Alexa
YSR
‘తెలుగువారి గుండెచప్పుడు వినగలిగే ఆత్మీయుడిగా ఉంటే చాలు... నా జన్మ ధన్యమైనట్టే’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం ఫన్ డేకథ

ఆకుపచ్చ సూర్యోదయం

Sakshi | Updated: February 12, 2017 01:10 (IST)
ఆకుపచ్చ సూర్యోదయం

ఆ సోబె (బాణం మొన)కి కళ్లప్పగించారు చాలామంది. డెబ్బయ్‌ లేదా ఎనభై బారల అవతల ఎడం చేయి బారజాపి నిలబడి ఉన్నాడు బొంకుల మోదిగాడు. ఆ ఊరివాడే. ఆ చేతిలో వెలక్కాయంత పేడముద్ద, దాని మీద నిలబెట్టిన కోడిగుడ్డు. ఎక్కువ మందిలో ఉత్కంఠ. ఏం జరుగుతుందో తెలుసులే అన్నట్టు స్థిమితంగా ఉన్నాయి కొన్ని ముఖాలు.

‘‘సయిలూరి సంతకు– సన్నగాజులు
మయిలూరి సంతకు –సన్నపురి చీర..’’
కూనిరాగం తీస్తూనే బాణాన్ని ఆ గుడ్డు మీదకి గురిపెడుతున్నాడు గోకిరి ఎర్రేసు.
గిజిగాడి గూడులాంటి చింపిరి జుట్టు. చెమటతో జిడ్డోడుతున్న ముఖం. ముక్కుకీ చెవులకీ మోటు వెంyì పోగులు. మెడలో నల్లతాడుతో తాయొత్తు. కొంచెం తెల్లగా ఉంటాడు కాబట్టి నుదుటి మీద, కణతల మీద ఉన్న కాల్చిన మచ్చలు పట్టిపట్టి చూస్తేగానీ తెలియదు. పొట్ట మీద, భుజాల మీద పచ్చబొట్లు. మొలకి గావంచా. అది గజ్జల వరకే ఉండి, పిరుదులు కూడా కనిపిస్తున్నాయి. తలకు మరో చిన్న గుడ్డ కట్టుకున్నాడు. కుడికాలి మడం దగ్గర రాగి కడియం. కాస్త బొద్దుగా ఉన్నా చలాకీగా ఉంటాడు.

 సొంతూరు గనర్లపాలెమే అయినా, ఎక్కడ కొండసంత జరుగుతున్నా కనిపిస్తూ ఉంటాడు. ఉదయాన్నే ఆరుగంటల కల్లా బేరసారాలు ఊపందుకునే కొండసంతలకి ఆ ముందు రోజే వచ్చి కావలసిన పనులు చూస్తాడు, మిత్రుడు మోదిగాడితో కలసి. ఇద్దరూ కొండవాళ్లే. తాటాకుతో చిన్న చిన్న పందిళ్లు వేసిపెడతారు. కావడితో నీళ్లు మోస్తారు. దుకాణాలు సర్దే మట్టిదిబ్బలని సరిచేస్తారు. నాలుగైదు అడుగుల పొడవు, రెండు మూడు అడుగుల వెడల్పులతో అరుగుల్లా ఉంటాయి ఆ దిబ్బలు. అడుగు ఎత్తు మాత్రం ఉండే ఆ దిబ్బల మీదే దుకాణాలు సర్దుకుంటారు. షావుకార్లు తలా ఒక అణా, బేడ ఇస్తారు. సరుకులతో రెంyð డ్ల బళ్లు తోలుకు వచ్చిన కాపులూ, సరుకు తీసుకువెళ్లడానికి వచ్చిన బళ్ల కాపులూ, మిగిలితే షావుకార్లూ ఇచ్చే ముద్దలతో కడుపు నింపేసుకుంటారు ఇద్దరూ.

