లిప్ట్ ప్లీజ్...

లిప్ట్ ప్లీజ్...


దెయ్యం అన్న మాట వింటేనే గుండె గుభేల్‌మంటుంది. ఇక దెయ్యం ఎదురుపడితే? వచ్చి మన పక్కనే కూచుంటే? మనతో మాట కలిపితే? ఆలోచిస్తుంటేనే చెమటలు పట్టేయడం లేదూ! చికాగోలో ఓ దెయ్యం ఇలాగే అందరికీ చెమటలు పట్టించింది. కంటి మీద కునుకు లేకుండా చేసింది. నమ్మశక్యంగా లేదా? అయితే ఆ దెయ్యం కథని మీరూ చదవండి!

 

అమెరికాలోని చికాగో... 1939వ సంవత్సరం.

రాత్రి తొమ్మిది గంటలు దాటి పదిహేను నిమిషాలయ్యింది. ఒక తెల్లటి కారు వచ్చి ‘ఒ.హెన్రీ బాల్‌రూమ్’ ముందు ఆగింది (దీన్ని ఇప్పుడు విల్లోబ్రూక్ బాల్‌రూమ్ అంటున్నారు). లేత గ్రే కలర్ సూట్‌లో హుందాగా దిగాడు జెర్రీ పాల్యూస్. అతడిని చూస్తూనే వాచ్‌మేన్ ఆనందంగా సెల్యూట్ చేశాడు. అతడి అభివందనాన్ని స్వీకరించినట్టుగా తలాడించాడు జెర్రీ. లోనికి వెళ్తూ వాచ్‌మేన్ చేతిలో ఓ కరెన్సీ నోటు పెట్టాడు. నోటు చూడగానే అతగాడి ముఖం మరింత వికసించింది. కృతజ్ఞతగా మరో సెల్యూట్ కొట్టాడు. తనదైన స్టయిల్లో అందంగా నవ్వి లోనికి నడిచాడు జెర్రీ.

 

ఓ కోటీశ్వరుడు తన పుట్టినరోజు ఫంక్షన్‌ని జరుపుకుంటున్నాడు ఆ రోజు. అతడి స్థాయి ఏమిటో ఆ హాల్ అలంకరణను బట్టే అంచనా వేసేయవచ్చు. అంత అద్భుతంగా ఉంది డెకొరేషన్. డిజైన్ చేసినవాడిని మనసులోనే మెచ్చుకుంటూ హాల్లోకి అడుగు పెట్టాడు జెర్రీ. అప్పటికే హాలంతా సందడి సందడిగా ఉంది. సముద్రంలో కెరటాలు ఎగసిపడుతున్నట్టుగా అందరిలోనూ హుషారు ఉరకలు వేస్తోంది. అలుపూ సొలుపూ లేకుండా ఆడా మగా కలిసి స్టెప్పులేస్తున్నారు. కొందరి చేతుల్లో వైన్ గ్లాసులున్నాయి. కొందరి చేతుల్లో కాక్‌టెయిల్ గ్లాసులున్నాయి. మధ్యమధ్యలో వాటిని సిప్ చేస్తూ మరీ హుషారెత్తిపోతున్నారు.

 

అందరినీ ఓసారి పరికిస్తూ పుట్టినరోజు చేసుకుంటున్న వ్యక్తి దగ్గరకు వెళ్లాడు జెర్రీ. తాను తెచ్చిన గిఫ్టును చేతిలో పెట్టి, విషెస్ చెప్పాడు. తర్వాత ఓ వైన్ గ్లాస్‌ను అందుకుని, ఓ పక్కగా ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. డ్యాన్స్ చేస్తున్నవాళ్లను చూస్తూ వైన్‌ని సిప్ చేస్తున్నాడు. అనుకోకుండా అతడి చూపు... ఓ మూలన వేసున్న టేబుల్ వైపు మళ్లింది. అక్కడో అమ్మాయి ఒంటరిగా కూర్చుని ఉంది. పాల నురుగులాంటి తెల్లని గౌను వేసుకుంది. గాలికి ముంగురులు ఎగిరి ముఖమ్మీద పడుతుంటే మృదువుగా ఎగదోసుకుంటోంది. హోరెత్తుతున్న సంగీతానికి పాదాలను మెల్లగా కదిలిస్తోంది.

 

జెర్రీ మనసులో చిన్న అలజడి. ఎంత ప్రయత్నించినా చూపు తిప్పుకోలేకపోయాడు. కోటీశ్వరుడైన తనను బుట్టలో వేసుకోవడానికి చాలామంది అమ్మాయిలే ప్రయత్నించారు. కానీ వాళ్లలో ఎవరిని చూసినప్పుడూ ఇలాంటి అనుభూతి కలగలేదు. ఆమె దగ్గరకు వెళ్లాలని మనసు పరితపిస్తోంది. కంట్రోల్ చేసుకోలేకపోయాడు. లేచి మెల్లగా ఆమె దగ్గరకు వెళ్లి ‘హలో’ అన్నాడు. తల తిప్పి చూసిందామె. కింద నుంచి పైకి ఓసారి పరికించి చూసి ‘హలో’ అనేసి ముఖం తిప్పుకుంది.

