నానమ్మ మిస్సింగ్ కాస్తా...

నానమ్మ మిస్సింగ్ కాస్తా...


బెస్ట్ కేస్

నేను కరీంనగర్ జగిత్యాల ఎఎస్‌పిగా పనిచేస్తున్న సమయంలో ఛేదించిన ఒక కేసు నాకు బాగా గుర్తుండిపోయే కేసుల్లో ఒకటి. ధర్మపురి పోలీస్‌స్టేషన్‌కి ఓ ఇరవైఏళ్ల కుర్రాడొచ్చి వాళ్ల నానమ్మ కనిపించడంలేదని చెప్పాడు. వెంటనే మావాళ్లు ఆ అబ్బాయి గ్రామానికి వెళ్లి వెతకడం మొదలుపెట్టారు. ‘పొద్దునే పెన్షన్ తీసుకుంటానంటే మండలాఫీస్ దగ్గర దించి ఇంటికొచ్చాను. గంట తర్వాత వెళ్లి చూస్తే అక్కడ మా నానమ్మలేదు’ అని ఆ అబ్బాయి చెప్పిన మాటల్ని బట్టి...



ఆ ముసలావిడ దారి తప్పి ఏటో వెళ్లిపోయి ఉంటుందనుకున్నాం. ధర్మపురి మండల పరిధిలో చాలా గ్రామాలున్నాయి. అన్ని గ్రామాల్లో వెదికాం. ఆమె ఒంటిపై సొమ్ములు బాగానే ఉన్నాయని చెప్పారు. ఒకవేళ దొంగలెవరైనా ఆమెను కిడ్నాప్ చేసి సొమ్ము దోచుకున్నారేమోనని అనుమానించాం. ఆ దిశగా కూడా పరిశోధన చేశాం. ఎక్కడా వివరాలు దొరకలేదు.

 

రెండు రోజుల తర్వాత...

నానమ్మ కనిపించడం లేదని ఈ కుర్రాడు, అతని తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. వారికేం సమాధానం చెప్పాలో అర్థం కావడంలేదు. మరో పక్క ‘ఈ పోలీసులు పెద్దావిడ జాడ కనిపెట్టలేరా?’ అంటూ ఊరివాళ్ల గోల. ఇంతలో ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో తుప్పల్లో ఒక ముసలావిడ శవం ఉందని కబురొచ్చింది. మావాళ్లు హుటాహుటిన వెళ్లి చూస్తే బాడీ బాగా పాడైపోయింది. తలకు బలమైన గాయం అయిన ఆనవాళ్లు ఉన్నాయి. ఒక కాలికి చెప్పు ఉంది, మరో చెప్పు నాలుగు అడుగుల దూరంలో పడి ఉంది. అంతకు మించిన వివరాలు గానీ, ఆధారాలు గానీ దొరకలేదు. విషయం పెద్దావిడ ఇంట్లో తెలియగానే కుటుంబం మొత్తం ఘొల్లుమంది.

 

సొమ్ముల కోసమే...

హత్య జరిగిన స్థలంలో ఆ పెద్దావిడ శవాన్ని చూడగానే అర్థమైంది అది ‘మర్డర్ ఫర్ గెయిన్’ కేస్ అని. చెవి కమ్మ తీయడం రాలేదేమో హంతకుడు క్రూరంగా చెవిని కూడా కోసేశాడు. సొమ్ములకోసం అంత పెద్ద వయసున్న మహిళ అని కూడా చూడకుండా క్రూరంగా పొట్టన పెట్టుకున్నారని ఆ ఊరివాళ్లంతా బాధపడ్డారు. నాక్కూడ చాలా బాధేసింది. అప్పటివరకూ మిస్సింగ్ కేసుగా ఉన్నదల్లా మర్డర్ కేసైపోయింది. వెంటనే మా క్రైమ్‌టీమ్ రంగంలోకి దిగింది. అన్ని రకాలుగా పరిశోధన మొదలుపెట్టాం. ముందుగా ఆ చుట్టుపక్కల డబ్బులకోసం దాడులు చేసే దొంగలపైనా నిఘా పెట్టాం. అప్పటికే అలాంటి కేసులున్నవారిని స్టేషన్‌కి తీసుకొచ్చి విచారించాం. ఎక్కడా వివరాలు దొరకలేదు.

 

దొంగలపని కాదు...

రెగ్యులర్ దొంగలు చేసిన పని కాదని తెలిసాక మా దృష్టిని ఊళ్లో వారిపై పెట్టాం. రోజులు గడుస్తున్నాయి కానీ ఎక్కడా ఎలాంటి సమాచారం దొరకడం లేదు. ‘బంగారం కోసం ముసలావిడను హత్యచేశారంట’ అనే వార్త చుట్టుపక్కల మండలాల్లో సంచలనంలా మారింది. ఒంటిమీద సొమ్ములుండగా ఒంటరిగా ప్రయాణం చేయడం ప్రమాదమంటూ మహిళలంతా ఆందోళన పడసాగారు. మరోపక్క వార్తాపత్రికల్లో పల్లెల్లో భద్రత లేదంటూ కథనాలు. ఇంతలో ఆ పెద్దావిడ మనవడు బండి కొన్నాడన్న విషయం తెలిసింది. మాకు తెలిసిన వివరాల మేరకు ఆ అబ్బాయికి ఉద్యోగం లేదు. తల్లిదండ్రులు కూడా అతనికి డబ్బులివ్వరు. అలాంటిది ఉన్నట్టుండి బండెక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తే నా స్నేహితుడి దగ్గర అప్పు తీసుకున్నానంటూ ఏవో కబుర్లు చెప్పాడు. మాకు మొదటి నుంచి ఆ అబ్బాయి చెప్పే మాటలు వాస్తవం కావనిపించేవి.

