుతున్నారు.రెండు నిమిషాలు ఆలోచించి, అక్కడే ఉన్న ఊటకలంతో రాశాడు రామరాజు.‘అల్లూరి శ్రీరామరాజు అను నేను, నా సహచరులతో ఈ పోలీసు స్టేషన్‌ను ముట్టడించి, సెంట్రీని ఆయుధాగారం గది తాళాలు అడిగాను. ఇవ్వడానికి అంగీకరించలేదు. స్టేషన్‌ స్తంభానికి కట్టివేసి తాళాలు తీసుకున్నాను.



 ఆయుధాలు సేకరించబడినాయి.’

‘‘సామీ! 1,390 తూటాలు.’’ చెప్పాడు గంతన్న.అది కూడా డైరీలో రాసి, కింద ‘అల్లూరి శ్రీరామరాజు’ అని సంతకం చేసి లేచాడు రామరాజు. అప్పటికే చింతపల్లి ప్రజలు కొందరు అక్కడికి చేరుకున్నారు.కొందరికి స్టేషన్‌ తగలబడితే చూడాలని ఉంది. అదేమీ పైశాచికానందం కాదు. పోలీసుల మీద ఉన్న పగ. ఇంత సులభంగా పోలీసులని లొంగదీసిన ఆ సాములోరిని చూద్దామనీ కొందరొచ్చారు.అప్పుడే లోపల నుంచి వస్తున్నాడు రామరాజు. ‘‘ఆ సాములే... శ్రీరామరాజు గారు!’’ ఎవరో అరిచారు.



వెంట మల్లు, గంతన్న, పడాలు, మిగిలినవాళ్లు. అందరి భుజాల మీద తుపాకులు.

గోకిరి ఎర్రేసు కత్తులు పట్టుకుని వచ్చాడు. తేగ గ్రామస్తుడు సుంకరి పోతయ్య పోలీసుల యూనిఫారాలు మూటగట్టి తెస్తున్నాడు, చివరన.రామరాజు స్టేషన్‌ మెట్లు దిగి వస్తుంటే మహా విజేతను చూసినట్టే ఉంది వాళ్లందరికీ.ఆ జనాన్ని చూసి రామరాజే స్వయంగా నినాదం ఇచ్చాడు, ‘‘వందేమాతరం’’దిక్కులు పిక్కటిల్లేటట్టు స్పందించారు, ‘‘మనదే రాజ్యం!’’ అంటూ.‘‘గాంధీజీకి’’ మళ్లీ రామరాజే అన్నాడు. ‘‘జై!’’ అన్నారంతా.మళ్లీ మల్లు దొర నినాదం ఇచ్చాడు, ‘‘అల్లూరి శ్రీరామరాజు గారికీ’’



‘‘జై... జై.... జై.....’’

అంతా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ప్రతి నమస్కారం చేస్తూనే వేగంగా ప్రాంగణం నుంచి బయటకు వచ్చాడు రామరాజు.ఆ క్షణంలో ఒక వాస్తవం చాలామందికి సులభంగానే అర్థమయింది–పోలీస్‌ స్టేషన్‌ దగ్ధం కాలేదు. కానీ, తూర్పు కనుమలలో పోలీసుల ప్రతిష్ట తొలిసారి బూడిదైంది.పెద్దవలస, రంపులఘాటీ వెళ్లే రోడ్డు వైపు తిరిగాడు రామరాజు. ముందే ఉన్నాడు జెండాధారి. అందరి ముఖాలలో విజయ భావన– వెల్లువలా.

సాయంత్రపు గాలికి మరింతగా రెపరెపలాడుతోంది జెండా.

                                                           

2

ఆగస్టు 23, 1922– మధ్యాహ్నం.