ఇదంతా ఒక ఎత్తు. ఈ పనయ్యాక కొండ సంతలలో ఎర్రేసు ప్రదర్శించే విలువిద్యా విన్యాసం మరొక ఎత్తు. కృష్ణదేవిపేటలో సంత జరుగుతున్న ఆ చోటుకి వంద గజాల దూరంలో పెద్ద ఖాళీ స్థలం. ఎడ్లనీ, బళ్లనీ కట్టేసే చోటు. ఆ రణగొణ ధ్వని ఏదీ ఎర్రేసుకి వినిపించడం లేదు. ముప్పయ్యో నలభయ్యో ఉంటాయి దుకాణాలు. మన్యంలో దొరకని వస్తువులు అమ్మే దుకాణాలు కొన్ని. కొండవాళ్ల దగ్గర నుంచి అటవీ సంపదను కొనుగోలు చేసే దుకాణాలు ఇంకొన్ని. ఈ సంపదను పట్టుకెళ్లడానికి వచ్చేవాళ్లు కొందరు.

 బాగా ఇవతల కట్టేసి ఉన్నాయి ఎద్దులు, విప్పేసిన బళ్లకే. దాదాపు అరవై బళ్లు. వాటిని లాక్కొచ్చిన ఎద్దులు. వాటి మెడలలో ఇత్తడి గంటలూ, మువ్వలూ చేస్తున్న శబ్దం–ఏదీ ఎర్రేసు చెవిని తాకడంలేదు.

పింజిరికె (వింటి నారి మీద ఉంచే బాణం రెండో కొస)ని కుడి చేతి బొటనవేలు, చూపుడువేలు కొసలతో పట్టుకున్నాడు. దానికి ముందే ఉన్న ఈకలతుంటె (బాణం గురి తప్పకుండా ఉపకరించే పక్షి ఈకల అమరిక)ని మధ్య వేలు పదే పదే తాకబోతూ వెనక్కి తగ్గుతోంది. అదో అలవాటు కాబోలు.

అప్పటిదాకా విల్లుని కొంచెం ఎత్తులో పెట్టి బారతీపు (ఆకర్ణాంతం వింటి నారిని లాగడం) భంగిమలో ఉన్న ఎర్రేసు, హఠాత్తుగా విల్లుని కాస్త ముందుకు పెట్టి బొక్కతీపు (నారిని గుండెలదాకా లాగి పట్టుకోవడం) భంగిమకి వచ్చాడు.

చుట్టూ నిలబడి ఉన్న వాళ్ల ముఖాలలో మరింత ఉత్కంఠ. అక్కడ మోదిగాడి ముఖంలో కాస్త కూడా బెదురు లేదు. ఎర్రేసు నైపుణ్యం మీద నమ్మకం.

‘‘మైలారు సంతకు–వెళుదుమన్నారట...
సాయిలూరి సంతకు వెళుదుమన్నారట...
మళ్లీవారం సంతకు మనమూ వెళ...........’’
కూనిరాగం ఆగిపోవడం, బాణం విల్లుని వీడడం ఎప్పుడు జరిగిందో, కోడిగుడ్డు భళ్లున పగిలింది.

అద్దిరబన్న అన్నారెవరో గట్టిగా.
‘‘కితం జన్మలో నువ్వు అర్జునుడివై ఉంటావురా!’’ మెచ్చుకోలుగా అన్నాడు ఓ బండబ్బాయి, ఒక రాగి పైస తీసి ఎర్రేసు చేతిలో వేస్తూ.

దానిని మొలలో చుట్టబెడుతూ అన్నాడు ఎర్రేసు. ‘‘ఇదిగో కాపుగారూ! అడివిలో పుట్టినోడెవడైనా అర్జునుడే. ఓ చేతిలో బుల్లి బాణం, ఇంకో చేతిలో బుల్లి విల్లు పట్టుకునే అమ్మ కడుపులో నుంచి బయటకొస్తాం మేం!’’

‘‘కోడిగుడ్డు బలేక్కొట్టావ్‌!’’ అన్నాడు ఇంకో బండివాడు, మహదానందంగా.
‘‘కోడిగుడ్డేటండి!  ఇంకో యాభై బారలు దూరం పెంచుకోంyì ! అలా ఎండిరూపాయెట్టండి! దాన్ని కూడా కొడతా! రూపాయి మాత్రం నాకిచ్చెయ్యాల!’’ అన్నాడు ఎర్రేసు, పందెం వేస్తారా అన్నట్టు.

