నాన్న ప్రేమ కోసం...

నాన్న ప్రేమ కోసం...


టీవీక్షణం

తల్లిదండ్రుల ప్రేమే పిల్లలకు బలం. అలాంటిది తన కన్నతండ్రికి తనమీద ప్రేమే లేదని తెలిస్తే ఆ కూతురి పరిస్థితి ఎలా ఉంటుంది?! మనసు బాధతో కుమిలిపోతుంది. ఆవేదన పొంగి పొరలుతుంది. అంజలికి కూడా అలానే అవుతుంది. 21 ఏళ్ల వయసులో తన తండ్రి ఆడపిల్లను వద్దనుకున్నాడని, అందుకే అతడికి తన మీద ప్రేమ లేదన్న నిజం తెలిసి షాక్ తింటుందామె. అతడి మనసులో ఎలాగైనా చోటు సంపాదించాలని తహతహలాడుతుంది. దానికోసం తీరకుండా మిగిలిపోయిన అతడి కలను తన కలగా చేసుకుంటుంది. ఆయన అందుకోలేకపోయిన లక్ష్యాన్ని తాను అందుకోవాలి, ఆయన సాధించలేకపోయిన విజయాన్ని తాను సాధించి చూపించాలని నిర్ణయించుకుంటుంది. ఏమిటా లక్ష్యం? దాన్ని ఆమె సాధిస్తుందా, తండ్రి ప్రేమను పొందుతుందా అన్నది తెలుసుకోవాలంటే... ‘స్టార్ ప్లస్’లో ప్రసారమయ్యే ‘ఎవరెస్ట్’ సీరియల్ చూడాలి.

 

బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అశుతోష్ గోవారికర్ తను రాసిన కథతో నిర్మిస్తోన్న ఈ సీరియల్, ఆదిలోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. హీరోయిన్ తండ్రికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలన్న వైవిధ్యభరితమైన లక్ష్యాన్ని పెట్టడం, అది తీరకపోవడంతో కూతురు ఎవరెస్ట్ ఎక్కి, తండ్రి కలను నెరవేర్చాలని తపించడం అన్న పాయింట్‌తో కథని అల్లడంలోనే అశుతోష్ సగం విజయాన్ని సాధించేశారు. దానికితోడు అంజలి పాత్రకు షమతా ఆచన్ చక్కగా సరిపోయింది. ఆమె అందం, ఆకర్షణ, నటన కచ్చితంగా సీరియల్‌కి ప్లస్ పాయింట్సే. ఇక తొలిసారిగా రెహమాన్ సంగీతం అందించిన సీరియల్ ఇదే కావడం... ఇంకో పెద్ద ప్లస్. ఇన్ని ప్లస్సులు కలిసినప్పుడు ఆ సీరియల్ సక్సెస్‌ను ఎవరు మాత్రం ఆపగలరు!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top