హిట్‌కార్ట్.. ఫ్లిప్‌కార్ట్

హిట్‌కార్ట్.. ఫ్లిప్‌కార్ట్ - Sakshi


వివరం: ఒక టీనేజ్ కుర్రాడు ఆవిష్కరించిన టంబ్లర్ బ్లాగ్‌ను వందల కోట్ల రూపాయలు వెచ్చించి  యాహూ డాట్ కామ్ వాళ్లు కొన్నారు. ఫేస్‌బుక్ మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయలను ఎప్పుడో దాటేసింది. ఇలాంటి వన్నీ వరసగా జరుగుతున్న పరిణామాలు. బహుశా ఎలక్ట్రానిక్ మార్కెటింగ్‌లో ఇంత సంపద దాక్కొని ఉందని ఎవరూ ఊహించలేదేమో! ఈ ఆశ్చర్యాల నడుమన మరో అబ్బురం ‘ఫ్లిప్‌కార్ట్’. ఇది ఉత్పత్తిదారు కాదు, వినియోగదారు కాదు, మధ్యవర్తి మాత్రమే! ఈ మధ్యవర్తి మార్కెట్ విలువ దాదాపు 42 వేల కోట్ల రూపాయలు. తాజాగా ఆరువేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఫ్లిప్‌కార్ట్ వార్తల్లోకి వచ్చింది.

 

 ఫ్లిప్‌కార్ట్ సైట్ మార్కెట్ విలువ దేశంలోని కొన్ని రాష్ట్రాల బడ్జెట్‌తో సమానం. చేవ ఉన్నంత వరకూ చేదుకోవచ్చు అన్నట్టుగా ఎలక్ట్రానిక్ మార్కెట్ ఊట నుంచి సంపదను సృష్టిస్తోంది ఫ్లిప్‌కార్ట్. దేశంలో ఇ-కామర్స్ విస్తృతం అవుతోందన్న విషయానికి రుజువుగా నిలుస్తోంది ఈ ఆన్‌లైన్ రీటెయిలింగ్ సంస్థ. ఇది ఆరంభం మాత్రమే! రానున్న ఐదారేళ్లలో ఈ స్థాయి మరింతగా పెరగడం ఖాయమట. మనదేశంలో ఇ-కామర్స్ మార్కెట్ అనేది ఈ స్థాయికి చేరడం ఒక గొప్ప అయితే, ఈ విజయానికి ఫ్లిప్‌కార్ట్ సారధ్యం వహించడం మరో ఘనత. కేవలం ఇద్దరు వ్యక్తులతో, నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభం అయిన సంస్థ ఫ్లిప్‌కార్ట్.

 

 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల గురించి ఆ మధ్య ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కొన్ని సంచలన వ్యాఖ్యలే చేశారు. ఐఐటీల స్థాయి అంతగొప్పగా లేదనీ అక్కడ చదువుతున్న విద్యార్థులు గతంలో లాగా కష్టపడం లేదనీ, తాలు సరుకు ఎక్కువగా ఉంటోందనీ ఆయన వ్యాఖ్యానించారు. నారాయణమూర్తి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. కేంద్ర మానవ వనరుల శాఖ కూడా ఆయన మాటలపై స్పందించింది. ప్రముఖ రచయిత చేతన్‌భగత్ అయితే నారాయణ మూర్తి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టాడు కూడా. నారాయణమూర్తి అభిప్రాయాలే తప్పు అని చేతన్‌భగత్ అభ్రిపాయపడ్డాడు.  

