ఆకుపచ్చ సూర్యోదయం

ఆకుపచ్చ సూర్యోదయం


రాత్రి... పదిగంటలు దాటి ఉండాలి. ఊరంతా సద్దుమణిగి పోయింది. నిద్రకు దూరమయ్యాడు రామరాజు. గూట్లో ఆముదం దీపం మసక వెలుతురు ఇస్తోంది. ఆ గదిలోనే మరో చాప మీద పడుకున్న తమ్ముడు నెమ్మదిగా గురక తీస్తున్నాడు. ‘అన్నయ్యా! ఇన్నాల్లూ ఎక్కలికెల్లావ్‌! అమ్మ లోజూ ఏడ్చేది, నీ కోసం!’ అంటూ సాయంత్రం తమ్ముడు వేసిన ప్రశ్న రామరాజును బాధించలేదు. తమ్ముడికి ఇప్పటికీ కొన్ని అక్షరాలు పలకడం లేదు. తల్లి పడిన వేదన కూడా ఆ ప్రశ్నలో వ్యక్తమైనా పెద్దగా చలించలేదు. సీత ‘ఊరుకో సత్తిబాబు’ అంటూ సర్దుబాటు చేసింది, ఆ క్షణంలో.  కానీ పుణ్యక్షేత్రాలకి వెళ్లానని చెప్పి ఉంటే బాగుండేదేమో అనిపించింది రామరాజుకి. అంతలోనే తండ్రి మ్యాజిక్‌ లాంతర్‌  ప్రస్తావన కూడా తెచ్చాడు సత్యనారాయణరాజు. తునిలో పేకేటి సుబ్బరాజు ఇంట్లో రామరాజే వదిలేశాడు. సత్యనారాయణరాజునే తీసుకు పొమ్మన్నాడట సుబ్బరాజు.అప్పుడే దూరంగా ఏదో పక్షి అరుపు. నెమ్మదిగా దూరమైందది.తాను తిరిగిన ప్రదేశాలన్నీ దైవాన్ని పూజించడాన్నీ, దేశాన్ని పూజించడాన్నీ వేరుగా చూడని వాతావరణంతో నిండి ఉన్నవే. ఉత్తర భారతదేశం వెళ్లాడు రామరాజు. ఉత్తర భారతం ఉష్ణ రక్త కాసారంలా ఉంది.



ఆ యాత్ర కళ్ల ముందు కదులుతోంది –ఆ మ్యాజిక్‌ లాంతరు బొమ్మల్లా...........

‘‘చిట్టిబాబు! ఈ బొమ్మేంటి? అదేవూరు? ’’  సంభ్రమాశ్చర్యాలు ప్రకటిస్తూ అడిగాడు పేకేటి సుబ్బరాజు, ఆ రోజు తునిలో.‘‘ముందు బొమ్మ చూడు! గుర్తొచ్చినప్పుడు చెబుతాను....!’’ అన్నాడు రామరాజు.మ్యాజిక్‌ లాంతర్‌ గొట్టం నుంచి వస్తున్న ఆ >ంతి గోడ మీద బొమ్మ రూపం దాల్చింది. ఏదో  నది...  ఆముదం దీపం కాంతితో రూపు కట్టిన ఆ బొమ్మలోనే నీళ్లు అంత స్వచ్ఛంగా కనిపిస్తున్నాయంటే, నిజంగానే ఆ నదీతీరానికి వెళితే ఇంకెంత అద్భుతంగా ఉంటుందోననిపించింది రామరాజుకి. కొన్ని గుర్తు లేకపోయినా బొమ్మలకి తండ్రి ఎలా వ్యాఖ్యానం చెప్పేవాడో అలాగే చెబుతాడు, రామరాజు.