‘‘నా కాడ ఎండిరూపాయెక్కడిది!?’’ అన్నాడా కాపు.
‘‘పోనీ... మీ సావుకారుని పెట్టమను. యాపారమంతా తూరుపు కుంచం, పడమర కుంచం. బోల్డు సొమ్ము.’’ దొంగతూకాలే అన్నట్టు చేతితో సైగలు చేస్తూ చూపించాడు ఎర్రేసు. మళ్లీ తనే అన్నాడు. ‘‘మొన్నవారం గాలికి పందిరి ఊగిందంట. అందుకని నాకిచ్చే బేడ (పన్నెండు పైసలు) కూడా ఎగ్గొట్టాడు. ఇంక రూపాయెక్కడ వదుల్తాడు? సరేగానీ కాపుగారూ! మీ సావుకారిచ్చే బేడ డబ్బులకి బేస్టిన్‌ దొర కడతన్నాడే, బంగ్లా– అలాంటిది కట్టివ్వాలా ఏంటి?’’ అన్నాడు పెద్ద గొంతుతో.

ఆ పేరు వినపడగానే గతుక్కుమన్నారంతా. అతడే గూడెం డిప్యూటీ తహసీల్దార్‌. అల్ఫ్‌ బాస్టియన్‌.

‘‘అదే, నర్సీపట్నంలో కడతన్నాడు, ఇన్లేదా! ఇంద్రబవనం కూడా అలాగుండదు. మహానుభావుడు, దాని ఇటక్కోసం మొత్తం అడవంతా కొట్టించేత్తన్నాడు.’’ అన్నాడు మళ్లీ తనే.
‘‘ఓరి... ఊరకోరా! మునసబు లగుడు సత్యనారాయణగార్ని ఇక్కడే చూశాను, ఇంతకు ముందు!’’ అన్నాడు ఓ బండబ్బాయి రెండు చేతులూ జోడించి, అటూ ఇటూ బెదురుతూ చూస్తూ.

‘‘ఈడు మంచోడో తెలీదు, పిచ్చోడో తెలీదు!’’ అన్నాడు ఇంకో బండబ్బాయి జారుకుంటూ.
కిసకిస నవ్వుకున్నాడు ఎర్రేసు. నిజమే, ఎర్రేసు అర్థంకాడు. పక్కనే ఉన్న మోదిగాడు కూడా నవ్వుకున్నాడు.

ఐదో ఆరో రాగి పైసలూ, రెండో మూడో అర్ధణాలూ చేతిలో పడ్డాయి. వాటిని నిర్లిప్తంగా చూస్తున్నాడు ఎర్రేసు.

అప్పుడే వచ్చిన ఆదినారాయణ  అడిగాడుæ.‘‘ఎన్ని పైసలు ఎర్రేసు?’’
‘‘అడుక్కున్నా ఇన్నే డబ్బులొస్తాయేమో?’’ అన్నాడు ఎర్రేసు.
‘‘తదాస్తు దేవతలుంటారంట. ఏంటా మాటలు?’’ అన్నాడు ఆదినారాయణ కంగారుగా.
‘‘విలుకాడికీ, అడుక్కునేవోడికీ ఒకటే ఇలువ అంటన్నా! సరే గానీ, ఎక్కణ్ణుంచి?’’ అడిగాడు ఎర్రేసు, నవ్వేస్తూ.

‘‘కొంగసింగి, గురువుగారి దగ్గర నుంచి!’’ భుజం మీది మృదంగాన్ని కళ్లతో చూపిస్తూ అన్నాడు ఆదినారాయణ.

ఏదో గుర్తుకు వచ్చినట్టు చటుక్కున అన్నాడు నిష్టురంగా ఎర్రేసు. ‘‘అన్నట్టు.. ఆ ఊసు నాకు చెప్పలేదేం?’’
‘‘ఏంటి ఎర్రేసు? ఏంటది?’’ కంగారుగా అన్నాడు ఆదినారాయణ.