 

 విశేషం ఏమంటే నారాయణమూర్తి, చేతన్‌భగత్.. వీళ్లిద్దరూ ఐఐటీ పూర్వవిద్యార్థులే! ఒకరు ఐఐటీల స్టాండర్డ్స్‌ను తక్కువ చేస్తే, మరొకరు ఐఐటీల స్థాయి గొప్పదని స్పష్టం చేశారు. తమ తమ రంగాల్లో అత్యున్నత స్థాయి వ్యక్తులుగా దేశంలోని యువతకు ఐకాన్‌లుగా ఉన్న ఈ ఇద్దరు వ్యకుల పరస్పర విరుద్ధ అభిప్రాయాల్లో ఏది రైటు? అంటే అంత సులభంగా చెప్పలేం. అయితే ‘ఫ్లిప్‌కార్ట్’ వ్యవస్థాపకులైన సచిన్ బన్సల్, బిన్నీబన్సల్ లాంటి వాళ్లను గమనిస్తే చేతన్ భగత్ వాదన రైటనిపిస్తుంది! మన ఐఐటీలు కూడా అద్భుతాలు సాధించగల వ్యక్తులను తీర్చిదిద్దుతున్నాయని, మనవి శ్రామికులను తీర్చిదిద్దే కర్మాగారాలు మాత్రమే కాదు, పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దగల విద్యాలయాలు కూడా అని చెప్పడానికి అవకాశం ఇస్తున్నవారిలో సచిన్, బన్నీలు ముఖ్యులు.

 

 ఐఐటీ ఢిల్లీ విద్యార్థులైన వీరిద్దరూ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార ప్రముఖులయ్యారు. యువ వ్యాపారవేత్తల్లో ప్రసిద్ధులయ్యారు. ప్రత్యేకించి ఆన్‌లైన్ వ్యాపారం ద్వారా ఈతరానికి ఇష్టులయ్యారు.  హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదివిన మార్కెజుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ను ప్రపంచానికి వరంగా ఇస్తే... ఐఐటీ ఢిల్లీ నుంచి బయటకు వచ్చిన సచిన్, బిన్నీలు ఫ్లిప్‌కార్ట్‌తో ఐఐటీ గ్లామర్‌ను పెంచుతున్నారు.

 

 2007 సమయంలో దేశంలో ఇంటర్నెట్ సేవలు విస్తృతం అవుతున్న సమయంలో ప్రారంభమైన శతకోటి సైట్‌లలో ఒకటిగా ప్రారంభం అయ్యింది ఫ్లిప్‌కార్ట్. అయితే కొంచెం సులభంగానే అనితర సాధ్యమైన స్థాయి సక్సెస్‌ను అందుకుంది. కారణం ఏమిటీ అంటే అదును కుదరడమే! ఫ్లిప్‌కార్ట్ ముందు ఎన్నో ఉన్నాయి.. ప్లిఫ్‌కార్ట్ తర్వాత ఎన్నెన్నో వచ్చాయి. అయితే రావాల్సిన సమయంలో  ఫ్లిఫ్‌కార్ట్ మాత్రమే వచ్చింది. అందుకే అది సూపర్‌సక్సెస్ అయ్యింది. సంపదను సృష్టించుకొంది. అసలు ఎలాంటి అంచనాలు లే కుండా, గొప్ప స్థాయికి చేరాలన్న కోరికలేమీ లేకుండా ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించామని అంటారు సచిన్, బిన్నీలు. ముందుగా వాళ్లు ఇచ్చే వివరణ ఏమిటంటే.. తామిద్దరం అన్నదమ్ములం కాదు. బంధువులం కూడా కాదని. అయితే  ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఐఐటీ ఢిల్లీలో ఒకరికొకరు పరిచయం అయ్యేంత వరకూ కూడా వీరిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకే స్కూళ్లలో చదువుతూ వచ్చారట. వీరిలో మొదట సచిన్ బన్సల్ అమెజాన్ డాట్‌కామ్‌లో ఉద్యోగం సంపాదించాడు. బిన్నీ బన్సల్ ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. గూగుల్‌లో కూడా పలుమార్లు ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అయితే ఉద్యోగం రాలేదు. చివరికి సచిన్ సహకారంతో  అమెజాన్ డాట్‌కామ్‌లోకి వెళ్లాడు.