 

స్నేహితుల సాయంతో...

ఎందుకైనా మంచిదని స్నేహితుల్ని తీసుకొచ్చి విచారించాం. ఒకబ్బాయి ‘ఎప్పుడూ వంద రూపాయలు కూడా ఎరుగనివాడు ఈ మధ్య బాగానే ఖర్చుపెడుతున్నాడు’ అని చెప్పాడు. ఇక లాభం లేదని ఆ మనవడిపై నిఘా పెట్టాను. అలాగే ఊళ్లో ఉన్న మా ఇన్ఫార్మర్ల సాయం కూడా తీసుకున్నాం. మా అనుమానం నిజమైంది. ‘ఈ మధ్యనే అతను మంచిర్యాలలో ఉన్న బంగారం దుకాణానికి వెళ్లి డబ్బు తెచ్చుకున్నాడు. ఆ సమయంలో నన్ను కూడా తీసుకెళ్లాడు’ అని అతని మరో స్నేహితుడు చెప్పిన వివరాల ఆధారంగా ఎంక్వైరీ చేయిస్తే అక్కడ ఇతను ఏవో బంగారు వస్తువుల్ని అమ్మినట్టు తెలిసింది. అలాగే పెద్దావిడను మండల కార్యాలయం దగ్గర వదిలిపెట్టిన విషయం కూడా వాస్తం కాదని తేలింది.

 

పక్కా ఆధారాలతో...

పెద్దావిడ మనవడు చెప్పిన విషయాలన్ని నమ్మినట్టే నమ్మి అతనిపై చేసిన పరిశోధన ఫలితాలు మాకు పక్కా ఆధారాలను చూపించాయి. వాటన్నింటిని చేతిలో పెట్టుకుని ఆ అబ్బాయిని స్టేషన్‌కి పిలిపించకుని విచారణ చేశాను. ముందు కాదన్నా... తర్వాత నిజం ఒప్పుకున్నాడు. నానమ్మ ఒంటిపై ఉన్న బంగారం కోసమే ఆమెను హత్యచేసినట్టు అంగీకరించాడు. నోటిమాట సరిపోదు కదా! ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో కారణాల దగ్గర నుంచి సంఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన వస్తువుల వరకూ అన్నింటినీ రికార్డు చేశాం.



హత్య చేసింది మనవడేనన్నందుకు మా దగ్గర ముఖ్య ఆధారం అతని సెల్‌ఫోన్ డేటా. ‘నేను ఫలానా సమయంలో మా నానమ్మను మండల కార్యాలయం దగ్గర దించాను’ అని అతను చెప్పిన సమయంలో అతను ఊరి పొలిమేరల్లోనే ఉన్నట్టు అతని సెల్‌ఫోన్ ఏరియా సిగ్నల్స్ చెప్పాయి. దాంతోపాటు చివరిసారిగా ముసలావిడను మనవడి బండిపై చూసిన సాక్షుల వివరాల ప్రకారం అతను చెప్పిన విషయాలన్ని నిజం కాదని అర్థమైంది. అప్పుడు అతడు వాడింది స్నేహితుడి బైక్.

 

25రోజులు...

మిస్సింగ్ కేసుతో మొదలై మర్డర్ కేసుగా బయటపడ్డ ఈ కేసులో హంతకుడు ఇంటి మనిషే అని తేల్చడానికి మాకు 25 రోజుల సమయం పట్టింది. మర్డర్ కేసుల్లో నిందితుడు బయటివాడైతే కేసు త్వరగా కొలిక్కి వస్తుంది. అదే ఇంటివారైతే చాలా సమయం వృథా అయిపోతుంది. ఎందుకంటే అనుమానించడానికి ఆధారాలు త్వరగా దొరకవు. ఈ కేసులో చూశారుగా... హంతకుడే స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు ఇచ్చాడు. అంతేనా... నాయనమ్మపై ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ మాపైన ఒత్తిడి తెస్తూ వారి పేర్లు వీరి పేర్లు చెబుతూ మమ్మల్ని అయోమయానికి గురిచేసే ప్రయత్నం కూడా చేశాడు. జల్సాలకు అలవాటు పడి సొంత నాయనమ్మనే అత్యంత కూర్రంగా హత్య చేసిన వ్యక్తి మా కళ్లెదురుగా ఉన్నా అతనే హంతకుడిని నిర్ధారణకు రావడానికి మాకు ఇంత సమయం పట్టింది. కొన్ని కేసుల్లో అయితే నెలలు, సంవత్సరాలు కూడా గడిచిపోతుంటాయి.

 

ఏడేళ్ల శిక్ష...

అన్ని ఆధారాలతో కేసు ఫైల్ చేసి కోర్టుకి అప్పగించాం. ఇంత జరిగినా ఆ పెద్దావిడ ఇంట్లోవాళ్లు మాత్రం మనవడికి ఏ పాపం తెలియదంటారు. ఎవరో దుండగులు చేసిన పని అంటారు. కోర్టులో హంతకుడికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది.

ప్రెజెంటేషన్: భువనేశ్వరి

ఫొటో: రాజేశ్‌రెడ్డి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top