‘‘బాస్కర్డు గారింటికి సాములోరొచ్చారంట. మయిమలు గలోరంట!’’ అన్నాడు ఎర్రేసు.
‘‘ఆయనా?! నీదాకా వచ్చిందా!  శ్రీరామరాజుగారు.’’

‘‘అలాగా! చాలా గొప్పోడంట కదా, దేవుడేనంటన్నారంతా!’’
‘‘అది నిజమే. కానీ నీకెవరు చెప్పారో, ఆయన మహిమలేం చెయ్యరు. పూజాపునస్కారం అంతే. ఆయన్ని చూస్తే బాధలన్నీ పోతాయని అంతా చూసెళతన్నారు. గోడెళ్లబోసుకుంట.....’’
‘‘నేనొస్తే మాటాడతారా, సాములు?’’ ఆత్రంగా అడిగాడు ఎర్రేసు.
‘‘ఎవరితోనైనా మాట్లాడతారు.’’ భరోసాగా అన్నాడు ఆదినారాయణ.
ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయాడామాట విని, ఎర్రేసు.
మధ్యాహ్నం మూడు గంటలవుతోంది. దుకాణాలు కట్టేయడం మొదలైంది. బళ్లూ సిద్ధమవుతున్నాయి. చీకటి పడే లోపున కొండ దిగాలి.
దూరంగా ఒక షావుకారు పిలుస్తున్నాడు, ‘‘ఒరేయ్‌! ఎర్రేసు! చింతపండు ఎక్కించాలి, రా! మోదిగాడేడి?’’

‘‘చిత్తం బాబూ!’’ అంటూ అటు అడుగు వేశాడు ఎర్రేసు.
అప్పుడే పిలిచాడు ఆదినారాయణ. ‘‘ఇదిగో ఎర్రేసు! ఉడుం చర్మం అడిగాను, కంజరి కోసం. ఆరు నెలలైంది...!’’ అన్నాడు, కొంచెం మొహమాటంగా.‘‘ఆదినారాయణ! ఉడాన్ని పట్టుకోవడం తేలిక్కాదు. ఒరే ఎర్రేసు! ఇదో వచ్చాను. నా తోలు ఒలిచి పట్టుకెల్లి ఆ కంసాళ్లబ్బాయికి ఇచ్చీరా అని ఏ ఉడుమూ ఎదుర్రాదు.’’ అన్నాడు నవ్వుతూ.
‘‘అడవిలో బాగా దొరుకుతాయి కదా!’’‘‘దొరుకుతాయి. ఉడుం తోలు సంగతేమో కానీ, అడవిలో అడుగు పెడితే ఫారెస్టోడు కొండోళ్ల తోలు తీసేస్తన్నడు. బేస్టిన్‌ దొర ఉన్నాడు చూడు, పెద్ద దానగుడు. మా గుడిసెల చూరు కోసం ఓ బారెడు కొమ్మ కొడితే జల్మానా ఏయించేత్తన్నాడు. ఇంక వేటాడనిస్తాడా?’’

‘‘అయ్యో అలాగా! పోనీలే.’’‘‘అయినా పర్లేదు. మంచోడివి నువ్వు. మన దార్లు మనకీ ఉంటాయి. వచ్చేవారం పట్టుకొస్తాలే!’’ అంటూ ముందుకువెళ్లాడు ఎర్రేసు.