ఆ ఊళ్లో ముప్పయ్‌ మంది వరకు ఉండేవాళ్లు అదే వయసు విద్యార్థులు. కోటనందూరులో సంస్కృతం చదువు నుంచి, ఊళ్లో ఇంగ్లిషు బడులకు వెళ్లే వాళ్లు కూడా ఉన్నారు. అంతా క్షత్రియుల పిల్లలు. తుని సంస్థానంలో పనిచేసే నీలాద్రిరాజుగారింట్లో ఉండేది రామరాజు కుటుంబం. ఆయన కవి. జ్యోతిష్యం కూడా చెప్పేవారు. సూర్యనారాయణమ్మకు దూరపు బంధువు. అంతకంటే ఆమె పుట్టింటివారికీ, ఆయన కుటుంబానికీ స్నేహమే ఎక్కువ. ఎక్కడో సంగీతం, ఇంకొకరి దగ్గర సంస్కృతం, నీలాద్రిరాజుగారి దగ్గర తెలుగు, భాష, ఛందస్సు, జ్యోతిష్యం ఇన్ని నేర్చుకుంటున్నాడు రామరాజు.



తునిలో దివాణం పాత మేడ. గోడ కాస్త తెల్లగా ఉన్నది అక్కడే. సగం విరిగిన తలుపులన్నీ మూసేసి, తలుపులు లేనిచోట తుండుగుడ్డలు కట్టి అక్కడ ఏర్పాటు చేశాడు మ్యాజిక్‌ లాంతరు బొమ్మల ప్రదర్శన శ్రీరామరాజు. అప్పుడప్పుడు మిత్రులంతా ఇలా ఒక ప్రదర్శన ఏర్పాటు చేసుకుంటారు. ఎప్పుడూ అవే అవే బొమ్మలు. అయినా ఏదో ఆకర్షణ. ఆ పాత మేడ వాళ్లందరి స్థావరం. పాత రాచరికానికి ప్రతీకగా ఉంటుంది. అడుగున్నర ఎత్తుండే దాని గుమ్మం దాటితే పెద్ద హాలు. ఆ హాలులోనే వీళ్లంతా ఉండేవాళ్లు. గోడల నిండా హంటింగ్‌ ట్రోఫీస్‌. పేరిచర్ల సూర్యనారాయణరాజు ముందు వరసలో కూర్చుని కన్నార్పకుండా చూస్తున్నాడు మ్యాజిక్‌ లాంతరు బొమ్మలని.



 నరుకులరాజు అంటారంతా. అతడి పక్కనే ఉన్నాడు సదాశివబ్రహ్మం. వీళ్లిద్దరి వెనకాలే ఆరుగురు కుర్రాళ్లు కూర్చున్నారు. పూసపాటి వెంకట వరాహ నరసింహరాజు కూడా ఉన్నాడు. నర్సుబాబు అంటారు. అతడికి కుడిపక్కన కూర్చున్నాడు బుద్ధు. అసలు పేరు పూసపాటిరేగ చిట్టిరాజు వర్మ. ఆ పాత కట్టడంలోనే వాళ్లు కొత్త కొత్త కలలు కంటూ ఉండేవారు. కానీ, రామరాజుకు ఏదో చెప్పలేని వెలితి. ఎప్పుడూ అశాంతి. ఒక్కొక్క రోజు అర్ధరాత్రి లేచి ఆ ప్రాంగణంలో చెట్ల కింద తిరుగుతూ కనిపించేవాడు. ఎవరికీ చెప్పకుండా వేకువనే స్నానం చేసి, ఊరి చివర ఉన్న సీతమ్మకొండ మీద ఆలయానికి వెళ్లేవాడు. సూర్యనారాయణమ్మ తలబాదుకునేది– ఇలా అయితే ఉద్యోగం ఎక్కడొస్తుంది? అంటూ. ఓ రోజు తల్లి గట్టిగా నిలదీసింది. సరే, ఉద్యోగం సంపాదిస్తాను, డబ్బు కావాలన్నాడు రామరాజు.

కొంచెం డబ్బు చేతిలో పెట్టింది, ఆ తల్లి.