 

 ఐఐటీలో సీటును సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. సాధారణ విద్యార్థులతో పోలిస్తే ఐఐటీ ఆశావహులు ప్రత్యేకమైన వాళ్లు. ఐఐటీ చదువు పూర్తి అయ్యాక కూడా వారి భవితవ్యం ప్రత్యేకంగానే ఉంటుంది. వారి ఆలోచన తీరు మారిపోతుంది. సచిన్ బిన్నీలను కూడా ఐఐటీ చదువు ఊరికే ఉండనీయలేదు! ఏదో చేయాలన్న తపన వారిని అమెజాన్ డాట్‌కామ్ నుంచి బయటకు వచ్చేలా చేసింది.

 

 అమెజాన్‌డాట్‌కామ్ అప్పటికే పేరున్న ఆన్‌లైన్ రీటెయిలర్. ప్రత్యేకించి పుస్తకాలు కొనడానికి ప్రపంచ వ్యాప్తంగా పుస్తకప్రియులు ఇష్టపడే వెబ్‌సైట్. అలాంటి అమెజాన్ నుంచి బయటకు వచ్చిన సచిన్, బిన్నీలు ఆ సైట్‌కు మరో పాయను మొదలు పెట్టారు. ఆన్‌లైన్ రీటెయిలర్స్‌గా ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించారు. అయితే ఫ్లిప్‌కార్ట్ అనేది అమెజాన్ లాంటి ఆన్‌లైన్ రీటెయిలర్ కావడం కేవలం యాదృచ్ఛికమేనట! తాము ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించడం వెనుక అమెజాన్ స్ఫూర్తి ఏమీ లేదనీ...తామేమీ అమెజాన్‌కు వ్యూహకర్తలుగా పనిచేయలేదనీ, అక్కడ ఐటీ విభాగంలో సాధారణ ఉద్యోగులమేననీ వారు  చెబుతారు.

 

 మొత్తం నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభం అయ్యింది ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్. అందులో రెండు లక్షల రూపాయలు కంప్యూటర్‌లు, ఫర్నీచర్ కొనడానికే అయ్యిందట.  వెబ్‌సైట్ వీక్షకులు కోరిన పుస్తకాలను డెలివరీ చేసే ఉద్దేశంతో  మొదలైన సైట్ ఇది. ఈ ఐడియాను తమకు తెలిసిన వాళ్లకు చెబితే.. జనాలకు ఇప్పట్లో పుస్తకాలను చదివే తీరిక ఎక్కడుంది? అనే సందేహాన్ని వ్యక్తపరిచారు! బన్సల్ లకు కూడా ఇదే అభిప్రాయం ఉండి ఉంటే.. ఫ్లిప్‌కార్ట్‌ప్రస్థానం అక్కడితో ఆగిపోయేది. కానీ సచిన్, బిన్నీలు ముందుకు సాగిపోయారు. నిక్షేపంగా ఉద్యోగం చేసుకోకుండా ఈ వ్యాపారం ఏమిటి? అంటూ ఇంట్లో వాళ్లే సున్నితంగా వారించాలని చూసినా వారికి సర్దిచెప్పుకుని పుస్తకాల జాబితా తయారు చేయడంలో మొదలుపెట్టారు.

 

 అనేక పుస్తకాల షాపులు తిరిగి అందుబాటులో ఉన్న పుస్తకాల జాబితాను తయారు చేశారు. వాటి వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టి, ఆర్డర్‌లు వస్తే ఆ పుస్తకాలను కొనుక్కుని వచ్చి పార్శిల్ చేయడం మొదలుపెట్టారు. ఇక సైట్ రిజిస్ట్రేషన్‌కు తోడు, పుస్తకాల వివరాలను అందించి ఆన్‌లైన్‌లో పెట్టడం అనే కష్టం మాత్రం ఉంది. ఆ కష్టాన్ని కూడా వారిద్దరే పడ్డారట. కొన్ని నెలల సమయం కేటాయించి పుస్తకాల షాపులు తిరిగి వాటి వివరాలను సైట్‌లోకి పెట్టారు. వ్యాపారం మెల్లిగానే ప్రారంభం అయ్యింది. క్రమంగా ఊపందుకొంది, పుస్తకాలతో మొదలై ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, చెప్పులు, షూలు మొదలుకొని ఇప్పుడు వందల రకాల వస్తువులు దొరికే రీటెయిలర్‌గా మారింది ఫ్లిప్‌కార్ట్.