ఉదయం ఎప్పుడో పది ప్రాంతంలో ఎర్రేసును ఏదో వివరం అడిగిన ఆ కొండవాడు ఇంకా అక్కడే ఉన్నాడు. అతడు తెచ్చిన సరుకు తీసుకున్న షావుకారు డబ్బులు ఇవ్వలేదు. ఇంకా పది మందో పదిహేను మందో ఉంటారు, డబ్బులు చేతిలో పడవలసిన గిరిజనులు. రాత్రంతా నడిచిన శ్రమ వాళ్ల ముఖాలలో కనిపిస్తూనే ఉంటుంది. నెత్తి మీద పెద్ద చింతపండు బుట్లో, కట్టెల మోపో, అడ్డాకులో, కావడి వేసుకుని ఓ పది పనసకాయలో పట్టుకు వస్తాడు. ఎవరో షావుకారు పిలుస్తాడు.  గెడ్డం కింద చేతికర్ర ఆన్చి నిలబడే వాళ్లు కొందరు. గొంతుక్కూచుని షావుకారు పిలుపుకోసం నిరీక్షించేవాళ్లు ఇంకొందరు. సాయంత్రం వెళ్లేటప్పుడు షావుకార్లు డబ్బులు విదిలిస్తారు– ముష్టి పారేసినట్టు. షావుకారు ముందు ఇస్తానన్నది ఎంతో, చివరికి చేతిలో పడేసినది ఎంతో కొండవాడికి తెలియదు. ఏ సంతయినా ఇంతే.

 సంత అంటే చాలు, తలంతా ఆముదం రాసుకుని, ఇన్ని పూలు తురుముకుని, మంచి చీర కట్టుకుని వస్తారు గిరిజన మహిళలు. ఆచ్చాదనలు లేని వారి వక్షాల మీద కన్ను వేయని మగాడు దాదాపు కనిపించడు. షావుకార్ల సహాయకుల కళ్లు మరీ పత్తికాయలైపోతాయి. సాయంకాలానికల్లా కొండ దిగాలన్న సంగతి కూడా మరచిపోయినట్టున్న ఫ్యాన్సీ సామాను అమ్మే ఆ కుర్రాడి కళ్లు పత్తికాయలై చాలా సేపైంది. కొత్త అద్దంలో ముఖం చూసుకుని ఆమె మురిసి పోతూ ఉంటే, కొంగు పక్కకి తప్పుకోవడంతో అనాచ్ఛాదితంగా కనిపిస్తున్న ఆమె నగ్నవక్షం కేసే చూస్తున్నాడు.

కానీ అంతకు మించి ఆశపడితే, ఇంటికి తిరిగి వెళ్లలేమని అలాంటి వాళ్లకి బాగానే తెలుసు. పెద్ద పెద్ద చింతపండు బుట్టలు, తట్టలతో సీతాఫలాల రాశులు బళ్లెక్కుతున్నాయి. కొండ చీపుళ్లతో ఓ బండి చిన్న కొండలా పెరిగింది. శీకాకాయి, కుంకుళ్లు, తుమ్మబంక వేగంగా చేరుతున్నాయి. మోదిగాడి కోసం వెతుకుతూ ఆ సామెతని చెప్పుకున్నాడు ఎర్రేసు–
‘‘కొండోళ్ల పంట, దిగువోళ్ల వంట!’’

3
ఆశ్వీయుజ మాసం.
దేవీభాగవతంలో ఒక ఘట్టం చెప్పుకున్నాక పేపరు పఠనం మొదలయింది గ్రామచావడిలో.
ఆ ఏడాది అక్టోబర్‌ 2న గోఖలే హాలులో మద్రాసు పౌరులు ఎంకె గాంధీ పుట్టినరోజును మొదటిసారి జరిపారట. అదీ వార్త. పత్రికలో నుంచి ముఖం బయటకు పెట్టి మరీ చెప్పారు భాస్కరుడు ఇంకో సంగతి, ‘‘కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు కూడా హాజరయ్యారట.’’