 డైరీలో రాసుకున్నంత స్థిరంగా మనసులోనే నమోదవుతూ ఉంటాయి, కొన్ని తేదీలు. రామరాజు జీవితంలో ఏప్రిల్‌ నెల 26, 1916 అలాంటిదే. మిత్రులందరికీ వీడ్కోలు చెప్పాడు. నిజానికి తన ఉద్దేశం ఏమిటో తనకే తెలియదు. ఇక  మిత్రులకేం చెబుతాడు? ఈ సువిశాల భారతావనిని చూడాలి. హిమాలయాలు చూడాలి. గంగను దర్శించాలి. కాశీయాత్ర చేయాలి. ఎలా వెళ్లాలి? ఏమో! కోటనందూరు నుంచి నర్సీపట్నం వెళ్లాడు. అక్కడ నుంచి చోడవరం, విజయనగరం మీదుగా ఇచ్ఛాపురం చేరాడు. అలా నడుస్తూనే ఉన్నాడు.ఎన్ని భాషలు, ఎన్ని యాసలు ఈ దేశం నిండా! ఎంత కళ! ఎంత ఆధ్యాత్మిక సంపద! వీటిని ఆవిష్కరిస్తున్నట్టే కొండలు, నదులు, గుళ్లూ, గోపురాలూ...



ఒరిస్సా కూడా దాటి, ఉద్యోగాలు కోకొల్లలుగా దొరుకుతాయని అంతా భావించే కలకత్తా మహానగరంలో అడుగుపెట్టాడు. ఆ కొద్ది డబ్బు అయిపోయింది. ఊరంతా చూస్తుంటే రెండు రోజులు గడిచిపోయాయి. ఆకలితో పేగులు మెలి తిరుగుతున్నాయి. నీళ్లు తాగితే కడుపు నిండుతోంది గానీ, ఒంట్లోకి శక్తి చేరడం లేదు.

∙∙∙

ఓపిక తెచ్చుకుని భాగీరథీ నది ఒడ్డునే నడుస్తుంటే దర్శనమిచ్చిన ప్రాంతం ....బేరక్‌పూర్‌. ఆ ఒడ్డుకు కొన్ని గజాల దూరంలోనే కనిపించింది మహారాజుల ప్యాలెస్‌ వంటి భవనం. సువిశాలమైన ప్రాంగణంలో, మహావృక్షాల మధ్య కళకళలాడుతోంది. కడుపు కాలుతున్నా భవనం కనువిందు చేస్తూనే ఉంది. మధ్యాహ్న భోజన వేళ అది. భవనం ఎదురుగానే ఉన్న రేవులో దిగి కాళ్లూ చేతులూ కడుక్కుని కడుపు పట్టినన్ని నీళ్లు తాగుదామని వంగుతుంటే ఎవరో పిలిచినట్టయింది.



‘‘దాదా! అపన్‌కి ఆచె! దాదా! అప్నె కె. ఇదికె ఆశున్నా!’’ (అయ్యా తమరు ఎవరు? మీరు ఎవరు? ఇటు రండి!) నెమ్మదిగా నిలబడి చూస్తే, ఆ పిలుపు ఆ భవనం ముందు నుంచే – వంగ భాషలో. అర్థం కాక, అటూఇటూ చూశాడు రామరాజు. ఈసారి ఇంగ్లిష్‌లో పిలుపు.ఇది అర్థమయింది. ముందుకు చూశాడు. ఆ భవనంలో నుంచి ఒక మనిషి అదరాబాదరా తనవైపు వస్తూ కనిపించాడు.‘నొమష్కార్‌’ అంటూ రేవులో నిలబడి మళ్లీ వంగభాషలోనే చెప్పాడు, ‘‘దాదా అపన్‌ ఖానా న ఖాదేతో ఒఖనా బాడినే ఖానా ఖాబో’’ ఇతడికి బెంగాలీ అర్థం కాలేదని అర్థమయింది అతడికి.



అప్పుడు సాధారణమైన ఇంగ్లిష్‌లో చెప్పాడతడు.‘‘మీరు ఈ పూట ఇంకా  భోజనం చేయకపోతే, ఆ ఇంట్లో భోజన వసతి ఉంది.’’ మౌనం దాల్చాడు రామరాజు. మొహమాటపడుతున్న సంగతి ఆ ఆగంతకుడు పసిగట్టాడు. ‘‘సంకోచాలు అవసరం లేదు. నిత్యం మా యజమాని ఈ వేళ ఎవరు వచ్చినా భోజనం ఏర్పాటు చేయిస్తారు. ఇది ఆ ఇంటి సంప్రదాయం. వినే ఉంటారు, అది సురేంద్రబాబు గారి ఇల్లు. జాతీయ కాంగ్రెస్‌ నాయకులు.’’ అన్నాడు. సంశయిస్తూనే అతడి వెంట నడిచాడు రామరాజు. కాదు, ఆకలే నడిపించింది. చాలా ఆధునికంగా ఉన్నా, ఆశ్రమంలాగే ఉంది భవంతి. ఆ నిశ్శబ్దంలో అంత మార్మికత.



