గాలిబ్ గీతం ప్రేమ కపోతం

గాలిబ్ గీతం ప్రేమ కపోతం


మనిషి గొప్పదనం ఒక పూవుకన్నా ఎక్కువా ఏమైనా? గాలిబ్ ఉద్దేశంలోనైతే కచ్చితంగా కాదు. ఆ సౌకుమార్యం, ఆ పరిమళం ఎంత అద్భుతమైనవి! అందుకే ఆయన ఇలా ఆశ్చర్యపోతాడు: ‘మనం ఇంతకావడానికే ఎంతో కాలం పట్టిందే! ఆ రోజాకు అంత కావడానికి ఎంతకాలం పట్టిందో’! పూలను ప్రేమించినవాడు మరి పూవంటి ప్రేయసిని ఎలా విస్మరిస్తాడు! అందునా ఆమె, ‘చూచినవారందరినీ తన అందంతో ఆరోగ్యవంతులను చేస్తుం’టే! పైగా, ‘అందమొక గుణమే కాదు ఔషధం’ కూడానాయే! ‘కత్తి చేతలేక కదనమ్ము జరిపెడి, ఇంతి కెవ్వ డసువు లీయకుండు?’ అయితే, ఆయన ఊహాప్రేయసి ఎప్పుడూ ఆయనకు చేరువ కాలేదు. దాంతో విరహం, వేడి నిట్టూర్పులు, కన్నీళ్లు! ఆమె కేశాలు ఆయనకు ఉరితాడుగా మారినట్టూ, ఆయన గుండెని ఆమె నవ్వులు ఛిద్రం చేస్తున్నట్టూ ఒకటే వేదన! ‘శస్త్రవైద్యుని కత్తి సైతము రక్తాశ్రు కణములొలికె’గానీ ఆమె మనసు మాత్రం కరగలేదు. ఇన్ని బాధలను భరించటానికి మళ్లీ ఉన్నవి పది గుండెలు కూడా కాదు, ఒకే ఒక్క చిన్ని గుండె! అయినా గాలిబ్‌కు గట్టి నమ్మకం ఏమిటంటే, ‘ప్రేమకు ప్రేమే బాధ, ప్రేమే చికిత్స’!

 

 గాలిబ్ గీతాలన్నీ సున్నితంగా, సుతారంగా ఉంటాయి. సాధారణ మాటల్లోనే అసాధారణమైన భావాల్ని ప్రకటిస్తాడు. తన కాలానికి గాలిబ్ ఆధునికుడు. గాలిబ్ అంటే ఉన్నతమైన అని అర్థం. అసలు పేరు మీర్జా అసదుల్లా బేగ్ ఖాన్. ఆగ్రాలో డిసెంబర్ 27, 1797న జన్మించాడు. ఉర్దూ, పర్షియా, అరబిక్ భాషల్లో రాశాడు. ‘కరెన్సీ నోటు సాధారణమైన కాగితంతో చేయబడినదైనా, సాధారణమైన కాగితంకన్నా అనేక రెట్లు విలువెక్కువ. అలాగే గాలిబ్ కవిత్వం’ అని తన అభిమానం చాటుకున్నాడు గాలిబ్ గీతాల్ని తెలుగులోకి మహాగొప్పగా తెచ్చిన దాశరథి కృష్ణమాచార్యులు.

 

 గాలిబ్ గీతాలన్నీ శృంగారం చుట్టూ తిరిగినవి కాదు. మానవ స్వభావాన్ని లోతుగానూ, గాఢంగానూ స్పృశిస్తాయి. ‘మనమనుకుంటాం మనమితరులతోనే మోసపోతామని, కాని వాస్తవానికి మనం మనతోనే ఎక్కువ మోసపోతాం’ అంటాడు. ‘మనమనుకుంటాం మనకు చాలా తెలుసని, కాని ఎంత తెలుసు మనకు తెలవవలసిన దానిలో’ అని ప్రశ్నిస్తాడు. అసలు అవన్నీ విడిచిపెడితే, మనిషి మనిషిగా నిలబడటం అంత సులభమా! ‘ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము, నరుడు నరుడౌట యెంతో దుష్కరమ్ము సుమ్ము’. ‘స్వీయ లోపమ్ము లెరుగుట పెద్ద విద్దె, లోపమెరిగినవాడె పూర్ణమగు నరుడు’.

 

 సుఖదుఃఖాల్లో దుఃఖమే ఆయన్ని ఎక్కువగా ఆలింగనం చేసుకున్నట్టుంది. ‘ఈ జగత్తు స్వభావము నేమియందు, మంచి చేసిన వానిని ముంచు నౌర’ అని లోకరీతిని చాటాడు. ‘నన్ను గూర్చి వార్త నాకె అందనిచోట నేను వాసముండినాను నేడు’ అని ఒంటరితనపు క్షోభను వెల్లడించాడు. అయినప్పటికీ నాశనంలోనూ ఒక సౌఖ్యాన్ని తలపోశాడు. ‘బ్రతుకుపై నింత విశ్వాస పడెదరేల, ఏడి మాంధాత? పురుకుత్సు డేడి నేడు?’ అని వాస్తవాన్ని గుర్తించాడు. మరణపు రుచిని కూడా అనుభవించడానికి ఆనందంగా సిద్ధపడ్డాడు. ‘ఎంతొ ఉత్సాహపడుచు కష్టింతు మౌర, మృతియె లేకున్న రుచి యేది బ్రతుకులోన?’ అన్నాడు. అలాగని ఆయనకు మరణానంతర భ్రమలు కూడా లేవు. ‘స్వర్గమును గూర్చి నాకు సర్వమ్ము తెలియు, మనసు సంతసపడుటకు మంచి ఊహ’ అన్నాడు. ఎంత హేతువాద భావుకత! అలాగే, ‘మృతినెరుంగని ఒంటి దేవతల కన్న నలుగురికి మేలు చేసెడి నరుడె మిన్న’ అని దేవుడిని మనిషికి కిందే నిలబెట్టాడు. కొన్నిసార్లు అతిశయోక్తులు కూడా అబద్ధం కానట్టుగా ఉంటాయి. ‘నా కన్నా ఉద్దండులైన కవులు ఎందరో ఉన్నారు, అయినా అదేమిటో గాని వారంటారు గాలిబ్‌కు గాలిబే సాటి, లేరెవరు అతనిపాటియని’ అని చెప్పుకున్నాడు ఫిబ్రవరి 15, 1869న పరమపదించిన గాలిబ్. దాన్ని అవుననడానికి మనకెందుకు అభ్యంతరం ఉండాలి!

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top