గ్రీన్‌ అంబులెన్స్‌...చెట్టంత అండ...

గ్రీన్‌ అంబులెన్స్‌...చెట్టంత అండ...


మొక్కలు నాటడం ఒక్క ఎత్తయితే... వాటిని పరిరక్షించుకోవడం మరో ఎత్తు. చాలామందికి మొక్కలను నాటడం మాత్రమే తెలుసు. ఆ తరువాత ఆ విషయాన్ని మరిచిపోతారు. మనిషిలాగే చెట్లు కూడా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటాయి. మనిషి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అంబులెన్స్‌లు ఆఘమేఘాల మీద సంబంధిత ప్రదేశానికి చేరుకుంటాయి. చెట్లకు మాత్రం ఈ సౌకర్యం ఎందుకు ఉండకూడదనే ఉద్దేశంతో వడోదర(గుజరాత్‌)లోని స్వచ్ఛందసంస్థ ‘పగ్‌డాండ్‌’ వడోదర మున్సిపల్‌ కార్పోరేషన్‌ (వియంసీ) సహకారంతో ‘గ్రీన్‌ అంబులెన్స్‌’ సదుపాయాన్ని ప్రారంభించింది.నగరంలో ఒకప్పుడు వేలాది మొక్కలు నాటిన ఈ  సంస్థ... ఆ మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి, వాటిని ప్రమాదకర పరిస్థితుల నుంచి తప్పించడానికి మూడు చక్రాల గ్రీన్‌ అంబులెన్స్‌లను ఉపయోగిస్తుంది.‘ఫలానా చోట మొక్కల ఆలనా పాలనా ఎవరూ పట్టించుకోవడం లేదు’‘ఫలానా చోట మొక్కలను పశువులు తింటున్నాయి’‘నీళ్లు లేక మొక్కలు ఎండిపోతున్నాయి’... ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ ఆ స్వచ్ఛంద సంస్థ హెల్ప్‌ లైన్‌కు రాగానే... వెంటనే ‘గ్రీన్‌ అంబులెన్స్‌’ రంగంలోకి దిగుతుంది. నీళ్లు, ఎరువులు... ఇలా చెట్ల సంరక్షణకు అవసరమైన అన్ని రకాల వస్తువులు, ఏర్పాట్లు ఇందులో ఉంటాయి.



నగరంలో నాటిన మొక్కల్లో 13 శాతం మాత్రమే బతుకుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ‘గ్రీన్‌ అంబులెన్స్‌’లతో రంగంలోకి దిగింది ‘పగ్‌డాండ్‌’మొక్కల విలువ గురించి విస్తృత అవగాహన కలిగించడం, మొక్కల్ని నాటడం, ఇతరుల చేత నాటించడం, వాటి సంరక్షణకు పాటు పడడం... తన కార్యరంగాలుగా ఎంచుకుంది ‘పగ్‌డాండ్‌’పర్యావరణ సంరక్షణలో స్థానిక ప్రభుత్వ శాఖలను క్రియాశీలంగా భాగస్వాములను చేయడం, బడులలో ఎకో క్లబ్‌లను స్థాపించడంలాంటి పనులు చేçస్తుంది ‘పగ్‌డాండ్‌’.‘‘గ్రీన్‌ అంబులెన్స్‌ల గురించి చాలామంది ఆసక్తిగా అడుగుతుంటారు. వినూత్నమైన ఆలోచన అని ప్రశంసిస్తుంటారు. నగరంలో గ్రీన్‌ అంబులెన్స్‌ల ప్రవేశం తరువాత మొక్కల సర్వైవల్‌ రేట్‌ పెరిగింది’’ అంటున్నారు ‘పగ్‌డాండ్‌’ ఫౌండర్‌ ట్రస్టీ నిషిత్‌ దాండ్‌.కొన్ని సందేశాలకు వేదికలు, ఉపన్యాసాలు అక్కర లేదని ఈ గ్రీన్‌ అంబులెన్స్‌లు నిరూపిస్తున్నాయి. రోడ్డు మీద వెళుతున్న ఈ గ్రీన్‌ అంబులెన్సులు చెట్ల విలువ, పరిరక్షణ గురించి మౌనసందేశాన్ని మోసుకెళుతున్నట్లుగా ఉంటాయి. ఒకరి నుంచి ఒకరికి గ్రీన్‌ అంబులెన్స్‌ల గురించి మాత్రమే కాదు... పర్యావరణ పరిరక్షణ గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. వడోదర ‘గ్రీన్‌ అంబులెన్స్‌’ల స్ఫూర్తి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరిస్తే... నాటిన ప్రతి చెట్టు క్షేమంగా ఉంటుంది. మనల్ని క్షేమంగా చూస్తుంది.



ఫీజు అక్కర్లేదు మొక్క నాటితే చాలు!

చత్తీస్‌గడ్, అంబికాపూర్‌లోని ‘శిక్షా కుటీర్‌’ అనే స్కూల్‌ చెట్ల సంరక్షణకు వినూత్నంగా ప్రయత్నిస్తుంది. పిల్లలను స్కూల్లో చేర్పించే సమయంలో పేరెంట్స్‌ కొన్ని మొక్కలను తప్పనిసరిగా నాటాల్సి ఉంటుంది. తాము నాటిన మొక్క ఒకవేళ చనిపోతే దాని స్థానంలో వేరొక మొక్క నాటాల్సి ఉంటుంది. పేరెంట్స్‌ ఫీజులు కట్టలేని స్థితిలో ఉంటే కొన్ని మొక్కలు నాటితే చాలు!



ట్రీ హెల్ప్‌లైన్‌

ఢిల్లీ ప్రభుత్వం చెట్ల సంరక్షణకు చాలా కాలం క్రితమే ‘ట్రీ హెల్ప్‌ లైన్‌’ను ప్రారంభించింది. చెట్లకు ఎవరైనా హాని కలిగిస్తున్నా, ఎక్కడైనా చెట్లు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయవచ్చు. ‘ఫలానా చోట ఉన్న చెట్టుకు ఇలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది’లాంటి సలహాలు కూడా ఇవ్వవచ్చు. ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ శాఖ ప్రవేశపెట్టిన ఈ టోల్‌–ఫ్రీ నంబర్‌ ట్రీ హెల్ప్‌ లైన్‌ మంచి ఫలితాన్ని ఇచ్చింది.

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top