పెద్ద హాలులో కూర్చుని ఉన్నాడా వృద్ధుడు. డబ్బయ్‌ ఏళ్లుంటాయి. బట్టతల, తెల్లటి గడ్డం. గుండ్రటి కళ్లద్దాలు. చదువుతున్న అమృతబజార్‌ పత్రికలో నుంచి ముఖం పక్కకు పెట్టి వంగభాషలోనే అన్నారు. ‘‘ఎక్కడ నుంచి వస్తున్నారు?’’ ‘‘మద్రాస్‌ ప్రెసిడెన్సీలో గోదావరి తీరం నుంచి వస్తున్నాను.’’ ఇంగ్లిష్‌లో చెప్పాడు రామరాజు.నీరసంగా వచ్చింది మాట. పరిస్థితి అర్థమైంది, ఆ పెద్దాయనకి.‘‘దక్షిణ భారతదేశం వారా?! సంతోషం. రండి ముందు భోజనం చేద్దాం!’’ ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ ఆలస్యం చేయకుండా సాదరంగా లోపలికి తీసుకువెళ్లాడాయన. ఆయన ఇంగ్లిష్‌ మాట్లాడుతుంటే అచ్చు ఆంగ్లేయుడి ఉచ్చారణలాగే ఉంది.‘‘కలకత్తా భోజనం కొంచెం కొత్తగా ఉంటుంది మీకు.’’ అన్నాడాయన చిన్నగా నవ్వుతూ.



అంతలోనే ఆయన భార్య కాబోలు వచ్చి, ‘‘కూర్చోండి బాబూ!’’ అంది.ఎంత మర్యాద! ఎంత సంస్కారం.వాళ్లు ఖరీదైన దుస్తులలో ఉన్నారు. రామరాజు సాధారణలాల్చీ పైజమాలో ఉన్నాడు.  భోజనం అయిన తరువాత సురేంద్రబాబు ఏవేవో ప్రశ్నలు అడిగారు. అన్నిటికీ సమాధానం చెప్పాడు రామరాజు.కొద్దిసేపటి తరువాత ఆ పెద్దావిడే తీసుకువెళ్లి మేడ మీద ఉన్న చిన్న గది చూపించి విశ్రాంతి తీసుకోమని ఇంగ్లిష్‌లో చెప్పింది.  అక్కడ నేల మీదే వేసి ఉన్న పరుపు మీద పడుకుని, ఇదంతా ఏమిటో, ఆయన ఎవరో, తాను ఎవరో అంతా మాయగా ఉంది అని అనుకుంటూ ఉండగానే తనకు తెలియకుండా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. సాయంత్రం నాలుగు దాటి ఉంటుంది. అప్పుడు మెలకువ వచ్చింది రామరాజుకి.



 పరుపు పక్కనే ఉంచిన రాగి చెంబులో నీళ్లు తాగాడు. ఒళ్లంతా తేలిగ్గా ఉంది. మనసంతా ఆహ్లాదంగా ఉంది. ఆ గదిలోనే ఉన్నాయి– పాత అమృతబజార్‌ ఇంగ్లిష్‌ దినపత్రిక ప్రతులు. ఆ నెలవే కాబోలు. ఒద్దికగా సర్ది ఉంచారు. బయట ఏ సవ్వడీ లేదు.చేత్తో నాలుగు పత్రికలు అందుకుని పరుపు మీద కూర్చుని చదవడం ప్రారంభించాడు. ఏ రోజుదో మరి, తేదీ చూడకుండానే తెరిచాడు రామరాజు. రెండో పేజీలో కింద కనిపించిన ఆ ఫోటో చూసి విస్తుపోయాడు. ఫొటో కింది వివరాలు చదివాక గొప్ప సంతోషం, అదే సమయంలో కొంత సిగ్గు. ఆ వృద్ధుడు–సురేంద్రబాబు అంటే– సురేంద్రనాథ్‌ బెనర్జీ.



ఒక్క క్షణం ఆగలేకపోయాడు. గబగబా కిందకి వచ్చాడు. ఆ పెద్దావిడ మొక్కలకి నీళ్లు పోస్తోంది. కొంచెం దూరంలో వినయంగా నిలబడి అడిగాడు, ‘‘ఆయన ఎక్కడ ఉన్నారు?’’‘‘లోపలే ఉన్నారు. ఇందాక నువ్వు ఎక్కడ చూశావో అక్కడ!’’ అన్నారామె నవ్వుతూ. ‘నేను అక్కడికి వెళ్లవచ్చా అన్నట్టు’ సైగ చేశాడు రామరాజు.అభ్యంతరం ఎందుకు అన్నట్టు భుజాలు సుతారంగా కదిపిందామె.లోపలకు వెళ్లి తప్పు చేసినట్టు ఆయనకు కొద్దిదూరంలో నిలబడ్డాడు రామరాజు. నోటి నుంచి మాట రావడం లేదు.



‘‘యంగ్‌మ్యాన్‌! ఏమిటి? ’’ అన్నారు ఇంగ్లిష్‌లో.నిమిషం తరువాత మౌనంగా వచ్చి పాదాభివందనం చేశాడు రామరాజు. ‘‘అరే, ఎందుకు?’’ అన్నారాయన, నవ్వుతూ. ఎంత అద్భుతమైన నవ్వు. అప్పుడా ముఖంలో కనిపించిన దివ్యత్వానికి విస్తుపోయాడు రామరాజు.‘‘అయ్యా! మీ ఎదుట నిలబడే అర్హత కూడా లేనివాణ్ణి. మీతో కూర్చుని ఏదేదో మాట్లాడాను. మన్నించాలి!’’ అన్నాడు రామరాజు.ఒక్కసారి గంభీరంగా మారిపోయారాయన.



ఆ మాట అని ఆయనకు మనస్తాపం కలిగించానని అర్థమైంది రామరాజుకి. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ‘‘అర్హత, అనర్హత... అర్హులు, అనర్హులు... ఒక గొప్ప భూమి మీద పుట్టిన వారి నోట ఇలాంటి మాటలు శోభించవు. అయినా, నీ చేత ఇలా మాట్లాడిస్తున్నది ఈ కాలం. ఒక బానిసదేశంలో పుట్టిన యువకుడు ఇంతకుమించి మాట్లాడగలడా?’’ ఇంగ్లిష్‌లో అన్నారాయన.



ఏమీ అర్థం కాక నిలబడి ఉండిపోయాడు రామరాజు. ‘‘నేను ఎక్కువ, నీవు తక్కువ అనుకోవడమే సరికాదు బాబూ! నీ కంటే నేను గొప్పవాడిని అనుకుంటున్నావు నువ్వు. మనిద్దరి కంటే గొప్పవాళ్లమనుకుంటున్నారు తెల్లవాళ్లు.’’‘‘కానీ.... నేను...మీరు....’’ ఏదో చెప్పబోయాడు రామరాజు.మధ్యలోనే ఆపేస్తూ అన్నారు బెనర్జీ, ‘‘భగవంతుడు మనందరినీ సమదృష్టితోనే సృష్టించాడు. నేను భగవంతుడిని నమ్ముతాను. మనమంతా ఆయన సంతానమే.’’ ‘‘మిమ్మల్ని కలుసుకోవడం నాకు భగవంతుడు ఇచ్చిన వరం.’’ అన్నాడు రామరాజు, ఉబ్బితబ్బిబ్బవుతూ.‘‘అలా అనుకుంటావా? సరే, నీ ఇష్టం. కానీ ఆ వరాన్ని జాగ్రత్తగా, గౌరవంగా చూసుకోవాలి. సరేనా!’’ అన్నారాయన.‘‘అంటే...!’’