 

‘‘నేనిక్కడ కూర్చోవచ్చా’’ అన్నాడు. ఆమె ఓసారి చుట్టూ ఉన్న టేబుల్స్ వైపు చూసింది. అవన్నీ ఉన్నాయిగా అన్నట్టున్నాయి ఆమె చూపులు. ఆ భావం అర్థమై... ‘‘అవన్నీ ఖాళీగానే ఉన్నాయనుకోండి. కానీ ఒక్కడినే కూర్చుంటే బోర్ కొడుతోంది. అందుకే ఇక్కడ కూర్చుందామని’’ అన్నాడు నవ్వుతూ. ఆమె కూర్చోమన్నట్టు సైగ చేసింది. హమ్మయ్య అనుకున్నాడు. మెల్లగా మాట కలిపాడు. కబుర్లలోకి దింపాడు. ఇంప్రెస్ చేశాడు. తనతో డ్యాన్స్ చేయడానికి ఒప్పించాడు.ఆమెతో సన్నిహితంగా మెలగడం జెర్రీ మనసును పులకింపజేస్తోంది. ఆమె నడుము చుట్టూ చేయి వేసి నర్తిస్తుంటే... హృదయం ఉప్పొంగిపోయింది. ఆ క్షణమే నిర్ణయించేసుకున్నాడు... ఆమెకి ఎప్పటికీ దూరం కాకూడదని!

 

తెల్లవారుజా మున మూడు అవుతుండగా చెప్పాడు... ‘‘మేరీ... ఐలవ్యూ’’. ఆమె కళ్లలో మెరుపులు మెరిశాయి. సిగ్గుతో పెదవులు అదిరాయి. ‘‘ఇక నేను వెళ్తాను. చాలా టైమయ్యింది’’ అంది దూరం జరుగుతూ.

 ‘‘సమాధానం చెప్పవా’’ అన్నాడు ఆమె కళ్లలోకి చూస్తూ. సిగ్గుల మొగ్గయ్యిందామె.

 ‘‘సరేలే... టైమ్ తీసుకుని చెప్పు. నేను నిన్ను డ్రాప్ చేస్తాను పద’’ అన్నాడు జెర్రీ. అతని వెంట నడిచింది. ఇద్దరూ కారులో బయలుదేరారు. దారి పొడుగునా కబుర్లలో మునిగిపోయారు. కాసేపటి తర్వాత అంది... ‘‘ఇక్కడ ఆపండి. నేను దిగుతాను.’’

 ‘‘ఓహ్... ఇక్కడేనా మీ ఇల్లు?’’

 ‘‘అవును. మళ్లీ కలుద్దాం.’’

 ‘‘ఎప్పుడు?’’

 ‘‘మీరెప్పుడంటే అప్పుడు’’

 

అనేసి జింకపిల్లలా చెంగు చెంగున వెళ్లిపోతుంటే జెర్రీ మనసు విహంగమై ఊహాలోకాల్లోకి ఎగిరిపోసాగింది. తన పిచ్చికి తనలో తనే నవ్వుకుని చేతులు స్టీరింగ్ మీద వేశాడు. కారు స్టార్ట్ చేస్తూ మేరీ వెళ్లినవైపే చూశాడు. అంతే... అతడి ఒళ్లు ఝల్లుమంది. కారు ఆపి, గబగబా దిగాడు. ఎదురుగా ఉన్న బోర్డుమీద ఉన్న పెద్ద పెద్ద అక్షరాలు అంత చీకట్లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి... ‘రిజరక్షన్ సిమెట్రీ’!

 హడలిపోయాడు జెర్రీ. చుట్టూ చూశాడు. అక్కడ ఇళ్లేమీ లేవు. అంతా శ్మశానమే. మేరీ అక్కడెందుకు దిగింది? ఎక్కడికి వెళ్లింది? కొంపదీసి కాటికాపరి కూతురా? లేక...

 ఇక ఒక్కక్షణం నిలబడలేకపోయాడు జెర్రీ. ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దయిపోయింది. గుండె వేగం హెచ్చింది. గబగబా కారెక్కి స్టార్ట్ చేశాడు. క్షణాల్లో అక్కడ్నుంచి దూసుకుపోయాడు.

 పాపం జెర్రీకి తెలియదు... ఆమె ఎవరో. తెలిసివుంటే అసలు ఆమెతో పరిచయం చేసుకునేవాడు కాదు. ఆమెకు లిఫ్ట్ ఇచ్చేవాడు కూడా కాదు. ఇంతకీ ఆమె ఎవరు??????

    

ఆ రోజు రాత్రి జెర్రీకి జరిగిన అనుభవం అతడికి కొత్త కావచ్చు. కానీ అప్పటికే చాలామందికి అలా జరిగింది. కానీ ఎవరూ నోరు మెదపలేదు. తొలిసారిగా జెర్రీ తన అనుభవాన్ని అందరితో మేరీ కథ ప్రపంచానికి తెలిసి వచ్చింది.