‘అబ్బ!’ అన్నట్టు ముఖాలు పెట్టారు శ్రోతలంతా.
మళ్లీ చదవడం ఆరంభించారు. ‘‘భారతదేశంలో రామకృష్ణుని వంటి సర్వసంగ పరిత్యాగులు, గోఖలే వంటి దేశభక్తులు, సాలార్‌జంగ్‌ వంటి రాజనీతి చతురులు జన్మించారు. గాంధీగారిలో ఆ మూర్తిత్రయంలోని మూడు గుణాలూ ఉన్నవి.....గాంధీగారు మూర్తీభవించిన ఆత్మశక్తి. అన్ని నిరోధాలను ఆయన ఆత్మశక్తితో తొలగించగలరు.’ అన్నారట సుబ్రహ్మణ్య అయ్యరు.’’  
‘‘నిజమే సుమా! రెండేళ్లలో ఎంత ఎదిగిపోయాడయ్యా గాంధీగారు!’’ అన్నాడు నారాయణస్వామి నాయుడు, అబ్బురంగా.
‘‘ఆయన కోసమా అన్నట్టు మహామహులంతా తప్పుకుంటున్నారు. లేకపోతే కాలమే తప్పిస్తోంది. అది గమనించరేం? ఎక్కడ తిలక్‌! ఎక్కడ మాలవ్యా! ఎక్కడ గోఖలే! ఎలాంటి మోతీలాల్, జిన్నాలు! లజపతిరాయ్, బిపిన్‌పాలు, అనిబిసెంటమ్మ, చిత్తరంజన్‌దాసు.....’’అన్నాడు భాస్కరుడు వేళ్లు ముడుస్తూ.
‘‘నిజమే! గాంధీ పేరు శూన్యం నుంచి రవళిస్తున్న ఓంకారంలా ఉంది.’’ అన్నాడు శ్రీరామరాజు, చివర్న.
4
పలకరిస్తే గలగలా మాట్లాడతాడు. అది కూడా ముగ్గురు నలుగురితోనే. లేకపోతే మౌనం. భాస్కరుడి గారికి పోస్టులో వచ్చే పుస్తకాలని గంటల తరబడి చదువుతాడు. రామకృష్ణ మఠం వారి ప్రచురణ ప్రబుద్ధ భారతి పత్రిక అంటే పంచ ప్రాణాలు రామరాజుకి. కూచిమంచి జగ్గకవి పద్యాలంటే ప్రత్యేక శ్రద్ధ. శృంగార నైషధం, మనుచరిత్ర, వసుచరిత్ర, పారిజాతాపహరణం భాస్కరుడి కోరిక మేరకు వ్యాఖ్యానంతో వివరించేవాడు. అప్పుడు యువకులంతా ఉండేటట్టు చూసేవారు భాస్కరుడు.

రామరాజును చూడడం కోసం వచ్చేవాళ్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది.
రెండు నెలలకే ఆయన తనకు శివాలయం దగ్గర ఒక పూరిల్లు నిర్మించి ఇమ్మని అడిగాడు. వచ్చిందే ఏకాంతంగా ఉంటూ తపస్సు చేసుకోవడానికి అంటూ తన లక్ష్యం గురించి గుర్తు చేశాడు.భాస్కరుడితో సహా చాలామందికి ఇష్టం లేదు. సోమమ్మ కంట నీరు పెట్టుకున్నారు. కృష్ణదేవిపేట వాసులు, కొంగసింగి గ్రామస్థులు స్వయంగా కట్టించి పెట్టారు ఆ చిన్న కుటీరం.
ఆ కుటీరంలోకి నవంబర్‌ 25, 1917న రామరాజు ప్రవేశించాడు. పాలూ పళ్లూ భాస్కరుడిగారింటి నుంచే వెళ్లేవి.

కానీ ఊరు నుంచి రామరాజు కొంచెం దూరంగా జరిగినా, ఊరు మాత్రం ఆయనను విడిచిపెట్టలేదు. అప్పుడే కృష్ణదేవిపేటకి పక్క గ్రామం కొంగసింగికి మండల దీక్ష కోసం రామరాజు వెళ్లాడు. ఆ ఊరి ప్రజలే అక్కడ దీక్ష నిర్వహించవలసిందని అడిగారు.
నలభయ్‌ రోజుల తరువాత తిరిగి వచ్చాక మళ్లీ భాస్కరుడిగారింటే మకాం ఉండవలసి వచ్చింది. కారణం– అక్కడ కుటీరం నిర్మించడం కుదరదని గూడెం డిప్యూటీ తహసీల్దారు బాస్టియన్‌ ఆదేశం పంపాడు. వెంటనే తొలగించారు. ‘‘పోనీలే బాబయ్యా! అదీ ఒకందుకు మంచిదే. అలాంటి అడవిలో ఒక్కడూ ఉండడానికి ఏ తల్లి ఒప్పుకుంటుంది? ’’ అంది సోమమ్మ. మళ్లీ ఆమే అడిగారు.