 

 వ్యాపార సంస్థలు తమ వస్తువులను షాపింగ్ కాంప్లెక్స్‌లకు తరలించాల్సిన అవసరం లేదు, జనాలు షాపింగ్ కాంప్లెక్స్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. అనుసంధాన కర్త ఫ్లిప్‌కార్ట్ ఉంది. ఇందులోకి లాగిన్ కావడం, కావాల్సిన వస్తువును చూసుకొని ఆర్డర్ చేయడం. అంతే. ఇలా నయా నగర జనాలకు సౌకర్యవంతంగా, సదుపాయవంతంగా మారింది ఫ్లిప్‌కార్ట్. దీనికి తోడు వ్యూహకర్తలుగా సచిన్, బిన్నీల తెలివితేటలు సైట్‌పై విశ్వసనీయతను పెంచాయి. ఇప్పుడు కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేర్చాయి.

 

 నెలకు 50 లక్షల డెలివరీలు!     

 విదేశీ ఆన్‌లైన్ రీటెయిలర్‌లకు దీటుగా ఫ్లిప్‌కార్ట్ దూసుకెళుతోంది. ప్రస్తుతం ఇ-కామర్స్ అనేది దేశంలో కేవలం పదిశాతం మందికి మాత్రమే అందుబాటులో ఉంది. వీరిలోనే రోజుకు 40 లక్షల మంది ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌ను విజిట్ చేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌కు దాదాపు రెండున్నర కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లున్నారు. ఫ్లిప్‌కార్ట్ నెలకు 50 లక్షల వస్తువులను డెలివరీ చేస్తోంది. మరి పదిశాతం మందికి మాత్రమే ఇ-కామర్స్ అందుబాటులో ఉన్న సమయంలోనే ఇంత సంచలనం అంటే.. అందరికీ అందుబాటులోకి వస్తే ఈ వెబ్‌సైట్ ఎక్కడకు చేరుతుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు!    

 

 ఎక్కువ విలువ కట్టారా?!

 ఫ్లిప్‌కార్ట్ మార్కెటింగ్ విలువ 42 వేల కోట్ల రూపాయలకు చేరడమే ప్రస్తుతానికి ప్రముఖవార్త. ఇలాంటి ఫీట్‌ను సాధించడం ఈ సైట్‌కు కొత్త గుర్తింపును సంపాదించి పెట్టింది. అయితే ఇందులో కొన్ని లోపాలున్నాయని అంటున్నాడు మరో ఆన్‌లైన్ రీటెయిలర్ స్నాప్‌డీల్ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్. ప్రస్తుతం స్నాప్‌డీల్ దేశంలోని రెండో పెద్ద ఆన్‌లైన్ రీటెయిలర్‌గా ఉంది. ఈ వ్యాపారంలో అనుభవజ్ఞుడు అయిన కునాల్ వెర్షన్ ప్రకారం ఫ్లిప్‌కార్ట్ ధరను అమాంతం పెంచేశార ట. పైగా ఫ్లిప్‌కార్ట్ కొత్తగా పెట్టుబడులను సేకరించాల్సిన అవసరం లేదని ఆయన అంటున్నాడు. ఇప్పటికే అనేకమంది పెట్టుబడి దారులు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టి కూర్చున్నారనీ అయినా ఫ్లిప్‌కార్ట్ మరిన్ని పెట్టుబడులు సేకరించడం అంతుబట్టడం లేదనీ ఆయన అంటున్నాడు. ఆహ్వానించాలే కానీ తమ సైట్‌కూ ఆ మాత్రం పెట్టుబడులు వస్తాయని స్నాప్‌డీల్ వ్యవస్థాపకుడు అంటున్నారు. వీటిని పోటీతత్వంతో చేస్తున్న విమర్శలే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌పై పెట్టుబడులు పెట్టిన వాళ్లు ఏమీ అమాయకులు కాదు కదా! అలెక్సా ర్యాంకింగ్స్‌లో భారత్ వరకు ఫ్లిప్‌కార్ట్ స్థానం 8. అంతర్జాతీయ స్థాయిలో 110. ఈ లెక్కల ప్రకారం వినోదం కోసం, వార్తల కోసం చూసే చాలా సైట్ల కన్నా ఫ్లిప్‌కార్ట్ చాలా ముందున్నట్టే!

 

 ఇక్కడ మాత్రమే దొరుకుతాయి!

మొదట్లో ఫ్లిప్‌కార్ట్ లో పుస్తకాలను అందుబాటులో ఉంచడానికే చాలా శ్రమపడాల్సి వచ్చిందట. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో గాడ్జెట్స్‌ను అందుబాటులో ఉంచేలా చేయడం కూడా ఒక మార్కెటింగ్ వ్యూహం. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభించే గాడ్జెట్స్ కూడా ఉన్నాయి. మోటో ఇ, మోటో జీ, షియామీ ఎమ్‌ఐ-త్రీ వంటి స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ సైట్‌నే క్రాష్ అయ్యేలా చేస్తున్నాయి.  

 

 వెబ్‌సైట్ నిర్మాణమూ ముఖ్యమే!

 అది ఎంత గొప్ప వెబ్‌సైట్ అయినా సరే.. వీక్షకుడికి అనుకూలంగా ఉన్నప్పుడే పాపులారిటీ సంపాదించుకోగలదు. ఫ్లిప్‌కార్ట్ ఈ విషయంలో కూడా విజయవంతం అయ్యింది. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనడానికి సంబంధించిన వివరాల్లో దేన్ని ఎక్కడ అమర్చి పెట్టాలో అక్కడ అమర్చినట్టుగా ఉంటుంది ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్. అమెజాన్ డాట్‌కామ్ వంటి సైట్‌లు కూడా యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. అయితే భారతీయ మనస్తత్వాన్ని పట్టుకోవడం మాత్రం ఫ్లిప్‌కార్ట్‌కే సాధ్యం అయ్యింది. బహుశా దీని నిర్వాహకులు భారతీయులు అయినందువల్లనేమో.

 

ఇ-మార్కెట్‌కు భరోసా

 పక్కింటి వాళ్లు వాడుతున్న వస్తువుల మన్నికను, పక్కవాడు వాడుతున్న స్మార్ట్‌ఫోన్ స్టైల్‌ను చూసిన తర్వాత వాటిని కొనే మనస్తత్వం భారతీయులది. వస్తువును కొనడం అంటే దానికి ఎంతో సమయం వెచ్చించి, షాప్‌ల వరకూ వెళ్లి తనివితీరా స్పృశించి, చూసుకుని కొనడం అలవాటు. ఈ పరిస్థితుల్లో వారిని షాపింగ్ నుంచి ఇ-షాపింగ్‌కి మళ్లించడంలో ఫ్లిప్‌కార్ట్ పాత్ర ఎంతో ఉంది. ఒకసారి కొన్న వాళ్లు మరొకసారి ఆర్డర్లు ఇవ్వడానికి ఇష్టపడేలా చేసింది. తద్వారా తను వృద్ధిచెందడం మాత్రమే కాకుండా మొత్తంగా ఇ-మార్కెట్‌నే విస్తరించింది.

 

 మనవాళ్లను ఆకట్టుకొంది!

 భారతీయుల మనసులను ఎరిగి ఆన్‌లైన్‌రీటెయిలింగ్‌ను సదుపాయవంతంగా తీర్చిదిద్దడంలో బన్సల్‌ల ప్రతిభ కనిపిస్తుంది. కొన్నింటికి క్యాష్ ఆన్ డెలివరీ అంటూ... వస్తువు ఇంటికి వచ్చాక మాత్రమే డబ్బు చెల్లించే అవకాశం ఇవ్వడం తొలి సదుపాయం. కొన్ని షరతులతో నెలరోజుల రీప్లేస్‌మెంట్ ఉండటం మరో సౌకర్యం. డెలివరీ తొందరగా ఉంటుంది. ఇవన్నీ ఫ్లిప్‌కార్ట్‌లోని ప్లస్‌పాయింట్లు. అపనమ్మకంతోనే తొలిసారి క్లిక్ చేసినా, అనుకున్న వస్తువు ఇంటికి చేరడంతో ఆ సైట్‌తో అనుబంధం ఏర్పడుతోంది. ఈ విధంగా భారతీయులను తన విశ్వసనీయతతో కట్టి పడేస్తోంది ిఫ్లిప్‌కార్ట్.

 

ఇన్ఫోసిస్ కో ఫౌండర్  నందన్ నీలేకని కుటుంబం ఆస్తులు ఇప్పుడు దాదాపు 6,500 కోట్ల రూపాయలు. ఫ్లిప్‌కార్ట్‌లో వాటాల ప్రకారం చూసుకొంటే బన్సల్‌ల ఇద్దరి ఆస్తులు కలిపి ఈ స్థాయిలోనే ఉన్నాయి! ఇన్ఫోసిస్ అంటే ముప్పై యేళ్ల శ్రమ. వంద ల వేల మంది ఉద్యోగులు, ఎన్నో నిద్రలేని రాత్రులు, శ్రమ ఒత్తిడిని తట్టుకుంటూ తమపై తమే జాలి పడిన సందర్భాలు...  ఇవన్నీ కలిసి నీలేకని వంటి వారిని ధనికులుగా చేశాయి. అయితే బన్సల్‌లకు తాము సాధించిన సక్సెస్‌ను చూసి నిద్రపట్టని రాత్రులున్నాయట!   

 

భవిష్యత్తుకు కూడా మేమే మార్గదర్శులం అని ధైర్యం చెప్పగలుగుతున్నారు ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు. అందుకే ఇప్పుడు ఏడు బిలియన్ డాలర్లుగా ఉన్న ప్లిప్‌కార్ట్ విలువ ఇకపై మరింతగా పెరగవచ్చు! 30 యేళ్లలో ఇన్ఫోసిస్ చేరిన 30 బిలియన్ డాలర్ల మార్కును ఈ సైట్ మరో మూడేళ్లలోనే అందుకోవాలన్న లక్ష్యాన్ని సాధించవచ్చు!  

 

దేశంలో ఇ-కామర్స్ విస్తృతి ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అనేక మంది భారతీయులు ఇప్పుడిప్పుడు ఆన్‌లైన్ మార్కెటింగ్ మొదలు పెడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు సగటు భారతీయుల గుండెల్లోకి ఫ్లిప్‌కార్ట్ క్రమంగా చొచ్చుకుపోతోంది. ఒక విశ్వసనీయమైన సంస్థగా మారుతోంది. సేవ అందించినందుకు గానూ వినియోగదారుడి ప్రేమాభిమానులు కూడా సొంతం చేసుకొంటోంది ఈ సైట్. ఇప్పుడు కలిసి వచ్చిన కొత్త పెట్టుబడుల ద్వారా మరింత ఉన్నతస్థాయి ప్రమాణాలను సాధిస్తామనీ, తమ మార్కెట్‌ను విస్తరిస్తామనీ, వినియోగదారులకు మంచి సేవలను అందిస్తామనీ సచిన్, బిన్నీలు చెబుతున్నారు. అదును చూసి వాళ్లు వేసిన నాట్లు ఊహించని ఫలితాలను ఇవ్వడమే కాకుండా, భవిష్యత్తులో ఫ్లిప్‌కార్ట్‌ను ఒక మహా వృక్షంగా ఎదిగేలా చేస్తున్నాయి.

 - జీవన్‌రెడ్డి .బి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top