ఏడాది కాపురం పూర్తయ్యింది

ఏడాది కాపురం పూర్తయ్యింది


హృదయం: మొన్నటి జూలై 11 తో జోడీ రోస్, లె పాంట్ డు డయబుల్ వివాహ బంధానికి ఏడాది పూర్తి అయ్యింది! ఈ సందర్భంగా జోడీ లెపాంట్ డు మీద గంతులేస్తూ తన ఆనందాన్ని పంచుకొంది. చాలా మంది తమ బంధాన్ని అవమానిస్తూ మాట్లాడారని, తనను పిచ్చిదాన్ని చూసినట్టుగా చూశారని, అయితే ఏడాదిగా లెపాంట్ డుతో బంధాన్ని కొనసాగించి తన ప్రేమను నిరూపించుకొన్నానని, తమ వివాహ బంధం ఇలాగే నిండునూరేళ్లు కొనసాగుతుందని జోడీ చెప్పుకొచ్చింది! అయితే లెపాంట్ డు మాత్రం మారు మాట్లాడలేదు. ఎందుకంటే అది ఒక రాతి కట్టడం, కాంక్రీట్ స్ట్రక్చర్!

 

 ప్రకృతిరమణీయ ప్రదేశాలపై ఎంతోమంది మనసు పారేసుకొంటారు. సహజసిద్ధంగా ఏర్పడిన నిర్మాణాలను, కట్టడాలను ప్రేమిస్తారు. అయితే జోడీ రోస్‌కు మాత్రం ఈ ప్రేమ ముదిరింది. ఏకంగా ఒక బ్రిడ్జిని పెళ్లి చేసుకొంది! ఆ బ్రిడ్జినే తన భర్తగా భావిస్తోంది! చట్టబద్ధంగా ఆ పెళ్లి చెల్లకపోయినా... జోడీ మాత్రం తమ జోడీని ఎవరూ విడదీయలేరని అంటోంది. జోడీ  రోస్ ఒక ఆస్ట్రేలియన్. పాపులర్ పాప్ సింగర్. పాప్ ఆల్బమ్స్‌ను రూపొందించడంలో భాగంగా ప్రపంచంలోని అనేక ప్రాంతాలను సంద ర్శించిందామె. అనేక వంతెనల మీద నిలబడి పాడుతూ ఆల్బమ్స్‌ను రూపొందించింది. అలాంటి ఆమెకు ఫ్రాన్స్‌లోని లెపాంట్ డు డయబుల్ బ్రిడ్జ్ చాలా నచ్చేసింది! ఎంతగానంటే పెళ్లి చేసుకోవాలనేంతగా! ఇంకేముంది... తన నిర్ణయాన్ని  సన్నిహితులందరికీ చెప్పేసింది. వాళ్లందరినీ తన పెళ్లికి ఆహ్వానించింది. అంతా ఆశ్చర్యపోయారు. ఒక వంతెననుపెళ్లి చేసుకోవడం ఏమిటి? అంటూ నోరెళ్లబెట్టారు. అయితే అప్పటికే జోడీ ఆ బ్రిడ్జితో నిండా ప్రేమలో మునిగిపోయిన తీరును చూసి ఎవరూ వాళ్ల పెళ్లికి అడ్డుగా మారలేదు. అయితే ఫ్రాన్స్‌లో ఇలాంటి పెళ్లిళ్లు చెల్లవు. మనుషులు ఇలా కట్టడాలను పెళ్లి చేసుకొంటే తాము గుర్తించమని స్థానిక మేయర్ స్పష్టం చేశాడు.

 

 అయితే అంత కోరికగా ఉంది కాబట్టి... పెళ్లి చేసుకొంటే చేసుకోవచ్చని అనుమతినిస్తూ మేయర్ స్వయంగా ఆ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించి వచ్చారు. ఆ విధంగా ఏడాది కిందట జోడీ ముచ్చట తీరింది. ‘‘నేను ప్రపంచంలో ఎన్నో బ్రిడ్జిలను చూశాను. కానీ  లె పాంట్ డు డయబుల్‌లో సొగసు ఎక్కడా కనపడలేదు. ఇది నా మీద తనప్రేమను ప్రకటిస్తున్నట్టుగా అనిపించింది. ఈ వంతెన మీద నిలబడి  నేను అద్భుతమైన సంగీతాన్ని కంపోజ్ చేయగలిగాను. క్రమంగా దీని మీద ప్రేమ ఎక్కువైంది. అందుకే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను...’’అంటూ జోడీ తన ప్రేమ గురించి, పెళ్లి నిర్ణయం గురించి వివరిస్తుంది. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా... జోడీతో పెళ్లి కి లె పాంట్‌కు ఇష్టం ఉందా? లేదా? అనే ది కనుక్కోవాల్సిందని కొంతమంది చమత్కరిస్తున్నారు.

 

 ప్రేమ సరిగమలు

 భూగోళం వేగంగా పరిభ్రమిస్తూ ఉంటుంది. అలా తిరుగుతున్నప్పుడు మనుషులు ఎగిరిపోయి పడకుండా పట్టి ఉంచే బంధమే ప్రేమ. అలాంటి పవిత్రమైన ప్రేమకు ఉన్నశక్తులు అన్నీ ఇన్నీకావు!

 - ప్రేమ గురించి, ప్రియమైన వాళ్ల గురించి ఎక్కువగా ఊహించుకొనే వాళ్లలో సృజనాత్మక శక్తి , ఏకాగ్రతలు పెరుగుతూ ఉంటాయట!

 - ప్రియమైన వాళ్ల చేయి పట్టుకొని నడుస్తూ ఉంటే మనసులోని ఎంత బాైధె నా ఇట్టే తరిగిపోతుందట.

 - కళ్లలోకి సూటిగా చూస్తూ ఐ కాంటాక్ట్ మెయింటెయిన్ చేస్తుంటే అపరిచితుల మధ్యనైనా సరే ప్రేమ పొంగుకొస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

 - ఉదయాన్నే ప్రియురాలిని కిస్ చేస్తూ ఆమెతో సరదాగా గడిపే మగాళ్లు మిగతా వాళ్లకన్నా ఐదేళ్లపాటు ఎక్కువగా బతుకుతారని అంటోంది ఫ్రెంచ్ శాస్త్రవేత్తల అధ్యయనం.

 - తొందరగా ప్రేమలోపడేది మగవాళ్లే. అలాగే ఆ ప్రేమ విఫలం అయితే ఎక్కువగా బాధపడేది కూడా వాళ్లే!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top