‘‘నీవు ఈ ఇంట్లోనే ఉండు. ఎంతో దూరం నుంచి వచ్చావు. ఈ వృద్ధుడికి అతిథిగా ఉండు! కలకత్తా ఎంతో గొప్పది. అసలు మన దేశమే ఎంతో గొప్పది కదా! ఇంతకీ ఏం పని మీద వచ్చావబ్బాయి!’’ అన్నారు.మౌనంగా ఉండిపోయాడు రామరాజు.‘‘ఏం పని మీద వచ్చావు బాబూ!’’ అన్నారు మళ్లీ బెనర్జీ.‘‘అయ్యా! నా ప్రయాణం ఎటో నాకే తెలియడం లేదు.’’ అబద్ధం చెప్పలేకపోయాడు.‘‘ఇంట్లో చెప్పి రాలేదన్నమాట!’’ కొంటెగా చూస్తూ అన్నారాయన.‘‘నిజమే!’’ అంగీకరించాడు రామరాజు.‘‘పోనీ నాకు చెప్పు. ఓ మిత్రుడు అడిగాడనుకుని చెప్పు! ఎటూ ప్రయాణం? నీ మనసులో ఏముంది?’’ అడిగారాయన.



‘‘ఈ దేశమంతా తిరిగి చూడాలని ఉంది. ఆ హిమాలయాలు, ఆ నదులు, ఆ కొండలు చూసి రావాలని ఉంది. పుణ్యక్షేత్రాలు చూడాలని ఉంది. ఏదో చెయ్యాలి. హిమాలయాలలో తపస్సు చేయాలని ఉంది. నా దేశం గొప్పదనం ఏమిటో స్వయంగా తెలుసుకోవాలనుంది. కానీ మాది కలిగిన కుటుంబం కాదు. ఇంట్లో చదువు కోమంటున్నారు, ఉద్యోగం చేయమంటున్నారు... నాకు బ్రిటిష్‌ వాళ్ల మీద, వాళ్ల అహంకారం మీద పోరాడాలని కూడా ఉంది.’’ చివరి మాటలు మాత్రం నీళ్లు నములుతూ చెప్పాడు రామరాజు.



ఒక్క నిమిషం తరువాత అన్నారాయన, ‘‘నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో చెప్పుకోవడానికి నీ దగ్గర నీకు తెలియకుండానే ఓ సమాధానం ఉంది. నేను చెప్పనా, అదేమిటో! తృష్ణ. ఒక తృష్ణ నడిపిస్తే నువ్వు ఇటొచ్చావు! దానిని నువ్వు వ్యక్తం చేయలేకపోయావూ అంటే అది నీ తప్పు కాదు బాబూ! ఆ లోపం రాజకీయపరమైన ఆత్మన్యూనతతో బాధపడుతున్న మన దేశానిది, మన కాలానిదీను.’’ అన్నారాయన.



కొద్దిగా అర్థమయింది రామరాజుకి.దగ్గరగా పిలిచి తన పక్కనే కూర్చోబెట్టుకుంటూ మళ్లీ బెనర్జీయే అన్నారు, ప్రశంసాపూర్వకంగా చూస్తూ.‘‘గొప్ప గొప్ప మతాలకు జన్మనిచ్చిన ఈ మహోన్నత దేశాన్ని దర్శించాలనుకున్నావు. ఈ వయసులోనే హిమాలయాలలో తపస్సు చేయాలన్నంత ఆకాంక్షను పెంచుకున్నందుకు నిన్ను చూస్తే అబ్బురంగా ఉంది. ఇక బ్రిటిష్‌ వాళ్ల మీద పోరాటం చేయాలన్న కాంక్ష ఈ కాలంలో పుట్టిన వాళ్ల గుండెల్లో ఒక జ్వాలలా మండక పోతేనే తప్పు. మండితే కాదు సుమా!’’ అన్నారాయన.ఒక కొత్త సూర్యోదయం ముందు నిలిచి ఉన్నట్టు అనిపిస్తోంది రామరాజుకి. ‘‘మంచిది. నేను వ్యాహ్యాళికి వెళుతున్నాను.’’ అంటూ లేచి నిలబడి, సోఫాకు ఆన్చి ఉన్న చేతి కర్రను తీసుకుని రెండడుగులు వేశారు. మళ్లీ ఠక్కున ఆగి వెనుతిరిగి అన్నారు–



‘‘నాన్నగారు ఏం చేస్తూ ఉం.....’’