కృష్ణదేవిపేటలో హఠాత్తుగా కలకలం. పితూరీ దండు ఏ క్షణాన్నయినా  కృష్ణదేవిపేట మీద పడవచ్చు. కొన్ని నెలల క్రితం సంతలో గోకిరి ఎర్రేసు, కణ్ణిగాడు చెప్పిన మాట నిజమేనన్నమాట. మరో పితూరీ మొదలైంది.  నాయకుడు శ్రీరామరాజే. ఆయనంటే ప్రత్యక్ష దైవం. కానీ పితూరీ అంటే భయం. ఫలితమే ఆ కలవరం.కొద్దిదూరంలో మాకవరంలోనే దండు ఉందని కబురు.



చింతపల్లి స్టేషన్‌ను కొట్టిన తరువాత సేన రంపులఘాటీ నుంచి శరభన్నపాలెం వెళ్లిందట. దారిలో, నడింపాలెం దగ్గరగా ఘాటీ మీదే పహరా కాస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్‌ కనిపిస్తే, వాళ్లని ఆపి, రెండు తుపాకులు, ఐదు తూటాలు కూడా లాక్కున్నారట. శరభన్నపాలెంలో ఉదయమే పెరుగు అన్నం పెట్టించాడట ముఠాదారు. ఇప్పుడు కృష్ణదేవిపేట వస్తున్నారట. అందరి నోటా అదే.మధ్య తరగతి కుటుంబాలు, చిన్న చిన్న ఉద్యోగులు, గ్రామాధికారులు తలా ఒక సంచీ పుచ్చుకుని ఇళ్లకు తాళం పెట్టి, చుట్టుపక్కల గ్రామాలలో బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. షేక్‌ మహమ్మద్‌ ఈసీబు బట్టల దుకాణం మూసేసి వెళ్లిపోయాడు. మరో చిన్న కిరాణా దుకాణం మూత పడింది.



ఇలా వెళ్లిపోయిన వాళ్లలో భాస్కరుడిగారి కుటుంబం ఒకటి. ఊరి శివార్లలో రైతు ఇంటికి చేరుకుంది. ఏపుగా పెరిగిన గంటి చేల మధ్య ఉందా తాటాకుల ఇల్లు. ఆ స్థలం, ఆ పొలం గురించి అంతకాలం గ్రామంలో ఉన్న శ్రీరామరాజుకు తెలియదని భాస్కరుడుగారు ఎందుకు అనుకున్నారో అర్థంకాదు. కానీ అందరికీ గట్టి నమ్మకం– రామరాజు అరాచకాలు సాగనివ్వరు.



అందుకే కొద్దిమంది ఊరి పొలిమేరకు వచ్చి ఎదురు చూస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలవుతోంది. అప్పుడే ఎండలో ఎర్రటి దుమ్ము దూరంగా. కొన్ని నిమిషాలకే ఆ మూడు సమూహాలు ఊరి వైపు రావడం కనిపించింది. ఆ దండుకు ముందే ఉన్నాడా యువకుడు– త్రివర్ణ పతాకంతో. దళంలో ఉద్రేకం లేదు, ఉత్సాహం తప్ప. దారిలో ఎవరినీ హింసించినట్టు సమాచారం కూడా లేదు. అందుకే ఇది పితూరీ దండు కాదు అని నిర్ధారించుకున్నారు కృష్ణదేవిపేట ప్రజలు.ఏరి స్వాముల వారు? ఎక్కడ? అందరిలోనూ ఇదే ప్రశ్న.



ఆ సమూహానికి కొద్దిగా ముందు నడుస్తున్నారు పది మంది– ఖాకీ దుస్తులతో, చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ నుంచి తెచ్చినవి.గ్రామస్థులు నిటారుగా అయ్యారు. వారి భుజాల మీద తుపాకులు.  నాటు తుపాకులు కాదు. పోలీసులు ఉపయోగించేవే. ఆ పది మంది కొంచెం దగ్గరగా వచ్చిన తరువాత పరికించి చూసిన వారికి కనిపించాడు రామరాజు.కొత్త అవతారాన్ని చూసినట్టుయింది. అందరికీ దిగ్భ్రాంతి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top