ఔను..! అతడు క్షమించలేడు...

గ్లెన్ ఫోర్డ్.. అరెస్టుకు ముందు  @ జైలు నుంచి విడుదలయ్యాక... - Sakshi


చేయని నేరం

‘నన్ను క్షమించవూ..’ ఆర్ద్రంగా అడిగాడు మార్టీ ‘నిన్ను చచ్చినా క్షమించలేను..’ కటువుగా బదులిచ్చాడు గ్లెన్  ఔను..! ఇప్పుడతడు క్షమించలేడు. చేయని నేరానికి మూడు దశాబ్దాలు జైల్లో మగ్గాడు. జైలు నుంచి బయటకు వచ్చాక అందరిలాగే జీవిద్దామనుకున్నాడు. ఎట్టకేలకు నిర్దోషిగా విడుదలయ్యాడు. అయితే, అతడి కోసం ఇప్పుడు మృత్యువు నిరీక్షిస్తోంది. అతడు ఇప్పుడు రోజులు లెక్కించుకుంటున్నాడు. ఖైదు నుంచి బయటకు వచ్చేసరికే అతడికి కేన్సర్ నాలుగో దశలో ఉన్నట్లు తేలింది.



మహా అయితే ఆరు నెలలకు మించి బతకడని డాక్టర్లు తేల్చేశారు. జీవిత చరమాంకంలో ఉన్న గ్లెన్ ఫోర్డ్‌ను కలుసుకోవడానికి వచ్చాడు మాజీ ప్రాసిక్యూటర్ మార్టీ స్ట్రౌడ్. గ్లెన్‌కు శిక్ష పడటానికి తానే కారణమైనందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అతడి ఇంటికి వెళ్లి మరీ తనను క్షమించమని అడిగాడు. ‘నిన్ను చచ్చినా క్షమించలేను’ అని మార్టీకి ముఖమ్మీదే చెప్పేశాడు గ్లెన్. చేసేదేమీ లేని మార్టీ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ వెనుదిరిగాడు. సినిమాను తలపించే ఈ నిజజీవిత ఘట్టాన్ని ‘నైట్‌లైన్’ వీడియోలో చిత్రీకరించి, వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. గ్లెన్ ఫోర్డ్ విషాద గాథను తెలుసుకోవాలంటే మూడు దశాబ్దాల వెనక్కు వెళ్లాల్సిందే..

 

జరిగిందేమిటి..?

అమెరికాలోని కాలిఫోర్నియాలో గ్లెన్ ఫోర్డ్ సాదాసీదా నల్లజాతి యువకుడు. సరైన ఉద్యోగం కూడా లేదు. పనుల కోసం లూసియానా వచ్చాడు. దొరికిన పనల్లా చేసేవాడు. అలాగే, లూసియానాలోని ష్రీవ్‌పోర్ట్ జ్యూవెలర్ అండ్ వాచ్‌మేకర్ దుకాణంలోనూ ఒకటి రెండుసార్లు పనులు చేశాడు. అనుకోకుండా 1983 నవంబర్ 5న ‘ష్రీవ్‌పోర్డ్’ దుకాణంలో దోపిడీ జరిగింది. దుకాణ యజమాని ఇసాడోర్ రోజ్‌మాన్ హత్యకు గురయ్యాడు.



అమెరికన్ పోలీసుల అనుమానం అలవాటుగా నల్లజాతి యువకుడైన గ్లెన్‌పైకి మళ్లింది. ఇంకేం! లోపలేసేశారు. ఇదే కేసులో జేక్ రాబిన్సన్, హెన్రీ రాబిన్సన్ అనే ఇద్దరు సోదరులనూ అరెస్టు చేశారు. అయితే, వారిని ప్రశ్నించి వదిలేశారు. గ్లెన్‌కు వ్యతిరేకంగా పోలీసుల కథనాన్ని, వారు చూపిన ఆధారాలను లూసియానా సుప్రీం కోర్టు విశ్వసించింది. ప్రాసిక్యూటర్‌గా వాదించిన మార్టీ స్ట్రౌడ్... ఈ కేసులో గ్లెన్‌కు మరణశిక్ష విధించాలంటూ వాదించాడు. వాదోపవాదాలు ముగిశాక, 1984లో తీర్పు ఇచ్చిన కోర్టు, గ్లెన్‌కు మరణశిక్ష విధించింది.



విచారణ సమయంలో తాను నిరపరాధినంటూ గ్లెన్ ఎంతగా మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. అతడిని అంగోలా జైలుకు తరలించారు. తగిన గాలి వెలుతురు లేని జైలు గోడల మధ్యనే మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. జైలులో ఉంటూనే గ్లెన్ లెక్కలేనన్ని అప్పీళ్లు దాఖలు చేసుకున్నాడు. అవేవీ పెద్దగా ఫలించలేదు.

 

అనుకోని మలుపులు...

అప్పీళ్లు దాఖలు చేసుకుంటున్నా ఫలితం లేకపోతుండటంతో గ్లెన్ దాదాపు ఆశలు వదిలేసుకున్నాడు. ముప్పయి మూడేళ్ల నిండు యవ్వనంలో కర్మకాలి కటకటాల పాలయ్యాడు. జైలులో కాలం గడిచిపోతుండగానే, ముదిమి మీదపడింది. ఓపిక నశించింది. ఇంతలో అనుకోని మలుపు. జేక్, హెన్రీలకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ తొక్కిపెట్టిందని, ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ గ్లెన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను 2000 సంవత్సరంలో లూసియానా సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.



కేసులో చిన్న కదలిక. అయితే, గ్లెన్‌కు సానుకూలంగా ఎలాంటి పరిణామం చోటు చేసుకోకుండానే పదమూడేళ్లు గడిచిపోయాయి. అలాంటి దశలో మరో మలుపు. రోజ్‌మాన్‌ను తానే కాల్చి చంపేసినట్లు జేక్ రాబిన్సన్ చెప్పుకుంటున్నాడంటూ ఒక అజ్ఞాత వ్యక్తి ప్రాసిక్యూటర్లకు సమాచారం ఇచ్చాడు. కోర్టు ఆదేశాలపై తిరిగి జరిపిన దర్యాప్తులో గ్లెన్ నిర్దోషిగా తేలాడు.



కోర్టు అతడిని గత ఏడాది విడుదల చేసింది. అయితే, జైలు జీవితం అతడి ఆరోగ్యాన్ని కబళించేసింది. కేన్సర్‌తో బాధపడుతున్న అతడు బతికేది మరో నాలుగైదు నెలలు మాత్రమేనని డాక్టర్లు రెండు నెలల కిందటే పెదవి విరిచేశారు. మృత్యువు కోసం నిరీక్షిస్తున్న దశలో గ్లెన్ ఎవరిని  క్షమించగలడు..?

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top