 చికాగోలోని ఒ.హెన్రీ బాల్‌రూమ్‌కీ, రిజరక్షన్ సిమెట్రీకీ మధ్య ఉన్న దారిలో ప్రయాణించిన చాలామందికి తెలుసు మేరీ గురించి. తెల్లని గౌను వేసుకుని, రోడ్డు పక్కన నిలబడి లిఫ్ట్ అడిగేది. ఎక్కించుకున్నవాళ్లని శ్మశానం దగ్గరకు వచ్చాక ఆపమనేది. ఆమె ఆపమన్నది శ్మశానం దగ్గర అని వాళ్లు తెలుసుకునేసరికి మాయమైపోయేది.



ఆ విషయాన్ని చాలామంది చాలాసార్లు చెప్పారు. కానీ అది భ్రమ కావచ్చు అని అంతా కొట్టి పారేశారు. కానీ జెర్రీకి  కలిగిన అనుభవం గురించి విన్న తర్వాత అవాక్కయ్యారు. ఆమె తనతో రాత్రంతా డ్యాన్స్ చేసిందనీ, తాను ఆమెను ముద్దాడాననీ కూడా జెర్రీ చెప్పాడు. దాంతో అందరికీ మేరీ అనే దెయ్యం ఉందనే విషయం అర్థమైంది. దాంతో ఆ దారిలో వెళ్లాలంటేనే భయం మొదలైంది. విషయం తెలియని వాళ్లు వెళ్లేవారు. మేరీ బారిన పడేవారు.

 ఓసారి ఓ ట్యాక్సీ డ్రైవర్ ఆ దారిలో వస్తుంటే శ్మశానం గేటు లోపల ఓ అమ్మాయి కనిపించింది.



గేటు ఊచలను వంచడానికి ప్రయత్నిస్తోంది. దాంతో వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఎవరో అమ్మాయి పొరపాటున శ్మశానంలో ఇరుక్కుపోయిందని, గేటు తెరవడానికి ప్రయత్నిస్తోందని చెప్పాడు డ్రైవర్. తక్షణం ఇన్‌స్పెక్టర్ అక్కడికి వెళ్లాడు. ఎవరూ కనిపించలేదు. కానీ రెండు ఊచలు వంగిపోయి ఉన్నాయి. వాటి మీద వేలిముద్రలు కనిపించాయి. అవి మనిషి ముద్రల్లా లేవు. విచిత్రంగా ఉన్నాయి. దాంతో పరిశోధన మొదలైంది. రిజరక్షన్ శ్మశానంలో సమాధి అయిన మేరీ పేరుగల మృతులందరి గురించీ ఆరా తీయడం మొదలుపెడితే తెలిసింది... ఆత్మగా సంచరిస్తోన్న మేరీ అసలు కథ!

 

ఆమె పేరు మేరీ బ్రెగోవీ. చికాగోలోనే నివసించేది. 1934లో ఓ రోజు రాత్రి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఒ.హెన్రీ బాల్‌రూమ్‌కి వెళ్లింది. అక్కడ వారిద్దరికీ చిన్న తగాదా వచ్చింది. ఆ సమయంలో బాయ్‌ఫ్రెండ్ ప్రవర్తించిన తీరు ఆమెకి మనస్తాపం కలిగించింది. ఎంత గానో ప్రేమించిన వ్యక్తి తనతో అను చితంగా ప్రవర్తించడంతో తట్టుకోలేక పోయింది. ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసింది. ఒంటరిగా ఇంటికి బయలుదేరింది. కాస్త దూరం నడిచిందో లేదో ఓ ట్రక్కు వచ్చి ఆమెను గుద్దేసింది.



క్షణాల్లో మేరీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. మేరీని రిజరక్షన్ శ్మశానంలో పాతిపెట్టారు ఆమె తల్లిదండ్రులు. నాటి నుంచీ ఆమె ఆత్మ బాల్‌రూమ్‌కీ, శ్మశానానికీ మధ్య సంచరి స్తూనే ఉంది. లిఫ్ట్ అడిగి అందరినీ భయపెడుతూనే ఉంది. కానీ ఏ ఒక్క రోజూ ఎవరికీ హాని మాత్రం చేయలేదు.అయితే ఏమయ్యిందో ఏమోగానీ... 1999 తర్వాత కనిపించడం మానేసింది మేరీ. ఆమె ఆత్మకు విముక్తే లభించిందో లేక మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ... మేరీని చూశామని ఆ తర్వాత ఇంకెవరూ చెప్పలేదు. మేరీ ఏమయ్యింది? ఎక్కడికి వెళ్లింది?!

  - సమీర నేలపూడి

 

మేరీ చికాగోలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన దెయ్యం. కొన్ని దశాబ్దాల పాటు ఆమె వార్తల్లో ఉంది. అలాంటి ఆత్మే లేదని నిరూపించడానికి ప్రయత్నించిన చాలామందికి సైతం ఆమె కనిపించింది. దాంతో మేరీ మళ్లీ లేచింది అంటూ పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. మేరీ బ్రెగోవీకి ‘రిజరక్షన్ మేరీ’ అంటూ ముద్దు పేరు పెట్టాయి!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top