‘‘బాబయ్యా! ఎప్పట్నించో అనుకుంటున్నాను. తమకి నిండా ఇరవై ఏళ్లు. ఎవరూ లేరా? దాచకుండా చెప్పాలి! ఎక్కడున్నారు?’’ చనువుగా, ప్రేమగా అడిగిందా పెద్దమనసు.
‘‘లేకేమి ఉన్నారు! అమ్మ, చెల్లి, తమ్ముడు. ఇంటికి పెద్దవాడిని నేనే. ఇల్లు విడిచి రెండేళ్లయింది. అయినా చింత పడక్కరలేదు. వాళ్లకి ఏ లోటూ ఉండదు. మా బంధుకోటి కూడా పెద్దదే.’’ అన్నాడు రామరాజు.

‘‘తమరి తండ్రిగారి మాటేదీ చెప్పలేదు!’’ గుర్తు చేస్తున్నట్టుగా అంది సోమమ్మ.
‘‘నా చిన్నతనంలోనే పోయారు’’ చెప్పాడు రామరాజు. గట్టిగా నిట్టూర్చి పైకే అన్నదామె. ‘‘మంచి స్వామివి! తల్లి మనసు పడే గుంజాటన గురించి మీ తపస్సు, చదువు చెప్పలేదా? ధనధాన్యాలకి లోటుండకపోవచ్చు. బంధుగణం ఉండొచ్చు. కానీ కడుపున పుట్టిన బిడ్డ ఎక్కడున్నాడో తెలీకపోతే ఆ తల్లి మనసు ఎలా నిలుస్తుందయ్యా! అటు పెనిమిటీ లేక, ఇటు పెద్దకొడుకు ఏమయ్యాడో తెలీక ఆ అమ్మ ఎంత కుంగిపోయిందో! తలుచుకుంటే నాకే కన్నీళ్లు ఆగడం లేదు. తమరు ఇప్పుడే నాకు చెప్పాలి మీ ఊరు, మీ ఇల్లు......’’


‘‘హలో...! నర్సీపట్నం హెడ్‌క్వార్టర్స్‌... హెడ్‌క్వార్టర్స్‌.... ఓవర్‌....’’ వైర్‌లెస్‌ గాండ్రించింది.
పచార్లు చేస్తున్న ఫర్బీస్‌ ఒక్క ఉదుటన వచ్చి గట్టిగా అన్నాడు, ‘‘హలో... హలో... కేడీపేట క్యాంప్‌.. ఓవర్‌.’’‘‘అక్కడున్న నాలుగు పటాలాలనీ వెంటనే సిద్ధం చేయండి! బహుశా కొయ్యూరు బయలుదేరాలి. ఓవర్‌.’’‘‘ఐదు నిమిషాల్లో సిద్ధం చేస్తాను. ఓవర్‌.’’ అంటూనే అక్కడే అటెన్షన్‌లో నిలబడి ఉన్న కానిస్టేబుల్‌కు సైగ చేశాడు ఫర్బీస్‌. అతడు డేరాల వైపు పరుగు తీశాడు. అస్సాం రైఫిల్స్, మలబారు దళాలు, ఇక్కడి పోలీసులు...ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నారు. కానిస్టేబుల్‌ చెప్పగానే యూనిఫారాలు అందుకోవడం ప్రారంభించారు.  బయట, స్టార్ట్‌ చేసిన రెండు లారీలు ఆ పక్క నుంచి శిబిరం దిశగా నడుస్తున్న శబ్దం....


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

అత్యున్నత విద్యావేదికగా రెడ్డి హాస్టల్‌

Sakshi Post

Governor Undergoes Treatment At Gandhi Hospital

Governor ESL Narasimhan visited Gandhi Hospital for treatment.

  • Johnson

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC