జీకే సన్నాఫ్ పీకే

జీకే సన్నాఫ్ పీకే


 ‘‘డాడీ... నేను మీలాగే భూగ్రహానికి వెళ్లాలనుకుంటున్నాను. నన్ను దీవించండి’’ అన్నాడు జీకే. ‘‘నేను వెళ్లి నానా చావు చచ్చాను కదా సన్. మళ్లీ నువ్వు వెళ్లడం ఎందుకు?’’ అడిగాడు పీకే.  ‘‘మీరు  2014లో వెళ్లారు. భూ గోళంలో ప్రతి నెలకూ ఎన్నెన్నో మార్పులు కనిపిస్తాయని చెప్పారుగా.  ఇన్నేళ్లలో ఎంతో మార్పు వచ్చి ఉంటుంది. అక్కడి సరికొత్త విశేషాలను మన గ్రహవాసులతో పంచుకోవాలనుకుంటున్నాను’’ అన్నాడు జీకే. ‘‘అయితే ఓకే’’ ఆశీర్వదించాడు పీకే.

 గత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి పీకేని.  ‘‘డియర్ సన్. నువ్వు ఎక్కడికైనా వెళ్లుగానీ ఆ రాజస్థాన్ ఎడారుల్లోకి మాత్రం వెళ్లకు.

 

 అక్కడే ఒక దొంగోడు నా మెడలో ఉన్న స్పేస్‌షిప్ రిమోట్ కంట్రోల్ దొబ్బేశాడు. ఆ భూమి మీద ఉండలేక, మన గ్రహానికి రాలేక ఎన్నెన్ని కష్టాలు పడ్డానో మీకు చెప్పాను కదా’’ అని వారించాడు పీకే. ‘‘రిమోట్‌ను మీలాగా అందరికీ కని పించేలా మెడలో  వేసుకుంటానా  ఏంటి? చక్కగా నడుముకు కట్టుకొని, మీరు భూ గోళం నుంచి తెచ్చిన షర్ట్ వేసుకుంటాను. ఇక అది ఎవరికీ కనబడదు. ఎవరూ దాన్ని కొట్టుకెళ్లే చాన్స్ లేదు’’.. ధీమాగా చెప్పాడు జీకే. ‘‘అయితే ఓకే!’’ అన్నాడు పీకే. ఆ మరుసటి రోజు స్పేస్‌షిప్ ఎక్కాడు జీకే.  ‘‘డియర్ సన్... క్షేమంగా వెళ్లి లాభంగా రాకపోయినా ఫరవాలేదు గానీ... లబోదిబోమని మాత్రం రాకు’’ అంటూ వీడ్కోలు పలికాడు పీకే.

    

 స్పేస్‌షిప్ ఒక అర్ధరాత్రి హైదరా బాద్‌లోని చింతల్‌బస్తీ క్రికెట్ గ్రౌండ్‌లో దిగింది. ‘‘వారం రోజుల్లో వచ్చేయాలి. రిమోట్ గానీ పోగొట్టుకున్నావంటే శాశ్వతంగా ఇక్కడే ఉండాల్సి వస్తుంది జాగ్రత్త’’ అని హెచ్చరించి వెళ్లిపోయారు స్పేస్‌షిప్ డ్రైవర్లు.తెల్లారిపోయింది. రోడ్లమీద తిరగడం ప్రారంభించాడు జీకే. మధ్యాహ్నమైంది. నోరు పిడచకట్టింది. అమీర్‌పేట్‌లోని ఒక సందులో ‘శ్రీ మహంకాళి కల్లు కాంపౌండ్’ అనే బోర్డ్‌తో ఒక రేకుల షెడ్డు కని పించింది. అందులో నుంచి వస్తున్నవాళ్లు చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం జీకేను ఆశ్చర్యపరిచింది.

 

 ఆసక్తితో లోనికి వెళ్లాడు. ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. పక్క నున్న వ్యక్తి జీకే భుజం మీద చేయివేసి ‘‘తమ్ముడూ... నాపేరు తోటరాముడు. నాకు ఒక బుల్లి చెల్లి ఉంది అనే కవిత రాసింది నేనే. నిన్ను చూస్తే నా సొంత తమ్ముడు గుర్తుకు వస్తున్నాడు. నీకు కల్లు తాగించాలని డిసైడ్ చేసిన’’ అని, ‘‘రెండు సీసాల కల్లు’’ అంటూ అరిచాడు. దాహంతో ఉన్న జీకే రెండు కాదు,  ఏకంగా ఇరవై సీసాల కల్లు తాగేశాడు. ‘‘గాడ గూసోని కల్లు తాగుతున్నది నా కజిన్ బ్రదరే. వాడే నా బిల్లు, వాడి బిల్లు రెండూ కడతడు’’ అని క్యాషియర్‌కి చెప్పి మాయమైపోయాడు తోటరాముడు.

 

 ‘‘దుకాణం బంద్ చేస్తున్నాం. లేచి బిల్లు కట్టు’’ అన్నాడు క్యాషియర్. జీకేకు అర్థం కాలేదు. ‘ఆకాశం నుంచి కిందికి వచ్చాను’ అని సైగలు చేశాడు. ‘‘బిల్లు అడిగితే చుక్కలు చూపెడుతున్నడు. వీడి బట్టలు విప్పి బజారు పాలు చేయండి’’ అని అరిచాడు  క్యాషియర్. ఇద్దరు వచ్చి జీకే చొక్కా చించేశారు. వెంటనే ఇద్దరూ గట్టిగా అరిచారు, ‘‘అన్నా వీడి నడుము మీద ఏదో మెరుస్తుంది’’ అని. క్యాషియర్  పరిగెత్తుకు వచ్చాడు.‘‘ఇది డైమండ్ వడ్డాణం. దాన్ని నొక్కేసి వీడిని గప్‌చుప్‌గా ఎక్కడైనా పడేసి రండి’’ అన్నాడు.

 

 మరుసటి  రోజు: సత్యం థియేటర్ ముందు ఉన్న మురికికాలువ పక్కన గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు జీకే. చుర్రుమని ఎండ తగలడంతో లేచి చూచాడు. తలంతా భారంగా ఉంది. కళ్లు మండు తున్నాయి. ‘వామ్మో... ఈ భూగ్రహం మీద ఒక్క క్షణం కూడా ఉండకూడదు. రిమోట్ నొక్కి వెంటనే మా గ్రహానికి వెళ్లిపోయి ప్రాణాలు దక్కించుకోవాలి’ అనుకుంటూ నడుం తడుముకున్నాడు. ఖాళీ!!! ‘ఓరి నాయనో’ అని అరుస్తూ ఆకాశం కేసి చూశాడు జీకే. కన్నపేగు కదిలి  గాఢ నిద్రలో ఉన్న పీకే టక్కుని లేచాడు. ‘నా సన్... నాయనో అని పిలిచినట్లు వినిపించింది. నాలాగే రిమోట్ పోగొట్టు కుని ఉంటాడు’ అనుకుంటూ కొడుకు జాడ కోసం స్పేస్‌షిప్ ఎక్కి అర్జంటుగా భూగ్రహానికి పయనమాయ్యడు పీకే!

 -  యాకూబ్ పాషా                                                   

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top