నెత్తుటి మరక

నెత్తుటి మరక - Sakshi


పట్టుకోండి చూద్దాం..

ఆరోజు చాలా పొద్దుటే ఆఫీసుకు వచ్చాడు చందర్. సెక్యూరిటీ గార్డ్ సెలవులో ఉన్నాడు. పనివాళ్లు ఎవరూ ఇంకా రాలేదు. తన ఛాంబర్‌లో ఒంటరిగా కూర్చున్నాడు చందర్. అందరికీ ఆఫీసు నుంచి ఎప్పుడూ ఇంటికెళదామా? అని ఉంటుంది. తనకేమో...ఆఫీసు టైం అయిపోతే చాలు గుండెలో గుబులు. దీనికి కారణం తన భార్య సుందరి. కాలేజీ రోజుల నాటి మిత్రురాలు సుందరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చందర్. మొదట్లో చిలకాగోరింకల్లా ఉండేవారు. ఆ తరువాత మాత్రం చీటికి మాటికి గొడవపడడం మొదలైంది. ఒకరోజు ఇంట్లో గట్టిగా అరిచాడు చందర్...

 

‘‘నా ప్రాణం పోతే...అది నీ వల్లే అని గుర్తుంచుకో...’’

 ‘‘దొంగే... దొంగా దొంగా అని అరిచినట్లు ఉంది. నీ నస భరించలేక ఏదో ఒక రోజు నేనే చనిపోయేలా ఉన్నాను’’ అని గట్టిగా అంది సుందరి. చందర్, సుందరీల సంసారంలో ఇలాంటి గొడవలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి.

 ఆ రోజు ఆఫీసుకు త్వరగా రావడానికి కూడా ఇంట్లో గొడవే కారణం.

 భార్యతో జరిగిన గొడవను గుర్తు తెచ్చుకుంటూ సిగరెట్టు వెలిగించాడు చందర్.

 ‘‘ఛా...ఏమిటో ఈ మనుషులు’’ అని నిట్టూర్చాడు.

 కాసేపు భార్యను తిట్టుకున్నాడు.

 

‘అమ్మానాన్నలు చేసుకోమన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే ఈ గొడవంతా ఉండేది కాదు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పుతుందా మరీ’ అనుకున్నాడు బాధగా.

 ఇంతలోనే చందర్‌కు తన బిజినెస్ పార్టనర్ కమల్ గుర్తుకు వచ్చాడు.

 కమల్ పేరు గుర్తుతెచ్చుకోగానే కోపం నషాళానికి అంటింది.

 ‘దుర్మార్గుడు... ఎంత మోసం చేశాడు! నమ్మి నెత్తి మీద పెట్టుకుంటే నిలువునా గొంతు కోశాడు’ అనుకుంటూ మరో సిగరెట్టు వెలిగించాడు.

 కమల్ తనకు చేసిన ఒక్కో మోసాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు చందర్.

 

ఇంతలోనే తన ఫోన్ మోగింది.

 ‘‘సురేష్... నాకు మళ్లీ ఫోన్ చేయవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు...’’ గట్టిగా తన పీఏ సురేష్‌పై అరిచాడు చందర్.

 ‘‘సార్...నేను చెప్పేది వినండి...’’ అవతలివైపు నుంచి సురేష్ అంటున్నాడు.

 ‘‘నువ్వు మరో మాట మాట్లాడకు... నీ అంతు తేలుస్తా...’’ అరిచాడు చందర్.

 ‘‘ఎవరి అంతు ఎవరు తేలుస్తారో చూద్దాం...’’ అని అంతకంటే గట్టిగా అరిచి ఫోన్ పెట్టేశాడు సురేష్.

 ఒక గంట తరువాత..... తాను కూర్చున్న సీట్లోనే హత్యకు గురయ్యాడు చందర్.

 

ఆ ఉదయం ఆఫీసుకు వచ్చిన వాళ్లు...

 1. చందర్ భార్య సుందరి.

 2. బిజినెస్ పార్టనర్ కమల్.

 3. పీఏ సురేష్.

 అనుమానితుల జాబితాలో ఈ ముగ్గురు ఉన్నారు.

 ఇన్‌స్పెక్టర్ నరసింహ సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. అనుమానితుల పేర్లు, వివరాలు తెలుసుకున్నాడు. ఆ తరువాత కొద్దిసేపట్లోనే చందర్‌ని హత్య చేసిన వ్యక్తి ఎవరో కనిపెట్టాడు ఇన్‌స్పెక్టర్ నరసింహ.

 క్లూ:

 చందర్ ఎదురుగా ఉన్న క్యాలెండర్‌లోని ఒక బొమ్మపై... నెత్తుటితో గీసిన గీత కనిపిస్తుంది.

 పై ముగ్గురిలో హత్య చేసిన వ్యక్తి పేరు చెప్పగలరా?

 

జవాబు: హంతకుడి పేరు కమల్. చందర్ సురేష్‌తో మాట్లాడిన తరువాత... బిజినెస్‌లో తనకు రావల్సిన వాటా గురించి మాట్లాడడానికి వచ్చాడు కమల్. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపంతో చందర్‌పై కాల్పులు జరిపి పారిపోయాడు కమల్. ఎదురుగా ఉన్న క్యాలెండర్‌పై ‘తామరపువ్వు’ బొమ్మపై రక్తంతో గీశాడు చందర్. తనపై కాల్పులు జరిపింది ‘కమల్’ అని తెలియడానికే ఇలా చేశాడు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top