‘‘లేరు. కాలం చేశారు.’’

‘‘అలాగా పాపం. అమ్మ?’’

‘‘మా గ్రామంలోనే ఉంది.’’



‘‘వెంటనే ఓ ఉత్తరం రాయి. తల్లి మనసు కదా! బాధ పెట్టకూడదు.’’ అనేసి నది దిశగా వెళ్లారాయన.  అదంతా కలలాగే ఉంది రామరాజుకి. ఉదయం ‘ది బంగాలీ’ పత్రిక పని చూసేవారు. అది ఆయనదే. రోజూ ఎవరో ఒకరు వచ్చేవారు. ముప్పయ్‌ సంవత్సరాలు ఇంగ్లిష్‌ బోధించారట. అసలు ఐసీఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణులు అయినా కూడా మోసం చేసి బ్రిటిష్‌ ప్రభుత్వం ఆ డిగ్రీ రద్దు చేసిందట. ఇవన్నీ నెమ్మదిగా తెలిశాయి.



అయినా బ్రిటిష్‌ రాజనీతి మీద ఆయన అపార నమ్మకం ప్రకటించడం ఎందుకో మాత్రం రామరాజుకి అర్థమయ్యేది కాదు. ఎడ్మండ్‌బర్క్‌ అంటే ఇష్టం. ఆయన పుస్తకమేదో చదువుతూ ఉండేవారు బెనర్జీ.ఆ ఇంట్లో గ్రంథాలయాన్ని చూస్తేనే నిబిడాశ్చర్యంగా ఉండేది రామరాజుకి. రెండు నెలలు గడిచాయి. రకరకాల సందర్భాలలో రకరకాల మాటలు అంటూ ఉండేవారాయన. అందులో రామరాజు మనసుకి బాగా తాకిన మాట– రాజకీయాలను ఆధ్యాత్మికం చేయాలి. అలా ఉంచాలంటే రాజకీయాల నుంచి నైతికత వేరుకాకూడదు.



ఆ రోజున వచ్చిన ఆ పెద్దాయనకి కూడా తనను పరిచయం చేయడం రామరాజుకి గొప్ప అనుభవమే. ఆయన మోతీలాల్‌ నెహ్రూ. ఆయన లక్నోలో జరుగుతున్న కాంగ్రెస్‌ సభలకి తనను ఆహ్వానించడం విభ్రమంగా ఉంది. తండ్రి మరణం తరువాత మరుగున పడిన కొన్ని భావాలు మళ్లీ పురి విప్పుకుంటున్నాయి రామరాజులో.లక్నో సమావేశాలకు స్వయంగా తీసుకువెళ్లారు బెనర్జీ.అక్కడి నుంచి వచ్చాకే ఎందుకు మనసు మారిపోయిందో రామరాజుకే తెలియదు. హరిద్వార్‌ వెళ్లాలన్న కాంక్ష నిప్పులా కాల్చడం మొదలుపెట్టింది. కానీ అదేమిటో, బెనర్జీ సన్నిధి వదలకూడదన్న తపన ఒకపక్క. కానీ చివరికి హరిద్వార్‌ యాత్రకే మనసు మొగ్గింది.

ఆ రోజు తలొంచుకుని ఎదురుగా నిలబడ్డ రామరాజుని బెనర్జీ దంపతులు ఏమిటన్నట్టు చూశారు.రెండు చేతులూ ఎత్తి, సజల నయనాలతో కోరాడు, ‘‘నాకు సెలవిప్పించండి మహానుభావా! హరిద్వార్, హిమాలయాలూ చూడాలన్న కోరిక నన్ను దహించివేస్తోంది.’’



రెండు నిమిషాల మౌనం.

తరువాత లోపలికి వెళ్లి వంద రూపాయలు తెచ్చి చేతిలో పెట్టారు బెనర్జీ.

‘‘వెళ్లిరా!’’ అన్నారు చేతులెత్తి దీవిస్తూ.

నిగూఢమైన ఏదో బాధ తొలుస్తున్నా ఆ మున్యాశ్రమాన్ని వీడి వచ్చేశాడు రామరాజు.

అప్పుడే ఇంటికి ఉత్తరం రాశాడు.

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top